Monday, October 31, 2011

అధ్యాయము-3 భాగము-2

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 2 

నేనూ, మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునాకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త అయ్యప్పదేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులయిన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురీ(గుంటూరు) మండలాంతర్గతమైన నంబూరు గ్రామము నందలి వేదపండితులులను, మళయాళదేశము నేలు రాజవంశమువారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మళయాళదేశము చేరి వేదవిద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే! నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోను, నియమ నిష్టలలోను, మంత్ర తంత్ర యంత్ర విద్యలలోను చాల ప్రసిద్ధులు. అయితే మాధవనంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట జేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయినవారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించెదనా యని తహతహలాడుచున్నాడు.

మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని, కొండకోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహ ద్వారమునకు వచ్చినప్పటికి శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి, "మాధవశంకరులు యిద్దరూ కలిసి వచ్చుచున్నారే ? ఏమి భాగ్యము!" అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగనే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులయిన శ్రీస్వామి "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులయిన వారు, జనన మరణ రూప సృష్టిక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే ! సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములయిన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుచునే యుండును. నరరూపధారియై వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లపుడునూ యీ భూమి మీద  భక్తి రక్షనర్థము అవతరించుచునే యుండును. నాయనా! శంకరా! నీవు విచిత్ర పురమున కాణాద మహర్షి గురించి వారి కాన సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము." అని పలికిరి.

(ఇంకా ఉంది..)