Thursday, October 20, 2011

ఉపోద్ఘాతము

ఉపోద్ఘాతము          

         శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురు చరిత్ర లో లభించెడి సమాచారం బహు స్వల్పం. కలియుగములో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు . వారి జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ.

            క్రీ. శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ ఘండికోట అప్పలరాజు శర్మ గారికి, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కి తృతీయ సంతానంగా జన్మించినారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామ రాజశర్మ అను ఇద్దరు అన్నలును, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రును  గలరు. వారు భారద్వాజ గోత్రీకులు. ఆపస్తంబసూత్రులు.

           శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు. వారి ధర్మ పత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ.

           శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానులు గారి ౩౩వ తరం వాడినయిన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లో బాపన్నావధానులు గారి ౩౩వ తరం లోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది గాని అది ఏ సమయమున ఏ విధముగా అని వివరింపబడలేదు.
          
            ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియపరచవచ్చునా లేదా అనే విచికిత్స నాకుండినది. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతం లో నేను వెడుతుండగా ఒక వృద్ధుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్తించెను. నేను 11 రూపాయలు ఇచ్చాను. తరువాత రెండు మూడు రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజునయితే వృద్ధ యాచాకుడికి 11 రూపాయలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురం సంస్థానానికి నేను 11 రూపాయలు ఇచ్చినట్లు రశీదు కూడా అందులో జత చేయబడినది. వస్తావమునకు నేను గానగాపురానికి ఎంత మాత్రం డబ్బు పంపించలేదు.

         శ్రీ నృసింహ సరస్వతీ స్వరూపుడైన శ్రీపాదుని సంకల్పం 'చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయము ఆసన్నమైనదని ' అని నేను గ్రహించి, ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాత ప్రతిని జాగ్రతగా కాపీ చేసి, తెలుగు పాతప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్లి కృష్ణా నదిలో నిమజ్జనం చేసితిని. కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురం లో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణం చేసి వారికి అందజేసితిని.

        ఈ సంవత్సరం (2001వ సంవత్సరము) విజయ దశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానం లో దానిని శ్రీపాద సన్నిధిలో మొట్ట మొదటి సారిగా పారాయణం చేసి సంస్థానం వారికీ అందజేయడం జరిగినది.

       మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్యభక్తి. ఈ మహాపవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్ఠల కోసం గాని, దానం కోసం గాని వెంపర్లాడే వంశం అసలే కాదు మాది.

        అయితే దత్తభక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందజేయడం మా విధి అని భావించి దీనిని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది.

        ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరమూ శక్తివంతమైనది. సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు గాని, అర్థం పర్థం గాని వర్ణనలు గాని ఉండవు. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకరభట్టు చేత వ్రాయబడింది. అతడు కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకనే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించారు.

         ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోవాలి. ఎటువంటి కష్టనష్టములేదురయినా, సంకట పరిస్థితులు ఎదురయినా ఈ గ్రంథ పారాయణం చేసి 11 మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. ఇది సాక్షాత్తూ శ్రీపాద శ్రీవల్లభులచే ఆ విధంగా హామీ పొందబడి వారి జీవితకాలంలోనే వ్రాయబడిన గ్రంథం. అందుచేత దత్తభక్తులు ఈ గ్రంథాన్ని పారాయణం చేసి మీ జీవితాల్లోనే అనుభవం పొందండి. అనుభవం ద్వారా యిది అక్షర సత్య గ్రంథమనేది మీకే అర్థమవుతుంది.

                                                                                                     దత్తసేవలో,
                                                                                   మల్లాది గోవింద దీక్షితులు, భీమవరం
                                                                                                12 -11 -2001     

No comments:

Post a Comment