Thursday, October 20, 2011

పీఠిక

 శ్రీ గురుదేవదత్త            శ్రీ గురుభ్యో: నమః              శ్రీరామసమర్థ
శ్రీ దత్త శరణం మమ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
పీఠిక 
        మానవునకు ఈ ప్రపంచమునందు శోక మోహములు కలిగి తద్వారా అనేక కష్ట నష్టములు కలుగుచుండును. దానికి రక్షకులు ఎవరు ? తన్ను తాపముల నుండి దు:ఖముల నుండి విదిపించువారెవరు? అప్పుడు పరమాత్ముడొక్కడే రక్షకుడు. పరమాత్ముని అనుగ్రహము వల్లనే సమస్త దు:ఖములు నశించి సుఖశాంతులు లభించును. దానికై మానవుడు పరమాత్ముని స్తోత్ర, ప్రార్థన, జప, ధ్యనాదులు అను సాధనాల ద్వారా మరియు వారి విశిష్ఠతలను విశదపరిచే పవిత్ర గ్రంథ పారాయణం ద్వారా, వారి అనుగ్రహం సంపాదించవలెను. పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అను త్రిమూర్తి రూపములతో ఉన్నాడు. త్రిమూర్తులే జగత్తునకు రక్షకులు, శిక్షకులు. వీరివల్లనే అన్నియు జరుగును. త్రిమూర్తులు కృతయుగమునందు అత్రి, అనసూయల భక్తికి పరవశులై వారి యింట త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి రూపముగా అవతరించినారు. వారి అవతారము గురురూపము. మానవుల అజ్ఞానమును పోగొట్టి, జ్ఞాన ప్రాప్తిని ప్రసాదించి, తద్వారా మోక్షమునొసగుటయే ఈ అవతార లక్ష్యము. అవధూత మార్గము ఏర్పడినది వీరి వలననే. అట్టి దత్తాత్రేయుని ఉపాసన ఆసేతు హిమాచల పర్యంతము కృతయుగము నుండి జరుగుచున్నది. అసంఖ్యాక భక్తులు ఆనాటి నుండి నేటివరకు దత్తోపాసన చేసి కృతార్థులైనారు. దత్తుని భజించిన యెడల ఏకకాలము నందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భజించిన ఫలము లభించును. దత్తుడు స్మర్తృగామి. అనగా భక్తితో స్మరించిన మాత్రముననే సంతుష్టుడై భక్తులను అన్ని విధములుగా రక్షించును. భుక్తిని, ముక్తిని ప్రసాదించును.

        సాక్షాత్ శ్రీ దత్తాత్రేయస్వామి వారు క్రీ. శ. 1320 ప్రాంతమున ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో గల శ్రీక్షేత్ర పీఠికాపురము నందు దత్తభాక్తులు, ఆపస్తంబ శాఖీయులు అయిన అప్పలరాజు సుమతి అను పుణ్యదంపతులకు ఉదయించి, శ్రీపాద శ్రీవల్లభుడు అని దివ్యనామమున, దత్తాత్రేయుల వారి ప్రథమ అవతారముర్తిగా ఈ కలియుగమున జగద్విఖ్యాతిగాంచిరి. తదుపరి మహారాష్ట్రలోని కరంజపురము నందు శ్రీ నృశింహ సరస్వతులు అను నామమున దత్తాత్రేయుల వారి ద్వితీయ అవతారముగా వెలిసి, పెక్కు మహిమలను ప్రదర్శించి ఈ జగత్తునందు సుప్రసిద్ధులయిరి.

        అట్టి శ్రీపాద శ్రీ వల్లభుల వారి విశిష్టత గురించి గురుచరిత్రలో కేవలము అయిదు అధ్యాయములందు మాత్రమే వివరించబడి ఉన్నది. కాని ఈ శ్రిపాదుల శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథములోని ప్రతి(53 ) అధ్యాయములందునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి గురించి వివరించబడి ఉన్నది. ఈ మహా గ్రంథము నిజముగా అమృతమే అయి వున్నది. దీని యందంతయు శ్రిపాదుని చరిత్ర, వారి లీలలు, వారి మహిమ, వారి మహోన్నత ఉపదేశములు, అత్యద్భుత మహిమలు అపారముగా ఉన్నవి. చదువరులకు తాము ఈ జగత్తును మరచి శ్రీపాదుల సన్నిధిలో వున్నట్లు అనుభూతి కలుగించునదిగా ఉన్నది. శ్రీపాదుని లీలలు శ్రీకృష్ణ బాల లీలల వలెవున్నవి.ఆ లీలలు చెప్పలేని ఆనందము కలిగించుచున్నవి. ఆ ఆనందముతో తన్మయత్వము కలుగును. ఈ చరిత్ర శ్రీపాదుని కాలమందే వారి ప్రియ శిష్యుడు పరమ భాక్తాగ్రేశ్వరులు కర్ణాటక దేశస్థులు అయిన శ్రీమాన్ శంకరభట్టు తో శ్రీపాదుల వారు రచింపచేసిరి. 

        అందరు ఈ చరిత్రను పారాయణము చేసిన యెడల, సంసార తాపములు పోగోత్తబడి, శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపకు పాత్రులై, మనస్సుకు సుఖ, శాంతి సమాధానములు కలుగును. ఈ చరితామృతమును అందరు చదివి, బంధు బాంధవులను, స్నేహితులను చదువుటకు ప్రోత్సహించి శ్రీపాద శ్రీవల్లభుల కృపను సంపాదించుకొని ధన్యులు అగుదురు గాక!
సోర్సు: శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం
                                              ఇతి,
                      జయ జయ రఘువీర సమర్థ సద్గురు
                                 శ్రీ సజ్జనగడ రామస్వామి 
మకాం:
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం. 



    

No comments:

Post a Comment