Monday, December 19, 2011

Chapter 10 Part 3

అధ్యాయము 10 
నరసింహమూర్తుల వర్ణనము - భాగము 3 

శ్రీపాదుల వారి స్వరూపము 

బాపనార్యులు: "నీవు మూడు సంవత్సరముల బాలుడవు. వయస్సుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవు ఏమయినా సర్వజ్ఞుడవా ?"

శ్రీపాదులు: "నా వయస్సు మూడు సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేననుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను. ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందునూ ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరుగనేరవు. నేను సాక్షీ భూతుడనై వీటన్నింటిని గమనించుచుందును."

బాపనార్యులు: "శ్రీపాదా! చిన్నపిల్లవాడు తాను చంద్రమండలము నందున్నట్లు తలంచిన మాత్రమున చంద్ర మండలము నందున్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు."

శ్రీపాదులు: "నేను సర్వే సర్వత్ర స్థితమై ఉండు ఆదితత్త్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనైయున్నాను. నా ఉనికివలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశము నందున్నట్లు నీకు అనుభవమునిచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశాములలో లేనని కాదు దానర్థము. నేను సర్వే సర్వత్ర ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములును నా పాదపీఠిక కడనున్నవి. నా సంకల్పమాత్రము చేతనే ఈ సృష్టి అంతయునూ ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నది?"

అప్పలరాజశర్మ: "నాయనా! చిన్ననాటి నుండియు నీవు మాకు సమస్యాత్మకముగా నున్నావు. నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరియొక అవతారముగా వచ్చెదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు. వారు యిదంతయునూ నాటకమనియూ, బూటకమనియూ మనస్చాంచల్యము వలన కలిగిన తెలివిమాలినతనమనియూ రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మకర్మలనాచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని, అవతారపురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును."

శ్రీపాదులు: "తండ్రీ! నీవు చెప్పునది నేను కాదనుట లేదు. సత్యమునే వచిన్చావలెను గదా! నా పాలబాకీ విషయము వచ్చినపుడు నాకు వినోదముగా నున్నది. పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినపుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని జూచి నీవు సూర్యుడవు కాదు అన్నంతమాత్రమున సూర్యుడు, సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాలాబాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు, మనుష్యులమనియు భావించి మానవతత్త్వమునేవిధమున అనుభవించుచున్నారో, అదే విధమున నేనునూ సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనేననియెడి తత్త్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు?"

బాపనార్యులు: "శ్రీపాదా! జతాదారి కనుమరుగయిన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగిపాత్రలు 31 లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదయినా చమత్కారము జేసి వాటిని మాయము చేసినావా?"

శ్రీపాదులు: "సర్వమునూ కాలకర్మవశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్తదర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెఱ్ఱితలలు వేసినది. కాంతాలోలుడయిన యితడు పురాతన కాలమునుండి పూర్వీకులచే ఆరాధించబడెడి ఆ పెద్ద తామ్ర దత్తవిగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడుకత్తెకిచ్చెను. లోకులతో దత్తవిగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారియై వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమునకాశపడి ఆ దత్తవిగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్తవిగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవజేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి యీ జన్మములో శ్రీమంతుల యింట జనించెను. పూర్వ జన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్తవిగ్రహము 32  రాగిపాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి యింట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగిపాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పమువలన నృశింహుని 32 అవతారముల అంశలు ఆ రాగిపాత్రలలో ప్రవేశించెను.

యీ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు, నా చేతులమీదుగా రాగిపాత్రను స్వీకరించవలసినదనియు, దానికి గాను పదివరహాల సొమ్మును శ్రేష్ఠి కిచ్చి నన్ను బంధవిముక్తిని చేయవలసినదనియూ చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయెను. అతని ఆర్ధికసమస్యలు అనూహ్యమయిన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించితిని. అతడు అప్పులవారి బాధనుండి తప్పించుకొనుటకు జటాధారియై మారువేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమునూ తెలిసినట్లే గదా!

యీ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా పదివరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి పదివరహాలు లభించునట్లు చేసితిని. అయితే దీనికి ప్రతిగా యితని పూర్వజన్మ కృత పుణ్యఫల మంతయూ హరించివేసితిని. ఓయీ! సుబ్బయ్య శ్రేష్ఠి ! చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వేకిలిచేష్టలన్నియునూ నాకు తెలియును. నీ గాధ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడీ పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచూ జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీ కంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియును. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగిపాత్ర నుండి జలము, అన్నము, బీరకాయపప్పు మాత్రమే లభించును. నీవు తిని, ఎవరికైననూ పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును." అని తీక్షణముగా పలికెను.

శ్రీపాదులవారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్ని గోళములుగా నుండెను. మరల వారు "ఓయీ సుబ్బయ్యశ్రేష్ఠి! యీ రాత్రి నీ యింటి దక్షిణద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో నున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడుబీదవాడవగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడీ పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినపుడు నేను అనుగ్రహించిన విధమున రాగిపాత్ర అనుగ్రహించును." అని కఠిన స్వరముతో పలికిరి. 

(ఇంకా ఉంది..)      

Saturday, December 10, 2011

Chapter 10 Part 2

అధ్యాయము 10 
నరసింహమూర్తుల వర్ణనము - భాగము 2 

నాయనా! శంకరభట్టూ! అవధూతలనుండిగాని, సిద్ధపురుషులనుండిగాని అనుగ్రహప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న శకలమైనను గ్రహించిన యెడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా! నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోను, మనస్సులోను ఆత్మలోనూ అంతర్లీనమైయున్న లక్ష్మీ అంశ క్షీనించసాగెను. శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమైతీరును. 32 రాగిపాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదులవారు సత్యమును చేసిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, శ్రీపాదులవారు వెళ్లిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 రాగిపాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలియున్నది. నాకు అప్పలరాజుశర్మ నుండి పదివరహాలు రావలెనని దొంగ లెఖ్ఖలు చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ పది వరహాలు నాకు యీ విధముగా లభించునట్లు చేసిరి. యీ లీలద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదులవారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు, సూర్యాస్తామయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్య యందును, సాయంసంధ్యయందును, అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతఃసంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులును విజ్రుంభించుటకు సిద్ధముగా నుండును. సాయంసంధ్య యందు సూర్యభగవానుని సమస్త శక్తులును తిరోగమన దిశయందు వారిని చేరును. 

అంతట నేనిట్లంటిని. "అయ్యా! దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే కాని, స్వీకరించక పోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయము అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదులవారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచూ వారే నరసింహావతారమని, శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివునియందు అనసూయాతత్త్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయయుంచి సవివరముగా తెలియజేయవలసినది."

అంతట సుబ్బయ్య శ్రేష్ఠి, "అయ్యా! మీరు ఆకలిగొని యున్నారు. నీ యింటికి అన్నార్థియై వచ్చినవానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును, జాతికుల భేదముల నెంచక యీయవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను యింతలో ఆ కనిపించెడి అరటిచెట్ల వద్దకు పోయి రెండరిటాకులను తెచ్చెదను. అన్నములోనికి సంభారము బీరకాయపప్పు. అది అమృత తుల్యముగా నుండును. " అని పలికెను. 

నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగిడీలో ఒక రాగిపాత్ర మినహా మరేమియూ లేవు. ఆహారపదార్థములుగాని, ఫలములుగాని, కందమూలములు గాని ఏమియూ లేవు. పైగా అన్నములోనికి ఆధరువుగా బీరకాయపప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమయిననూ తటాకమునకు పోయి కాళ్ళుచేతులు కడుగుకొని వచ్చెదను అని అనుకొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటిచెట్లు వైపునకు వెడలినాడు. 

నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చితిని. సుబ్బయ్య శ్రేష్ఠి రెండు అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాడిచెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను యీ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తరువాత తనవద్దనున్న రాగిపాత్రను తీసుకొని రెండు దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగిపాత్రనుంది జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగిపాత్ర నుండి బీరకాయపప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేమిరువురమునూ సమృద్ధియును, అమృతోపమానమును అయిన ఆ అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములయిన తదుపరి ఆ రాగిపాత్ర ఎప్పటివలెనే ఖాళీగా నుండెను. 

శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము 

శనైశ్చ్వరుడు కర్మకారుడు, గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనైశ్చ్వరునివలెనే ఫలితములిచ్చును. కేతువు అంగారకుని వలెనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనైశ్చ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయంసంధ్య మహాశక్తిమంతము, చతుర్థీ తిథియు, త్రయోదశీ తిథియు, రాహుగ్రహమునకు బలమైన తిథులు. శనిత్రయోదశీ మహాపర్వమునందు సాయంసంధ్యలో శివారాధనము చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదులవారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదులవారిని అర్చించిన యెడల సర్వగ్రహదోషములు శమించును. యుద్ధములకును, ఆపదలకును, శస్త్రాస్త్రములవలన కలుగు అకాలమృత్యువులకును, ఋణగ్రస్తులై యీతిబాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము. అరుణమనగా పాపము లేనిది. చిత్తానక్షత్రమునాడుగాని, మంగళవారమునాడుగాని శ్రీపాదులవారు అరుణ వర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును, బాపనార్యులవారును శనిప్రదోషమున చేయు శివారాధానము నందు పాలుపంచుకొనెడివారు. ఆ రోజున అప్పలరాజుశర్మకూడా మహానిష్ఠతో నుండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమాతీమహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమైయున్న అనసూయా మహాతత్త్వమును ధ్యానించెడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది. అందువలన వెంకటప్పయ్య శ్రేష్ఠి వారినున్దిగాని, నరసింహవర్మ వారినుండి గాని, బాపనార్యుల వారినుండిగాని ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియూ, వారినుండి ధనమును స్వీకరించక పోవుటయే మహాపాపమనియూ శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకరభట్టూ! శ్రీపాదులవారు సకలదేవతాస్వరూపులు. సర్వదేవతాస్వరూపులకునూ అతీతమైన మహాతత్త్వము వారిది. వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములను పొందగలిగినవారు ధన్యులు.

సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు ఈ వింత పధ్ధతి ద్వారా తన తండ్రిని ఋణవిముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలమువలె వ్యాపించెను. శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు. అప్పలరాజుశర్మ కనులనుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దులకుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మగారి యింటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యులును వచ్చిరి. తండ్రిని ఋణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానిన్చిరి. నేను సమావిష్టులయిన పెద్దల సమక్షములో రాజశర్మగారి బాకీ తీరెనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారివచ్చి పది వరహాలు యిచ్చి రాగిపాత్రను కొనుక్కొని వెళ్ళిన యెడల ఋణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతట ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను.

బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. "ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా?" అంతట శ్రీపాదులు వారు, "ఆ జటాధారియే కాదు. అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియును." అని జవాబిచ్చిరి.

(ఇంకా ఉంది...)

Thursday, December 8, 2011

Chapter 10 Part 1

అధ్యాయము - 10 
నరసింహ మూర్తుల వర్ణనము - భాగము 1 

నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణము కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసున తలచుకొనుకొలదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయానమార్గామందు అల్లంత దూరమున అశ్వత్థవృక్షము కానవచ్చినది. అది అపరాహ్ణ సమయము. నాకు ఆకలి మిక్కుటముగా నున్నది. దరిదాపులలో ఏదయినా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మాధూకరమును తెచ్చుకోవలయును. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థవృక్షమున్నది గదాయని ఆలోచించ సాగితిని. అశ్వత్థ వృక్షచ్ఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది. 

నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చితిని. ఆ నూతనవ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చొనమనెను. అతని కన్నులయందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడీ ఒకటుండెను. దానియందు ఆహారపదార్థములు ఏమియునూ లేవు. ఒక రాగిపాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాదవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని, "అయ్యా! మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించితిరా!" అని ఆతురతతో ప్రశ్నించితిని. 

అంతట అతదిట్లు పలికెను. "అయ్యా! నేను సద్వైశ్యకులమునందు జనించినవాడను. నన్ను సుబ్బయ్యశ్రేష్ఠి అని అందురు. నాకు చిన్నతనముననే మాతాపితృవియోగము సంభవించినది. మా యింట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడివాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయమేర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చుపెట్టితిని. మళయాళదేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థియై వచ్చేదివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశములవారికి అమ్మి వారినుండి రత్నరాశులను, గుఱ్ఱములను అతడు స్వీకరించెడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురమునూ కలిసి వర్తకవాణిజ్యములను చేసెడివారము. మా వద్ద మేలుజాతి గుఱ్ఱములను రాజులు, మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మవశమున మేమిరువురమూ కూడా వేశ్యా సాంగత్యమున భ్రష్ఠులమైతిమి. 

అరబ్బుదేశములవారితో మేమిరువురమునూ చేయు క్రయవిక్రయములు కొంతకాలము ఉత్సాహ భరితముగానే సాగెను. తదుపరి వారు మా యొద్దనుండి విశేషధనమును స్వీకరించి మేలుజాతి గుఱ్ఱములనీయక బహు నాశిరకము గుఱ్ఱముల నిచ్చిరి. మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టమువచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతి స్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాలమరణము చెందెను. 

నాయనా! తీర్థములలోకెల్లా శ్రేష్ఠమని పిలువదగిన పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామము. నేను నా అజ్ఞానదశవలన దేవ బ్రాహ్మణ నిండా చేసెడివాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యమును ప్రదర్శించెడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రిగారయిన అప్పలరాజశర్మ గారింటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజనభాజనములనేర్పాటు చేయుటకు అప్పలరాజు గారివద్ద రోఖ్ఖము లేకుండెను. శ్రేష్ఠిగారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో, శ్రేష్ఠి గారు వారి కుల పోరోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రోఖ్ఖమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా యిచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కాని అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణము నుండి తీసుకొనివెళ్ళిరి. బంధుగణములు వెళ్లిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వ అయిననూ లేదనియూ, తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదననియూ రాజశర్మ బదులిచ్చెను. నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడునేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీ కి వడ్డీ లెక్కవేసి దొంగ లెఖ్ఖలేసి పది వరహాలు యివ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకీయ వలెనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని ఒకటి, రెండు వరహాలు వారికిచ్చిన సరిపోవును. యీ విషయమును పదుగురెదుట చెప్పుచుండెడివాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దూరాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి "ఓరీ! దురాత్ముడా! ధనమదాంధముతో యిష్టము వచ్చినట్లు వదురుచున్నావు. మా కులపురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే! నీ పద్ధతులను మార్చుకొననిచో నీవు తీవ్రముగా నష్టపోయెదవు. అగ్ని హోత్రము కంటెను పవిత్రుడైన రాజశర్మను నీవు యీ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయెదవు. " అనెను.

ఒక పర్యాయము శ్రీపాదులవారు వెంకటప్పయ్య శ్రేష్ఠి యింటివద్ద నుండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, "రాజశర్మ నా బాకీని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరినయిననూ నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయును, లేదా తానే ఊడిగము చేయవలయును. ఒక కొడుకు గ్రుడ్డివాడును, రెండవ కొడుకు కుంటివాడును, మూడవ కొడుకైన శ్రీపాదుడు మూడు సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు?" అంటిని. వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నులవెంట నీరు దారాపతముగా వర్షించుచుండెను. శ్రీపాదులవారు తమ దివ్య హస్తములతో వారి కన్నీటిని తుడిచి, "తాతా! నేనుండగా భయమెందులకు? హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే! సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము?" అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి "ఓయీ! నీ బాకీని నేను తీర్చెదను. పద! నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవచేసి నా బాకీ నివృత్తి చేసెదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ యింట నివసింపదు. ఆలోచించుకొనుము." అనెను.

గర్వాంధుడను, దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారి నెత్తుకొని నా దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, "సుబ్బయ్యా! నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పని చేసెదను. నీకు సమ్మతమేనా?" అనిరి. నేను వల్లెయంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి యొకడు నా యొద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడ? అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని. ఇదే నా దుకాణము అని అంటిని. అంతట అతడు "అయ్యా! నాకు అత్యవసరముగా ఒక రాగిపాత్ర కావలయును. వేల ఎక్కువయిననూ పరవాలేదు. daya యుంచి నాకు అత్యవసరముగా రాగిపాత్రనిచ్చినచో తీసుకొని వెళ్లిపోయెదను." అనెను. నా వద్ద 32 రాగిపాత్రలున్నవి. కాని నేను నా వద్ద ఒకే ఒక రాగిపాత్ర ఉన్నాడని, 10 వరహాలు ఇవ్వగలిగిన యెడల దానిని యిచ్చెదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలో నున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగిపాత్రను యీయవలెను. దానికి శ్రీపాదులవారు అంగీకరించిరి. శ్రీపాదులవారి హస్తముల నుండి జటాధారి రాగిపాత్రను అందుకొనెను. శ్రీపాదులవారు నవ్వు చుండిరి. జటాధారి కూడా నవ్వసాగిరి. శ్రీపాదులవారు జటాధారితో, "ఓయీ! నీ కోరిక తీరినది. నీ యింట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాసదీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్యాబిడ్డలు నీ కోసము  ఎదురు చూచుచున్నారు." అనెను. జటాధారి ఆనంద భరితుడై వెడలిపోయెను. 

నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పలరాజశర్మని అవమానించవలెననెడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈ నాటికి తీరినది.నేను గర్వముతో, "యీ రోజున రాగిపాత్ర విక్రయముతో నాకు విశేషధనము సంప్రాప్తించినది. అప్పలరాజశర్మ నాకు యీయవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధవిముక్తుడు." అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రిసాక్షిగా చెప్పమనిరి. మందభాగ్యుడను నేనట్లే చెప్పితిని. 

(ఇంకా ఉంది..)                  

Chapter 9 Part 4 (Last Part)

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 4 

కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజశర్మ గారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులయిననూ వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండెడిది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగా నుండెడివారు. వారి కుటుంబములో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండును. శ్రీపాదుల వారి పితామహుల నామధేయము శ్రీధరరామరాజశర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించునది శర్మ నామధేయము. గ్రామమునందు పంటలు పందిననూ, పండకపోయిననూ జమీందారులకు పన్ను కట్టవలసివచ్చెడిది. నిర్బంధముగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై నుండెడిది.

అందువలన శ్రీధరరామరాజశర్మ తన యిష్టాయిష్టములతో ప్రమేయములేకుండా, జమీందారు వారి ఆజ్ఞననుసరించి, హింసాపద్ధతులద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చెడిది. అది వారి కర్తవ్యము, ధర్మమూ కూడాను. అయిననూ, దైవముదృష్టిలో అది పాపకార్యమాయెను. అప్పలరాజశర్మ జ్యేష్ఠభ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధరరాజశర్మయు, చిన్నసోదరుడైన రామరాజశర్మయు అన్గావైకల్యముతో జన్మించిరి. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తావతారులయిననూ తాతగారు చేసిన ఆ స్వల్ప పాపకర్మముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసివచ్చినది. అందుచేతనే వారికి కూడా పాలసమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమము సర్వులకునూ వర్తింపజేయును. తాను అవతారముగా వచ్చియున్ననూ కూడా కర్మఫలితమును తానుకూడా అనుభవించుట మనకు మార్గదర్శకత్వము వహించుటకే.

శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియునూ, శ్రీ వత్సవాయి నరసింహవర్మయునూ, శ్రీపాదుల వారిని తమ స్వంత మనుమనివలె భావించువారు. అందువలన వారు శ్రీపాదులవారి పాలసమస్యను తీర్చుట ఎట్లాయని దీర్ఘముగా ఆలోచించిరి. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా! దీనికి సరి అయిన ఉపాయమును మీరే చేయవలయినని చెప్పిరి. శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలదు. దానిలో సర్వశుభలక్షణములున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠిగారు క్రయముపొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమవద్ద భద్రముగా నుంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పలరాజశర్మగారు వచ్చిరి. వారికి యీ గోవిక్రయ ధనమును వర్మగారోసంగిరి. పౌరోహిత్యము జరుపునపుడు సామాన్యముగా సంభావన నిమిత్తము యీయబడు మొత్తముకంటే యిది చాలా ఎక్కువగా నుండెను. అప్పలరాజశర్మగారు ధర్మబద్ధముగా తాము తీసుకోవలసిన ద్రవ్యమును మాత్రమే తాము తీసికొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతట వర్మగారు తాముకూడా ఆ మిగతాధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశములో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలననిరి. యీ తగాదా శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీ బాపనార్యులు యిట్లు ప్రకటించిరి. "అప్పలరాజశర్మ నిరాకరించిన యీ మొత్తమును తీసుకొనుటకు ఇష్టపడేవారు తీసుకోవచ్చును." అనేకమంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు యిప్పించవలసినదని పోటీపడజొచ్చిరి. ఇది అంతయునూ విడ్డూరమైన విషయము. 

అంతట తరునవయస్కుడైన పాపయ్యశాస్త్రియను బ్రాహ్మణుడు, "శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాదు. దైవమే అయిన యెడల యీ విచిత్రపరిస్థితి ఏల దాపురించును? శ్రీ దత్తుడే అయినచో తన ఇద్దరు సోదరులను అంగవైకల్యము నుండి ఏలకాపాడడు? జరిగిన కొన్ని సంఘటనలూ కేవలము యాదృచ్ఛికములు. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను. శ్వేతార్కరక్షను కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతీరోజు ఎంతయో జపము చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినాను మలినము అంటదు. యోగ్యుడనైన నాకు యీ ధనమును యిప్పించవలసినది." అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్యశాస్త్రికి ఆ ధనమును యిప్పించెను. ఆ ధనము ఒక మంచిగోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగిసిన తదుపరి విజయగర్వముతో పాపయ్యశాస్త్రి యింటికి పోయెను. అపుడు వాని మేనమామ తన యింటనుండెను. ఇరువురికి ఇష్టాగోష్టి జరిగెను. భోజనము చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను. అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనము చేసేదననియు, ప్రస్తుతము తన మేనల్లుని యింట భోజనము చేయుటకు వీలుపడదనియూ చెప్పి శ్రీఘ్రముగా వెడలిపోయెను. 

మేనమామ వెళ్ళిపోయిన తరువాత పాపయ్య సాలోచనగా కూర్చొనియుండెను. అతని భార్యవచ్చి, "స్వామీ! ఇప్పుడు వచ్చిన యీ మేనమామ గత సంవత్సరము చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చు గ్రుద్దినట్లు పోలియుండలేదా?" అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండెడివాడు. అతడును గత సంవత్సరము పరమపదించెను. ఇప్పుడు యీ మేనమామ ఎవడు?  తన బుద్ధి ఎంతభ్రమలో చిక్కుకున్నది?తనకు మేనమామ వరుస అయినవాళ్ళు మరికొందరున్నను వారెవ్వరునూ ఇతనిని నూటికి నూరుపాళ్ళు పోలియుండలేదు? చనిపోయిన తన మేనమామయొక్క ప్రేతాత్మనా తాను చూచినది? అతని గుండె వేగముగా కొట్టుకొననారంభించినది. తనకు భూతప్రేతపిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయము కూడా లేదు. తాను ఉపాసించెడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకు చెడుకాలమా? మేనమామ వెళ్లిపోవుచూ "నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను." అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరివిధముల బాధింపదొడగెను. తాను ఆనతికాలములోనే మరణించి తన మేనమామను పరలోకములో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్రచిత్తముతో చేసుకొనలేకపోయెను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయము నందలి స్వయంభూదత్తుని దర్శించుకొనుటకు పోయెను. దత్తమూర్తిని ద్యానింపదొడగెను. ఆ ధ్యానములో తనకు శిరస్సులేని దత్తుడు కనిపించసాగెను. అచ్చటకూడా జపము చేసుకొనుటకు కూర్చున్నపుడు మనస్సు చంచలముగా నుండెను. అర్చకస్వామి ప్రసాదము నిచ్చునపుడు ఆ ప్రసాదమంతయును విషపూరిత కలశమున ముంచి యిచ్చునట్లు తోచెను. అర్చకస్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రము యీ ప్రసాదమును తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య యింటికి తిరిగివచ్చునప్పటికి తన భార్యనుదుట కుంకుమ కనిపించదాయెను. నేను బ్రతికుండగనే కుంకుమనేల తీసితివని    అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంత కుంకుమబొట్టును పెట్టుకొనియుండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మనస్థిమితము తప్పెననియెడి ప్రచారము వేగవంతమాయెను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూతచికిత్స మొదలయినవి చేయబడుచుండెను. తనకు పిచ్చిలేదనియు, తాను చెప్పెడి విషయములన్నియూ యదార్థములేయని అతడు చెప్పుచుండెను. అచటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధముగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. ఆజ్ఞానవశమున తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకిది ఫలితమని ఆమె తలపోసెను. నోరులేని పాషాణమూర్తులయిన దేవతామూర్తుల కంటె సశరీరుడై దివ్యాంశలతో వెలుగొందు శ్రీపాదుని శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని యింటికి వచ్చినది. వానిని ఎత్తుకొని ముద్దాడినది. ఏకాంతసమయము చూసుకొని వానితో తనయొక్క దురవస్థను తెలిపినది. శ్రీపాదులిట్లనిరి. "అత్తా! ఇదంతయును ఒక చిన్న సర్డుబాతుతో సమసిపోవును. నీవు నాకు మాత్రుసమానురాలవు గనుక యీ రహస్యమును నీకు చెప్పుచున్నాను. నీవు ఎంతమాత్రము ఆలస్యము చేయక నూతన గృహమును నిర్మించుకొనుము. నీవును, మామయు వాస్తుపూజ చేసి, నూతన గృహప్రవేశము చేసిన తదుపరి అంతయును స్థిమితపడును." 

శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించిరను విషయమును ఎవరికీ తెలియనీయక అద్దె యింటిలో ఉండుటచే ఈ కష్టములు తమకు సంప్రాప్తించినవనియూ, స్వంత గృహమును నిర్మాణము చేసుకొని తీరవలయుననియూ తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానముగా యిచ్చిరి. దానిని వెంటనే వ్యయప్రయాసల కోర్చి పూడ్పించిరి. నూతన గృహనిర్మాణమునకు యింటిలోని ధన, కనక, వస్తువులు అన్నియునూ వ్యయమాయెను. కొంతఋణము కూడా చేయబడెను. కొండరాల్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణమందు  వాడిరి. గృహప్రవేశము జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయెను. 

నాయనా! శంకరభట్టూ! పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటమునుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక, క్షోభ, అవమానము, ధనవ్యయము మొదలయినవి కలిగించి కర్మను ధ్వంసముచేసిరి. అంతేగాకుండా పాపయ్య చెడుకర్మను కొండరాళ్ళలోనికి ఆకర్షించి, వాటిని శకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేసిరి. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధమార్గములు చిత్రవిచిత్రములుగా నుండును. స్వస్థుడయిన పాపయ్యతో శ్రీపాదులిట్లనిరి. "నీవు ఎంతటి బుద్ధిహీనుడవు. బుర్రలేనివాడవు? నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదుడుగా నీ ఎదుటనే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వరాలయములోని పాషాణదత్తమూర్తినే నీ రక్షకుడని నీవు నమ్మిటివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్ళకు ఆకర్షించి వాటిని ఖండఖండములుగా చేయించి, నీ కర్మను క్షయింపజేసి, నీకు నూతన గృహమును కూడా ప్రసాదించితిని. నీవు సశరీరుడైయున్న యీ దత్తునియందు విశ్వాసముంచిన యెడల నీ సంస్కారము లన్నింటిని నా శరీరముపైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించెడివాడను. భక్తుని ఒక్క భావనను బట్టి దైవము అనుగ్రహించి ఫలముండును."

యీ లీల జరిగిన తర్వాతా పాపయ్య శ్రీపాద శ్రీవల్లభులవారిని దత్తావతారముగా గుర్తించిరి.

శ్రీపాదుల వారి పాలసమస్య శ్రీ శ్రేష్ఠి గారికిని, శ్రీ వర్మగారికిని బాధాకరముగా నుండెను. వారు శ్రీ సత్యఋషీశ్వరుల చెంతకువచ్చి, "ఓ! రాజర్షీ! మీరు జనకమహారాజు వలె సంసారము నందుండియూ బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమైయున్నారు. మాదొక చిన్న విన్నపము. మీరు దానిని ఆమోదింప వలసినది." అని అడిగిరి. దానికి బాపనార్యులు, "విన్నపమేదో తెలియకుండ ఆమోదము తెలుపుటెట్లు? మీరు నిస్సంకోచులై విషయమును తెలియజేయుడు. నేను అది ధర్మబద్ధమైనయెడల ఆమోదించి తీరెదను." అనిరి. అంతట శ్రీ శ్రేష్ఠి "నేను శ్రీ వర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందినా శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొందియుంటిని. మా కులపురోహితులయిన శ్రీ అప్పలరాజశర్మ గారికి దానిని యీయదలంచితిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమయిన యెడల అంతకంటె మేము కోరదగినదేదియు లేదు." అనిరి.

శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు "సరి! సరి! ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రండు. దానిని అప్పలరాజునకు యిచ్చు ప్రయత్నమును చేసెదము. శుభ లక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు యింట నుండుట దాటకు, గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరము." అని వచించిరి.

గోమాత బాపనార్యుల యింటికి తీసుకొని రాబడినది. దానిని దానముగా స్వీకరించుటకు అప్పలరాజుశర్మ నిరాకరించిరి. హిమాలయములలో శతోపథ ప్రాంతమనునది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతము నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములుండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించి యున్నామనియు, తన బాల్యరూపమును చూసి తరించవలసినదనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగతించిరి. శ్రీపాద శ్రీవల్లభరూపముననున్న శ్రీ దత్తప్రభువులని దర్శించి చరితార్థులైరి. వారిముందు యీ పాలసమస్య తేబడెను. శ్రీ అవధూత, అప్పలరాజుశర్మ గోదానమును స్వీకరించి తీరవలెననియూ, శ్రీపాదుల వారు సాక్షాత్తూ దత్తప్రభువనియూ, వ్యర్థములయిన నియమములతో దత్తప్రభువులకు క్షీరమునొసంగు మహాత్తరసేవను పోగొట్టుకొనగూడదనియూ నొక్కి వక్కాణించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగిరి. పంచభూతములచే సాక్ష్యము నిప్పించెదమని ఆ అవధూతలనిరి.

శ్రీపాదులే దత్తాత్రేయులని పంచ భూతములు సాక్ష్యము యిచ్చుట 

యజ్ఞము ప్రారంభమాయెను. భూమాత సాక్ష్యము పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే గనుక అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకముగా నిచ్చునది, దానముగా లెక్కకురాదు గనుక సత్యఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా యీయవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరింపబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపముతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యముగా స్వీకరించబడెను. ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులేయని తెలియపరచెను. పంచ భూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజశర్మ గోదానమును స్వీకరించిరి. గోదానఫలితము శ్రేష్ఠి గారికి దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు యిచ్చునట్లు నిర్ణయించబడినది. యీ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికిని, వత్సవాయివారికిని అపూర్వ పుణ్యము లభించినది. 

భవిష్యత్తులో కోకనదము అని పిలువబడు వాయసపుర అగ్రహారము ( కాకినాడ), శ్యామలాంబాపురము (సామర్లకోట), శ్రీ పీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశములవారు, అన్ని జాతులవారు, అన్ని సంప్రదాయములవారు, ఏదో ఒక జన్మమున, ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీస్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడెను. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను యీ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడెను. ఆ భూర్జ పత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్యరూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువులలోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలము నందు పాదుకాప్రతిష్ఠ, ఆలయనిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్యశ్రేష్థుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుతుమ్బమున సిరిసంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్యలోకము నందు కొంతకాలముండిన తరువాత మరాఠదేశమున మహాదైశ్వర్యవంతులయిన వైశ్య కుటుంబము నందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతీ అవతారమును కూడా దర్శించగలరు. 

నాయనా! శంకరభట్టూ! యీ గోదాన సత్యధివిశేష శుభప్రదము. నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాదవల్లభులు సదా రక్షించెదరు గాక!

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము !

(అధ్యాయము 9 సమాప్తం)                           

Wednesday, December 7, 2011

Chapter 9 Part 3

అధ్యాయము 9
కర్మఫల మీమాంస - భాగము 3

అంతట నేనిట్లంటిని. "అయ్యా! నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు గదా! వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసము నెట్లు చేసెదరు?"

సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దానధర్మముల ఫలితము

తిరుమలదాసు యిట్లనెను. "శ్రీకృష్ణుడు కర్మఫలితములను అనుభవింపవలెననే చెప్పెను గాని జాగ్రదావస్థలోనే వానిని అనుభవింపవలెనని చెప్పలేదు. వాని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన పది సంవత్సరముల కర్మమును మానసికక్షోభవలననో, స్వప్నములలోని మానసిక బాధలవలననో, కొద్ది ఘడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు, యోగులకు దానధర్మములు, సేవలు చేయుటవలనను, దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడ పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్య స్వరూపములు. వాటికి కైంకర్యములు చేయుట వలన మనపాపము వాటికి ఆపాదింపబడి, వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పున్యమూర్తులకు దానధర్మములు, సేవలు చేయుటవలన ధ్యానశక్తి మధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని, ఆ సేవామధ్యమమున శిష్యుని పాపకర్మలను తానూ స్వీకరించి తన తపఃఫలమును శిష్యునికి సంక్రమింపజేయును. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతారపురుషులు మహాతేజోమూర్తులు గనుక, వారు అగ్ని స్వరూపులు కనుక, తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు, వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగ నుండిన యీ బదలాయింపు కూడ అంత తీవ్రస్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్ధములయిన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు, రాప్పాలను కొట్టుట ద్వారాను, రకరకముల చిత్రమార్గాముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను. శ్రద్ధగా వినుము.

శ్రీపాదులవారు పుట్టినప్పటి నుండి వారికి పాలసమస్య ఉండెడిది. సుమతీమహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి యింట ఒక ఆవు ఉండెడిది. వారింటనున్న కాలాగ్నిశమనదత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండెడిది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు, గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరము నిచ్చుచుండెను. అదియొక వింత ప్రవృత్తిగానుండెను.

కాలాగ్నిశమన దత్తునికి నైవేద్యముగా నుంచిన ఆ స్వల్ప క్షీరమును, ఒక్కొక్కపరి శ్రీపాదులవారు నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజా మందిరమున చొరబడి త్రాగెడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజశర్మ గారు దత్త ప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యము నిడి నిరాహారముగా నుండెడిది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగిన యెడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును త్రాగెడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్యశిశువునకు చాలినంత క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించెడివారు. సమృద్ధిగా క్షీరమును యివ్వగల ఆవును శ్రీ అప్పలరాజుశర్మ గార్కి యివ్వవలెనని వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కాని అవి అన్నియునూ వ్యర్ధమాయెను. అప్పలరాజుశర్మ ఎత్తి పరిస్థితులలోను దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణమువలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేదపండితులు గనుక వేదసభలేమయినా జరిగినచో వేదసంభావనను మాత్రమే స్వీకరించెడివారు. వారికి పౌరోహిత్యమువలన రాబడికూడా తక్కువ. వారు కేవలము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, నరసింహవర్మ గారికిని మాత్రమే పౌరోహిత్యము చేసెడివారు. వారిరువురూ, సామాన్యముగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యముకంటె ఎక్కువగా యిచ్చెడి సాహసముచేసిన అప్పలరాజుశర్మ గారు కోపగించుకొనువారు. అప్పలరాజుశర్మగారు తమ మామగారైన సత్యఋషీశ్వరులనుండి కూడా ఏమియునూ స్వీకరించెడివారు కారు. కార్తీకపౌర్ణమి నాడు సుమతీమహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల యింట భోజనము చేసెడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధతదియ తోజున మామగారింట  భోజనము చేసెడివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేశ చతుర్ధినాడు కూడా బాపనార్యుల యింట భోజనము చేసెడివారు.

కుటుంబము యొక్క యీ దు:స్థితిని తలంచుకొని సుమతీ మహారాణి ఒకనాడు భర్తతో, "నాథా! మా పుట్టినింటివారు స్థితిపరులే కదా! పైగా వారు కూడా నిష్టాగరిష్ఠమైన శ్రోత్రియసంస్కారముల వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొకదానిని స్వీకరించుటలో నాకు దోషమేమియును కనబడుటలేదు. శ్రీపాదునికి కడుపునిండుగా క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి." అనెను. అంతట అప్పలరాజుశర్మ యిట్లనెను. "సౌభాగ్యవతీ! నీవు చెప్పేది విషయము బాగుగనే యున్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియు నుండనేరదు. కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలా మంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వము నుండియూ యిప్పటివరకు అత్యంత ఆశ్చర్యకరమయిన విషయములు నడచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన యెడల మనయింటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరము నీయవచ్చును గదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగజేయవచ్చును గదా. అదియును గాక పెద్దవాడయిన శ్రీధరరాజశర్మ అంధుడిగాను, చిన్నవాడయిన రామరాజశర్మ కుంటివాడు గానూ ఉన్నారే! శ్రీపాదుడు వారిద్దరునూ అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చును గదా. నీవు ఈ విషయము నీ నాయనతో చర్చిన్పుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితముకాదు."

సుమతీ మహారాణి యీ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసముతో యిట్లనిరి. "అమ్మణీ! ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే గాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనిన్చితిని. మనయింట గోసమృద్ధి యున్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే గాక మహదానందప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రము యొక్క ఆమోదము ఆవశ్యకమే! ఆహా! ఏమి విధివైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనోయని పరిపరివిధముల ప్రయత్నించు జామాటలు లోకమున లెక్కకు మిక్కుటముగానున్నారు. అయిననూ నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతని నియమమును భంగపరచయత్నించిన మనము వెఱ్ఱివాళ్ళమగుదుము. సృష్టియందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించినగాని నీ భర్త యీ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న ఋణానుబంధము తెగిపోవును. ఋణవిముక్తుడైన దత్తుడు మీ యింట బిడ్డగానుండజాలడు. జగద్గురువై లోకమునుద్ధరించుటకు బయల్వెడలెను. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని, వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టుమని కోరకుము. సర్వమునూ కాలాధీనమైయున్నది. ఆ కాలము శ్రీపాదుని అధీనమై యున్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీరసమృద్ధి కలిగితీరును. అయితే శ్రీపాదునితో నీకు ఋణానుబంధము నశించును. ఋణవిముక్తుడైన యీ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీరసమృద్ధమై, తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరము నొసంగును. అప్పుడసలు యీ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన యీ విషమసమస్యను దత్తుడే పరిష్కరించును." అని తెలిపెను. 

అంతట శంకర భట్టు "అయ్యా! శ్రీపాదుల వారి అన్నలిద్దరునూ అన్గావైకల్యముతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా?" అని ప్రశ్నించెను.

అంతట తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శ్రీ దత్తాత్రేయులవారు సాయంసంధ్యలో అవతరించిరి. శ్రీపాదులవారు ఉషఃకాలమున అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్టమధ్యాహ్నము అభిజిలగ్నమునందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయంసంధ్య తరువాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారము యోగసాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుబట్టని గాఢ అంధకారము. జీవులకు తెలియకుండగనే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలోనుంచి పరిణామము వైపునకు పయనించిరి. ఇది కేవలము ఒక్క భూమండలమునకే పరిమితము కాదు. 

శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులును ఒక్కసారి విజ్రుంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మా సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములయిన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచూ అనంత వైవిధ్యములో పరిణామము నొందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండుడు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచూ జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారియొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. 

దత్తావతారమునకును, శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాళరాత్రి నడచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారయిన శ్రీధరరాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తిక వాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారయిన శ్రీరామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయిననూ, మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి, కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలయిన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్యవిషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. 

(ఇంకా ఉంది..)               

Chapter 9 Part 2

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 2 
శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును.

మూడు అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచూ, వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు లక్ష మార్గములననుసరించిన యెడల, వానిని ఉద్ధరించుటకు దైవము పదిలక్షల మార్గముల ననుసరించును. శ్రీదత్తప్రభువు తన అంశావతారములచేతను, సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధులద్వారాను ఈ సృష్టిపాలనము చేయుచుందురు. 

పూర్వయుగములందలి శ్రీదత్తులవారేనా ఈ శ్రీపాదులవారు అను స్వల్పసంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదులవారు నైవేద్యరూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయా మాత లోహపుశనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమీ అలనాటి దత్తుడనేనని గుర్తుచేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్ధము కూడ ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బుస్థానములోనున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపములో నున్నవనియు, వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చితిననియు, శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్యమానసములో వీక్షించని వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్యమానసములో వీక్షించనిజీవి ఏదియూ ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యము. సత్యవస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టితమై యుండుట వలన ఆ జ్ఞానమును పొందినవారందరూ ఈ లోకమునుండి అంతర్థానమైననూ నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చునపుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులయిన మునులు, అవతారపురుషులు అందరునూ అవినాశ తత్త్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్త్వమునకు చెందినవారు. అవినాశతత్త్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండితీరవలెననెడి నియమమేదియునూ లేదు. య్యది స్వేచ్చాతత్త్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంతనవీనము. కారణములేని కార్యము జరుగుటకు వీలులేదు. సర్వకారణములకునూ, సర్వకార్యములకునూ ఏకైకతత్త్వమే ఆధారము. అది అన్నింటికినీ అతీతము. అదియే దత్తతత్త్వము. ఆ దత్త ప్రభువు తన సంపూర్ణకళలతో కలియుగమున ప్రప్రథముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు వేయిశిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. 

నాయనా! శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీనృశింహ సరస్వతిగా అవతరించెదమని సెలవిచ్చి యున్నారు. హిరణ్యకశపుడు అతి విచిత్రములయిన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినాను ఇచ్చిన వరములకు భిన్నముకాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడయిన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కోడా తన స్వామీ ఉన్నాడని వచించెను. స్వామీ స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా? లేడా? అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునణచుటకును, ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీదత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని ఋజువు చేయుట నరసింహావతార విశిష్టత, దైవదూషణ చేయువారి మదమునణచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట - అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులునూ, శ్రీ నృశింహ సరస్వతియునూ, శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమియూ లేవు. 

తిరుమలదాసు యీ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రములమీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో గదా! శాలివాహన శకములో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూణశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదులవారు శలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? యీ కలియుగము ఏ రోజున ఎన్ని ఘటికల, ఎన్ని విఘటికలకు ఆరంభమైనది. భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము, భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదులవారు ఏ విషయములను వ్రాసియిచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తవతారముగా నమ్మెదను.

నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పకుండగా నేను మధ్యమధ్యలో వారు చెప్పుదానిని ఆలకించు భంగిమలను కనపరచుచూ, చిరునవ్వును నవ్వుచూ ఆ లోహపు శనగల వైపు చూచుచుంటిని. 

ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురు పోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదులవారి చరిత్రము నాలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములునూ వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించినది. 

ఆహా! క్షణములో నేను చెవిటివాడు గాను, తిరుమలదాసు మూగవాడు గాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్ననూ మాట వచ్చుటలేదు. నేను వినదలచుకొన్ననూ ఎంతటి చిన్నధ్వని కూడా వినిపించుటలేదు. అపుడు నేనిట్లు నా మనసులో చింతించితిని. "రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వముగాని కాదుగదా! హా! హతవిధీ! యిపుడేమి చేయవలెను?"

ప్రసాదముగా ఉంచబడి లోహపుఖండములుగా మారిన శనగలు 
"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిల్చుట 

ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్రభాషలో "శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్నపత్రము కానవచ్చెను. మేము చూచుచుండగనే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జపత్రము కంటె చాలాచాలా తక్కువమందము కలిగియుండెను. అది ముట్టుకొనినపుడు మృదువుగానుండెను. నలుపురంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి యీ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగుభాషలో నున్నది. "శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18 వ తేదీన రాత్రి సమయమున 2 గంటల 27 నిమిషముల 30 సెకండ్లు. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధపాడ్యమి, శుక్రవారము, అశ్వినీ నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది."

నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయునూ స్వేదరూపమున బయటకు వచ్చుచుండెను. శరీరము కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదులవారు అదృశ్యముగా యిచ్చటనేయున్నారని నాకు రూడీయైనది. నా మనమున "ఏమి నా దురదృష్టము? నేను కురవపురమునకు చేరుట కలలోనిమాట! శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించిననూ ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసికొట్టి ఉతికి ఆరవేయును." అని చింతించితిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు సాధారణంగా, బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్యపరమాణువులకు బోధించుచు, ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువుచేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురుశిష్యులు ఉభయులూ దోష భూయిష్టులే! బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు, రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిసరములనున్నవారు తమ రజకవృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని యిటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు గాని, అవగాహన చేసుకోన గలుగువారు గాని కారు. ఏది ఏమయిననూ నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. 

నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మవర్చస్సుతో వేలుగొందుచుండెను. అంతట నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మాలిన మనస్కుడయిన నేను రజకుడనని తోచెను. 

నైవేద్యముగా ఉంచబడి లోహరూపమున మారియున్న శనగలు క్రమముగా యధారూపమును పొందినవి. శ్రీపాదులవారు నన్ను మన్నించారని అర్ధము చేసుకొంటిని. మరికొంతసేపటికి తెల్లటిరంగులో నున్న ఆ పత్రము అంతర్ధానమాయెను.

తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శంకరభట్టూ! ఈ కలియుగము లోహయుగము. ఇదంతయునూ కల్మషములతో కూడినయుగము. శ్రీపాదులవారి ఆజ్ఞ మేరకు, నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము  హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠదేశమున శరీరధారిని కాక తప్పదు."

"అయ్యా! శ్రీపాదులవారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరియొక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతమును శలవిచ్చి నన్ను ధన్యుడచేయవలసినది." అంటిని.

తిరుమలదాసు యిట్లనెను. "ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల యింటికి ఉతికినబట్టలను తీసుకోనిపోయితిని. సుమతీమహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదులవారినెత్తుకొని ఆడించుచుండిరి. దత్తదిగంబర! దత్తదిగంబర! దత్తదిగంబర అవధూతా! అని వారు పాడుచుండిరి. అపుడు శ్రీపాదులవారు రెండు సంవత్సరముల బాలుడు. వారు కేరింతలుకొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయనమనోహరముగా నుండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్త దిగంబర! అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతట శ్రీపాదులవారు నృసింహ సరస్వతి దత్త దిగంబర! అనిరి. తాము సాక్షాత్తు దత్త ప్రభువులుగా గతములో అవతరించితిమనియు, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు, తెరమరుగయిన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదులవారు తమదయినా శైలిలో ఈ విధముగా బోధపరచిరి.

సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట 

శ్రీపాదులవారు, "తాతా! నేను నృసింహ సరస్వతిగా మరాఠదేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠదేశమునకు రమ్మనుచుంటిని." అనిరి. శ్రీధరావధాన్ల వారి నోట మాటరాలేదు. అంతట తిరుమలదాసు, "నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్ననూ, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ." అంటిని. అపుడు శ్రీపాదుల వారు "తిరుమలదాసూ! నీవు మరాఠదేశమున గాడ్గేమహారాజ్ అను పేరుతో రజకకులమున జన్మించెదవు గాక! దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యెదవు గాక! ధీశిలానగరమున 'సాయిబాబా' నామమున యవనవేషమున నా యొక్క సమర్ధ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవనవేషమున నున్న నా సమర్ధ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవు గాక! నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక 'గోపాలా! గోపాలా! దేవకినందన గోపాలా!' అను నామమును జపించెదవు గాక! నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకము నందుండి ఆ పైన గాడ్గేమహారాజ్ గా లోకహితార్ధము చేయుము. ఇదే నీకు నా వరము! నా అభయము!" అని నన్ను దీవించిరి.

శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. ఇంతలో సుమతీమహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మివుండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలెనే భావించిరి. 

(ఇంకా ఉంది...)                    

Tuesday, December 6, 2011

Chapter 9 Part 1

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 1 

ఆనాడు గురువారం. సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును, నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణరూపంలో మా గదిలో ప్రవేశించినది. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం! ఆ సన్నటి సూర్య కిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల రూపాన్ని ఇద్దరమూ చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగనే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము, అత్యంత మంగలప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి పదునారు సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యముచేత మాత్రమే! క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళరూపము కనుమరుగైనది. 

శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును, బాధాకరముగను కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన, శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా? అని మనసులో మధనపడసాగితిని. 

అప్పుడు శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిధ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీదత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్టమధ్యాహ్న సమయమందు దత్త క్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము." అంతట నేనిట్లంటిని. "అయ్యా! ప్రతిరోజూ శ్రీదత్తప్రభుని స్మరణతోను, దత్తకథాప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన.

శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పదొడంగెను. "నాయనా! కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వము నిర్మూలించి, ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమయిన లీలలద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మసంస్థాపనా కార్యక్రమములన్నింటికి బీజరూపమును యీ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. "

ఖనిజములో చైతన్యము నిద్రాణస్థితి. ఖనిజస్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధనిద్రాణస్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తుపదార్థము తీసుకొన్న మనుజుడు తన శరీరమునందు యీ స్థితిని అనుభవించును. ప్రాణశక్తిరూపమున అభివ్యక్తమైన తత్త్వము పరిణామము చెంది వికాసముచెందిన దశలో మనస్సుద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసముచెందిన దశలో మనుష్యుదానిపించుకోనును. మనస్సు తనయొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సునకతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగాముద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప, నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితి ననుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొండుచుండును. అయితే అతడు మహా సంకల్పముననుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములంటావు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతిమానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతిక్షణము కోట్లకొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధా నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు.మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన, వారి అతిమానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాన్తిస్వరూపము వేగము కూడా వారి అతిమానస వేగామునకు సరికాదు. మానవుడుగాని, మరేప్రాణిగాని చేయు ఏ చిన్న ప్రార్థన అయిననూ అసంఖ్యాకములయిన వారి తేజః పుంజములను చేరి తీరవలసినదే! సమస్త దృశ్యాదృశ్య శక్తులకునూ వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరమునుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటికోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహనక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తెజస్సునండు సూర్యుని ముందు దివిటీవలె నుండును. నాయనా! ఇదే శ్రీపాద శ్రీవల్లభ వారి అసలుసిసలు తత్త్వము. అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ, నిరాకారస్వరూపము సృష్టియందు తనకుగల అవ్యాజ అనంత కరుణతో సాగున, సాకారముగా మనుష్య రూపములో శ్రేపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. 

శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము 

మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమయినటులనే, దైవము కూడా తనయొక్క అనంత పరిమితులను కుదించుకుంటూవచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగప్రక్రియ. సత్యము ఒక్కసారి సృష్టిలో ప్రతిష్టించబడిన యెడల అది స్వతస్సిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్టించ సంకల్పముతో వచ్చిన దివ్యభావ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతట నేనిట్లంటిని. "అయ్యా! మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియుచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతుచిక్కుటలేదు. వారి యీ దివ్యభవ్య  చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలేనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్టించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టలగురించి వింటిని గాని, సత్యమును ప్రతిష్టించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన." అంతట తిరుమలదాసు యిట్లనెను. "అయ్యా! శంకరభట్టూ! నీవు శ్రీవారి దివ్యచారిత్రను వ్రాయుటకు సంకల్పింపబడినవాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించును. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీ లేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకుమించి నీవు ఆలోచించుట వ్యర్థము."

మానవుడు రకరకముల భోజనపదార్థములను తీసుకోనును. అవి వాటంతట అవియే జీర్ణమై, మానవునికి శక్తి నిచ్చుచున్నవి. ఈ ప్రక్రియయందు మానవుని ప్రమేయముగాని ప్రయోజకత్వముగాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుట వరకే వాని బాధ్యతా, ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొనుట అనునది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరముయొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు కావున తప్పు, ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛలేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించవలసినదే! ఇది తిన్నవానికి ఇష్టమున్ననూ, లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతస్సిద్ధకార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్టించబడినది.  సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను, మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు, ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకొని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహనక్షత్రాదుల గతులు యీ రకముగా జరిగి తీరవలసినదే! ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి యీయబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టియందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమునూ సంకల్పమాత్రమున సిద్ధించుచుండును, త్రేతాయుగమున యగ్నయాగములు చేయుటవలన సిద్ధించుచుండును, ద్వాపరయుగమున మంత్ర, అస్త్రప్రయోగమున సిద్ధిన్చుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రములవలన సిద్ధించుచుండును. యుగధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్నకొలదియూ సరళీకరణ విధానము నిర్ణయించబడినది.

(ఇంకా ఉంది..)

Saturday, December 3, 2011

Chapter 8 Part 4 ( Last Part)

అధ్యాయము 8
దత్తావతారముల వర్ణనము - భాగము 4
కర్మచక్ర పరిణామము

అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. "నీవు చెప్పునది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసినయెడల సప్తజన్మముల బాలవైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు నలుగురయిదుగురు స్త్రీలను వివాహమాడిన యెడల మరు జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ నలుగురయిదుగురు స్త్రీలు తమ కామవాసనలు, సంస్కారములు నశింపనియెడల పురుష జన్మనెత్తి ఆ స్త్రీ ని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచారదోశము కలుగును. అట్లుగాక వేరువేరు జన్మములయందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన యెడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచాక్రమునండు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమూ నాచరింపవలెను. పురుషజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మము నాచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుషజన్మకు గాని యిటు స్త్రీ జన్మకుగాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమనునది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచూ మనస్తాపమునొందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి, పదిమందితో కలిసి దానిని భుజించెననుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధననుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలములోనిక్షిప్తమై యుండును. నాయనా! వాయుమండలము నందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మలవలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక, తనను తినిన పదిమంది మానవులను హింసింపవలెనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మనెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు, ప్రతీ చర్యకును, ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణమునలవరచుకొనవలెను. సాత్వికుడు మేకను చూచిననూ, దాని మాంసము తిననొల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయిననూ సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన యెడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును.

పీఠికాపురవాసుల సాంఘాతిక పుణ్యమును, సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీ దత్తునిగా గ్రహింపక మరింత అశుభఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరదిన్చుచూ, శ్రీపాదవల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్ధంకానపుడు మౌనము వహించుట మంచిది, అంతే కాని దివ్యభవ్యమైన శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచూ పాదములకు మేకులను కొట్టువారునూ, శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక, శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీదత్తనామస్మరణమున సర్వమనోరథములు అయాచితముగా, అప్రయత్నముగా సిద్ధించును. శ్రీవల్లభుని నిందించు పాపజనులకు  విచిత్ర పద్ధతులలో విఘ్నములు, అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్ని స్వరూపము. వారు ధరించునది అగ్నివస్త్రము. వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి? ఎన్ని కల్పములు గడచినవి? ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి? కాని శ్రీదత్తులవారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తూ శ్రీపాద శ్రీవల్లభులే! సృష్టిలోని ప్రతీ అణువణువునూ, యీ పరమసత్యమునకు సాక్ష్యము పలుకును.

స్వయంభూదత్త పునఃప్రతిష్ట 

శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్తసిద్ధుడు. అతడు తిట్లు, శాపనార్థముల మూలమున ఆశీస్సులనందజేయు వింత సాధువు. అతడు ఎవరినయినా పొగిడిన యెడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీనించినట్లే! ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అపుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలానదిలో నున్నాడని తెలిపెను. అంతట ఏలానదిలో ప్రయత్నముచేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభ ముహూర్తమున అపరసర్వమంగళాదేవి అయిన సుమతీ మహారాణియు, బ్రహ్మతేజో విరాజితులైన అప్పలరాజశర్మయు పునఃప్రతిష్టించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి.

విద్యారణ్యుల ఆవిర్భావము 

ఆలయములో పునఃప్రతిష్ట జరిగిననాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ యింటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లెయనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము రెండవ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానులు భుజముపైకెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచూ సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యెను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు "మాధవా! నాకు 16 సంవత్సరములు వయస్సు వచ్చునపుడు నీ కోరికమేరకు బుక్కరాయుడుచే హిందూసామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు, బుక్కరాయునికి నీవు తోడై యుండుము. నీవు విద్యారణ్యమహర్షి నామమున విఖ్యాతుడవయ్యెదవు గాక! నీ సోదరుడైన సాయణాచార్యునింట రాబోవు శతాబ్దములలో గోవిందదీక్షితులు జనించును. ఆ గోవిందదీక్షితుడు ఎవరో కాదు నీవే! రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవు గాక!" అనిరి.

అంతట ఆ సిద్ధుని కన్నులవెంట ఆనందబాష్పములు జలజలరాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదులవారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత? అనెను. అంతట శ్రీపాదులిట్లనిరి. "నీవు శృంగేరీపీఠము నధిష్టించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యెదవు. నీ శిష్య పరంపరలో మూడవవాడిగా నీవే కృష్ణసరస్వతీ నామమున జనించెదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యము మిక్కుటముగా నున్నది. కావున నేను నృసింహ సరస్వతీ నామమున తిరిగి అవతారమెత్తునపుడు నీవు కృష్ణసరస్వతీ నామమున నాకు కాశీలో సన్యాసదీక్ష నిచ్చెదవు. దీనికి కాశీవిశ్వేశ్వరుడునూ, అన్నపూర్ణామాతయునూ సాక్షి. నీవు సన్యాసిధర్మమును పునరుద్ధరింపవలెను."

వశిష్ఠ, శక్తి, పరాశరసత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులును, ఋగ్వేదులును అయిన వాజపేయయాజుల మాధవాచార్యుడు, విద్యారణ్యమహర్షిగా వినుతిగాంచి తీరును. నాయనా! రేపు నీకు మరిన్ని విషయములను చెప్పెదను అని తిరుమలదాసు యీ రోజు వృత్తాంతము ముగించెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 8 సమాప్తం) 

Chapter 8 Part 3

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 3 
కర్మ రహస్యము 

నిరంతరమూ శ్రీపాదుల వారి స్మరణలోనూ, ధ్యాసలోనూ ఉండెడి యీ పరిసర ప్రాంగణమంతయునూ శుభప్రదములు పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్పందనలన్నియునూ విషపూరితములై యున్న కారణమున, కలుషిత వాయుమండలములో నిండిన ఆ బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిధ్యమును స్వీకరించరయిరి. దీనిలోని రహస్యము ఇది సుమీ!

జీవులు తమ పరిణామ క్రమములో గాని, విపరిణామ క్రమములో గాని కర్మసూత్రముననుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలెను కదా! అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞానాన్వేషి అయిన కారణమున పరినామక్రమము యొక్క చివరిదశలో కురువపురములో శ్రీపాదుల దర్శనభాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగల్గెను. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడయినను అనేక సంవత్సరముల వరకూ శ్రీపాడులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణము వలన, గుర్తించిన తదుపరి కూడ యింకనూ ఎంతయో సాధనాక్రమమున గాని వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొందసాధ్యము కాలేదు. 

అప్పుడు శంకరభట్టు ఇట్లదిగెను. "అయ్యా! మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతీ జాతికిని ఒక ఆత్మ ఉండునా? పార్వతీ దేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి?"

అంతట తిరుమలదాసు యిట్లనెను. "ప్రతి జాతికిని ఒక ఆత్మ యుండును. అది ఒక మానసిక పదార్థమై ఉండును. అది దివ్యాత్మ అయిన శ్రీదత్తుని నుండి వెలువడిన భాగము. సదా దానితో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకోనునట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తము కాదు. స్పృహ కలిగియుండి జీవించి యుండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వము నందు యీ వ్యక్తుల యొక్క వివిధములయిన శక్తి సామర్థ్యములు, గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును. ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును. ప్రతి దేశమునకునూ ఆత్మ ఉండును. మనము నివసించు భూమికి కూడా ఆత్మ కలదు. దానినే మనము భూమాత అని పిలుచుచున్నాము. అనగా యీ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడిన ఒకానొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధముగా హిమవన్నగము నందు అభిమానము  గల దేవతాశాక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమవతి. సర్వసాక్షి అయిన సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు అనిన యెడల జీవుల శుభాశుభ కర్మలననుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవతాత్మ అని అర్థము. 

సూర్య భగవానుని వలన మాత్రమే సర్వజీవులును, తమతమ కార్యకలాపములను సాగించగలుగు చైతన్యమును పొందుచున్నారు. ఆకాశమున విరాజమానుడైన సూర్యుడు వేరు. ఆ సూర్యుని అభిమానదేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాదవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యెదరని నీతో చెప్పితిని. కోటానుకోట్ల బ్రహ్మాండములలో వారు ప్రతి అనువులోను విలీనమయ్యెదరు, వారు సర్వాంతర్యామి గదా! తిరిగి విలీనమగుట అనగా నేమి అని నీవు అడుగవచ్చును. వారు సర్వాంతర్యామిగా నున్ననూ, వారియొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటానుకోట్ల బ్రహ్మాండములునూ ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగిరపరచు ఉద్దేశ్యముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోనూ పరిణామదశలో ఒకానొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయులవారు అవతరించెదరు. ఇనుమును సూదంటు రాయి ఆకర్షించును. అదే ఇనుము మాలిన్యములతో కూడియున్నపుడు ఆకర్షణ అత్యంత బలహీనమగును. మాలిన్యములను రహితమొనర్చి సృష్టి యందలి ప్రతీ అణువును తమవైపు ఆకర్షించుకొని విశ్వపరిణామక్రమమునకు వినూత్న దిశను యివ్వదలచినపుడు మాత్రమే యీ విధమైన అవతారము వచ్చును.

పంచకన్యల వివరణ 

శంకరభట్టు తిరుమలదాసును ఇట్లడిగెను. "అయ్యా! అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనం" అని చెప్పుదురు గదా! ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుట లేదు. వివరింప ప్రార్థన.

అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. 'అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయమును పన్నును. కోడి రూపమును ధరించి కొక్కొరోకో అని అరిచేను. వేకువ జాముఅయ్యెనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు  కలవాడు గనుక అహల్య వ్యామోహమున నున్న అతని తీవ్రమనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్యా రూపముయోక్క శరీరమునందలి జీవాణువులన్నియు దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించెను. అంతట అహల్య, "ఓ తెలివిమాలిన మునీ! ఎంత పని చేసితివి?" అనెను. అహల్య గౌతముని కంటెనూ అధ్యాత్మికముగా ఉన్నత స్థితి యందుండెను. అహల్యా శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యమునొంది శివార్చనమున స్వస్థుడాయెను. అహల్య మనశ్శక్తి జడత్వమొందెను. దానితో ఆమె శరీరము కూడ జడత్వమునొంది పాషాణమయ్యెను, శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాపవిమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము.

శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. అయిదు రూపములయిననూ, అయిదు మనస్సులు ఉన్ననూ, వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే! ఇదియొక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ.

అసలయిన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్నిప్రవేశము చేసినపుడు యిద్దరు సీతాలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము.

భూచక్రమునందలి 12 రాశులలోను 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యౌవనవతిగా నుండగా గురుబ్రహ్మ అభిమాన దేవతయైన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యౌవనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మవిరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినపుడు భర్తృభావమే కలిగెడిది కాదు. ఆమెలో తన యెడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనః ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై యుండెను. ఈ విధముగా పరిణామస్థితి నొందిన తారాదేవి, పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారచంద్రుల కలయిక ధర్మవిరుద్ధము కాలేదు. సృష్టినియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టివచ్చుట చంద్రుని ధర్మమూ. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మవిరుద్ధమగును. ధర్మవిరుద్ధమైనది ఏదీ విచ్చిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయనా! ఈ ధర్మసూక్ష్మము ననుసరించి తారాదేవి మహాపతివ్రత.

భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. 'చెడు జరుగునపుడు సాధ్యమైన యెడల దానిని నిరోధింపవలెను. దానిని నిరోధింపవలెను లేదా ధర్మవిరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను.' అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది ఫక్కున నవ్వెను. అంతట భీష్ముడిట్లనియె. 'ద్రౌపదీ దేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టుపట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును యిప్పుడు శరీరము నుండి బయల్వెడలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మష రహితముగా నున్నది. సత్యము బోధపడినది. ' అనెను.

జీవి పరిణామదశలో అనేక జన్మలెత్తుచుండెను. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మింపవచ్చును. మానవజన్మ లేకుండా పశుపక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచలస్వభావురాలైన ఒక భార్య, దుష్టప్రవృత్తిగల ఒక భార్య, మృదుస్వభావముగల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించెను. మృదుస్వభావముగల భార్య విభీషణుడుగా జనించెను. కల్పాన్తరము నందు వీరు మువ్వురునూ, మండోదరి పురుషుడుగా జనిన్చినపుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్యకాగా అంగదుడు జనించెను. తదుపరి రావణునికి భార్యగానయ్యెను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపురాణి అయ్యెను. వాలికి భార్యగా నున్నపుడున్న జీవాణువులు, రావణుని భార్యగా నున్నపుడున్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా నున్నపుడున్న జీవాణువులు వేరువేరుగా నున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే! "

అప్పుడు శంకరభట్టు ఇట్లడిగెను. "అయ్యా! స్త్రీలకూ ఒకే భర్తతో నుండవలెననియూ, పురుషులు ఏకపత్నీ వ్రతులాయి ఉండవలెననియూ చెప్పుదురు గదా! బహు భార్యత్వము కాని, బహు భర్తృత్వము గాని నిందనీయములు కాదా?"

(ఇంకా ఉంది..)

Thursday, December 1, 2011

Chapter 8 Part 2

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 2 
శ్రీపాదులు షోడశకళాప్రపూర్ణులు

కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరములోనికి ప్రవేశించిరి. శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశకళా పరిపూర్ణమైన మహాయుగావతారమను విషయమును బోధ చేయుచుండిరి. తమ పదునారు సంవత్సరముల వయస్సులో పీఠికాపురమును వీడిరి. ఆ తరువాత పదునాలుగు సంవత్సరములు కురువపురము, తదితర ప్రాంతముల సంచరించిననూ వారి వయస్సు మాత్రము 16 సంవత్సరములందే నిలచియుండెను. 
దత్తాత్రేయుని షోడశావతార నామాలు 

16 సంఖ్యకు మరియొక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయస్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చి యుండిరి. అవి (1) యోగిరాజు, (2) అత్రివరదుడు, (3) దిగంబరావధూత శ్రీ దత్తాత్రేయుడు, (4) కాలాగ్ని శమనుడు, (5) యోగిజనవల్లభుడు, (6) లీలావిశ్వంభరుడు, (7) సిద్ధరాజు, (8) జ్ఞానసాగరుడు, (9)విశ్వంభరావధూత, (10) మాయాముక్తావధూత, (11) ఆదిగురువు, (12) సంస్కారహీనశివస్వరూపుడు, (13) దేవదేవుడు, (14)దిగంబరుడు, (15) దత్తావధూత, (16) శ్యామకమలలోచనుడు. 

శ్రీ దత్త ప్రభువులు భోగమోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకలను ఆరాధించిననే చాలును. వారి పాదుకలను నాల్గు వేదములు నాల్గు కుక్కల రూపమును పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రతలనూ పోగొట్టగలిగిన వేదములే, అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడియుండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు, దేవతలకు, సప్తర్షులకు కూడా అసాధ్యము.

పూర్వము వామనావతార సమయమున వారికి సమకాలికుడుగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించునపుడు మాతృ గర్భము నుండి తల ఒక పర్యాయము బైటికి వచ్చి పరిసరములను పరికించి, తిరిగి గర్భస్థమయ్యెను. అపుడు దేవతలు, ఋషులు ప్రార్థించగా వారు మరల జన్మించిరి. వారు ఆజన్మ బ్రహ్మజ్ఞానులు.

శ్రీపాదుల వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా రెండుసార్లు జన్మించుట వలన వారు ఆజన్మద్విజులు. ఆజన్మబ్రహ్మజ్ఞానసంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ, అనంత, అద్వైత సచ్చిదానందముతో అవతరించిరి గనుక ఈ అవతారమున వారికి గురువను వ్యక్తియే లేడాయెను. శ్రీపాదుల వారు గణేశ చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము గాక, వారికి అతీతముగా నున్న ఒకానొక ప్రత్యేక తత్త్వము. అందువలన వారు త్రిమూర్తులకతీతమైన నాలుగవ తత్త్వమని సూచించుటకు చతుర్థీ తిథినాడు జన్మించిరి. సృష్టి యందలి ప్రవృత్తి గణములు, నివృత్తి గణములు రెండింటికీ అధిపతి అయిన గణేశ తత్త్వమని సూచించుటకు గణేశ చతుర్థీ దినమున ఆవిర్భవించిరి. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళ గ్రహమని కూడా అందురు. ఈ గ్రహము పాపస్థుడైనయెడల జీవులకు అనేక అమంగాలములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను పరిహరించుటకు, సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమందు జన్మించిరి. చిట్టా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేషఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త గనుక, హరిహరాత్మజుడైన అయ్యప్పస్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించిరి. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నములో జన్మించి, వారు విశ్వప్రభువుననియూ, దర్బారుచేయుటకు వచ్చిన చక్రవర్తిననియూ తెలియజేయుచున్నారు. శ్రీపాదుల వారికి తెలియని ధర్మసూక్ష్మములు లేవు. ధర్మసంకటము లేర్పడినపుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపధము దర్శనీయమగును.


శ్రీదత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటిదేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్తదేవతా స్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషిపూజ చేయవలయును. విష్ణు ముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రా ముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జిహ్వ యందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమందు లక్ష్మి కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టియందలి సమస్త స్త్రీదేవతాశక్తులును శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులును శ్రీపాదుల వారి కుడిభాగము నందు కలవు.  

తిరుపతిలో ఏడుకొండల మీద వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే! 'వేం' అనగా పాపములను 'కట' అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. 'వేం' కారము అమృతబీజము. 'కట' అనునది ఐశ్వర్యబీజము. అందువలన వేంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయునూ, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభులును అభిన్నమూర్తులు.

అప్పుడు నేనిట్లంటిని. "అయ్యా! తిరుమలదాసూ! వర్ణాశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు వచిన్చిరి. శ్రీపాదవల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహమును నివృత్తి చేయవలసినది.
బ్రాహ్మణ లక్షణములు 

అంతట తిరుమలదాసు ఈ విధముగా చెప్పనారంభించెను. "నాయనా! బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే సద్బ్రాహ్మణుడని పిలువబడును. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన యెడల అతడు దుష్ట బ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన యెడల అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మున్నగువాటికి లోనైన యెడల అతనిలో బ్రాహ్మణత్వము లేశమాత్రమైననూ లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారమువలన అతనిలోని బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరింపబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేకమార్పులకు లోని చండాలత్వము నొందును. అపుడతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానాకాంక్షుడై నిరంతర తపస్సువలన బ్రాహ్మణత్వము పొందవచ్చును. అప్పుడు జన్మ  సిద్ధముగానున్న అతని శరీరమునందలి జీవకణములు బ్రాహ్మణత్వము నొందును. ఈ విధముగా బ్రాహ్మణత్వమును పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్చ్వరుడు మూడురాశులలో ప్రయాణము చేయు 7 1 /2 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకును శరీరమునందలి జీవకణములు మార్పులు చెందును. పాత జీవకణములు నశించును. క్రొత్త జీవకణములు సృష్టింపబడును. ఈ ప్రక్రియ అంతయునూ మనుష్యులకు తెలియకుండగనే జరుగుచుండును.

క్షత్రియుడు తన క్షేత్ర వృత్తిని వీడి శాంతరస ప్రధాన వ్రుత్తి అయిన కృషి, గోగణపోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన యెడల అది తీవ్ర దశకు వచ్చిన యెడల అతనిలో క్షాత్రము ఎంత మాత్రమునూ నిలువదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకులోనై వైశ్యత్వము నొందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తి నవలంబించిన పరశురాముని వలెనగును. పూర్వకాలమున ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతః బ్రాహ్మణులైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా? కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనను క్షాత్ర వృత్తి నవలంబించలేదా! జన్మతః శూద్రుడనయిన నేను శ్రీపాదుల అనుగ్రహము వలన బ్రహ్మజ్ఞానము పొందలేదా? జన్మతః శూద్రుదయినా వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా గాని, క్షత్రియుడుగా గాని, బ్రాహ్మణుడుగా గాని మారవచ్చును. కేవలము ఒకానొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయకుండుట గాని, శిక్ష వేయుట గాని యమధర్మరాజు చేయడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములు ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడనయిన నేను మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. జన్మతః బ్రాహ్మణుడయినవాడు మరుజన్మలో శూద్రుడుగా జన్మింప వచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్లు కోసము వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వము, బాహువులు క్షత్రియత్వము, ఊరువులు వైశ్యత్వము, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవని శ్రీపాదవల్లభులే ఒక పర్యాయము సెలవిచ్చి యుండిరి. శంకరభట్టూ, నీవు మా యింత ఆతిధ్యమును స్వీకరించుచున్నావు. మా యింటి భోజనము బ్రాహ్మణ భోజనమే!

(ఇంకా ఉంది..) 

Wednesday, November 30, 2011

Chapter 8 Part 1

అధ్యాయము 8 
దత్తావతారముల వర్ణనము - భాగము 1 
బ్రహ్మజ్ఞానము కొరకు తపించువారు బ్రాహ్మణులే

ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తీ చేసుకొనిన తదుపరి యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఆత్మ సాక్షాత్కారమగునపుడు పదహారు కళలూ తమతమ భూతములలోనికి చేరిపోవును. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యములోనికి ప్రవేశించును. ఆత్మజ్ఞానము, కర్మలు అన్నియునూ బ్రహ్మస్వరూపములో ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైననూ బ్రాహ్మణుడే యగును. 'ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనస్సు, అన్నము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములు, లోకములలోని నానావిధమైన నామములు' అనువాటిని పదహారు కళలని అందురు. శ్రీపాద శ్రీవల్లభులు షోడశకళా పరిపూర్ణ పరబ్రహ్మావతారము.

ఆహారమే మనస్సగును. సాత్విక ఆహారము వలన మనోనైర్మల్యము ఏర్పడును.

విధాత ముందుగా ప్రాణమును సృష్టించెను. ప్రాణమనునది విశ్వములోని సమస్తప్రాణము. సూక్షాత్మ, హిరణ్యగర్భ నామములతో యిది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవునియోక్క భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధములైన మూర్తిత్వములలోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తిశరీరమని పేరు. ప్రాణమయచైతన్యమును సరి చేయుట ద్వారా భౌతికసంబంధమైన బాధలను పరిహరింపవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమె స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తరువాత పంచభూతములేర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములేర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలములో పనులు జరుగునట్లు చేయుటకు మనస్సు ఏర్పడినది. మానవులు తమ ఆహార విషయములో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారము యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనస్సు ఏర్పడుచున్నది. మనస్సు ఆహారముచే బలోపేతమైన యెడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచనాస్రవంతి క్రమబద్ధము చేసి, నియంత్రణలో ఉంచినయెడల ఆలోచనా ప్రతిబింబరూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుచున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యధావిధి నాచారించుచూ, ఆయా కర్మకలాపములలో పధ్ధతి ప్రకారము మంత్రములను ఆలాపించిన యెడల అది కర్మ అని పిలువబడును. కర్మలను బట్టియే ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపములు లేకుండగా ప్రపంచముండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంకెల పదహారు రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క యింద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితమౌతుంది. సమాధి స్థితిలో ఉన్నయోగికి ఆత్మా సాక్షాత్కారమైనపుడు పదహారు కళలూ తమ తమ భూతములలో లీనమౌతాయి. యోగి యొక్క భౌతిక శరీరమండలి యింద్రియములలోని శక్తులు విశ్వాంతరాళం లోని భూతములలో లీనమౌతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలనాచరించకుండా ఉండలేరు.

అహం నశించనిదే మోక్షం కలుగదు

మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనునది మనస్సు బుద్ధి అను వాటియొక్క నియమ నిబంధనలచేత నిబద్ధితమైన చైతన్య జ్యోతి. ఆత్మసాక్షాతారం పొందిన యోగికి పూర్వ జన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటి ధోరణి పూర్తిగా నశించనిదే ఆత్మసాక్షాత్కారము జరుగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారమైనపుడు శ్రుతికర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దానియొక్క మాయాజాలములన్నియునూ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడగుచున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుచున్నాడు. అతని స్థూలదేహము కర్మఫలములను అనుభవించుచున్నను యోగికి స్థూలదేహ స్పృహ లేనపుడు ముక్తావస్థలోనే యుండును. పరమాత్మ సిద్దావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్య లీలను ప్రకటించవచ్చును. యోగికి యీ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయును. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు, యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమయిపోవలెను. 

శ్రీ బాపనార్యులు శ్రీశైల క్షేత్రములోని శ్రీ మల్లిఖార్జునలింగములోనికి, గోకర్ణములోని మహాబలేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలములలోనికి, సూర్యమండలము నుండి శక్తి పాతమును చేసియున్నారు. స్వయంభూదత్తుని అర్చామూర్తిలోనికి కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన యీ శక్తికి శాంతి జరుపవలెను. లేనియెడల అర్చామూర్తి యొక్క తీక్షణతకు అర్చకునితో సహా, అర్చనలు జరుపువారు అందరునూ శిక్షింపబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తుని లోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీబాపనార్యుల ఆధ్వర్యములో వేలాది మంది ప్రజలసమక్షములో జరిగినది. సూర్యమండలము నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుచుండగానే మల్లిఖార్జునలింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు యీ శక్తిపాతమునకునూ అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలుపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయము. శ్రీశైలములో శాంతి జరిగినది. వేలాదిమందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంత తత్వములో నిలచినపుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుచుండును.

అయితే పీఠికాపురములోని శ్రీ స్వయంభూదత్తునిలో జరిగిన శక్తిపాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనార్యులు శాంతి జరుగవలెనని అన్నదానము జరుగవలెనని సూచించిననూ, అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను త్రోసిపుచ్చిరి.

(ఇంకా ఉంది..)         అధ్యాయము 7 భాగము 5

అధ్యాయము 7 
ఖగోళముల వర్ణనము - భాగము 5 


లోకనివాసులు, లోకాధిపతులు, ఖండముల వివరణ 

వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి, యితడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తరదిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురమునందు యితడుండును.

అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాల ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు.

సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పున్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. 

రాసాతలమునందు పుణ్యనగరమనునది కలదు. దానికి నిఋతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైఋతి దిక్కునకు అధిపతి. తలాతలము నందలి ధనిష్ఠాన పురమున పిశాచ గణములతో కూడి భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీ పతియైన ఈశానుడు కలదు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. 

పాతాళమునందు వైకుంఠనగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోను, వాసుకి మొదలయిన సర్పశ్రేష్ఠులతోనూ, శేషశాయియై విరాజిల్లుతున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు.

ఆఖరిదైన పాతాళ లోకము నందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండము నందు ప్రేత గణములుందురు. తృతీయఖండము నందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు.

సప్తసముద్రములును, సప్తద్వీపములును, మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది తొమ్మిది ఖండములుగా విభజించబడియున్నది. దక్షిణము నందున్న దానికి భారత ఖండమని పేరు. దీనిలో భరతపురము నందు స్వాయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్య జీవులు, ఋషులు స్వాయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర, చక్రవాళ, లోకాలోక పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించి యుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తన గుండా ప్రసరింపనీయని పొరలు.

మహాభూమికి దిగువన ఏడు అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతలలోకమనునది పిశాచాములకు నివాసము. వితలలోకము నందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునండలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలి చక్రవర్తి తన పరిజనులయిన రాక్షసులతో నివసించును. వైవస్వతపురము నందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రాసాతలములోని పుణ్యపురమనునది నైఋతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్ఠాపురములో భేతాళుడుండును. తలాతలము నందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనునది పితృదేవతలకు నివాసము. పాతాళము నందు శ్వేతద్వీపవైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకొన్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేత గణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్య గ్రహ స్తానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము 'రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్దినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతి' అని ఉత్తరాపోశనలోఉదాకప్రదానము వీరికే చేయబడుచున్నది. 

లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ 

భూలోకమునందు గల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖయందు ప్రకాశించునది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండులోకము. సూర్యగ్రహమండలము ఎంతమాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధ లోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చరలోకము, రాశ్యధిదేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువ లోకము అనునవి కలవు. ఇవేకాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు.

భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవతయయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము రెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, అంగారక గ్రహము మూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము అయిదు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము ఏడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శుక్రలోకము తొమ్మిది లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము పదకొండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, రాశ్యధిదేవతా లోకము పన్నెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతా లోకము పదమూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షి లోకము పదునాల్గు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, ద్రువలోకము పదునైదు బ్రహ్మాండ యోజనములలోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములయిన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్యబిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున గాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు.

దత్తుడు అనగా ఎవరు?

నరసావధానులు తాతా! నీకు అనుభవములోనికి రావలెనన్న కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి యుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజోమహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్త ప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము.

శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులును, అతని భార్యయును నిర్ఘాంతపోయిరి. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు యింతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయునూ, తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులును, అతని భార్యయు వెక్కి వెక్కి ఏడువసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములు స్ప్రుశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి.

శ్రీపాదుల వారు "నేను దత్తుడను. కోటానుకోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్త్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను. దిగంబరుడను. ఎవరయితే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబరా! శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! నరసింహ సరస్వతి దిగంబరా! అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపములో సదా ఉందును. మా మాతామహులయిన శ్రీ బాపనార్యులు పరదేశము నుండివచ్చి పాదగయా క్షేత్రము నందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించు కొనువారికి ఉచితముగా భోజన, వసతి సౌకర్యములు కలిగించు చుండగా, నీ స్వయంభూదత్తుడేడి? అదృశ్యమాయెనుగా? అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే! నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్య లోకములు ప్రాప్తించును. బ్రతికి యుండిన జీవులనే కాక చచ్చిన జీవులయొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావుపుట్టుకలు రెండునూ సమానమే! అయిననూ నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా? అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కన్పించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్త ధ్యానములో నుండుము. మరుజన్మమున కటాక్షించెదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసేంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటానుకోట్ల బ్రహ్మాండమును సృజించి, రక్షించి, లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను." అని పలికిరి. మహాభాయంకర శబ్దముతో శ్రీ చరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది, శ్రీపాదులు అదృశ్యులయిరి.

నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును యీ రకముగా తెలియజేసిరి. వారు సర్వ వ్యాపకతత్త్వము. నిరాకారమైన ఆ తత్త్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలకరూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండియూ చేయు లీలలకు అంతమెక్కడ ?

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము-7 సమాప్తం)