Friday, October 28, 2011

అధ్యాయము-2 భాగము-8

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 8
శంకరభట్టు మహారాజుల సంవాదము

ఇంక రెండవ పరీక్ష ప్రారంభమాయెను. రాజునకు అత్యంత ప్రియమయిన మూగ భాషలో పరీక్ష మొదలాయెను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలిడిరి. రాజగురువులు తమ వేళ్ళను చూపుచూ ఒకటా, రెండా? అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా? లేక మరొకరు ఎవరయినా తోడున్నారా ? అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడనే వచ్చితినని ఒక వేలు చూపించుచూ సైగలతో ఉత్తరమిచ్చితిని. తదుపరి వారు మూడువేళ్ళను చూపిరి. మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది. మీరు దత్తభక్తులా? అని ప్రశ్నించితిరనుకొంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి యిది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసితిని. దానికి రాజగురువులు తియ్యటి తినుబండారములు బ్రతిమాలు ధోరణిలో సైగలతో యివ్వబోయిరి. నేను అది వలదని వారించుచూ నా వద్దనున్న అతుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను దీసి వారికిచ్చితిని. నాకు తియ్యటి తినుబండారముల కంటె అతుకుల యందు యిష్టము ఎక్కువనియు, మీరు కూడా వీటి రుచిని తెలుసుకోవచ్చుననియూ నా భావము.

అప్పుడు రాజగురువులు ఉదాత్తస్వరముతో "రాజా! ఇతడు గొప్ప పండితుడు. వేద వేదాంగములను ఔపోశన పట్టిన మహా పండితుడని తెలియుచున్నది. ఈతడు మూగభాషలో కూడా మహా పండితుడని శ్లాఘించెను." నాకంతయునూ అయోమయముగ నున్నది. అపుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచెను. "రాజా! శివకేశవులవారు యిద్దరున్నారు కదా! వారిద్దరూ ఒకటేనా? వేరు వేరా ? అని ప్రశ్నించితిని. ఒక వేలు చూపుచూ ఇతడు వారిద్దరూ ఒకటేయని తెలియజేసెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురున్నారు కదా! అని మూడు వేళ్ళను చూపితిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి అయిదు వేళ్ళు ఉన్ననూ సమిష్టిగా లేవా? అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధురపదార్థములను యివ్వబోతిని. తనకు అటువంటి శిష్యప్రశిష్యుల గోల ఏమి లేదనియూ కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ, తెలియజేయుచూ నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను." నేను దిగ్భ్రాంతుడనయితిని. ఆహా! లోకములోని మనస్సులు. వాటి ఆలోచనలు, అర్థము చేసుకొను పద్ధతులు ఎంత విభిన్నమయినవని ఆశ్చర్యపోయితిని.

ఇంక మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచూ వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. "ఏకాచమే అనగా ఒకటి. త్రిస్రశ్చమే అనగా ఒకటికి మూడు కలిపి, వర్గమూలము కనుగొనగా రెండు. పంచచమే అనగా నాలుగుకు అయిదు కలుపగా తొమ్మిది వచ్చును. దాని వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును. దాని వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై అయిదు వచ్చును. దాని వర్గమూలము అయిదు. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై అయిదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పైఆరునకు వర్గమూలము ఆరు. త్రయోదశచమే అనగా ముప్పైఆరునకు పదమూడు కలిపి వర్గమూలము కనుగొన్న ఏడు వచ్చును. పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన 64 వచ్చును. దానికి వర్గమూలము 8 . సప్తదశచమే అనగా 64 నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9 . నవదశచమే అనగా 81 కి 19 కలుపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింగ్ శతిశ్చమే అనగా 100 కు 21 కలుపగా 121 వచ్చును. దానికి వర్గమూలము 11 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 121 కి 23 కలుపగా 144 వచ్చును. దాని వర్గమూలము 12 . పంచవింగ్ శతిశ్చమే అనగా 144 కి 25 కలుపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13 . సప్తవింగ్ శతిశ్చమే అనగా 169 కి 27 కలుపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14 . నవవింగ్ శతిశ్చమే అనగా 196 కి 29 కలుపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15.   ఏకత్రిఇంశతిశ్చతు అనగా 225 కి 31 కలుపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16 . త్రయోవింగ్ శతిశ్చమే అనగా 256 కి 33 కలుపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17 . పంచవింగ్ శతిశ్చమే అనగా 289 కి 35 కలుపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18 . సప్తత్రింగ్ శతిశ్చమే అనగా 324 కి 37 కలుపగా 361 వచ్చును. దాని వర్గమూలము 19 . నవత్రింగ్ శతిశ్చమే అనగా 361 కి 39 కలుపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20 ." అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించితిని. "ఇదియంతయు పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాదమహర్షికి తెలియును. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును." శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

    (అధ్యాయము-2 సమాప్తం)

No comments:

Post a Comment