Wednesday, November 30, 2011

అధ్యాయము 7 భాగము 5

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 5 


లోకనివాసులు, లోకాధిపతులు, ఖండముల వివరణ 

వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి, యితడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తరదిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురమునందు యితడుండును.

అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాల ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు.

సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పున్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. 

రాసాతలమునందు పుణ్యనగరమనునది కలదు. దానికి నిఋతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైఋతి దిక్కునకు అధిపతి. తలాతలము నందలి ధనిష్ఠాన పురమున పిశాచ గణములతో కూడి భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీ పతియైన ఈశానుడు కలదు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. 

పాతాళమునందు వైకుంఠనగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోను, వాసుకి మొదలయిన సర్పశ్రేష్ఠులతోనూ, శేషశాయియై విరాజిల్లుతున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు.

ఆఖరిదైన పాతాళ లోకము నందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండము నందు ప్రేత గణములుందురు. తృతీయఖండము నందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు.

సప్తసముద్రములును, సప్తద్వీపములును, మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది తొమ్మిది ఖండములుగా విభజించబడియున్నది. దక్షిణము నందున్న దానికి భారత ఖండమని పేరు. దీనిలో భరతపురము నందు స్వాయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్య జీవులు, ఋషులు స్వాయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర, చక్రవాళ, లోకాలోక పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించి యుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తన గుండా ప్రసరింపనీయని పొరలు.

మహాభూమికి దిగువన ఏడు అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతలలోకమనునది పిశాచాములకు నివాసము. వితలలోకము నందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునండలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలి చక్రవర్తి తన పరిజనులయిన రాక్షసులతో నివసించును. వైవస్వతపురము నందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రాసాతలములోని పుణ్యపురమనునది నైఋతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్ఠాపురములో భేతాళుడుండును. తలాతలము నందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనునది పితృదేవతలకు నివాసము. పాతాళము నందు శ్వేతద్వీపవైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకొన్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేత గణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్య గ్రహ స్తానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము 'రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్దినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతి' అని ఉత్తరాపోశనలోఉదాకప్రదానము వీరికే చేయబడుచున్నది. 

లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ 

భూలోకమునందు గల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖయందు ప్రకాశించునది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండులోకము. సూర్యగ్రహమండలము ఎంతమాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధ లోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చరలోకము, రాశ్యధిదేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువ లోకము అనునవి కలవు. ఇవేకాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు.

భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవతయయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము రెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, అంగారక గ్రహము మూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము అయిదు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము ఏడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శుక్రలోకము తొమ్మిది లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము పదకొండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, రాశ్యధిదేవతా లోకము పన్నెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతా లోకము పదమూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షి లోకము పదునాల్గు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, ద్రువలోకము పదునైదు బ్రహ్మాండ యోజనములలోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములయిన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్యబిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున గాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు.

దత్తుడు అనగా ఎవరు?

నరసావధానులు తాతా! నీకు అనుభవములోనికి రావలెనన్న కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి యుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజోమహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్త ప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము.

శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులును, అతని భార్యయును నిర్ఘాంతపోయిరి. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు యింతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయునూ, తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులును, అతని భార్యయు వెక్కి వెక్కి ఏడువసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములు స్ప్రుశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి.

శ్రీపాదుల వారు "నేను దత్తుడను. కోటానుకోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్త్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను. దిగంబరుడను. ఎవరయితే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబరా! శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! నరసింహ సరస్వతి దిగంబరా! అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపములో సదా ఉందును. మా మాతామహులయిన శ్రీ బాపనార్యులు పరదేశము నుండివచ్చి పాదగయా క్షేత్రము నందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించు కొనువారికి ఉచితముగా భోజన, వసతి సౌకర్యములు కలిగించు చుండగా, నీ స్వయంభూదత్తుడేడి? అదృశ్యమాయెనుగా? అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే! నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్య లోకములు ప్రాప్తించును. బ్రతికి యుండిన జీవులనే కాక చచ్చిన జీవులయొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావుపుట్టుకలు రెండునూ సమానమే! అయిననూ నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా? అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కన్పించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్త ధ్యానములో నుండుము. మరుజన్మమున కటాక్షించెదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసేంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటానుకోట్ల బ్రహ్మాండమును సృజించి, రక్షించి, లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను." అని పలికిరి. మహాభాయంకర శబ్దముతో శ్రీ చరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది, శ్రీపాదులు అదృశ్యులయిరి.

నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును యీ రకముగా తెలియజేసిరి. వారు సర్వ వ్యాపకతత్త్వము. నిరాకారమైన ఆ తత్త్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలకరూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండియూ చేయు లీలలకు అంతమెక్కడ ?

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-7 సమాప్తం) 

No comments:

Post a Comment