Sunday, October 7, 2012

Chapter 18 Part 3 ( Last Part)

అధ్యాయము 18
రావిదాసును గురించి వర్ణనము - భాగము 3
శ్రీపాదుల విరాట్ స్వరూపము

కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు "మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టివిధానము చిత్రవిచిత్రముగా ఉన్నది. నిరాకారుడనయిన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనయిన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులునూ నా కరస్ధమయి ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతీ అణువు అణువు లోనూ ఉన్నవాడిని నేనే. అణువణువునూ కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే! అణువణువునూ విడగొట్టగలిగి నూతన సృష్టిరచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే! ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధచేయుచూ సర్వజీవులనూ అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచూ, ఆర్తితో పిలిచినపుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్త్వమును నేనే! అన్ని జీవులలోనూ 'నేను' 'నేను' అని తోచుచున్న అసలుసిసలైన 'నేను'ను నేనే! అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్నయెడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని, అవి మీకు  వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నపుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది?" అని శలవిచ్చిరి.

పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు యీ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటినుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్దిక్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది.

స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన 

శ్రీపాదులిట్లనిరి. "ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడనూ పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగవిఘ్నములను జయించలేడు. ఓయీ! వల్లభేశా! వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలముచేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేకరకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే! వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే! చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి, నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసినయెడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము."

శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరి. "అమ్మా! శ్రీపాద శ్రీవల్లభుడైన నేను ప్రతీ స్త్రీయందును నాకు జన్మనిచ్చిన అఖండసౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే! నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి యీ పసుపుకోమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. యీ సృష్టిలోనే ఏ శక్తికి కూడ దానిని మార్చుటకు సాధ్యము కాదు.

నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటిగురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృశింహ సరస్వతి అను పేరా మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృశింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేదవిద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన యీ ఘంట ఒకప్పుడు మా తాతగారింటనుండెడిది. అది నా సంకల్పమున సాధకులననుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలిపొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పైపొరలలో  నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టూ! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితాంరుతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ ఘంట అనేక ఆకారములు మారి, పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థాన మేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వానరూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను."

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

Sunday, September 2, 2012

Chapter 18 Part 2

అధ్యాయము 18
రావిదాసును గురించిన వర్ణనము - భాగము 2
భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు

కురుంగడ్డ వైపునకు రావిదాసు పడవనడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడయిన కారణమున యితరులు తనపడవలో ఎక్కిన యెడల స్పృశ్యతాదోషము కలుగుననియూ, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియూ ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రావిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన యెడల నా విద్వత్తును గమనించి భూరిసంభావననిచ్చును. అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రావిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రావిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడ ఏమియునూ తెలియదని పండితుడు గమనించి, ఓయీ! నా జన్మ చరితార్ధము. పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్ధమనెను. రావిదాసు మిన్నకుండెను. నదీప్రవాహము మిక్కుటముగానుండెను. దానికి తోడు పడవలో రంధ్రముపడి నీళ్ళు పడవలోనికి రాసాగెను. అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రావిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రావిదాసు, నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము నూటికి నూరుపాళ్ళు వ్యర్ధమే అనెను. రావిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్ఛరించుచూ నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీమధ్యమున గోచరించెను. అది అంతయునూ శ్రీపాదులవారి మహిమయని రావిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి. రావిదాసు యింతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించిననూ వారు నిర్లక్ష్యధోరణితో తిరస్కరించుచుండిరి. కాని యీనాడు మాత్రము రావిదాసు నమస్కరించినపుడు ప్రసన్నవదనముతో మందహాసము చేసిరి. రావిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటిమాటరాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, "ఓరీ! పాండిత్యగర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై యుండి, సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహాయిల్లాలును క్షోభపెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్తనుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించిననూ మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండ లయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభనొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను యీ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక మూడు వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయినయెడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే! సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో మూడు వర్షములు ఆయుష్షును యీయమందువా? తక్షణమే సమాధానమీయవలసినది." అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాటరాక మూగవానివలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్షును పెరుగవలెననెడి కోరిక యుండెను. కాని నోటమాటరాలేదు. శ్రీపాదుల వారే "నీ హృదయమునందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని యీ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజకవనితకు సేవలు చేయుచూ కర్మఫలముననుభవించెదవు. నీవు యీ మూడు వర్శములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటులేకుండా రజకవనిత వద్ద సేవచేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవచేయుచూ శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రావిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాద్దత్తావతారమైన నన్ను సేవించు కొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమినుండి వైదొలగవలసినది." అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రావిదాసు శ్రీపాదులవారి దుస్తులను ఉతుకుటయూ, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయూ మొదలగు సేవలను చేసుకొను చుండెను.

శ్రీపాదులవారు నదీస్నానానికి వచ్చినప్పుడల్లా రావిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రావిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందలమంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే యీ నమస్కారములను వారు అంగీకరించినపుడు మాత్రమే ఈ మహాయోగము కలుగుననికూడా తన తండ్రి చెప్పియుండెను. రావిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను.

రావిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీజనముతో కలసి జలక్రీడలాడుటను గాంచి తను గూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునపుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకువచ్చి, రావిదాసునకు యవనవంశమందు వైడూర్యనగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి. తాము నృశింహ సరస్వతీ అవతారమందు వానికి దర్శనభాగ్యమి చ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రావిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి యీ వింతదృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని.

నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము?

ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులయిన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమయిన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీగురుదేవులు పసుపుకొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి.

వల్లభేశునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము

ఇంతలో ఒక యువబ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళిదూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు. ఆపస్తంబసూత్రుడు. వల్లభేశ్వరశర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు. శ్రీపాదులవారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరుపేరునా అడిగి వారి క్షేమసమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులయినవారికి యిది ఒకరకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్నభిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్యహస్తములను పైకిచాచిరి. ఒక పెద్ద వెండిపాత్ర నిండుగా 'ఖీర్' అనబడు పాయసమందుండెను. అచ్చట సమావిష్టులయిన శిష్యగణములకు దాని పంచిపెట్టవలసినదని శ్రీపాదులవారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచిననూ పాత్రయందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తనశిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రావిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచారములకు కూడా స్వామిప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేశుని తమదగ్గర కూర్చొనమనిరి. వల్లభేశుని ప్రక్కనే నేను కూర్చొంటిని. నా ప్రక్కన సుబ్బణ్ణశాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చొండెను. ఒక బీదబ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతట శ్రీపాదులవారు "నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్నచోటనే భయముండును. ఈ వల్లభేశుడే నీకు అల్లుడు. సుబ్బణ్ణశాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేశుని పితృదేవతలు చాలా ఆగ్రహముగా నున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాదికర్మలు, సభక్తికముగా చేసెడి పిండప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యధా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహమంత్రములను చదువవలెను. మాంగల్యభాగ్యము కొరకు పసుపుకొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకండిన ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాదివారు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు, అను మహాదుష్టశక్తుల వలన పీడింపబడువారికి తక్షణమే యీ ప్రసాదము వలన బాధానివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గెడివారికి యీ ప్రసాద స్వీకరానంతరము సంపద అభివృద్ధి చెందును." అని తెలిపిరి. ఈ దివ్యభాషణము చేయుసందర్భమున శ్రీపాదులవారి చెక్కిళ్ళ నుండి అశ్రువులు జాలువారినవి. డగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులవారు "మల్లాదివారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి వంశములతోను నాకున్న   ఋణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్యభక్తికి నేను పరవశించెదను. నాకేదయినా తినుటకు దొరకునేమోయని నేను వారి వంటయిళ్ళలోనికి సూక్ష్మరూపములో యధేచ్ఛగా పోవుచుందును. వారే కాదు! ఎవరయిననూ సరే నన్ను వాత్సల్యభక్తితో ఆరాధించిన వారి యిండ్లయందు నేను పసిబాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మ్రింగివేసి వాటికి నవ్యములయిన విముక్తదేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్యశక్తులు, మహాపదార్ధమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందు కొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో నున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము." అని ఆజ్ఞాపించిరి.

మేము ఏరుదాటి యీవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బణ్ణశాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహమంత్రములే తెలియునుగాని, ప్రేతసంస్కారకర్మల గురించి, ఆయామంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూలేదు, కననూలేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బణ్ణ బ్రహ్మ స్థానమున కూర్చుండెను.అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బణ్ణకే ఆశ్చర్యము! ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహమంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపుకొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు. వరుడు కూడా నిర్ధనుడే. వివాహసందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగక పోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేశునకు తల్లియు తండ్రియు కూడ లేరు. కన్య తల్లిదండ్రులును, వరుడును, పురోహితుడును, నేనును కలిపి అయిదుగురుము మాత్రమే! ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదులవారి దర్శనమునకు పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు శలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేశుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాడులవారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ  ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగావలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను.

(ఇంకా ఉంది...)     

Friday, April 27, 2012

Chapter 18 Part 1

అధ్యాయము 18 
రావిదాసును గురించిన వర్ణనము - భాగము 1 
శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము 

నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ (కురువపురము) చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆదిమధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపమునుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాదనమస్కారము చేసికొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శచేయునపుడు తమ కమండలమునుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమియునూ మాట్లాడకుండగనే అతితియ్యని కంఠస్వరముతో దివ్యశ్రీచరణులవారు "నాయనా! శంకరభట్టూ! నీ యందలి ప్రేమాతిశయమున నిన్ను యిచ్చటకు ఆకర్షించితిని." అని పలికిరి. ఆ పలుకుల తియ్యదనమును, అపారమైన వారి కారుణ్యామృతదృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకునూ అభయప్రదానమొనరింప సశక్తమగు, అనంతశక్తిసంపన్నమైన వారి దివ్యహస్తమును నా మస్తకముపైనుంచిరి. నాలోని కుండలినీశక్తి ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను వివశునిచేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమునూ అంతర్ధానమగునట్లు తోచినది. వెయ్యి సముద్రములు ఒక్కసారిగా విజ్రుంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచూ మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయస్పందనము, నాడీస్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై, నిశ్చలత నొంది మహాశూన్యములో నిలిచినది. నా హృదయము నందలి చైతన్యము విశ్వమునందున్న అనంతచైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మస్వరూపమైన ఆనందమాయస్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరియొక పర్యాయము ఆ 'నేను' అనునది కూడా శాంతించి అవ్యక్తమయిన దివ్యానందస్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలోనుండి కోటానుకోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునపుడు 'నేను' ఈ సర్వచైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ 'నేను' అనునది శమించినపుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయునూ నాకు చిత్రవిచిత్రముగా నుండెను.

అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని. జగత్తునకు ఆదిగురువులైన శ్రీ వల్లభస్వామి వేయితల్లుల ప్రేమను మరిపించెడి కారుణ్యామృతదృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి.

మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం 

నాతో వచ్చిన బ్రాహ్మణద్వయమునకు శ్రీపాదులవారితో మాట్లాడుటకుగాని, వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకుగాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదులవారు నావైపుచూచి నీతోవచ్చిన యీ యిద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. "ప్రభూ! దివ్య శ్రీచరణుల దర్శనముకోరి వచ్చిన యీ యిద్దరునూ కూడా బ్రాహ్మణులే!" అని నేనంటిని. దానికి ఆ ప్రశాంతసుందరుడు "నాయనా! వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే! గోమాంస భక్షణచేయు మ్లేచ్ఛులవలె తోచుచున్నారు. యదార్ధమును వీరినడిగియే తెలుసుకొనవచ్చును." అనెను. అంతట ఆ బ్రాహ్మణులిద్దరునూ "అయ్యా! మేము బ్రాహ్మణులము కాము. మ్లేచ్ఛులమే! సందేహము లేదు." అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభులు క్షణక్షణ లీలావిహారి. నేను నిర్ఘాంతపోయితిని. అంతట ఆ మహాగురువులు "శ్రీపాదశ్రీవల్లభుడనెడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయులవారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారియందు భక్తిభావము సంపూర్ణముగా కలిగియుండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలునూ ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తుష్టిప్రదము. బ్రాహ్మణజన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞపశువయిన ఆ మేకయేకాక, దానితో రక్తసంబంధముగల అనేక మేకలు తమ నీచజన్మము నుండి విముక్తమై ఉత్తమజన్మల నొందును. శీఘ్రముగనే బ్రాహ్మణజన్మ నొందును. యజ్ఞపశువయిన ఆ మేకను ఆ విధముగా ఉత్తమజన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞమును నిర్వహించువారికి ఉండవలెను. ఆ విధమయిన యోగి, తపోబలము లేక, నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలియిచ్చిన, మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ, కాలములనుబట్టి ధర్మకర్మములు మారుచుండును. మ్లేచ్ఛుడైననూ, మహాతపశ్శాలి అయినయెడల గోమాంస భక్షణ చేసిననూ, అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదియై గోవునకు, దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని యెడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది, కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ , పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రమెక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు, అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమునాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండకోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొనితెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తనవద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రిగాని, నరకబడెడి కుమారుడుగాని నరకుట అను క్రియ జరుగునపుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజక్షేమమునకు ఆహారము కావలెను. పంటపండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్షరహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ, పాండవులకు రాబోవు కాలములో యుద్ధక్షేత్రాముగా నుండదగిన ధర్మక్షేత్రాముగా నిర్ణయించెను. ఓయీ! నామమాత్ర బ్రాహ్మణులారా! మీకు గోమాంసభక్షణచేయుట ఎంతమాత్రము సమర్ధనీయముకాదు. అయితే పూర్వ పుణ్యవశమున, మీ పితృదేవతల ప్రార్ధనాబలమున  విశేషించి నా అవ్యాజకారుణ్యమువలన మీరు మా దర్శనభాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా, అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్రజలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే యిచ్చటనుండి బయలుదేరి మీ యిచ్చవచ్చిన చోట్లకు పొండు. మీకు అన్నవస్త్రములకు లోటులేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛవనితలను వివాహమాడి మ్లేచ్ఛధర్మము ననుసరింపుడు. మీచేత చంపబడిన గోవులు మీకు యీ జన్మములోనూ, జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచూ, అత్యంత శ్రమతో మీరు సంపాదించెడి కష్టార్జితమును యధేచ్ఛగా అనుభవించుచూ సుఖించును గాక! అయితే నా దర్శనభాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడేబాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్దులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు గలిగిన, విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరు గాక! మరాఠ దేశమందు శిధిలాగ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధ క్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నాయొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరమువలె మార్చుటకు వీలులేనిది. తక్షణము యీ ప్రదేశమును వీడిపోవలసినది. అని వారిరువురిని ఆజ్ఞాపించిరి.

నేనునూ, శ్రీపాదులవారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రావిదాసు అను నామాంతరము గలిగిన రజకుడొకడు వచ్చెను. రావిదాసు శ్రీపాదులవారికి పదేపదే నమస్కరించుచుండెను. కొంతసేపటివరకు శ్రీపాదుల వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదులవారు వానివైపుచూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేమయి ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచూ నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను.

(ఇంకా ఉంది..)        

Wednesday, April 25, 2012

Chapter 17 Part 4 (Last Part)

అధ్యాయము 17 
శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 4 
అనఘాసమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము

సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్నచిత్తులయిన నామానందుల వారు, "ఆత్మ నిరంతరాయమయినది. మనస్సు ప్రతీ క్షణములోనూ అనేక కోట్లసార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమకాలమున వారిరువురిలో ఎవరయినాగాని, లేదా వారిద్దరుగాని తమ మానసికచైతన్యము జీవనిర్జీవస్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందినయెడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నముచేయు మహాదోషములవలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగానుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలననూ, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్ళను నానావిధములుగా హింసించుట వలననూ, నిర్ధాక్షిన్యముగా శిశు హత్యలను, స్త్రీ హత్యలను చేయుట వలననూ, నిస్సహాయస్థితిలో నుండు అనాధల యెడల పరమ కర్కశత్వమును చూపుట వలననూ నపుంసకత్వము కలుగుట కాని, నపుంసకునకు భార్యగా అగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు పదిమంది సంతానమును కనుటవరకు హక్కుగలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మవిరుద్ధము. పదిమంది సంతానమును కన్నా తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా! నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకునూ, నీవు అనుకూల దాంపత్యముతో సర్వసుఖములను పొందుటకు అనఘావ్రతము చేసి అనఘాదేవి సమేత శ్రీదత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి యిహలోక సుఖము, పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్తదర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతీ అక్షరమునందును యుగాయుగాంతముల వరకూ చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములయిన విధినిషేదములును లేవు. నేను యీ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటినుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రమును నా మదిలో మొదులుచున్నది. వినండి!

సిద్ధమంగళ స్తోత్రము 

1 . శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

2 . శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

3 . మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

4 . సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

5 . సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

6 . దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

7 . పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

8 . సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

9 . పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

నాయనలారా! పరమపవిత్రమైన యీ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతముచేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండలదీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించినచోట  సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు." అని అమృతవాక్కులను ఆ సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి వివరించిరి.

శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట 

శ్రీనామానందుల వారి నోటివెంట యీ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతట నేనిట్లంటిని. "మహాపురుషా! ఈ దివ్యస్తోత్ర పారాయణముతో, శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కధాప్రసంగాములతో యీ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున యీ రాత్రి గడుపవలెననెడి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులయిన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించుకొనుచున్నవాడను." నాతోబాటు ఉన్న సుశీలయును, బ్రాహ్మణ సోదరులును, నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులయిన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయునూ, శ్రీపాదులవారి నామస్మరణముతోను, వారి లీలాకథా ప్రసంగములతోను, సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషఃకాలమున శ్రీపాదులవారికి దివ్య శ్రీమహామంగళహారతి యీయబడెను.

మహామంగళ హారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్లబండిపై భోజనసామాగ్రిని వేసికొని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలును, నీ భర్తయు వేరొక బండిలో యీ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజనసామగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీ నామనందుల వారు ధ్యానావస్థలో నుండిరి.

శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులయినపుడు బండివాడెక్కడ? అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయెనని చెప్పగా, ఆహా! మీరెంత అదృష్టవంతులు! నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమునూ విస్తుపోతిమి. శ్రీ నామానందులు "శ్రీపాదులవారు పరమ కారుణ్యమూర్తి! వారే బండివాని రూపములోవచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా! సుశీలా! నీ అదృష్టము పండినది. నీ భార్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయునూ, అత్తమామలునూ కొలదిసేపటిలో ఎడ్లబండిలో యిచ్చటకు చేరుకొనుచున్నారు." అని పలికిరి.

త్రికాలవేదులయిన నామానందులవారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో, అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 17 సమాప్తం)

Chapter 17 Part 3

అధ్యాయము 17
శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 3
దత్తారాధనము యొక్క విశిష్టత

అంతట నేను, "అయ్యా! అటులయినయెడల మనము వివిధరూపములలోనున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది." అని వారిని కోరితిని. అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై "ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి. అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది. అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమైయున్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత   పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి  వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు. ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని  విష్ణువును ఆదేశింప వచ్చును. ఈ ప్రక్రియలో  తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదులవారి అశ్రితుడొకడు  గుఱ్ఱమునెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరచినది. రక్తసిక్తుడైన ఆ భక్తునివైపు శ్రీపాదులవారు తమ అభాయహస్తమును చూపగా గాయములన్నియునూ క్షణములో మాయమయినవి. శ్రీపాదులవారి యందు నమ్మకము యిసుమంతయు లేని మరొకనికి అదేరోజున నూరువరహాలతో నిండిన పాత్రయొకటి లభించును. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదులవారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతట శ్రీపాదుల వారిట్లనిరి. "నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. కాని వీని ఆయుర్దాయమును మరొక 20  సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్యభక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. నూరు వరహాలు దొరికినవానికి యీ రోజు మహాదైశ్వర్యము కలుగవలసిన రోజు. కాని వాడికి భక్తీభావము యిసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుటవలన వాని మహాదైశ్వర్యయోగమును కేవలము నూరువరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తిగలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొన గలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతియయిన పరమేశ్వరుడు కూడా అటువంటివానికి దాసుడయి సంచరించును." అను సద్విషయములను, సందేశములను తెలియపరచిరి.

శ్రీ నామానందుల వారు యీ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనంద భరితులమయితిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతట నామానందుల వారు "మీరు ఏకభుక్తము చేయుచూ మండల దీక్షను పాటించుడు. మిక్కుటమయిన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు. ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు. అంతట పాపము శమించును. పాపశమనమయినట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని, స్వప్నములో గాని పొందగలరు. మండలదీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున  పూర్వపు అలవాట్లకు బానిసలయిన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము." అని తెలిపిరి.

(ఇంకా ఉంది..)          

Monday, April 23, 2012

Chapter 17 Part 2

అధ్యాయము 17
శ్రీనామానందుల వారి వర్ణనము - భాగము 2

నా దత్తనామస్మరణమును తన్మయత్వముతో ఆలకించుచూ దారివెంట పోవుచున్న బాటసారి యొకడు మేడిచెట్టుఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను "ఓయీ! నీవు ఎవ్వడవు? మర్యాదగా యిచటనుండి వెంటనేపొమ్ము. నీవు పోకపోయినచో యిచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నిన్ను చంపివేసెదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహనామాంత్రికుని హతమార్చితిని." అంటిని.

అందులకు ఆ నూతనవ్యక్తి చేతులు జోడించి, "అమ్మా! నేను రజకకులమునందు పుట్టిన రవిదాసు అనుపేరుగల దత్తభక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుండును. శ్రీగురుదత్తులు యీ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురము నందు విరాజిల్లుచున్నాడు. ఎంతటి దూరదూరములలోనున్న దత్తభక్తులకైననూ తాను యీ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలావిశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము! నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు యిష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే యున్నది. నేను నా బంధువులయింటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను." అని పలికెను.

అంతట నేను "నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పెడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరయి ఉన్నది అని విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో యీ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువుచేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదులవారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము యీచోటినుండి వెళ్ళకపోయిన యెడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనెదవు." అంటిని.

అతడు మారు మాటాడక దత్తదిగంబర! దత్తదిగంబర! శ్రీపాదవల్లభ దత్తదిగంబర! అని పాడుకొనుచూ వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్టమీద పద్మాసనము వేసుకొని ధ్యానము చేసుకొనుచుండగా యీ దుష్టులబారిన పది మీ వలన రక్షింపబడితిని.

అంతట నేను, "అమ్మా, శ్రీపాదులవారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యాముగా ఉండని దేశముగాని, వారి ఎరుకలోలేని కాలము గాని యీ సృష్టిలో లేనేలేవు. కార్యకారణ సంబంధములతో యీ సృష్టిలో వివిధ దేశములలో, వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వ కారణములకునూ వారే మహాకారణము. రకరకాల స్థితులలో నున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణములేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదులవారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా యిటువంటి అన్ని స్థితులకూ అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియును. మనము శ్రీపాద శ్రీవల్లభులవారి నామస్మరణము చేసుకొనుచున్న యెడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తిని పొందగలము." అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ, సుశీలయను పేరుగల యీ బ్రాహ్మణ యువతితోనూ కలసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మేమందరమునూ దత్త నామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందమువలె కనుపించుచుంటిమి. ప్రయాణమధ్యములో నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి.

శ్రీదత్తుడు ఛండాలవేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట

నామనందులవారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీనామానందుల వారిట్లు చెప్పసాగిరి. మానాయనగారి పేరు మాయణాచార్యులు. నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాసదీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తరదేశమునందలి పుణ్యక్షేత్రములను, సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చితిని. మేము శ్రీ వైష్ణవులమగుటచే శివారాధానము మాకు సమ్మతము కాదు. మడి, ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతీమాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చుచు ఛండాలునొకనిని చూచితిని. ఛండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి 'నామానందా! నాకు గురుదక్షిణ సమర్పించి యిచ్చటనుండి కదులుము' అని గద్దించి పలికెను. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు యీ వింతను చూచుచుండిరి. ఛండాలుడు శ్రీవైష్ణవబ్రాహ్మణోత్తముని గురుదక్షిణనిమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమీ అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగివచ్చి యీ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరి కొందరనుకొనిరి. అంతట నేను, "ఓయీ! నీవేవ్వరవో నాకు తెలియదు, అయిననూ నేను వైష్ణవబ్రాహ్మణుడను, నీవు ఛండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమియునూ సబబుగాలేదు." అనంటిని. యింతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేక పోయితిని. వాని కన్నులు  చింతనిప్పుల వలె ఎర్రగానుండెను. వాని ముఖకవళికలు ఎంతటివారికయిననూ హడలు పుట్టించునవిగా నుండెను. నా యీ శాంతవచనములకు వాడు ఎంతమాత్రమును లొంగక, "నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచూ, నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రములవారిని ప్రశ్నించుచూ పిచ్చికుక్కవలె తిరుగుచున్నావు. బ్రాహ్మణజన్మనెత్తితినని దురహంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనెడి సన్యాసనామము నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయూ నాకు గురుదక్షిణగా నిచ్చి అందరునూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయిన యీ కత్తితో నీ శరీరమును ఖండఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదేపదే కుళ్ళపొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడిచేసెదను. ఖండించబడిన ప్రతీ శరీరభాగమునందునూ చైతన్యమును అనుభవించుచూ ఘోరమైన నరకబాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న ఔను, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటిదేవతలతో ఎవరినీ ప్రార్థించిననూ నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్కదేవత కూడా సాహసింపలేడు." అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన ఛండాలుడు తన ఒరలో నున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. 

నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ ఛండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించితిని. నా వద్దనున్న రొఖ్ఖమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నియునూ నాకు కల్పితములుగా తోచెను. అయితే, నా ఊహలను అన్నింటినీ తలక్రిందులుచేయుచూ వారి మోహనమైన దివ్యమంగళరూపము నాకు దృగ్గోచర మాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్యమంగళమూర్తి, "నేను శ్రీదత్తుడను, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించితిని. నీవు నా వాడవు. నేను నీ వాడవు. నేను నీ సొత్తు. నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటినుండి నామానందుడవై ధర్మప్రచారము చేయుచూ, చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు." అని దీవించెను.

నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట

అయ్యా! ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించివేయుచున్నది. ఏ యింటికి పోయిననూ నాకు అన్నమిడువారే కానరారైరి. జనులు నా గురించి వింతవింతగా "ఇతడొక పిచ్చివాడు. ఛండాలుడొకడు త్రాగివచ్చిన మైకములో వీనినుండి గురుదక్షిణ వసూలుచేసెను. ఇతడు బ్రాహ్మణుడయిననూ ఛండాలుని  గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన యితనికి  భిక్షవేయుట ధర్మశాస్త్ర విరుద్ధము."అని చెప్పుకొనసాగిరి. యీ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగనే శ్రీ అప్పలరాజుశర్మ గారింటికి చేరితిని. భవతీ! భిక్షాందేహి! అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతోనుంటిని. ఇంతలో తలుపు తెరచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపుపళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగుమీద కూర్చొండబెట్టుకొని తమ దివ్యహస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను, మూతిని తుడిచిరి. అనంత శక్తిస్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచి, "నీకు సర్వమునూ సిద్ధము చేయబడును. దేనికోసమూ వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీవెచ్చటనున్ననూ నీ వెన్నంటియే నేనుందును. అదృశ్యముగా జంటనై సంచరించెదను. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుచుందును." అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటినుండి నేను సన్యాసినై నా యిచ్చవచ్చినచోటుల సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 

నాల్గు విధములైన జీవన్ముక్తులు 

నేను, "అయ్యా! శ్రీదత్తులవారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానమున్నదా? ప్రత్యేకమయిన మంత్రములను ఏమయిననూ జపము చేయవలెనా? నా సంశయములను దీర్చి కృతార్థుని చేయవలసినది." అని అడిగితిని.

దానికి ప్రసన్నవదనులయిన శ్రీనామానందులు "నాయనలారా! మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షము కలుగవలెనను నియమములేదు. శారీరక ప్రారబ్దమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటివారిని 'జీవన్ముక్తులు' అని పిలువవచ్చును. తన యిష్టదైవము యొక్క లోకమునందు నివసించుట 'సాలోక్యముక్తి'. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన యిష్టదైవము యొక్క సామీప్యమునందు నివసించుభాగ్యము కలుగును. దానినే 'సామీప్య ముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైన పుణ్యరాశియున్న యెడల తన యిష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే 'సారూప్యముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైనస్థితిలో తన యిష్టదేవతా చైతన్యములో 'సాయుజ్యము' నందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకొన్న దత్తభక్తులు యిహలోకమునందుండగనే సాలోక్యముక్తి ననుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్దము ననుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదారవిందములందు లగ్నమై సృష్టియొక్క ధర్మములను, ధర్మసూక్ష్మములను సృష్టి నిర్వహింపబడు చిత్రవిచిత్ర విధానములను తన అంతరదృష్టితో అవలోకించుచూ ఆనందము ననుభవించెను. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నియునూ, వారి ప్రమేయము లేకుండగనే విశ్వకళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోకజీవనము సాగించుచూ సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతరదృష్టితో సాలోక్యభక్తులకంటే విశ్లేషణాత్మకముగ తెలుసుకొందురు. వారు పొందెడి ఆనందము మరింత మిక్కుటముగానుండును. జీవిశరీరబద్ధుడైనపుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో, బద్ధావస్థయందుండును. పరిణామము చెందు కొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించునపుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుజ్యమునందిన శ్రీ దత్తభక్తుల  నుండి శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్చగా ప్రకటిత మగుచుండును. శ్రీదత్తులవారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుజ్యము నొందిన యోగిపుంగవులకు సంకల్పమనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారినుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరునూ శ్రీపాదుల వారి దివ్యాంశలే! ఆయా దేవతల ద్వారా శ్రీపాదులవారే భక్తులను అనుగ్రహించెదరు." అని సెలవిచ్చిరి.


(ఇంకా ఉంది..)                        

Chapter 17 Part 1

అధ్యాయము 17 
శ్రీనామానందుల వారి దర్శనము - భాగము 1 

నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితము లేనిదానివలె కన్పించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళుచేతులు వణక నారంభించినవి. యిద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగుపరుగున వచ్చి నా కాళ్ళపైబడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయూ అయోమయముగా నుండెను. దారిబత్తెము కూడాలేని బక్కబ్రాహ్మణుడనైన నేను పరాయిస్థలములో పరాయి వ్యక్తుల బారినుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, "అమ్మా! నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారినుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది." అని అంటిని.

ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే గాక తమ బారినుండి యీ స్త్రీని రక్షించెదనని ధృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి, వారు "ఓ బక్కబ్రాహ్మణుడా! మేము యీ దురాచారిణిని చంపదలచితిమి. నీవు యీమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన యెడల నిన్నుకూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డురాకుము." అనిరి.

నాలో ఏదో అదృశ్యశక్తి ప్రవేశించినట్లనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటినుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడెడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టి వేయునవి అయి ఉన్నవి. అంతట నేను, "బ్రాహ్మణజన్మనెత్తి సిగ్గులేకుండగా గతరాత్రి ఆవును వధించి, ఆ మాంసమును భుజించి, కల్లును ద్రావి, సకల దురాచారములతో కూడిన మీకు నన్నునూ, యీ నిరపరాధియైన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పనికాదు. నేనన్నింటికిని సిద్ధముగనే యుంటిని. మీయందు జాలితో పలుకుచున్నాను. మీరు యీ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠివ్యాధి సోకినవారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్ఠివ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారయిన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే యీ ఔషధమును తయారు చేయు విధానము అందరికినీ తెలియదు. కామవాంఛను అణచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలెనని మీరు కోరుకున్నచో యీ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి యీ మాటలను పలుకుచున్నాను." అని పలికితిని.

నా మాటలు విన్న యిద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము! నేను పలికిన కొన్ని పలుకులు వారి గతజీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిషము యందు ఏమాత్రమూ పాండిత్యములేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, "అయ్యా! మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు, అయిననూ మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము యిర్వురమునూ అన్నదమ్ములము. బ్రాహ్మణజాతిలో జన్మించిననూ, బ్రాహ్మణధర్మములు మాలో పూర్తిగా లుప్తమయినవి. సర్వభ్రష్ఠులమయితిమి. గోమాంసభక్షకుల తో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోను మేము సర్వభ్రష్ఠులమైతిమి. ఒక గుట్టమీద పద్మాసనములో కూర్చొన్న యీమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానయిననూ ఆమెను అనుభవింపదలచితిమి. అదేమిచిత్రమో గాని, ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శనభాగ్యము మాకు కలిగినది." అనిరి. అంతట నేను "ఏది మంచి, ఏది చెడు అను వివేచననుచేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించుచుండెను. మనము మంచిదారిలో నడచిన యెడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన యెడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసివచ్చును. ఈయమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమయిన కోరికలతో యీమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో, క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్తనందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తిస్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుతకాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యీ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియునూ కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మా! నీ వృత్తాంతమును ఎరిగింపుము." అని ఆమెనడిగితిని.

అంతట ఆమె, "అయ్యా! తమరు నన్ను యీ పాపాత్ముల బారినుండి రక్షించితిరి. మీరు నాకు పితృసమానులు. నేను సద్బ్రాహ్మణ  వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింపమొదలిడెను. యౌవనసంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించు ఆనందించుటయనిన సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదేపదే చెప్పుచుండును. నేను సుమంగళీచిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన విటుని కోసమై వేచియుంటిననియు, అలంకరణరహితముగానున్నచో విధవరాలువలె అమంగళముగా ఎందులకు కన్పించుచున్నావనియు, గృహమునందలి చిన్న పిల్లలను మురిపెము చేయునెడల నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసిననూ నీవు చాల ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగుపొరుగు వారు ఆనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన యెడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచూ, ఆ మంత్రాధిష్ఠాన దేవత ప్రీతికొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్ననూ అత్తగారుగాని, మామగారుగాని యింటియందున్న తక్కిన పెద్దలుగాని నా భర్తను పల్లెత్తుమాట అనరు. ఈ భూలోకమునందు నరకమనునది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడచుచుండెను." అని తెలిపినది.

ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడేతెంచెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని మా యింటికాహ్వానించిరి. అతడు ఏవేవో లెఖ్ఖలు వేసి, చిత్రవిచిత్రములయిన పూజలుచేసి, "ఈమె నష్టజాతకురాలు. అనేక అమంగళయోగములు కలది. ఆ యోగప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను యింటనుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు, పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతానయోగము కలుగును." అని చెప్పెను.

దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలును, యింటిలోని వారును, నా భర్తయును నన్ను యింటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరములేక కనీసము పుట్టినింటికయిననూ కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా యింటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్ఛమైన తన కామవాంఛకు నన్ను బలిచేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తికొలది విసరితిని. అది వానినెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధీ! నేను స్త్రీనైయుండి గత్యంతరములేని పరిస్థితులలో బ్రాహ్మణహత్య చేసితిని. నా మనస్సు మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయిననూ నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారయిననూ అన్నదమ్ములును, వదినెలును, మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకులేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామరజనము చూచిరి, కాని వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇంటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయెదను గాక! యని తలచి దారీతెన్నూలేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహుదప్పికగానుండెను. కాసారములోని నీరుత్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షమొకటుండెను. ఔదుంబరము దత్త ప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమను విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్షమూలమునందే గాఢనిద్రలోనికి జారుకుంటిని. కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళుతెరచి చూచునంతలో రెండు నాగుపాములు నాకు రెండు వైపులా కాపలాకాయు కావలివాండ్ర వలెనుండెను. నేను ఆ రెండు నాగుపాములకునూ నమస్కారము చేసితిని. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి రెండునూ ఎటోపోయెను. నేను దత్తదిగంబర ! దత్తదిగంబర! జయగురుదత్త! దత్తదిగంబర! అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబరవృక్షఛాయలో కూడనుంటిని. నేను శ్రీదత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను.

(ఇంకా ఉంది..)      

Friday, April 20, 2012

Chapter 16 Part 3 (Last Part)

అధ్యాయము 16 
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 3 
తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము

నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.

పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.

ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత  మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.

మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు  తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరివాండ్రు  చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము.

కాతికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడుబాధను చూడలేక నీళ్ళు తెచ్చిపోసెను. అయిననూ అది అగ్నిని ఆర్పలేదు సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్ననూ అతని శరీరము ఏ మాత్రమూ కాలలేదు. అవయవములేవియునూ విక్రుతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను.

నాయనా! శంకరభట్టూ! రౌరవాది మహానరకములందు అనేక అర్బుధముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునపుడు శిఖపిండుకొనునపుడు, గావంచాను పిండుకొనునపుడును, భోజనసమయమునందు 'రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్య  ముపతిష్ఠతు' అని పరిషేచనము చేసి విడుచు నీరు అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగా నున్నవారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులయిన వారికి శ్రీపాదుల వారు కొంగుబంగారము, ధర్మభ్రష్ఠులు, మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు.

మాంత్రికుని శవము చితినుండి గంతులువైచుచూ గ్రామపెద్ద యింటికిచేరెను. అగ్నిచేత దహించబడకుండగా, అగ్నివలన మహావేదనను అనుభవించుచూ పెడబొబ్బలు పెట్టుచూ, అతడు గ్రామపెద్ద యింటికిచేరెను. మేమందరమునూ గ్రామపెద్ద యింటివద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచూ, దత్తప్రభువు యొక్క దివ్య, భవ్య, నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్తదిగంబరా! శ్రీపాదవల్లభ దిగంబరా! అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూలరూపమున నున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము నందలి దివ్యకిరణములు వారి స్థూలసన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతనూ పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటానుకోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండెను. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య, సామీప్య, సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలయిన వారిని పవిత్రము చేయుచుండును.

వారి దివ్య నామస్మరణము చేయునపుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల  ద్వారా తమ ఉనికిని, సత్తాను ఋజువుచేయుచుందురు.

దత్తుడు దిగంబరుడా ? శ్రీపాదుడు దత్తుడా! అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా? అని మాంత్రికుడు శ్రీపాదులవారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటినుంచి మాంత్రికుని తీసుకొనివచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా, దిగంబరావస్థ లో తన భక్తులయెదుట నిలబెట్టినారనిన యిది సామాన్య విషయమా? సామాన్య యోగులకు యిది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను, ఎప్పుడయినా విన్నామా? కన్నామా? అంతయునూ చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులయిన వారు, తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్ల వాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను, సౌఖ్యములను పొందెదరు.

శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచూ ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపినయెడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యముచేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయునూ స్వయంకృతాపరాధమనియూ, ఆ అపరాధము యొక్క కర్మఫలమును యీ విధముగా అనుభవించుచున్నాననియూ అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతిచేసిన విషయములను అతడు గుర్తుచేసుకొనెను. తన అజ్ఞానకాలమున మహాత్ములను, దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మానస్ఫూర్తిగా శరణుజొచ్చెను.

అతని మనస్సులో యీ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుట కిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవకుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్దకుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహ లోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచూ సాధువర్తనుడనై జీవించెదనని ఎటో పోయెను. గ్రామపెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పుచెప్పెను.

మూడు సర్పరాజములు నివసించిన పుట్టయందు మూడు ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా యింటికి అరుదెంచెను. అతడు యీ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయము నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా యిచ్చి భుజింప మనెను. అతడిట్లు వచించెను. "శ్రీపాదులవారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వ్రుక్షమూలమున కూర్చొనెడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వ్రుక్షమూలమున నున్న శ్రీపాదులవారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ, నృశింహసరస్వతి, స్వామిసమర్థ అను నామత్రయమునకు సంకేతమే యీ మూడు వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ మూడు వృక్షములు. కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఔదుంబర వృక్షబీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలము నందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున నున్న శ్రీపాదులవారికి శనిప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడువారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమై యుండును." ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు ధృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 16 సమాప్తం)    

Chapter 16 Part 2

అధ్యాయము 16
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 2
శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము

యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాడులకు యీ ఘటనాక్రమమంతయునూ అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు నాలుగువైపులా సరిహద్దులందు తాటిచెట్లు ఉండెను. ఆ తాటిచెట్లను కల్లుగీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు యీయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరపపండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరపపండ్లు కోయబడెను. అవి అన్నియునూ బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకొనిపోవుటకు సిద్ధముగానుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యము చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు పదుగురు. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లూకమును గాంచితిని. ఆ భల్లూకము చెట్టునుండి క్రిందపడినది. భాల్లూకమనిన అందరకునూ భయమే! వాడియైన తన గోళ్ళతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్ఛరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాడులవారి నామమును ఉచ్ఛరించినపుడు తన చేతులతో తాళమువేయుచూ ప్రసన్నముగానుండెను. నేను మిరపపండ్ల బస్తాలతో రెండెడ్లబండిలో యింటికి చేరితిని. నా బండికి ముందుభాగమున భాల్లోకము నడుచుచుండెను.

మా యింటిలోని వృద్ధదంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండువారందరికి యిది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్ఛరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భాల్లోకము కూడా ఆనందముగా స్వీకరించినది.

ఆ రోజునుండి భల్లూకము మా యింటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబసభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా యింట ప్రతి నిత్యమును దత్తప్రభువుల లీలావిశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను.

శ్రీమన్నారాయణ యీ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాల స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగనే అది ఆనందముతో గంతులు వేయసాగినది.

శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను

మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారినుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాన్త్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా యింటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకమునందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొనియుండెను. తాంత్రికుడు ఒకానొక యోగప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగప్రక్రియద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను.

శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధకర్మల నుండి రక్షించుట

శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రికబాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవులయొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మఫలముల తీవ్రతను క్షీనింపచేయుదురు.

శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యధావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగానుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదులవారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి.

నామపారాయణము జరుగుచున్నపుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవమువలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటిని అది పొందసాగెను. భక్తులు నామ పారాయణము చేయునపుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్త్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్త్వము నశించి మానవత్త్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూకతత్త్వములోనికి మార్పుచెందుటచే తాంత్రికుడు భల్లూకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్ళతో బంధించి అడవిలో దించివైచిరి.

భల్లూకము మానుషభాషలో మాట్లాడనారంభించి, "అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను. ఎక్కువ వడ్డీలను వసూలుచేయుచూ జనులను మిగుల బాధించితిని. తత్ఫలితముగా భల్లూకజన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమజన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికితోడు శ్రీపాదుల వారి భక్తుడను, మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు, శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చలభక్తితో వారినారాధించువారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను." అని పలికెను.

అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చటనుండియో మూడు నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునపుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన మూడు నాగుపాములు భల్లూకమునకు మూడుసార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చటనుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయునూ మా యింటనే ఉండినవి.

మాకు సర్వకాల సర్వావస్థలందునూ శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయినవారు గాని, మైలదోషము సోకినవారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి.

నాగుపాములు మాయింట నివసించుటచే మా యింటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్తభక్తులు మా యింటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని, శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయభావముతో నుండెడివి. వృద్ధదంపతులు యింటి భాగములోని కొంతస్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించియుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్దారించిరి. తీర్పు వెలువడునంతవరకునూ ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుటకు అనుమతి యీయబడెను. మా దాయాదులు గ్రామపెద్దలను ధనప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైననూ తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట యుండెను. నాగులచవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమియునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు "నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము! మా అభీష్టములు తీర్చుము" అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకూ దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును.

శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగులచవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్న వారు ప్రార్థనచేయు వారు, పాలుపోయు వారు యీ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి.

నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము యిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును, మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే మూడు నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు.

(ఇంకా ఉంది..)                         

Saturday, April 7, 2012

Chapter 16 Part 1

అధ్యాయము 16 
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 1 

నేను శ్రీపాదులవారి దివ్య చరితమును మననము చేసికొనుచూ, మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసికొనుచూ పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననెడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడయి ఉన్నాడు. అతడు "అయ్యా! కొంతసేపు యిక్కడ విశ్రమించి చెరుకురసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు." అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు యిచ్చిన చెరుకురసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. "అయ్యా! నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే! అయితే వారు బ్రాహ్మణులు. మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును, మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్ధికపరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పులబాధకు తట్టుకొనలేక చార, స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములనోసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము "దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలనమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన యెడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది." అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల యింట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు, "బాపనార్యుల యింట లభించేది అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురయిన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభామయిన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది." అని పలికిరి. శ్రీ బాపనార్యులు "మా భూములను యిదివరకే పంటకాపులకు ఒసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమయిన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకక పోదు." అనిరి. తదుపరి శ్రీపాదులవారు, "ఇదిగో! గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి యీ మినుములను పారవేయవలసినది. రాతిక్రింద కప్పకు కూడ ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది." అనిరి.

మేము బాపనార్యుల యింట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధదంపతులు మాత్రముండిరి. వారుకూడ కమ్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుతచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడ కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడ లేదు. ఆ విధముగ ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననెడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్ఠులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికీ తమ ఆస్తిపాస్తులను యీయవలెననెడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధదంపతుల యింట మాకు ఆతిధ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలించిననూ ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా యింటిల్లిపాదికీ, వాంతులు, విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినపుడు వృద్ధదంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్యభావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ యింట తిష్ఠవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశక్యత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో, రేవో యిచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. 

దాయాదులకు వృద్ధదంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని, వారు మాత్రము అక్కరలేదు. మేముకూడ వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకొనవలెననెడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలోవారు రాజీకివచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని, మమ్ములను ఆ యింటనుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి.

దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచిపడి అతనిని ఆ వృద్ధదంపతుల యింటికి తీసుకొనివచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. "మీ యింటనున్న యీ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ యింటనున్న ఆ యింట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ యింటి నుండి పంపించివేయుడు."

దానికి వృద్ధ దంపతులు "మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నయెడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంతధానము ఖర్చు అయిననూ, వారికి ఉన్న అమంగళములన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరునూ మంత్రాధీనులయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సద్బ్రాహ్మణులయిన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది. " అని ఆ జ్యోతిష్కుని కోరిరి. 

జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా! శంకరభట్టూ! ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మలకునూ వేదమే మూలమయి ఉన్నది. యాగములచేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకునూ, దేవతలకునూ పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు అయిదు రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్యసహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమయిన దోషములు లేవు. వృద్ధదంపతుల పుణ్యమా అని మాకు పరమపవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్పహవిస్సులు, మంత్రసామర్థ్యము వలన ఏయేదేవతలకు ఎంతకావలయునో అంతవృద్ధిని పొందును. 

భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది 

గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల యిహలోకస్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోకస్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పదిమందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యులవంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడయిన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి.


(ఇంకా ఉంది..)            

Chapter 15 Part 3 (Last Part)

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 3 
మహారాజునకు గర్వభంగము 

పీఠికాపురము సంస్థానమునేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనెడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలెననెడి కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజుశర్మ యింటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, 'శీఘ్రముగా శ్రీపాదులవారిని తీసుకొని అప్పలరాజుశర్మయు, బాపనార్యులును కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని.' అవమానకరమైన యీ ఆహ్వానమును శ్రీపాదులవారు తిరస్కరించిరి. అప్పలరాజుశర్మకు కోటలోనికి వెళ్ళుటకు యిష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, "నాయనా! బంగారూ! కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా!" అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదులు "తాతా! మహారాజునకు భక్తిలేదు. నా దర్శనము అంత సులభమైనది కాదు." అనెను. శ్రీపాదులవారు భటులతో "మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా యిచ్చటకు రావచ్చును. అతడు కేవలము యీ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను యీ సృష్టికంతకునూ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చునపుడు వట్టి చేతులతో రారాదు. నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన యెడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును." అని కరాఖండీగా చెప్పిరి.

శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజుశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహ వర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన యీ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. 'నేను తలచుకున్న ఆ బుడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక! నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు.' అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యెను. శోషవచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి. అయిననూ అతడు నీరసముగా నుండెను.

ఇంతలో అతని మనోనేత్రమునకు వికారస్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. 'నేనే శక్తిని! నీలోనికి ఉరుకుచున్నాను.' అని అరచుచూ అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తిధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. 'వెంటనే నాలో నుండి వెళ్ళిపో!' అని అతడు హీనస్వరముతో అరచెను. 'ఇదిగో! వెళ్లిపోవుచున్నాను!' అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకుపోయెను. ఆ రకముగా పోవునపుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయూ, శక్తి బయల్వెడలుటయూ జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజ పురోహితులయిన  సుందరరామశర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకొనిన తదుపరి శరీరములోనికి శక్తి రాకపోకలు నిలచిపోయెను. అంతట శర్మ యిట్లనిరి. "మహారాజా! చూచినారా! మా అర్చన యొక్క శీఘ్ర ఫలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి. అది మీకు వ్యర్థము. వారి యింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజావిశేషమున అప్పలరాజుశర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చవుకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైననూ మూర్ఖుడై శ్రీపాదుని దత్తవతారమని స్తుతించుచున్నాడు. మీరెంతమాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాల గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతముగనయిననూ శ్రీపాదుని యిచ్చటకు తీసుకురాగలరు ?" ఈ మాటలు, ముఖస్తుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని యిచ్చటకు రప్పించిన యెడల నాకు కలుగు లాభమేమి? పై పెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదులవారి వద్ద కొన్ని క్షుద్రవిద్యలున్నట్లు, నాకు అనుమానముగా ఉన్నది. నాపైన శ్రీపాడుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయిన, యీ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేల? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కులపురోహితులు. మా శ్రేయస్సును కాంక్షించువారు." అని పలికెను.

అంతట శర్మ యిట్లనెను. "మహారాజా! దత్తపురాణమును బ్రాహ్మణులచేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధానము చేయవలెను. భూరిదక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన యెడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును."

రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాల అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసెడి రోజునుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండును. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయెను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యెను. కొండనాలుకకు మందువేసిన ఉన్ననాలుక ఊడిపోయెనను విధముగ బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమీయసాగిరి. బక్కచిక్కిన దేహములతో, ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ళవలె నుండిరి. ఏమిరా! మాకు శ్రాద్ధభోజనము పెట్టుటలేదేమి? మేము యీ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా ? అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధకలాపములను చేయుచున్నానని రాజనెను. "నీవు చేయుచున్నావు సరే! కాని అవి మాకు అందుత లేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినపుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినపుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును." అని పితరులు రాజుతో ననిరి. కనులు మూసినాను, తెరచిననూ పితరుల యొక్క యీ గోలతో ఆర్త నాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్ర అనునట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచూ, యింటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నపుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగుచోటుకి రాజు వచ్చి వీక్షించినపుడు - దీనముగా, హీనముగా, కృశించిన శరీరములతో, ప్రేతకళతో నున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై, రాజు పరిస్థితి చాల దయనీయముగా నుండెను.

సుందరరామశర్మ యింట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడు నొకదానిని తెచ్చి తన తండ్రిని స్థంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రిమీద ఉమ్మివేసి, తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినపుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్దిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణము పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు యధేచ్చగా యింట తిరగాడుచూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు విక్రుతముగా నవ్వుచూ నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరములవారు పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు? మేమే! మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమియునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది, ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులయినవారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేదించ దలచితిమి." అని పలుకుచుండిరి.

పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును కూడా భయభ్రాంతులై, "దత్తపురాణము పారాయణచేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము కాని యిది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనమువలన శంకరుడు ప్రసన్నుడై, తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యము చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసిన అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్ళకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు, నింద్యములయిన వాక్కులతో తమను వేధించువారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన యీ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై, వాక్కులచేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్త్వముతో రక్షించి, భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసెడి యెడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో." అని పరితపించుచుండిరి.

సృష్టిలో మానవుడు కూలియే. కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు

వెంటనే బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును, శ్రీపాదుల వారిని శరణు జొచ్చిరి. అంతట శ్రీపాదులువారు "ఈ సృష్టిలోని ప్రతీ మానవుడును కూలియే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనయిన యెడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ యిచ్చెదను. అప్రసన్నుడనయిన యెడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే యిచ్చెదను. ఆలయములో స్వయంభూదత్తుడుగా నున్నది నేనే! కాలాగ్నిశమన దత్తరూపములో నున్నది నేనే! జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను. నాకు ముఖమునకు మంగళ హారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టినయెడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్తపురాణములోని విష్ణుదత్తుడును, అతని భార్యయును, యీ కలియుగములో అప్పలరాజుశర్మగాను, సుమతీ మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరియొక కల్పమందు లాభాదమహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడ బాపనార్యులు వారే! వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేశచతుర్థి నవతరించుట కూడా దివ్యసంకల్పములో భాగము. వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారము నుండియూ వెంకటప్పయ్య  శ్రేష్ఠిగారితో ఋణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నృశింహరూపములో ఋణానుబంధము కలిగిన నరసింహవర్మ, నిజంగా పుణ్యాత్ములు గనుకనే వారికి నాతో యీ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండును. నేను నృశింహసరస్వతిగా అవతరించునపుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించెదను. వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి యిచ్చటనున్న భూతప్రేతములకు విముక్తి కలిగించినట్లే. నృశింహ సరస్వతిగా అవతరించునపుడు నా గంధర్వనగరమునకు వచ్చిన భక్తుల నావహించిన భూతప్రేతములను పారద్రోలి, ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంతమాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన యెడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జా నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన యెడల, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదా దత్తా! శ్రీవల్లభా! దిగంబరా! అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటిని దహించివేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుటవలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున, మీరు దత్తపురాణమును పారాయణ చేసియున్ననూ, మీకు దాని ఫలితము లేకపోగా, వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము." అని తెలిపిరి.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము


(అధ్యాయము 15 సమాప్తం)