అధ్యాయము 22 భాగము 3
గురుదత్త భట్టు వృత్తాంతము
జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే
నేను కాశీ యాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించెదను, అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్ననూ అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాసఫలము రాజాలదు, గంగాజలము నందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగాస్నానఫలము రాజాలదు ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్ననూ, భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించిననూ, వాని యొక్క మానసిక కాలము, మానసిక దేశము తగు విధముగా లేకపోయిన యెడల వాడు పీఠికాపురనివాసిగా గాని, శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెఖ్ఖలోనికి రాలేడు. యోగకాలము, యోగదేశము అనునవి ఆధ్యాత్మికశక్తి సంపన్నులకు మాత్రమే అవగతము అవగలిగెడి విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో, ఏ ప్రదేశములో యోగదేశము అనునది ఏర్పడునో తెలీయరాని దివ్యరహస్యము. మానవునికి కర్మ చేయు అధికారమున్నది.
సత్కర్మ వలన సుఖము, దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్ననూ సద్గురుని కరుణ వలన యోగకాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినపుడు, ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలెనో ఆ యోగదేశము నందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమయిన విషయము. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండెడి వాడు. ఉన్నట్టుండి శ్రీపాదులవారు ఒకానొక రోజున వానిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి, "నేనే సృష్టి స్థితి లయ కారకుడను. నేనే ఆదిమూలమును. ఈ సమస్త సృష్టియు నా యందే ఉద్భవించి, నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది." అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతట శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు స్మశానమునకు పోయిరి. నరసింహవర్మగారు కూడా వెంటనుండిరి. ఔదుంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను స్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి. అంతట శివయ్యకు ఆ వింత మనఃప్రవృత్తి నుండి విమోచనము కలిగెను.
నరసింహవర్మకు యిదంతయునూ వింతగా నుండెను. అపుడు శ్రీపాదులవారు "తాతా! దీనిలో ఆశ్చర్యపోవలసినదేమియూ లేదు. వాయసపురాగ్రహారము నందలి ఒక పండితునికి సదా నాపై, "ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ! పసికూన అయిన శ్రీపాదుడెక్కడా! ఇతడు సృష్టి, స్థితి, లయ కారకుడట. ఆదిమూలమాట. ఇదంతయునూ దంభము, అసత్యము.' అనువిధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ ఋణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగకట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుంచి రక్షించినాను." అని వివరించిరి.
నాయనా! శంకరభట్టూ! పీఠికాపురమున అవతరించిన యీ మహాతేజస్సు, ధర్మజ్యోతి నేడు యీ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితముల నిచ్చుచుండెను. ఏ రకములయిన జ్యోతిష ఫలితములయిననూ నిర్దేశిత భౌతికాలము నందు భౌతికదేశము నందు జరిగి తీరవలెననెడి నియమము లేదు. అది యోగకాలమును బట్టి, యోగదేశమును బట్టి నిర్ణయింప బడుచుండెను.
శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్దకర్మ, మరణమును కూడా తప్పించగలరు.
శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిషశాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరముల తరువాత జరుగవలసిన సంఘటనలను యిప్పుడే జరిపించగలరు, అనగా యోగాకాలమున యిప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరుగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు, అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియునూ దేశకాలములందు సదా జరుగుచుండును. శ్రీపాదులవారు ఆ దేశకాలములను తమ యిష్టము వచ్చినట్లు మార్చి వేయగలరు. ఒక పర్యాయము శ్రేష్టిగారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదులవారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్ధలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతట శ్రీపాదులవారు "తాతా! నీకు ఈ రోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్ధలై ముక్కచెక్కలయి నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశకాలములను యీ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించితిని." అని తెలిపి వారిని ఆశ్చర్యపరచిరి. ఇంతలో సాయంసంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి శెలవు తీసుకొని కురుంగడ్డ వదలి కృష్ణకు యీవలి ఒడ్డునకు చేరితిమి.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
( అధ్యాయము 22 సమాప్తం)
No comments:
Post a Comment