శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
అధ్యాయము 1
చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము - భాగము 1
శ్రీ మహా గణాధిపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి, శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ ( శ్రీపాద శ్రీవల్లభుడు) వైభవము ను వర్ణింపదలచినాను.
శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు, శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్ర దేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీ పీఠికాపురమను గ్రామము నందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము తో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధములేని అల్పజ్ఞుడనయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకోనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వ జనులకు వినయ పూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను.
నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను. స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో, ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి, కన్యాకుమారి లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను.
నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని. ఒకానొక మంగళవారము శ్రీ దేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా, అంబ నా వైపు కరుణాపూరిత దృష్టి తో చూచుచు, " శంకరా! నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని" చెప్పెను.
నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే యున్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునపుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని.
మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకోను పర్వత భూమి అని తెలుసుకొంటిని. నా అదృష్టరేఖ బాగున్న యెడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్దపులి నిలబడియున్నది. నాకు సర్వాన్గాముల యందును వణుకు, దడ పుట్టినవి. భయ విహ్వాలుడనయిన నేను ఒక్కసారిగా శ్రీపాదా! శ్రీవల్లభా! దత్తప్రభూ! అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్దపులి సాధుజంతువువలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహనుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది.
అంతట ఆ వృద్ధతపస్వి "నాయనా! నీవు ధన్యుడవు. శ్రీదత్త ప్రభువు యీ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని, మహా సిద్ధపురుషులకు, మహా యోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధిస్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి. సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహ ద్వారము వద్దనున్న యీ పెద్దపులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము," అని వచించెను.
అంతట నేను పెద్దపులి రూపములో నున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. వెంటనే ఆ పెద్దపులి 'ఓం'కారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అని ఆలాపించినది. నేను యీ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్దపులి యొక్క రూపము నందలి అణువులన్నియును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున కాంతిదేహముతో వెడలిపోయెను. నా యెదుట నున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని.
వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్ని లో హుతము చేయుతంకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను.
ఆ వృద్ధ తపస్వి, "లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నియును లుప్తమయిపోవుచున్నవి. పంచ భూతముల వలన లబ్దిపొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి వి విజ్రుంభించిననూ మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన యెడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోక హితార్థము నేను యీ యజ్ఞమును చేసితిని. యజమనగా కలయిక, అదృష్ట వశమున నీవు యీ యజ్ఞమును చూచితివి. యజ్ఞ ఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాల అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయునూ ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి యిటువంటి అలభ్య యోగమును కలిగించును" అని వచించెను.
నేను ఆ మహా పురుషునికి నమస్కరించి, "సిద్ధ వరేణ్యా! నేను పండితుడను గాను, యోగిని గాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని" కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి.
అంతట నేను "సిద్ధ వరేణ్యా! నేను శ్రీ కన్యకా పరమేశ్వరీ మాట దర్శనము చేసుకొన్నప్పుడు, అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకూ వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరామోసంగి నన్ను ధన్యుల చేయవలసినదని" ప్రార్థించితిని.
ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను...
wonderful videos on sreepada vallabha. Sreepadavallabha sansthan pitapuram need lots of funds. Sreepadavallabha charitramrutham is a popular text which is very rare to find and also available in few book stores in India. If you put the charitramrutham on internet, most of the people stop buying the book and read the text online. It would be better if you post a chapter or few pages to encourage people to buy books from the book store or directly from pitaphuram sansthan.
ReplyDeleteJayagurudatta. Thank you for your comment. I agree that Sripada Srivallabha Charitamrutam is a wonderful book and having the book at home is beneficial and miraculous. Unfortunately, this book is very rare to find. I have benefited greatly by reading this book and wanted to share this wonderful book with those who cannot find it, yet are eager to read it. Definitely, I encourage people to buy the book if they can and give it to their friends too! Also, I request all the readers of this blog to donate the price of this book (Rs 200 - USD 15.00 or equivalent) to Sripada Srivallabha Mahasamsthaanam, Pithapuram and support the cause.
DeleteSrigurudatta.