అధ్యాయము-2
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 1
నేను (శంకరభట్టు) మరుత్వమలై నందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకొంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగనే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటె కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కాని శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సు నిమిరి "శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదించినారు.
నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళు సరికి అక్కడ బహు సుందరమైన శివాలయమున్నది. కాని అది నేను గతంలో దర్శించిన ఆలయము కానేకాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను వున్నది మధురానగరమని తెలిసినది.
నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీన్డ్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండి యున్న పట్టణప్రాంతముగా కనిపించినది. ఎంత వెదికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచూ నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమాయెను. చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారమొకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూచునప్పటికి మూడు తలలు కలిగిన పెద్ద సర్పమొకటి నా వెంట వచ్చుచుండెను. మూడు తలలకును మూడు మణులున్నవి. ఆ మణుల నుండి కాంతిప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన యెడల ఆ దివ్యసర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రిపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగనే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీసిద్ధ యోగీంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును, ఆ కాంతియును కూడా అదృశ్యమయినవి.
శ్రీ సిద్ధ యోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా యిచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిధ యోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్యహస్తముతో న శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయల్వెడలుచున్నట్లు అనిపించినది. నా మనస్సు నందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్టసంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను.
(ఇంకా ఉంది.)
(ఇంకా ఉంది.)
No comments:
Post a Comment