Monday, October 31, 2011

అధ్యాయము-3 భాగము-3

 అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 3 
కాణాద మహర్షి కణ సిద్ధాంతము 

"స్వామీ! నన్ను క్షమింపుడు. కాణాదమహర్షి గురించి, వారి కణసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు." అని అంటిని.

కరుణాస్వరూపులైన శ్రీ పలనిస్వామి యిట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములయిన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ కేంద్ర బిన్డువుననుసరించి మహా వేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన యీ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షనక్షము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మ స్థితిలో దత్త ప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభాసధ్యమో అంత కష్ట సాధ్యము కూడా. ప్రతీ కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన యెడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమానమగుచుండెను. అనంతములైన మహా శూన్యముల సంయోగ ఫలితమే యీ చరాచర సృష్టి, పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉందును. ఇవి రెండునూ కలిసినపుడు వ్యతిరేకపదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణ ప్రతిష్ట జరిగినపుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగనే యుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థ  వంతమగును. సర్వమంత్రములును కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రీ కూడా కలిగినది. గాయత్రి మంత్రము నందు మూడు పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రము నందలి నాలుగవ పాదము 'పరోరజసి సావదోమ్' అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలినీశక్తి 24 తత్త్వములలో యీ జగత్తులు సృష్టి చేయును. గాయత్రీ యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు.'గో' అనగా 2. కులము అనగా 4 . బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక తొమ్మిది సంఖ్యచే సూచితము. ఎనిమిది అనునది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు యిష్టమైన వారి నుండి "దో చౌపాతీ దేవ్ లక్ష్మీ" అని అనుచుండెడివారు. జీవులందరికీ పాటి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది తొమ్మిది సంఖ్యను, లక్ష్మీ అనునది ఎనిమిది సంఖ్యను, 'దో' అనునది రెండు సంఖ్యను 'చౌ' అనునది నాలుగు సంఖ్యను సూచించునవి అయి ఉన్నవి. 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అనుటకు మారుగా అపభ్రంశముగా, విచిత్రముగా 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుచూ 2498 సంఖ్యను జీవులకు గుర్తుచేయు చుండిరి. గోకులము నందలి పరబ్రహ్మము, పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీ కృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము.


"నాయనా! శంకరా! స్థూల మానవ శరీరము నందు 12 రకముల భేదములు కలవు. అందరికినీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదాని కంటెను మరియొకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును.అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును.

మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు యీ ప్రదేశమునకు విచ్చేసిరి. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు యిచ్చతకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతెక్కడిది? శ్రీవల్లభులు యిచ్చతకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీ నారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలము లన్నియు ఇచ్చట శ్రీ చరణముల కదా పడుచుండుట గమనించితిని. వారు దేశ కాలములకు అతీతులు." అని వచించెను.

నేను శ్రీ పళని స్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. "స్వామీ! బ్రహ్మ కమలములనగా నేమి? అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీదత్త ప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియుచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను." అని కోరితిని.

(ఇంకా ఉంది..)  

అధ్యాయము-3 భాగము-2

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 2 

నేనూ, మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునాకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త అయ్యప్పదేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులయిన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురీ(గుంటూరు) మండలాంతర్గతమైన నంబూరు గ్రామము నందలి వేదపండితులులను, మళయాళదేశము నేలు రాజవంశమువారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మళయాళదేశము చేరి వేదవిద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే! నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోను, నియమ నిష్టలలోను, మంత్ర తంత్ర యంత్ర విద్యలలోను చాల ప్రసిద్ధులు. అయితే మాధవనంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట జేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయినవారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించెదనా యని తహతహలాడుచున్నాడు.

మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని, కొండకోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహ ద్వారమునకు వచ్చినప్పటికి శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి, "మాధవశంకరులు యిద్దరూ కలిసి వచ్చుచున్నారే ? ఏమి భాగ్యము!" అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగనే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులయిన శ్రీస్వామి "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులయిన వారు, జనన మరణ రూప సృష్టిక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే ! సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములయిన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుచునే యుండును. నరరూపధారియై వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లపుడునూ యీ భూమి మీద  భక్తి రక్షనర్థము అవతరించుచునే యుండును. నాయనా! శంకరా! నీవు విచిత్ర పురమున కాణాద మహర్షి గురించి వారి కాన సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము." అని పలికిరి.

(ఇంకా ఉంది..)

Saturday, October 29, 2011

అధ్యాయము-3 భాగము-1

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 1 
శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ 

శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరము నందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్లూరుచుండెను. మూడురోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. నాలుగవ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపలి నుండి మహా రౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమూ లేదు, సున్నమూ లేదు, అని కసురుకొనెను. నేను గృహము బైటనే కొంతసేపు వేచి యుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, "అయ్యా! అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన యెడల నా నెత్తి మీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు, యీమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును.మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగులగొట్టబడినవి. మా యింట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న యెడల ఇబ్బంది ఉండదు. లేని యెడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి, మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పధ్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకోనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసినవారు ఎవ్వరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుట లేదు. లోకులు 'నీకు అప్పు యిచ్చిన యెడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చునపుడు తీర్చెదమనుకొందువా? ఆ దారియును యిప్పుడు మూసుకొని పోయెను.' అని అనుచుండిరి. స్థితిపరుడనయిన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలచి, 'వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటయినా ఎవరయినా దానమిచ్చిన యెడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే యింటిలో నీకు అన్నము లభించును.' అని అన్నది. అంతట భార్యా విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నియును నాకు బాగుగా తెలియును. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును." అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాదా! శ్రీవల్లభా! ఏమి యీ విషమ పరీక్ష! అనుకోని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు యింటికిని పోయితిని. ధనసహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నమును పెట్టువారే కరువయిరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు యిట్లు పలికెను. "అయ్యా! ఇప్పటివరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీకు కూడా దురదృష్టవంతుడవయితివి." అప్పుడు నేను యిట్లంటిని. "అయ్యా! సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే! వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచూ ఆ కనిపించుచున్న రావిచెట్టు మొదటలో కూర్చొనెదము. ఆపైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము". అని పలికితిని.

దానికి ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిని. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, "అయ్యా! యువరాజుల వారికి మాట వచ్చినది. మూగతనము పోయినది. సత్వరమే మిమ్ములను తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని" విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. "నేను ఒంటరిగా రాజాలను. నాతోపాటు యీ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్లవలెనని చెప్పితిని." దానికి రాజభటులు వల్లెయనిరి. మమ్ములను గుఱ్ఱములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరు గమనించి ముక్కుమీద వ్రేలు వేసికొనిరి.

మహారాజు ఇట్లు పలికెను. "అయ్యా! మహాత్మా! మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలా సేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! శ్రీదత్త దేవా దిగంబరా! అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాకారుడయిన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి, నోటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందురు? శ్రీదత్తప్రభువులకును, ఆ యోగికిని గల సంబంధమేమి?" దయ ఉంచి తెలుపవలసినదని కోరెను.

"శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్త ప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే! వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను, పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని." అని సవినయముగా పలికితిని.

విచిత్రపురము నందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా, రాజునకు సద్బుద్ధి ఏర్పడి, తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేనోళ్ళ శ్రీవల్లభస్వామిని కీర్తించిరి.

రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను. "అయ్యా! యిన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలననూ, వైష్ణవులు శివదూషణ చేయుట వలననూ పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయునూ ఋణపడి యున్నాము." అని పలికెను.

మేము వారి నుండి శెలవు పుచ్చుకుని వచ్చునపుడు మాధవనంబూద్రి కూడా మాతో పాటు వచ్చెదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురమూ అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా యిచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణ్యమునకు యిచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువర్తనురాలాయెను.

(ఇంకా ఉంది...)

Friday, October 28, 2011

అధ్యాయము-2 భాగము-8

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 8
శంకరభట్టు మహారాజుల సంవాదము

ఇంక రెండవ పరీక్ష ప్రారంభమాయెను. రాజునకు అత్యంత ప్రియమయిన మూగ భాషలో పరీక్ష మొదలాయెను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలిడిరి. రాజగురువులు తమ వేళ్ళను చూపుచూ ఒకటా, రెండా? అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా? లేక మరొకరు ఎవరయినా తోడున్నారా ? అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడనే వచ్చితినని ఒక వేలు చూపించుచూ సైగలతో ఉత్తరమిచ్చితిని. తదుపరి వారు మూడువేళ్ళను చూపిరి. మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా? అని ప్రశ్నించితిరనుకొంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి యిది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసితిని. దానికి రాజగురువులు తియ్యటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో యివ్వబోయిరి. నేను అది వలదని వారించుచూ నా వద్దనున్న అతుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను దీసి వారికిచ్చితిని. నాకు తియ్యటి తినుబండారముల కంటె అతుకుల యందు యిష్టము ఎక్కువనియు, మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావము.

అప్పుడు రాజగురువులు ఉదాత్తస్వరముతో "రాజా! ఇతడు గొప్ప పండితుడు. వేద వేదాంగములను ఔపోశన పట్టిన మహా పండితుడని తెలియుచున్నది. ఈతడు మూగభాషలో కూడా మహా పండితుడని శ్లాఘించెను." నాకంతయునూ అయోమయముగ నున్నది. అపుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచెను. "రాజా! శివకేశవులవారు యిద్దరున్నారు కదా! వారిద్దరూ ఒకటేనా? వేరు వేరా ? అని ప్రశ్నించితిని. ఒక వేలు చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేయని తెలియజేసెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురున్నారు కదా! అని మూడు వేళ్ళను చూపితిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి అయిదు వేళ్ళు ఉన్ననూ సమిష్టిగా లేవా? అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధురపదార్థములను యివ్వబోతిని. తనకు అటువంటి శిష్యప్రశిష్యుల గోల ఏమి లేదనియూ కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ, తెలియజేయుచూ నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను." నేను దిగ్భ్రాంతుడనయితిని. ఆహా! లోకములోని మనస్సులు. వాటి ఆలోచనలు, అర్థము చేసుకొను పద్ధతులు ఎంత విభిన్నమయినవని ఆశ్చర్యపోయితిని.

ఇంక మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. "ఏకాచమే అనగా ఒకటి. త్రిస్రశ్చమే అనగా ఒకటికి మూడు కలిపి, వర్గమూలము కనుగొనగా రెండు. పంచచమే అనగా నాలుగుకు అయిదు కలుపగా తొమ్మిది వచ్చును. దాని వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును. దాని వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై అయిదు వచ్చును. దాని వర్గమూలము అయిదు. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై అయిదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పైఆరునకు వర్గమూలము ఆరు. త్రయోదశచమే అనగా ముప్పైఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును. పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన 64 వచ్చును. దానికి వర్గమూలము 8 . సప్తదశచమే అనగా 64 నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9 . నవదశచమే అనగా 81 కి 19 కలుపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింగ్ శతిశ్చమే అనగా 100 కు 21 కలుపగా 121 వచ్చును. దానికి వర్గమూలము 11 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 121 కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలము 12 . పంచవింగ్ శతిశ్చమే అనగా 144 కి 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13 . సప్తవింగ్ శతిశ్చమే అనగా 169 కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14 . నవవింగ్ శతిశ్చమే అనగా 196 కి 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15.   ఏకత్రిఇంశతిశ్చతు అనగా 225 కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 256 కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17 . పంచవింగ్ శతిశ్చమే అనగా 289 కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18 . సప్తత్రింగ్ శతిశ్చమే అనగా 324 కి 37 కలుపగా 361 వచ్చును. దాని వర్గమూలము 19 . నవత్రింగ్ శతిశ్చమే అనగా 361 కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20 ." అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించితిని. "ఇదియంతయు పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాదమహర్షికి తెలియును. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును." శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

    (అధ్యాయము-2 సమాప్తం)

అధ్యాయము-2 భాగము-7

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 7 
శంకరభట్టు మహారాజుల సంవాదము   

నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి? అని తలంచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించునటులే నన్ను కూడా "అంతకు యింత అయిన యింతకు ఎంత అగును?" అని ప్రశ్నించెను. "ఇంతకు ఇంతే!" అని గంభీరముగా బదులిచ్చితిని. రాజు విభ్రాంతుడై యీ విధముగా వచించెను. "మహాత్మా! మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనయితిని. నాకు ఈ మధ్యనే పూర్వ జన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా యింటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసెడివాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నా కంటె కూడ ధనికులు, అన్నపానములకు లోటులేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని, ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. అబ్దీకములకు గాని, వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు, సంభావనలు వచ్చెడివి. అందుండి వంద వంతులలో ఒక వంతు మాత్రమే నాకిచ్చి తొంబై తొమ్మిదివంతులు వారే స్వీకరించెడివారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండెడిది. పైగా నా యింటి నుండి తోటకూరను ఉచితముగా పొందెడివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యధావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు ప్రతిరోజూ తినుట వలన హాని ఏమియూ జరుగదనియూ చెప్పుచుండిరి.

కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వ జన్మలో నేను కటిక దరిద్రస్థితిలో ఉండికూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించితిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగ నేను వారి కంటె ఎన్నో రెట్లు ధనవంతుడుగను, శ్రేష్టుడిగను జన్మించితిని. తోటకూర దానము చేయుట వలన రాజయితిని గదా, మరి యిప్పుడు అప్పటికంటె ఎన్నో రెట్లు బండ్లకొలది తోటకూర దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి? అని యీ వింత ప్రశ్నను వేసితిని. దానికి మీరు సరియైన సమాధానం చెప్పితిరి." అని ముగించెను. అంతట నేను "రాజా! పూర్వజన్మలో పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమయినది. మణులు, రత్నములు, బంగారము వంటివి దానము ఈయదగిన యీ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినాను అందుకు వందరెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమియూ రాదు." అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా యిచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీ చరనులు కృపా విశేషమున గాడిదను అధిరోహించెడి గండము తప్పినదని భావించితిని. "శుక్లాంబర ధరం విష్ణుం..." అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి యిదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కెడి గండము తప్పించినందులకు శ్రీపాదులవారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించితిని.

(ఇంకా ఉంది..)

అధ్యాయము-2 భాగము-6

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 6 

శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను ? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్రపరిస్థితుల్లో యిరుక్కొని విచిత్రముగ బయటపడితిని.

నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయవిధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా! మీరు వైష్ణవులా! శైవులా! అని ప్రశ్నించిరి. "మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు, అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపెడివారమనియు, ఆది శంకరుల దక్షినామ్నాయి పీఠం అయిన శృంగేరి యందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియూ" నేను చెప్పితిని. మీరు దయ ఉంచి మా రాజు గారి వద్దకు రావలసినదని వారు కోరిరి. నేను వారిననుసరించి రాజ దర్శనమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరయినా కనిపించిన యెడల, వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, "అంతకు యింత అయితే యింతకు ఎంత?" అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలెనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞము చేయించిరి. అదృష్ట వశమున వానికి పుత్రసంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను, బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుటవలననే తన కుమారుడు మూగవాడయ్యెనని రాజు అభిప్రాయపడెను.అందుచే ఆ రాజు శైవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును, వైష్ణవులకును కూడా సంకట ప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించునట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయు, తక్కిన వంటకములను భుజించుటయూ బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తర్వాతా వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరనో, వండిన తోటకూరనో తినవలసి వచ్చెడిది.

బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియూ, వేదాంతములో పండితులమనియూ, పురాణేతిహాసములలో పండితులమనియు విర్రవీగెడి బ్రాహ్మణులు అందరునూ కూడ తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోను ఒక దత్త భక్తుడు, దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు, తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరునూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించిరి.

తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలెనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాల గర్విష్టిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో నుండి, మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను.

(ఇంకా ఉంది..)

Thursday, October 27, 2011

అధ్యాయము-2 భాగము-5

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 5 

కానీ మీ పితృదేవతలలోని కొందరు స్మశాన కాళికాసాధన చేసి, దానితో అయిష్టులయిన వారిని ఎందరినో, తమ మంత్ర ప్రభావముతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన, నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన యీ సంఘటన జరిగి వారికి ఉత్తమగతులు లభించినవి. 

అయ్యా! బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతిస్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై, సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనెడి భేదమేమియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానము నపేక్షించినపుడు బ్రాహ్మణ ధర్మమూ ననుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్టి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనునది బ్రాహ్మణధర్మ ప్రకారము దోషమైనది. కాని క్షత్రియధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు. సత్యాన్వేషివి. కావున అహింస నీకు పరమధర్మము. కాని కసాయివానికి మాత్రము కాదు.

కావున మానవుడు చేయు కర్మలవలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న, తానూ ఏ కులమందు జన్మించినను, తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు గనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి.

శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతీ క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యానశ్లోకమును పఠిoచుచూ వినోదముగా నీ తోటివారితో వదురుచుండెడివాడవు. "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అను శ్లోకమును వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పెడివాడవు. శుక్లాం బరధరం అనగా తెల్లబట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు శశివర్ణం అనగా బూడిదరంగులో కూడినదనియూ చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగినదనియూ, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియూ, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను, అని చెప్పెడివాడవు. అయ్యా! శంకరభట్టూ! శ్రీదత్తప్రభువు బహుచమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అపుడు నీవు దుమ్ము, ధూళితో బూడిదరంగులోనే ఉంటివి. నడువలేక నడువలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆన్చి నడచివచ్చితివి. ఆ విధముగ నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాస పడుచూ మేడిచెట్టు వద్దకు వచ్చిననూ గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన యెడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను యీ రకమయిన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశమును వినెడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు యిచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్థుల యింట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన యీ సంఘటనను వారికి పొరపాటున చెప్పిననూ వారు నిన్ను తమ కులముల నుండి వెలి వేయుదురు. 

శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిధ్యమును స్వీకరించి రెండు, మూడు రోజులు గడచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని.

(ఇంకా ఉంది..)

అధ్యాయము-2 భాగము-4

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 4 
 శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము 

సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగిపొరలుచుండెను. అతని నేత్ర ద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు గదా! అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగెను. "అయ్యా! నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే! అంత్యజుడనే! సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలచినాను. మీ పేరు శంకరభట్టు అనియూ, మీరు శ్రీపాద శ్రీవల్లభులవారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియూ, అంతేగాక మీరు కాకులచేతను, సర్పములచేతను, ఎందులకు బాధపెట్టబడినారో కూడా నాకు తెలియును." అనెను. 

నేను దిగ్భ్రాంతికి లోనయితిని. బహుశ ఇతడు కొంత జ్యోతిష్యవిద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించెననుకొంటిని. వెంటనే వల్లభదాసు యిట్లనెను. "అయ్యా నేను జ్యోతిషుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము- పాండిత్య ప్రకర్ష కలిగినవారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్త్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినావో, ఆ పరతత్త్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని తర్కవితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల అవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిక అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము.  

నిన్న పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్య తత్త్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందగా వప్పజెప్పగలరు, కాని ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గాలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా! మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో! మీరు తర్కప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల, ఎన్ని వేల మార్లు వేదమును వల్లె వేసియుండిరి? ఎంత పుణ్యము! ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి, అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకములందలి సమస్తములైన వారలు, వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. "వేదము ప్రభువు యొక్క ఉచ్చ్వాసనిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వ ధర్మములకును మూలము వేదములే. వేదపఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా, దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేనియెడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైన భోజనము కావలెనన్న వారు యితరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైన ఒక గింజను దానము చేసిన యెడల దేవతలమైన మేము దానిని వెయ్యిగింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనపుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంతఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంతవరకును, స్వేచ్చగా యిందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంత కాలము స్వేచ్చగా ఉండవచ్చును."

ఇంద్రుని వచనములు విన్న వారు సంకట స్థితికి లోనయిరి. ఆకలిదప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి యుండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరల యిట్లు పలికెను. "మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రము నందు నివసించియు పితృ దేవతలకు పిండోదకములు యిచ్చునపుడును, అబ్దీకములు పెట్టునపుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినదీ, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా యిదేవిధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘ కాలము జీవించిరి. ఆహా! ఎంత ఆహారము వృధాగా ఖర్చయినది? వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి యుండిరి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్కవితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నియూ స్పష్టముగా వారిలో కన్పించుచున్ననూ, శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులయితిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తియొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లును అంతవరకు పితృదేవతారూపమైన వాయసరూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడినది." "శంకరభట్టూ! ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి, పూర్వ పుణ్య వశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి." అని శ్రీ వల్లభదాసు పలికెను.

అంతట నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియూ, శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీవల్లభదాసు యిట్లు పలికెను. "అయ్యా! మీ శరీరము నుండి వచ్చు వాసనచేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి."

నేను "అయ్యా! వల్లభదాసు మహాశయా! ఆ సంఘటన ఎందులకు జరుగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును, సర్పములకును, ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడిచేయునోయని చాలా భయముగా ఉన్నది?" అని అంటిని. 

అందుకు శ్రీవల్లభదాసు, "అయ్యా! ఇదంతయునూ శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట యిటువంటి ఉపద్రవములు జరగవు.

ప్రాణములు యిచ్చిన వానికే, ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ యుండదు.

(ఇంకా ఉంది..)

Wednesday, October 26, 2011

అధ్యాయము-2 భాగము-3

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 3

ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న యిండ్లుగల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యెను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంటదప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములేవరయినా సమకూర్చిన యెడల స్వయంపాకమును చేసికొని భుజించెదనని తలచితిని.  ఆ పల్లెలో బ్రాహ్మణులెవరయినా ఉన్నారేమోయని సందేహము కలిగి ఆ పల్లెప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, "అయ్యా! మేము కొండజాతి ప్రజలము. నేను యీ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేనియెడల మా నుండి పండ్లు, పుట్టతేనె స్వీకరించవలసినదని చెప్పెను." 'మార్గమధ్యే శూద్ర వదాచరేత్' అని యున్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పుకాదని తలచితిని. వారు కొండకోనలలోనే లభ్యమగు పండ్లు, పుట్టతేనె తెచ్చి నా ఎదుట బెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ యిష్టము వచ్చిన చోట్ల పొడువసాగినవి. నేను భయవిహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునేయున్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద యిట్లనెను. "ఆహా! ఏమి విడ్డూరము! మా ప్రాంతము నందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు యింత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరయినా సిద్ధపురుషుని నిందించుటయో, అవమానించుటయో చేసియున్నావు. వారి శాపఫలితముగా యిటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న యెడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యథా భావించవలదు." అని మిన్నకుండెను.

నాకు సమకూర్చబడిన పండ్లను, పుట్టతేనెను నేను స్వీకరిన్చాలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. నేను పరుగుపెట్టుచున్ననూ కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా ? మరి నాకు శ్రీపాద  వల్లభుల దర్శనప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా! గత జన్మములోని పాపములన్నియును క్షీనించినగాని నాకు శ్రీదత్తప్రభువు యొక్క దర్శనము కాదేమో! నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకొని వచ్చితినో! అవి అన్నియును నశింపవలెనన్న యిటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసివచ్చునో! ఆహా! శ్రీవల్లభుల దర్శనప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో యిన్ని సంకటములు, ఉపద్రవములు యిమిడి ఉన్నవా? హా! దైవమా! నన్నింకను ఎన్ని శిక్షలకు గురిచేయ దలచితివో కదా! ఇంక నన్ను కాపాడువారెవ్వరూ? శ్రీపాద శ్రీవల్లభా! శరణు! శరణు! అని తలచుచూ నెమ్మదిగా అడుగులు వేసికొనుచూ ఒక మేడిచెట్టు మొదలుకు చేరుకొంటిని. శ్రీదత్తప్రభువుల నివాస స్థానమైన యీ మేడిచెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీదత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకెన్నడునూ లేని ఒక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో, లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని, పెద్దపెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్లిపోవుచుండెను. ఇదివరకు కాకులవలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటినుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైననూ నేను మరణించుట ఖాయమని తలంచితిని.

సాయంకాలమగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి, ఆరవైచి, ఆరిన బట్టలను మూటలుగా గట్టి, గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి, నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన యెడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక, ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొనిపోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి యుండెను. దుర్గంధ భరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచముపైనుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును దీసి నా చేత త్రాగించెను. పాములు కరచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకులనుండి రసము పాలవలె స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలోను బెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగాసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకొనియుండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో, "విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన యీ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్న యితడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు." అనెను.

కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి యంతయునూ నేను చర్మకారుని యింటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయూ దత్త దిగంబరా! దత్త దిగంబర! శ్రీపాదవల్లభ దిగంబర! అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొనియుంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునపుడు నా హృదయము ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమకులమైన బ్రాహ్మణవంశమునందు జన్మించిన వాడిననియు, అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను.

(ఇంకా ఉంది..)

అధ్యాయము-2 భాగము-2

అధ్యాయము-2
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 2
శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు 

అపుడు శ్రీ సిద్ధయోగీంద్రులు యీ విధముగా సెలవిచ్చిరి. "శంకరభట్టూ! నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్టించిన శివలింగమును, అప్పుడు ఉన్న యదార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని, సృష్టియని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీదత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును. వర్తమానము భూతకాలముగా మారవచ్చును. భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీదత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరుగాబోవునది అంతయును వారి సంకల్పము ననుసరించియుండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీదత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో, ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారియై శ్రీపాద శ్రీవల్లభులుగా యీ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురము నందలి మత్స్యకారులవంటి అల్పజ్ఞులు కూడ బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములును క్షీనించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యదార్థస్థితియును మనకు అవగతమగును.

దేవేంద్ర ప్రతిష్టితమైన ఆ శివలింగమును ధనంజయుడను ఒక వ్యాపారి గమనించి, ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి, అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురానగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతానప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా, ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా మూడేళ్ళ పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది యీ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహా వైభవోపేతముగా మీనాక్షీ సుందరేశ్వరుల దివ్యకళ్యాణము జరిపించెను.

శ్రీ సిద్ధ యోగీంద్రుల వారు యీ విధముగా సెలవిచ్చిరి. "నాయనా! శంకరభట్టూ! సృష్టినందలి ప్రతివస్తువునుండియూ ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న యీ ప్రకంపనములవలన యితర వస్తువులతో ఆకర్షణ, వికర్షణలు కలుగుచుండును. స్థూల, సూక్ష్మ కారణశరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాప కర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్యవిశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్య కర్మములయందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధిచెందుచుండును. ఆ పుణ్యము వృద్ధినొంది, పాపము క్షీనించిననేగాని శ్రీదత్తప్రభువుల వారియందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల, కర్మ కారణ వశమున రకరకములయిన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృపవలననే నీవు యిచ్చతకు రాగలిగితివి."

నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచూ శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియూ, ఎప్పుడు కురువపురమునకు చేరుదునాయనియూ మనస్సులో తహతహలాడుచుంటిని.

మరునాడు ఉదయమునన మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్టమీద గల రావిచెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రియందు నేను శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమములో నున్నదంతయును భ్రమ మాత్రమేనా ? యని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా? దక్షుడా? మంత్రికుడా? యని మనసున సందేహము కలుగసాగెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగెను. నన్ను యిటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము? అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని.

(ఇంకా ఉంది)

అధ్యాయము-2 భాగము-1

అధ్యాయము-2  
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 1 

నేను (శంకరభట్టు) మరుత్వమలై నందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకొంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగనే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటె కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కాని శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సు నిమిరి "శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదించినారు.

శ్రీ యోగివరేణ్యులు యీ విధంగా సెలవిచ్చినారు. "నాయనా! శంకరభట్టూ! నీవు దర్శించిన ఆ శివలింగము మహా మహిమాన్వితమైనది. పూర్వము దేవేంద్రుడు అనేకమంది రాక్షసులను జయించినాడు. కాని ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిన్యముగా చంపి వేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యా పాతకము వలన దేవేంద్రుడు కళా విహీనమైపోయాడు.తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడనేక పుణ్య స్థలముల సందర్శనం చేసినాడు. పాండ్య దేశంలోని యీ కదంబవనము నందలి శివలింగము మహా శక్తివంటమగుట వలన ఇంద్రుడు కదంబ వనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము ఆకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగాజేసినది. ఈ క్షేత్రములో ఏదో గొప్పదనమున్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి, ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్టితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులయిన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా, అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును.

నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళు సరికి అక్కడ బహు సుందరమైన శివాలయమున్నది. కాని అది నేను గతంలో దర్శించిన ఆలయము కానేకాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను వున్నది మధురానగరమని తెలిసినది.

నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీన్డ్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండి యున్న పట్టణప్రాంతముగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచూ నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయెను. చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారమొకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచునప్పటికి మూడు తలలు కలిగిన పెద్ద సర్పమొకటి నా వెంట వచ్చుచుండెను. మూడు తలలకును మూడు మణులున్నవి. ఆ మణుల నుండి కాంతిప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన యెడల ఆ దివ్యసర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రిపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగనే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీసిద్ధ యోగీంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును, ఆ కాంతియును కూడా అదృశ్యమయినవి. 

శ్రీ సిద్ధ యోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా యిచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిధ యోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో న శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయల్వెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సు నందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్టసంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను.

(ఇంకా ఉంది.)


Tuesday, October 25, 2011

అధ్యాయము 1 - భాగము 3

చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము  - భాగము 3

వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కాని, ఆత్మజ్ఞాన ప్రబోధకములయిన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగెను. "గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే! వ్యాఘ్రమా! అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరునూ వ్యాఘ్రాజినముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చునది అయినపుడు, వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను? పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు. గావున నా యొక్క ఆత్మా వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన యెడల ఆత్మజ్ఞానము పొందినట్లే."

సంవత్సర కాలము యిట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గుహవద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానము చేయుటవలన ఆ వ్యాఘ్రరూపమును పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకును, ఆత్మశుద్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి 'ఓం' కారమును నేర్పిరి. "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అను దానిని మంత్రముగా వల్లెవేయమనిరి.

వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను. అపుడు కురువపురమునండు తన భక్త జనసందోహముతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు, వారితో "నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు. నేను యిప్పుడే తిరిగి వచ్చెదను." అని పలుకుచూ కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచునపుడు వారు అడుగుపెట్టు ప్రతిచోట ఒక తామరపద్మము ఉదయించుచుండెను. వారు యీవలి ఒడ్డునకు చేరి "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అని అవిశ్రాంతముగా పఠిoచుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచూ కురువపురమునకు చేరిరి.అందరునూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి.

శ్రీవల్లభులు కురువపురం చేరి, వ్యాఘ్రము నుండి క్రిందకు దిగీదిగగానే ఆ వ్యాఘ్రము అసువుల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలెను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వ జన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకొనవలసినదని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులవార శ్రీవల్లభులు "నాయనా! వ్యాఘ్రేశ్వరా! నీవు ఒకానొక జన్మమున మహా బలిష్టుడవైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి, నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు యిప్పించుట మొదలయిన క్రూరకర్మలను చేయుచుంటివి. నీవు మనుష్యజన్మమెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన, కాల కర్మ కారణ వశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసియున్నది. కాని నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపజేసితిని. చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధ పురుషుల దర్శనాశీస్సులను నీవు పొందెదవు. యోగమార్గమున నీవు ఉన్నతుదవై  ప్రకాశించెదవు గాక!" అని ఆశీర్వదించిరి.

శంకరభట్టు యింతకు పూర్వము చూచినది సాక్షాత్తూ ఆ వ్యఘ్రేశ్వరునే. అతడు హిమాలయముల యందుండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండ యితడు వ్యాఘ్ర రూపమున కావలి కాయుచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావ ప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరముగాని, వార్తాహరుల అవసరముగాని లేదు. కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయునూ శ్రీదత్త ప్రభువు లీల.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము ! 
(అధ్యాయం-1  సమాప్తం)
( అధ్యాయం-1 భాగము-1 )
( అధ్యాయం-1 భాగము-2 )

అధ్యాయము 1 - భాగము 2

చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము  - భాగము 2 

వృద్ధ తపస్వి యిట్లు చెప్పనారంభించెను. నాయనా! ఆంధ్ర దేశమునందు గోదావరీ మండలమందు అత్రి మహర్షి తపోభుమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమశుంఠ అయ్యెను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననూ సంధ్యా వందనము కూడా చేయజాలడయ్యెను. "వ్యాఘ్రేశ్వర శర్మా అహంభో అభివాదయే" అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియూ, వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ, అతడు విని యుండెను. తిలదానములు పట్టుతకును, అభావామేర్పడినపుడు అబ్దీకములకు పోవుటకునూ తప్ప, ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యూనతా భావమేర్పడెను. 

ఒకానొక బ్రాహ్మీముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదికి దిగి వచ్చుచుండెను. వాని శ్రీ చరణములు భూమిని తాకగనే యీ భూమండలము దివ్యకాంతి తో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, "నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకునూ ఋణానుబంధము కలదు. ఋణానుబంధము లేనిదే శునకమైననూ మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము నీకు శుభామగును" అని పలికి అంతర్థానమయ్యేను. 

వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించ సాగెను. అతడు తన సంచారములో ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. వ్యఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్థానమయ్యెను. ఆ మహాత్ముడు యిట్లు వచించెను. "వ్యాఘ్రేశ్వరా! నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వ జన్మార్చిత పుణ్య స్వరూపము. కాలప్రబోధితుడవై నీవు యిచ్చటకు రాగలిగితివి. ఊర్వశీకుండము నందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభుమికి ఆకర్షింపబడితివి. ఇదంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ!" అని పలికెను. 

వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడయి "గురుదేవా! శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది?" అని ప్రశ్నించెను. "నాయనా! శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తూ దత్త ప్రభువులు, త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవితృకాఠక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురము నందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భారద్వాజునకు యిచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రము నందు అనేకమంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు, అవతరించినట్లును, సవితృకాఠకచయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లును, పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినది. దేశమునందలి యితర భాగములందు లుప్తములయినను, కల్కి అవతారభూమి అయిన "శంబల" గ్రామము నందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడియున్నవి. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినపుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినపుడు, పుణ్యకర్మలు ఫలితమివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమీ దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినపుడు ఏ యుగమందయిననూ, ఏ కాలమునందయిననూ శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన, స్పర్శన సంభాషణా భాగ్యము నిచ్చెదరు. నీ పూర్వ జన్మ పుణ్య కర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపైన కలిగినది. నేను, నా గురుదేవులయిన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు, మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము నభ్యసించుచు, ఆత్మజ్ఞానసిద్ధికి ప్రయత్నించవలెను." అని శిష్యులను ఆదేశించి సంజీవినీ పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను.

వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను....

 

అధ్యాయము 1 - భాగము 1

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  
అధ్యాయము 1 

చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము - భాగము 1 

శ్రీ మహా గణాధిపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి, శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ ( శ్రీపాద శ్రీవల్లభుడు) వైభవము ను వర్ణింపదలచినాను.

శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు, శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్ర దేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీ పీఠికాపురమను గ్రామము నందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము తో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండిత  వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధములేని అల్పజ్ఞుడనయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకోనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వ జనులకు వినయ పూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను.

నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను. స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో, ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి, కన్యాకుమారి లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను.  

నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని.  ఒకానొక మంగళవారము శ్రీ దేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా, అంబ నా వైపు కరుణాపూరిత దృష్టి తో చూచుచు, " శంకరా! నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని" చెప్పెను.
నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే యున్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునపుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని.

మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకోను పర్వత భూమి అని తెలుసుకొంటిని. నా అదృష్టరేఖ బాగున్న యెడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్దపులి నిలబడియున్నది. నాకు సర్వాన్గాముల యందును వణుకు, దడ పుట్టినవి. భయ విహ్వాలుడనయిన నేను ఒక్కసారిగా శ్రీపాదా! శ్రీవల్లభా! దత్తప్రభూ! అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్దపులి సాధుజంతువువలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహనుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది.
అంతట ఆ వృద్ధతపస్వి "నాయనా! నీవు ధన్యుడవు. శ్రీదత్త ప్రభువు యీ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని, మహా సిద్ధపురుషులకు, మహా యోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధిస్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి. సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ  గుహ ద్వారము వద్దనున్న యీ పెద్దపులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము," అని వచించెను.

అంతట నేను పెద్దపులి రూపములో నున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. వెంటనే ఆ పెద్దపులి 'ఓం'కారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అని ఆలాపించినది. నేను యీ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్దపులి యొక్క రూపము నందలి అణువులన్నియును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున  కాంతిదేహముతో వెడలిపోయెను. నా యెదుట నున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని.
వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్ని లో హుతము చేయుతంకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను.

ఆ వృద్ధ తపస్వి, "లోకములో  యజ్ఞ యాగాది సత్కర్మలన్నియును లుప్తమయిపోవుచున్నవి. పంచ భూతముల వలన లబ్దిపొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి వి విజ్రుంభించిననూ మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన యెడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోక హితార్థము నేను యీ యజ్ఞమును చేసితిని. యజమనగా కలయిక, అదృష్ట వశమున నీవు యీ యజ్ఞమును చూచితివి. యజ్ఞ ఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాల అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయునూ ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి యిటువంటి అలభ్య యోగమును కలిగించును" అని వచించెను.

నేను ఆ మహా పురుషునికి నమస్కరించి, "సిద్ధ వరేణ్యా! నేను పండితుడను గాను, యోగిని గాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని" కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి.
అంతట నేను "సిద్ధ వరేణ్యా! నేను శ్రీ కన్యకా పరమేశ్వరీ మాట దర్శనము చేసుకొన్నప్పుడు, అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకూ వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరామోసంగి నన్ను ధన్యుల చేయవలసినదని" ప్రార్థించితిని. 

ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను...

Monday, October 24, 2011

పారాయణ విధానం - ఫలశృతి

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము విషయానుక్రమణిక. 
పారాయణ విధానం - ఫలశృతి

       అధ్యాయము                                  అధ్యాయపఠన ఫలితము                                      

1. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము              గృహమునందు శాంతి సౌభాగ్యములు కలుగును                   

2. సిద్ధ యోగీంద్ర దర్శనం,                       ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను,                            
    వృత్తాంతం                                         మనోక్లేశాములను విచిత్రపుర పరిహరించును.    

3. పళనిస్వామి దర్సనం,                          నాగదోష నివారణ, సంతాన ప్రాప్తికి ఈ                                  
    కురువపుర సందర్శనం                        అధ్యాయము అవస్య పఠనీయం

4. కురువపురమున                                కన్యలకు యోగ్యమైన వరులతో వివాహప్రాప్తి,                      
    వాసవాంబిక దర్శనం                           గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును. 

5. శంకరభట్టు తిరుపతి చేరుట,                  దేవతా మొక్కులను తీర్చకుండుట వలన కలుగు దోషముల    
    కాణిపాకమున తిరుమలదాసు               నుండి విముక్తిని, విఘ్నములను పోగొట్టుకొనుటకును
    సందర్శనము

6. నరసావధానుల వృత్తాంతము                పితృదేవతల శాపముల నుండి నివృత్తి కొరకు                      

7. ఖగోళ వర్ణనము                                  విద్యా ప్రాప్తి కొరకు                                                          

8. దత్తావతారముల వర్ణనము                   సంతాన ప్రాప్తి కొరకు, లక్ష్మీ కటాక్షమునకు

9. కర్మఫల మీమాంస                              ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు

10. నరసింహమూర్తుల వర్ణనము              దౌర్భాగ్యమును పోగొట్టుటకు

11. సుబ్బయ్య శ్రేష్టి, చింతామణి,              దురభ్యాసముల నుండి విముక్తికి
      బిల్వమంగళుల వృత్తాంతము

12. కులశేఖర వృత్తాంతము                     శరీరారోగ్యమునకు

13. ఆనందశర్మ వృత్తాంతము                   పశుసంపద పెరుగుటకు, వ్యవసాయము ఫలించుట

14. దత్తదాసునకు అభాయప్రదానము       ఆపదల నుండి గట్టెక్కుటకు, ధైర్యోత్సాహములు
                                                           కలుగుటకు
15. బంగారప్ప, సుందరరామశర్మల          అకారణ కలహముల నివారణకు, పూర్వజన్మకృతదోష
     వృత్తాంతము                                     నివారణకు

16. శ్రీమన్నారాయణ వృత్తాంతము           ధనాకర్షణశక్తి పెరుగును

17. శ్రీ నామానందుల వారి దర్శనము       సిద్ధపురుషుల ఆశీర్వాదము కలుగును

18. రవిదాసును గురించిన వర్ణనము       పాపకర్మములు ధ్వంసమై భాగ్యవంతమయిన జీవితము
                                                           ఏర్పడుటకు
19. గురుచరణునితో సమాగమము         మానసిక క్లేశములు అంతరించును

20. విస్సావధాన్లు వృత్తాంతము              జీవితములో ఏర్పడే మహత్తర కష్ట నష్టముల నివారణకు

21. దండిస్వాములు కుక్కుటేశ్వరా-        ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్య బలము
      లయమునకు వచ్చుట                   పెంపొందును

22. గురుదత్తభట్టు వృత్తాంతము             కర్మదోషములను పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములను
                                                         పరిహరించును
23. శివపూజ రహస్య వివరణము           దీనివలన ఐశ్వర్యప్రాప్తి కలుగును.

24 . అర్థనారీశ్వర తత్త్వ వివరణ             దాంపత్యానుకూలతకు చాలా మంచిది

25. రుద్రాక్ష మహాత్మ్యం                        అనేక రకముల యీతిబాధలంతరించి సుఖశాంతులు కలుగును

26 . -----                                          దురదృష్టమును పోగొట్టుటకును, సత్సంతాన ప్రాప్తికిని

27 . పంచదేవ్ పహాడ్ ప్రాంతమున         విషమ పరిస్థితులందు దైవసహాయము లభించును
       విరూపాక్ష సందర్శనము

28 . శ్రీ వాసవీ నగరేశ్వరుల                 యోగ్యమయిన పెండ్లి సంబంధములు కుదురుటకు
       వృత్తాంతము

29 . శ్రీపాదుల దివ్యోపదేశము              పితృదేవతలు ఆశీస్సులందించెదరు

30 . శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము          ఉజ్వల భవిష్యత్తు కొరకు
       ఏర్పడునని స్వయముగా
       శ్రీపాదుల వారే సెలవిచ్చుట

31 . దశమహావిద్యల వర్ణనము           విద్యాప్రాప్తికి, ఐశ్వర్యప్రాప్తికి, అధికారప్రాప్తికి

32 . నవనాథుల వర్ణనము                 సద్గురు కటాక్షము కలుగును

33 . శ్రీపాదుల వారే స్వయముగా        యోగ్యమయిన వివాహ సంబంధము కుదురుటకు
      రమణి, నరసింహరాయల
      వివాహము జరుపుట

34 . శరభేశ్వర వృత్తాంతము               అప్పుల బాధలు తీరి సుఖ సమృద్ధులు పొందుటకు

35 . ఉగ్రతారాదేవి వివరణ                  వాక్సిద్ధిని పొందుటకు

36 . వేదాంతశర్మ వృత్తాంతము           అనుకూల దాంపత్యమునకు

37 . ఛిన్నమస్తాదేవీ వర్ణనము             జీవితమూ అర్థం పర్థం లేకుండా నడచునపుడు

38 . బగళాముఖీ ఆరాధన వివరణ       ఆత్మస్థైర్యమును కలిగించుటకు ఈ అధ్యాయము

39 . నాగేంద్రశాస్త్రితో సమాగమము       సర్పదోష నివారణకు

40 . భాస్కర శాస్త్రితో సమాగమము      అసాధ్య విషయములు సాధ్యమగును

41 . కుహనా పరివ్రాజక వృత్తాంతము    ఇతరులు చేయు మోసముల నుండి, కుట్రల నుండి తప్పించుకొనుట

42 . శ్రీపాదుల వారు పిఠాపురము        తప్పిపోయిన పిల్లలు దొరకుటకు
       నుండి అంతర్దానమగుట

43 . శ్రీ అనఘాలక్ష్మీ వర్ణనము             అష్ట విధ ఐశ్వర్యములు పొందుటకు

44 . స్వర్ణ పీఠికాపుర వర్ణనము            ఉజ్వల భవిష్యత్తునకు

45 . శ్రీ హనుమంతుల వారిని              అన్ని రంగములలోను అభివృద్ధి కలుగును
       భూమి మీద అవతరించమని
       ఆదేశించుట

46 . ధనగుప్తుల వారింటికి వెళ్ళుట       వెంటనే వివాహ సంబంధములు కుదురును

47 . శ్రీ పీఠికాపురము నుండి పంచదేవ   సర్వవిధ శుభ ఫలములను పొందుటకు
       పహాడ్ నకు విచిత్రముగా తన  
       తల్లిదండ్రులు యింకనూ ఆశ్రితులను
       రప్పించుట

48 . పంచదేవ పహాడ్ నందు              ఆర్తులకు, అర్ధార్తులకు, జిజ్ఞాసువులకు, మోక్షమునపెక్షించువారికి
        దర్భారు వివరణ                        అనగా చతుర్విధ పురుషార్థములు సిద్ధించును.

49 . శ్రీపాదులు కర్మవిధ్వంసము        సమస్త కర్మదోషములు శాంతించును.
       చేయువిధానములు

50 . ------                                    గురునింద చేసిన యెడల కలిగే దరిద్రము మొదలయిన శాపముల
                                                       నివృత్తి కొరకు

51 . ------                                     జలగందము మొదలయిన గండముల నుండి రక్షణ పొందుటకు
                                                         యీ అధ్యయాము

52 . శంకరభట్టు యోగానుభవ            ఏ సమస్య అయిననూ అప్రయత్నముగా పరిష్కరించబడును.
        నిరూపణ

53 . శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము    మహాపాపములు ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టము తిరిగి
 పీఠికాపురమును చేరు విధానము      వశమగును.

(పై అధ్యయన పఠన ఫలితము నందు సూచించబడిన కోరికలు పొందగోరు భక్తులు, తమ కోరికలను సంకల్పము చేసుకొని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము సప్తాహదీక్షతో భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిన యెడల, 
లేదా కనీసము 

ఆయా అధ్యాయములను 40 దినములు (స్త్రీలు - 48 దినములు) పాటు ప్రతిదినము స్నానానంతరము పఠించి భక్తీ శ్రద్ధలతో శ్రీపాదుల వారినే తన్మయత్వముతో స్మరించుచు, శక్త్యానుసారము శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ దత్త స్తోత్రములను స్తుతించి, భజించిన కార్యసిద్ధి లభించును.)                                                     

ఇతర ప్రచురణలు


శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వద్ద అమ్మకమునకు సిద్ధముగా వున్న ఇతర ప్రచురణలు 

1 . గురుచరిత్ర
2 . దత్త పురాణం
3 . గురుగీత 
4 . దత్త ఉపాసన
5 . శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము - నామావళి సహితము
6 . శ్రీధర విరచిత శ్రీదత్త కరుణార్ణవ స్తోత్రము ( తెలుగు తాత్పర్య సహితము)

శ్రీ వాసుదేవానంద సరస్వతి వారిచే సంస్కృతమున రచింపబడి, బ్రహ్మశ్రీ పన్నాల వెంకటాద్రి భట్టు శర్మ గారిచే నేరుగా తెలుగు లోనికి అనువదింపబడిన క్రింది రెండు అమూల్య గ్రంథములు.

శ్రీ గురుచరిత్ర - పెద్ద లిపి (56  రంగు బొమ్మలతో సహా సుమారు 700 పేజీలు కలది. పూర్తీ క్యాలికో  బైండింగుతో)
వెల రూ. 120 -00 లు. 

శ్రీ దత్త పురాణము - పెద్ద లిపి సుమారు 425 పేజీలు కలది - వెల రూ. 100 - 00 లు.
మరియు 

శ్రీపాద శ్రీవల్లభుల వారి విశేష మహిమలను, ఉపదేశములను వెల్లడించు సప్తాహ పారాయణ గ్రంథము 
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - పెద్ద లిపి సైజు 360 పేజీలు గలది - వెల రూ. 120 - 00 లు. 

కావలసిన వారు
ఒక్కొక్క గ్రంథమునకు రూ. 25 /- లు అదనముగా పంపిన యెడల నేరుగా 
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, పిఠాపురం నుండి పోస్టులో పంపబడును. వి. పి. పి. పద్ధతి లేదు. 


శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం
వేణుగోపాల స్వామి గుడివీధి , పిఠాపురం - 533 450 , తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
ఫోన్: (08869 ) 250300 .

శ్రీక్షేత్ర పిఠాపురమునకు మార్గము


శ్రీక్షేత్ర పిఠాపురమునకు మార్గము 

  • శ్రీక్షేత్ర పిఠాపురం సౌత్ సెంట్రల్ రైల్వే లో విజయవాడ, విశాఖపట్నం రైలు మార్గమందు సామర్లకోట జంక్షన్ కు 10 కి. మీ. దూరములో ఉన్నది. 
  • శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము పిఠాపురము రైల్వే స్టేషన్ నుండి 1/2 కి. మీ. దూరంలో గోపాలస్వామి గుడి వీధి లో ఉన్నది. 
  • హైదరాబాద్ నుండి వచ్చు రైళ్లలో గోదావరి ఎక్స్ ప్రెస్ , ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ పిఠాపురం నందు ఆగును. 
  • బొంబాయి నుండి వచ్చు కోణార్క్ ఎక్స్ ప్రెస్. 
  • ఢిల్లీ నుండి నాగపూర్, కాజిపేట, విజయవాడల మీదుగా వచ్చు నిజాముద్దీన్ లింక్ ఎక్స్ ప్రెస్. 
  • గుజరాత్ నుండి పూరీ వెళ్ళు ద్వారకా పూరీ( వోకా) ఎక్స్ ప్రెస్.
  • అహ్మదాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్ళు నవజీవన ఎక్స్ ప్రెస్.
  • బెంగుళూరు నుండి విశాఖపట్టణం వెళ్ళు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లు సామర్లకోటలో ఆగును. 
  • సామర్లకోట నుండి పిఠాపురమునకు రైళ్ళు , బస్సు సౌకర్యములు ఎక్కువగా కలవు.   

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

శాశ్వతపూజలు, నిత్యపూజలు

శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము నందు వేంచేసియున్న, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ దత్తాత్రేయులు, శ్రీ నృశింహ సరస్వతి స్వామి వార్లకు శాశ్వతపూజలు, నిత్యపూజలు ప్రతి నిత్యమూ త్రికాల ధూప దీప నైవేద్యార్చనలు నిర్వహింపబడుచున్నవి. 

సప్తాహ పారాయణ విధానము


శ్రీపాద శ్రీవల్లభ చరితామృత గ్రంథ సప్తాహ పారాయణ విధానము


1 . శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును భక్తిశ్రద్ధలతో పఠింపవలెను. ఇది అక్షర సత్య గ్రంథమని శ్రీపాదుల వారిచే నిర్ణయింపబడి ఆశీర్వదించబడినది. కావున ఈ గ్రంథము వేదము వలె స్వతః ప్రామాణికమయినది. ఇది మానవులే కాక దేవతలచే కూడా పఠించబడు గ్రంథము. గురుచరిత్రలో తెలుపబడినట్లు గురుచరిత్ర పారాయణం ఏ విధముగా చేయవలెనో అదే విధానము అదే నియమ నిబంధనలతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పారాయణము చేయవచ్చును. సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభునిగా భావించుచు ఈ గ్రంథమును శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాకారేణ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః అని స్మరింపవలెను.

సంశయాత్మక దృష్టిని విడనాడి ఈ గ్రంథమును శ్రద్ధతో పఠించిన ఇష్ట కార్యార్థ సిద్ధి కలుగును. దీనిని శంకాసమన్విత దృష్టి తో భావించిన యెడల అనేక కష్టములు, నష్టముల పాలగుదురని, ఈ విషయమును శ్రీపాదుల వారే స్వయముగా చరితామృతమున తెలిపినట్లు ఉన్నది.

2 . పారాయణం
మొదటి రోజు    ఒకటి నుండి ఆరవ అధ్యాయముల వరకు అనగా  1 నుండి 61 వ పేజి వరకు చదువవలెను.

రెండవ రోజు     ఏడు నుండి పండ్రెండవ అధ్యాయముల వరకు అనగా 62 నుండి 123 వ పేజి వరకు చదువవలెను.

మూడవ రోజు  పదమూడు నుండి పదునెనిమిది అధ్యాయముల వరకు అనగా 124 నుండి 188 వ పేజి వరకు చదువవలెను.

నాల్గవ రోజు     పంతొమ్మిది నుండి ఇరువది రెండవ అధ్యాయముల వరకు అనగా 189 నుండి 226 వ పేజి వరకు చదువవలెను.

ఐదవ రోజు     ఇరువది మూడు నుండి ముప్పది నాల్గవ అధ్యాయముల వరకు అనగా 227 నుండి 265 వ పేజి వరకు చదువవలెను.

ఆరవ రోజు     ముప్పది ఐదు నుండి నలుబది రెండవ అధ్యాయముల వరకు అనగా 266 నుండి 304 వ పేజి వరకు చదువవలెను.

ఆఖరి రోజు    నలుబది మూడు నుండి ఏబది మూడవ అధ్యాయముల వరకు అనగా 305 నుండి 338 వ పేజి వరకు చదువవలెను.

పారాయణం రోజులలో, ఆ రోజు నిర్ణయించబడిన అధ్యాయములను చదివి, గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభుల కరుణా కటాక్షము తో వారికి తీరవలెనని భావించేది ప్రత్యెక సమస్య లేదా కోరికకు, ఫలశ్రుతి నందు నిర్దేశించబడిన అధ్యాయమును ప్రతిదినము అదనముగా చదివిన యెడల భక్తులకు మంచి ప్రతిఫలముండును.

సప్తాహ దీక్షానంతరము 11 మందికి అన్నదానమును చేయవలెను లేదా దానికి సరిపడు ద్రవ్యమును శ్రీపాద శ్రీవల్లభుల లేదా శ్రీ దత్తాత్రేయుల వారి, ఏ దేవస్థానము నందయిననూ దానముగా యీయవచ్చును.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన పీఠాధిపతులు

శ్రీ క్షేత్ర పిఠాపురం నందు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన పీఠాధిపతులు

సద్గురు శ్రీ రామస్వామి వారు

శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం

శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, శ్రీ క్షేత్ర పిఠాపురం 

గ్రంథానుశీలనం-3


గ్రంథానుశీలనం-2


గ్రంథానుశీలనం-1

గ్రంథానుశీలనం

తొలిపలుకులు


శ్రీ గురుదేవ దత్త

శ్రీ గురుదేవ దత్త



Thursday, October 20, 2011

పీఠిక

 శ్రీ గురుదేవదత్త            శ్రీ గురుభ్యో: నమః              శ్రీరామసమర్థ
శ్రీ దత్త శరణం మమ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
పీఠిక 
        మానవునకు ఈ ప్రపంచమునందు శోక మోహములు కలిగి తద్వారా అనేక కష్ట నష్టములు కలుగుచుండును. దానికి రక్షకులు ఎవరు ? తన్ను తాపముల నుండి దు:ఖముల నుండి విదిపించువారెవరు? అప్పుడు పరమాత్ముడొక్కడే రక్షకుడు. పరమాత్ముని అనుగ్రహము వల్లనే సమస్త దు:ఖములు నశించి సుఖశాంతులు లభించును. దానికై మానవుడు పరమాత్ముని స్తోత్ర, ప్రార్థన, జప, ధ్యనాదులు అను సాధనాల ద్వారా మరియు వారి విశిష్ఠతలను విశదపరిచే పవిత్ర గ్రంథ పారాయణం ద్వారా, వారి అనుగ్రహం సంపాదించవలెను. పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అను త్రిమూర్తి రూపములతో ఉన్నాడు. త్రిమూర్తులే జగత్తునకు రక్షకులు, శిక్షకులు. వీరివల్లనే అన్నియు జరుగును. త్రిమూర్తులు కృతయుగమునందు అత్రి, అనసూయల భక్తికి పరవశులై వారి యింట త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి రూపముగా అవతరించినారు. వారి అవతారము గురురూపము. మానవుల అజ్ఞానమును పోగొట్టి, జ్ఞాన ప్రాప్తిని ప్రసాదించి, తద్వారా మోక్షమునొసగుటయే ఈ అవతార లక్ష్యము. అవధూత మార్గము ఏర్పడినది వీరి వలననే. అట్టి దత్తాత్రేయుని ఉపాసన ఆసేతు హిమాచల పర్యంతము కృతయుగము నుండి జరుగుచున్నది. అసంఖ్యాక భక్తులు ఆనాటి నుండి నేటివరకు దత్తోపాసన చేసి కృతార్థులైనారు. దత్తుని భజించిన యెడల ఏకకాలము నందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భజించిన ఫలము లభించును. దత్తుడు స్మర్తృగామి. అనగా భక్తితో స్మరించిన మాత్రముననే సంతుష్టుడై భక్తులను అన్ని విధములుగా రక్షించును. భుక్తిని, ముక్తిని ప్రసాదించును.

        సాక్షాత్ శ్రీ దత్తాత్రేయస్వామి వారు క్రీ. శ. 1320 ప్రాంతమున ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో గల శ్రీక్షేత్ర పీఠికాపురము నందు దత్తభాక్తులు, ఆపస్తంబ శాఖీయులు అయిన అప్పలరాజు సుమతి అను పుణ్యదంపతులకు ఉదయించి, శ్రీపాద శ్రీవల్లభుడు అని దివ్యనామమున, దత్తాత్రేయుల వారి ప్రథమ అవతారముర్తిగా ఈ కలియుగమున జగద్విఖ్యాతిగాంచిరి. తదుపరి మహారాష్ట్రలోని కరంజపురము నందు శ్రీ నృశింహ సరస్వతులు అను నామమున దత్తాత్రేయుల వారి ద్వితీయ అవతారముగా వెలిసి, పెక్కు మహిమలను ప్రదర్శించి ఈ జగత్తునందు సుప్రసిద్ధులయిరి.

        అట్టి శ్రీపాద శ్రీ వల్లభుల వారి విశిష్టత గురించి గురుచరిత్రలో కేవలము అయిదు అధ్యాయములందు మాత్రమే వివరించబడి ఉన్నది. కాని ఈ శ్రిపాదుల శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథములోని ప్రతి(53 ) అధ్యాయములందునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి గురించి వివరించబడి ఉన్నది. ఈ మహా గ్రంథము నిజముగా అమృతమే అయి వున్నది. దీని యందంతయు శ్రిపాదుని చరిత్ర, వారి లీలలు, వారి మహిమ, వారి మహోన్నత ఉపదేశములు, అత్యద్భుత మహిమలు అపారముగా ఉన్నవి. చదువరులకు తాము ఈ జగత్తును మరచి శ్రీపాదుల సన్నిధిలో వున్నట్లు అనుభూతి కలుగించునదిగా ఉన్నది. శ్రీపాదుని లీలలు శ్రీకృష్ణ బాల లీలల వలెవున్నవి.ఆ లీలలు చెప్పలేని ఆనందము కలిగించుచున్నవి. ఆ ఆనందముతో తన్మయత్వము కలుగును. ఈ చరిత్ర శ్రీపాదుని కాలమందే వారి ప్రియ శిష్యుడు పరమ భాక్తాగ్రేశ్వరులు కర్ణాటక దేశస్థులు అయిన శ్రీమాన్ శంకరభట్టు తో శ్రీపాదుల వారు రచింపచేసిరి. 

        అందరు ఈ చరిత్రను పారాయణము చేసిన యెడల, సంసార తాపములు పోగోత్తబడి, శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపకు పాత్రులై, మనస్సుకు సుఖ, శాంతి సమాధానములు కలుగును. ఈ చరితామృతమును అందరు చదివి, బంధు బాంధవులను, స్నేహితులను చదువుటకు ప్రోత్సహించి శ్రీపాద శ్రీవల్లభుల కృపను సంపాదించుకొని ధన్యులు అగుదురు గాక!
సోర్సు: శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం
                                              ఇతి,
                      జయ జయ రఘువీర సమర్థ సద్గురు
                                 శ్రీ సజ్జనగడ రామస్వామి 
మకాం:
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం.