Tuesday, November 1, 2011

అధ్యాయము-3 భాగము-4

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 4 
బ్రహ్మ కమలముల స్వరూపము

దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచూ యిట్లు తెలియజేసిరి, "శ్రీమహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీకమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకములందలి బ్రహ్మ కమలములకు ప్రతిగా యీ భూమండలము నందలి హిమాలయములందు యీ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12 వేల అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే యిది పుష్పించును. నాయనా! అర్థరాత్రి సమయము నందు మాత్రమే యిది వికసించుట మరియొక విచిత్రము. ఇది వికాసము చెండునపుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును నిండిపోవును. హిమాలయమునందలి సాధకులయిన మహాత్ములందరూ యీ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి, నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు యిది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో యిది హిమము నుండి బయటపడును. గ్రీష్మ కాలమంతయూ వికాసప్రక్రియ జరుగుచుండును. అమరనాధ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమా ప్రాంతము నందు అర్థరాత్రి సమయమందు యిది పూర్ణ వికాసము చెందును. నాయనా! శంకరా! సాధకులు, మహా తపస్వులు , సిద్ధ పురుషుల కోసము మాత్రమే కేవలము హిమాలయములందు మాత్రమే యీ అద్భుత లీల ఇప్పటికినీ, ఎప్పటికినీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును. యోగ విఘ్నములంతరించును. ఇది సద్యః ఫలితము నిచ్చు అద్భుతలీల. కావున యోగులు, తపస్వులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి, విధి రీత్యా ఎవరికీ దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శనభాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మ కమలము అంతర్థానమగును.

(ఇంకా ఉంది..) 

No comments:

Post a Comment