అధ్యాయము 16
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 3
తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదుల వారి గుణపాఠము
నాగులచవితినాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులునూ, గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునయిననూ తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలగినవాడు. పాము కరచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలగినవాడు. అతనిచేతిలో గరుడరేఖ కూడా యుండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు, మంత్రగాడును తలపోయుచుండిరి.
పుట్టకు దరిదాపులలోనున్న ప్రాంతమంతయునూ మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రములనుచేయుచూ మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయస్థితిలో నుంటిమి. అమాయకములయిన జాతిసర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని, వాని అనుచరులకునూ యిదిఎంతయో సంతసము కూర్చుచుండెను. అయిననూ వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమునూ ఆకారములో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలలవైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము నందు మాత్రము అగ్ని చల్లారుచుండెను.తుదకు అగ్ని అంతయునూ ఆరిపోయెను. ఆ సర్పరాజములు యధేచ్చగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును, అతని అనుచరులునూ బిత్తరపోయిరి.
ఇంతలో గ్రామపెద్ద పెద్దకుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత మగుట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయూ విడ్డూరమే! మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనసులో మహాభయము తోచెను. అనాధ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరేవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగతజీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన యెడల నీ యిద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి.
మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద యింటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు యిద్దరునూ విధి వైపరీత్యమునకు లోనయిరి. మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణమంతయునూ విషాద భరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును స్మశానమునకు తీసుకొనిపోయిరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవాములో ఆకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు, వానిని రక్షించినచో యిదే శరీరముతో అతడు ప్రేతార్మ చేయు దుష్ట కార్యములన్నియునూ చేయుననియూ, అతని శవము కాలి బూడిద అయిన యెడల కేవలం ప్రేతాత్మ గానే యుండి తనకి వశమైయుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియూ, అందుచేత శవమునకు నీళ్లుపోయు ప్రయత్నమును మానుకొనిరి. విగతజీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మకంటే సజీవుడై తన స్వంత ఉపాదిలోనే ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులని కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును, దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్త్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము.
కాతికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడుబాధను చూడలేక నీళ్ళు తెచ్చిపోసెను. అయిననూ అది అగ్నిని ఆర్పలేదు సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్ననూ అతని శరీరము ఏ మాత్రమూ కాలలేదు. అవయవములేవియునూ విక్రుతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను.
నాయనా! శంకరభట్టూ! రౌరవాది మహానరకములందు అనేక అర్బుధముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునపుడు శిఖపిండుకొనునపుడు, గావంచాను పిండుకొనునపుడును, భోజనసమయమునందు 'రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతు' అని పరిషేచనము చేసి విడుచు నీరు అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగా నున్నవారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులయిన వారికి శ్రీపాదుల వారు కొంగుబంగారము, ధర్మభ్రష్ఠులు, మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు.
మాంత్రికుని శవము చితినుండి గంతులువైచుచూ గ్రామపెద్ద యింటికిచేరెను. అగ్నిచేత దహించబడకుండగా, అగ్నివలన మహావేదనను అనుభవించుచూ పెడబొబ్బలు పెట్టుచూ, అతడు గ్రామపెద్ద యింటికిచేరెను. మేమందరమునూ గ్రామపెద్ద యింటివద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచూ, దత్తప్రభువు యొక్క దివ్య, భవ్య, నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొనుచుంటిమి. దత్తదిగంబరా! శ్రీపాదవల్లభ దిగంబరా! అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూలరూపమున నున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము నందలి దివ్యకిరణములు వారి స్థూలసన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మరూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతనూ పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటానుకోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండెను. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహా విశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య, సామీప్య, సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధ పురుషులు, మహాయోగులు మొదలయిన వారిని పవిత్రము చేయుచుండును.
వారి దివ్య నామస్మరణము చేయునపుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల ద్వారా తమ ఉనికిని, సత్తాను ఋజువుచేయుచుందురు.
దత్తుడు దిగంబరుడా ? శ్రీపాదుడు దత్తుడా! అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా? అని మాంత్రికుడు శ్రీపాదులవారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటినుంచి మాంత్రికుని తీసుకొనివచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా, దిగంబరావస్థ లో తన భక్తులయెదుట నిలబెట్టినారనిన యిది సామాన్య విషయమా? సామాన్య యోగులకు యిది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను, ఎప్పుడయినా విన్నామా? కన్నామా? అంతయునూ చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. శ్రీపాదుల వారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులయిన వారు, తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్ల వాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను, సౌఖ్యములను పొందెదరు.
శ్రీపాదుల వారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచూ ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపినయెడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యముచేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయునూ స్వయంకృతాపరాధమనియూ, ఆ అపరాధము యొక్క కర్మఫలమును యీ విధముగా అనుభవించుచున్నాననియూ అతడు తెలిసికొనెను. ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతిచేసిన విషయములను అతడు గుర్తుచేసుకొనెను. తన అజ్ఞానకాలమున మహాత్ములను, దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదుల వారిని మానస్ఫూర్తిగా శరణుజొచ్చెను.
అతని మనస్సులో యీ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుట కిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవకుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్దకుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహ లోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచూ సాధువర్తనుడనై జీవించెదనని ఎటో పోయెను. గ్రామపెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పుచెప్పెను.
మూడు సర్పరాజములు నివసించిన పుట్టయందు మూడు ఔదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా యింటికి అరుదెంచెను. అతడు యీ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయము నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదముగా యిచ్చి భుజింప మనెను. అతడిట్లు వచించెను. "శ్రీపాదులవారు పీఠికాపురమునందలి వారి మాతామహగృహమున ఒకానొక ఔదుంబర వ్రుక్షమూలమున కూర్చొనెడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వ్రుక్షమూలమున నున్న శ్రీపాదులవారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ, నృశింహసరస్వతి, స్వామిసమర్థ అను నామత్రయమునకు సంకేతమే యీ మూడు వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ మూడు వృక్షములు. కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఔదుంబర వృక్షబీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలము నందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున నున్న శ్రీపాదులవారికి శనిప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడువారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమై యుండును." ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు ధృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
(అధ్యాయము 16 సమాప్తం)
No comments:
Post a Comment