Thursday, August 7, 2014

Chapter 23 Part 2 ( Last Part)

అధ్యాయము 23 భాగము 2

శివపూజా రహస్య వివరణము

శివమహిమ, ఆంద్రప్రదేశమందలి ఏకాదశ శివ క్షేత్రములలోని శివ స్వరూపములు

శివుడు ఏకాదశ రుద్రస్వరూపము. ఆంద్రదేశము నందు పదునొకండు శివ క్షేత్రములు కలవు. వాటి దర్శనము మహాఫలమునందించును. అవి 1) బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2) శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3) ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4) క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు 5) అమరావతి నందలి అమరలింగేశ్వరుడు 6)కోటీఫలీ క్షేత్రము నందలి కోటీఫలీశ్వరుడు 7) పీఠికాపురము నందలి కుక్కుటేశ్వరుడు 8) మహానంది యందలి మహానందీశ్వరుడు 9) కాళేశ్వరము నందలి కాళేశ్వరుడు 10)శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు 11) త్రిపురాంతకము నందలి త్రిపురాంతకేశ్వరుడు.

వాస్తవమునకు శివునకు మూర్తి లేదు. శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపము గాక మరేమియు కాదు. సిద్ధి కలిగిన తదుపరి నిర్మలమనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటిక లింగము. మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానము కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును. మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకూ వ్యాపించి యుండు నాడులను రుద్రజడలందురు. శివుని హఠయోగి రూపములో లకులీశుడందురు. శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును. ఈ సృష్టియందు రాగతాళ బద్ధమయిన సృష్టి, స్థితి, లయములనెడి మహాస్పందనల కనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందురు. శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా యీయగలడు. చిత్ అనగా మనస్సు, అంబరమనగా ఆకాశము లేక బట్ట. ఆకాశ రూపములో ఉండువాడే చిదంబరుడు. నీవు చూచెడి యీ విశాల విశ్వములోని రోదసీస్వరూపము రుద్రస్వరూపమే!  ద్వాదశ జ్యోతిర్లింగములు రాశి చక్రములోని 12 రాసులకు ప్రతీకలు. కనుక శివుడు కాలస్వరూపుడు. అష్ట దిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే. పంచభూతములు అతని పంచముఖములు. పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి ఏకాదశ రుద్ర కళలగుచున్నవి. వీరినే ఏకాదశ రుద్రులందురు. ఉమామహేశ్వర రూపము నిత్యప్రసన్న రూపము. త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకరూపము. జ్ఞాననేత్రమే మూడవకన్ను సమాధిస్థితిలో ప్రసన్నమైన ధ్యానములో నుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివజటాజూటములోని ఆ పరమపావని గంగామాత. 

అది మిధునమైన శివపార్వతుల స్వరూపమే మిధునరాశి. ఆర్ధ్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనం యిస్తాడు. మిధునరాశిని సమీపించుటకు ముందు వృషభరాశిని దాటి వెళ్ళవలెను గదా! ఆ వృషభమే నందీశ్వరుడు. అది ధర్మస్వరూపము. భ్రూమధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ! యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్థనారీశ్వరరూపము. 

సహస్రారంలో లింగోద్భవకాలములో కర్పూరకళిక భగవత్ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. లింగమనగా స్థూల శరీరములో లోపల దాగియుండే లింగశరీరం. ఇది జ్యోతిరూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది. 

శివపూజారహస్యములు అనుష్ఠానము చేతను, గురుకటాక్షము చేతను మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. భౌతికరూపమైన పీఠికాపురమెట్లుండునో జ్యోతిర్మయి స్వరూపమైన స్వర్ణపీఠికాపురమనునది ఒకటున్నది. అది నా చైతన్యముచే నిర్మితమయినది. దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు, జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు. వారు ఎంతెంత దూరములలో ఉన్ననూ స్వర్ణ పీఠికాపురవాస్తవ్యులే అగుదురు. వారికి నేను సర్వదా సులభుడను. 

భౌతిక పీఠికాపురములోని కుక్కుటేశ్వరాలయము నందు నీవు చూచిన అర్చకస్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు. భూతప్రేత పిశాచాది మహాగణములు ఎన్నియో ఉండును. యోగాభ్యాసము చేయుకొలదినీ, శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించు కొలదినీ, ఆయా భూతప్రేతములు అలజడి సృష్టించుచునే యుండును. ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు. నా పేరిట మహాసంస్థానము మా మాతామహ గృహమున ఏర్పడితీరునని అనేక పర్యాయములు చెప్పితిని. నా సంకల్పము అమోఘము. చీమలబారుల వలె లక్షోపలక్షల భక్త గణములు, యోగి గణములు నా సంస్థానమును దర్శించగలరు. ఎవరు, ఎప్పుడు, ఎంతమంది, ఏ విధానముగా రావలయునో నేనే నిర్ణయించెదను. పీఠికాపుర వాస్తవ్యులయినంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరనుకొనుట సర్వకల్ల. నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును. అయోగ్యులకు అది ఎండమావివలె  నుండును. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! 
       
(అధ్యాయము 23 సమాప్తము)


Thursday, July 3, 2014

Chapter 23 Part 1

అధ్యాయము 23 భాగము 1

శివపూజా రహస్య వివరణము

శివయోగి భక్తిమహిమ - వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు 

నేను కృష్ణ యీవల ఒడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను. అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చుచుండెను. ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులయిన శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది. నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు. నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరునూ శ్రీపాదుల వారి దివ్య చరితమును, లీలలను, మహిమలను, వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత, విశేషత సంతరించుకొనియున్నవి. శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియజెప్పబడెడివి. అవి ఒకదానికొకటి ఎంత మాత్రమూ సంబంధము లేని వింతవింతలు. ఇదివరకెన్నడునూ నేను వినియుండని చిత్రవిచిత్ర సంగతులు. నాకు ఇప్పటివరకు శ్రీపాదుల వారి పది సంవత్సరముల వరకూ జరిగిన లీలా విశేషములు ఒక క్రమపద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి. నేను నా మనసున యిట్లాలోచించుచుంటిని. ధర్మగుప్తులవారు శ్రీవారి 11వ సంవత్సరములో జరిగిన సంఘటనలను ఏవయినా నాకు తెలియజేతురేమోనని అనుకుంటిని. శ్రీపాదుల వారు క్షణక్షణ లీలావిహారి. అంతలోనే శ్రీ ధర్మగుప్తులు నాతో యిట్లు చెప్పనారంభించిరి. అయ్యా!శంకరభట్టూ! నేను శివభక్తుడను. శ్రీపాదుల వారి 11వ సంవత్సరములో శివయోగి ఒకడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు చాలా యోగ్యుడు. కరతలభిక్ష చేయువాడు. తనయొద్ద ఏ రకమైన సంచిని గాని, కంచమును గాని, మరే పాత్రను గాని ఉంచుకొనువాడు కాడు. అతడు చూపరులకు పిచ్చివానివలె నుండెను. అతడు తొలుదొల్త శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను. అతని పిచ్చివాలకమును, ధూళిధూసరిత విగ్రహమును చూచి అర్చకస్వాములు ఆలయములోనికి రానీయరైరి. అతడు దేహస్పృహయే లేని అవధూత. అతడు మాటిమాటికీ శివపంచాక్షరి జపించుచుండెను. ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయిన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుఱ్ఱము మీద వచ్చుచుంటిని. మార్గమధ్యమున శ్రీ కుక్కుటేశ్వరాలయమును దర్శించుట నాకు అలవాటు. నేను వైశ్య ప్రముఖుడనయిన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి. వారికి మంచి సంభావనలనిచ్చుట నా అలవాటు. నేను అయిదు వరహాలను అర్చకస్వాముల కీయదలంచితిని. ఆ అయిదు వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు. వారి ఆర్థికపరమైన కష్టములను, వెతలను, బాధలను నాతో చెప్పుకొందురు. సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిరి. ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను. వానితో పాటు రెండు త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి. అర్చకస్వాములకు ముచ్చెమటలు పట్టినవి. 

ఆ శివయోగి, "అర్చకస్వాములారా! మీకు భయమేమియును వలదు. మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు యివి ఆభరణములు. తండ్రిని బిడ్డలు కౌగిలించుకొనునట్లు ఈ నాగుబాములు మన తండ్రియైన కుక్కుటేశ్వరుని కౌగిలించుకొనుటకు ఆతృతపడుచున్నవి. అవి మనకు సోదరులతో సమానమైనవి. మనము మన సోదరులను జూచి భయపడుట, పారిపోవుట, లేదా చంపబూనుట మహాపాపము. అర్చకస్వాములు చేయు విశేషపూజ వలన అవి యిక్కడకు ఆకర్షింపబడినవి. నాగాభరణుడైన కుక్కుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించెదము గాక! నమకచమకములను సుస్వరముతో, రాగయుక్తముగా ఆలపించుడు." అనెను. 

అర్చకస్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు. అర్చకస్వాములకు కొంత వందిమాగధ జనముండెడివారు. అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరయినా ధనవంతులైయుండి విశేషముగా సంభావనల నిచ్చువారయినచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెడివారు. ఈ అర్చకస్వాములలో పీఠికాపురములో నున్న సూర్యచంద్రశాస్త్రి  అనునతడు మంచి పండితుడే గాక నిష్ఠ గల అనుష్ఠానపరుడు. అతనికి శ్రీపాదుల వారి యందు భక్తి ప్రేమలు మెండు. అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమకచమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను. అచ్చటకు వచ్చిన నాగుపాములు కూడా రాగతాళ బద్ధముగా తమ పడగలను కదల్పుచూ తమ ఆనందమును వ్యక్తము చేసెను. 

సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల యింటికి తీసుకుని వచ్చెను. శివయోగికి సంతృప్తి కరమయిన భోజనమొసంగబడెను. అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనము కూడా అయ్యెను. శ్రీపాదుల వారు వానికి శివశక్తిస్వరూపులుగా దర్శనమిచ్చిరి. ఆ శివయోగి మూడురోజుల పాటు సమాధిస్థితి నందుండెను. మూడు రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్యహస్తముతో వానికి అన్నమును తినిపించి, తదుపరి వానికి, "నాయనా! సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మకర్మలనాచరించి తరించవలసినది. పురాణములందలి విషయములు కల్పనలు గాని, అసత్యములు గాని కానేకావు. వాటిలోని సామాన్య అర్థము వేరు. నిగూఢమైన రహస్యార్థము వేరు. అనుష్ఠానము చేసెడి సాధకులకు మాత్రమే. దానిలోని అంతరార్థములు, నిగూఢ రహస్యములు, అంతఃకరణములో స్ఫురించును. ఋతుకారకులగు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా, చంద్రుడు మనస్సుకు ప్రతీక. చిత్సూర్యతేజస్సు, మనోరూపమయిన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యము నెరవేరదు. అమావాస్య అనునది మాయకు ప్రతీక. ఈ మాయా స్వరూపమే ప్రథమమున వసువులు అనెడి పేరుగల కళలను సృజించుచున్నది. చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట, తిరిగి వానిని తనయందు లయము చేసికొనుట జరుగుచున్నది. పరమాత్మ తేజస్సును మాయ మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపచేయుచున్నదో అదే విధముగా చంద్రుని యందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది. మాయయునూ, అమావాస్యయును జడస్వరూపములయిననూ వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్సాన్నిధ్యమును బట్టి చిజ్జడాత్మకమయినది. వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడ శిశుజనాదులకు కారణభూతమగుచున్నది. బ్రహ్మ జ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుండును. స్త్రీలయందుండెడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమయినది గనుక ఇది బ్రహ్మహత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు. 

ఛందస్సులచే కప్పిపుచ్చబడినది గనుక వేదరహస్యములను ఛాందసమందురు. వంక లక్షణము ఆర్తవమునకుండును గావున ఋతిమతియైన స్త్రీని మూడు రోజులు దూరముగా నుంచెదరు. స్వర్గమనునది స్వతసిద్ధ కాంతి గల తేజోగోళము. మర్త్యలోకమనునది చావుపుట్టుకలు గల లోకము. పాతాళములన్నియు సూర్యకాంతి వలననే కాంతివంతములగుచున్నవి గనుక వీనికి పృశ్నులు అని పేరు. సప్త పాతాళములకునూ జాతవేదాది అధిష్ఠాన దేవతలు కలరు. మనము నివసించు భూమి ఈ సప్తపాతాళములకునూ ముందున్నది. దీనికి అగ్నియను వాడు అధిదేవత. ఈ ఎనమండుగురు అధిదేవతలకునూ అష్టవసువులని పేర్లు గలవు. సూర్యకాంతి వలన శోభను పొందెడివారు గనుక వీరిని వసువులని పిలుచుచున్నారు. ఈ ఎనిమిది గోళములకునూ మధ్యనున్న వాయుస్కంధములను సప్తసముద్రములందురు. వాయువులకు సముద్రము అనెడి సంజ్ఞ కలదని యాచ్యమహర్షి సెలవిచ్చెను. సామాన్య మానవులు సప్తసముద్రములను జలస్వరూపముగా భావింతురు కాని అది సరికాదు." అని తెలియజేసిరి. 

(ఇంకా ఉంది..)
  

Wednesday, July 2, 2014

Chapter 22 Part 3 (Last Part)

అధ్యాయము 22 భాగము 3

గురుదత్త భట్టు వృత్తాంతము

జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే

నేను కాశీ యాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించెదను, అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్ననూ అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాసఫలము రాజాలదు, గంగాజలము నందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగాస్నానఫలము రాజాలదు ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్ననూ, భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించిననూ, వాని యొక్క మానసిక కాలము, మానసిక దేశము తగు విధముగా లేకపోయిన యెడల వాడు పీఠికాపురనివాసిగా గాని, శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెఖ్ఖలోనికి రాలేడు.  యోగకాలము, యోగదేశము అనునవి ఆధ్యాత్మికశక్తి సంపన్నులకు మాత్రమే అవగతము అవగలిగెడి  విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో, ఏ ప్రదేశములో యోగదేశము అనునది ఏర్పడునో తెలీయరాని దివ్యరహస్యము. మానవునికి కర్మ చేయు అధికారమున్నది. 

సత్కర్మ వలన సుఖము, దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్ననూ సద్గురుని కరుణ వలన యోగకాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినపుడు, ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలెనో ఆ యోగదేశము నందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమయిన విషయము. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండెడి వాడు. ఉన్నట్టుండి శ్రీపాదులవారు ఒకానొక రోజున వానిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి, "నేనే సృష్టి స్థితి లయ కారకుడను. నేనే ఆదిమూలమును. ఈ సమస్త సృష్టియు నా యందే ఉద్భవించి, నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది." అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతట శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు స్మశానమునకు పోయిరి. నరసింహవర్మగారు కూడా వెంటనుండిరి. ఔదుంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను స్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి. అంతట శివయ్యకు ఆ వింత మనఃప్రవృత్తి నుండి విమోచనము కలిగెను. 

నరసింహవర్మకు యిదంతయునూ వింతగా నుండెను. అపుడు శ్రీపాదులవారు "తాతా! దీనిలో ఆశ్చర్యపోవలసినదేమియూ లేదు. వాయసపురాగ్రహారము నందలి ఒక పండితునికి సదా నాపై, "ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ!  పసికూన అయిన శ్రీపాదుడెక్కడా! ఇతడు సృష్టి, స్థితి, లయ కారకుడట. ఆదిమూలమాట. ఇదంతయునూ దంభము, అసత్యము.' అనువిధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ ఋణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగకట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి రక్షించినాను." అని వివరించిరి. 

నాయనా! శంకరభట్టూ! పీఠికాపురమున అవతరించిన యీ మహాతేజస్సు, ధర్మజ్యోతి నేడు యీ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితముల నిచ్చుచుండెను. ఏ రకములయిన జ్యోతిష ఫలితములయిననూ నిర్దేశిత భౌతికాలము నందు భౌతికదేశము నందు జరిగి తీరవలెననెడి నియమము లేదు. అది యోగకాలమును బట్టి, యోగదేశమును బట్టి నిర్ణయింప బడుచుండెను. 

శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్దకర్మ, మరణమును కూడా తప్పించగలరు. 

శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిషశాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరముల తరువాత జరుగవలసిన సంఘటనలను యిప్పుడే జరిపించగలరు, అనగా యోగాకాలమున యిప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరుగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు, అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియునూ దేశకాలములందు సదా జరుగుచుండును. శ్రీపాదులవారు ఆ దేశకాలములను తమ యిష్టము వచ్చినట్లు మార్చి వేయగలరు. ఒక పర్యాయము శ్రేష్టిగారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదులవారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్ధలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతట శ్రీపాదులవారు "తాతా! నీకు ఈ రోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్ధలై ముక్కచెక్కలయి నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశకాలములను యీ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించితిని." అని తెలిపి వారిని ఆశ్చర్యపరచిరి. ఇంతలో సాయంసంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి శెలవు తీసుకొని కురుంగడ్డ వదలి కృష్ణకు యీవలి ఒడ్డునకు చేరితిమి. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! 

( అధ్యాయము 22 సమాప్తం)