Friday, April 20, 2012

Chapter 16 Part 2

అధ్యాయము 16
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 2
శ్రీపాదుల వారు తన భక్తులను కాపాడిన విధము

యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాడులకు యీ ఘటనాక్రమమంతయునూ అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు నాలుగువైపులా సరిహద్దులందు తాటిచెట్లు ఉండెను. ఆ తాటిచెట్లను కల్లుగీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు యీయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరపపండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరపపండ్లు కోయబడెను. అవి అన్నియునూ బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకొనిపోవుటకు సిద్ధముగానుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యము చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు పదుగురు. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లూకమును గాంచితిని. ఆ భల్లూకము చెట్టునుండి క్రిందపడినది. భాల్లూకమనిన అందరకునూ భయమే! వాడియైన తన గోళ్ళతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరమునందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లూకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామమును ఉచ్ఛరించసాగితిని. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపమును పొంది నేను శ్రీపాడులవారి నామమును ఉచ్ఛరించినపుడు తన చేతులతో తాళమువేయుచూ ప్రసన్నముగానుండెను. నేను మిరపపండ్ల బస్తాలతో రెండెడ్లబండిలో యింటికి చేరితిని. నా బండికి ముందుభాగమున భాల్లోకము నడుచుచుండెను.

మా యింటిలోని వృద్ధదంపతులకే కాదు చుట్టుప్రక్కల నుండువారందరికి యిది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయునూ శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్ఛరించుచుంటిమి. భల్లూకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భాల్లోకము కూడా ఆనందముగా స్వీకరించినది.

ఆ రోజునుండి భల్లూకము మా యింటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబసభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకము మా చేలన్నింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా యింట ప్రతి నిత్యమును దత్తప్రభువుల లీలావిశేషములకు సంబంధించిన చర్చలను, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను.

శ్రీమన్నారాయణ యీ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లూకము చెరుకుతోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాల స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగనే అది ఆనందముతో గంతులు వేయసాగినది.

శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను

మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారినుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాన్త్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా యింటనున్న భల్లూకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లూకమునందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడిరి. స్తబ్ధముగా భల్లూకము పండుకొనియుండెను. తాంత్రికుడు ఒకానొక యోగప్రక్రియ ద్వారా భల్లూకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగప్రక్రియద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను.

శ్రీపాదుల వారు తమ భక్తులను వారి ప్రారబ్ధకర్మల నుండి రక్షించుట

శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధములు వెదకబూనుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లూకము తాంత్రికబాధకు గురి అయ్యెను. అయితే భల్లూకమునందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవులయొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాపకర్మఫలముల తీవ్రతను క్షీనింపచేయుదురు.

శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యధావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనసులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్యమనస్కముగానుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదులవారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి.

నామపారాయణము జరుగుచున్నపుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవమువలె పడియున్న భల్లూకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటిని అది పొందసాగెను. భక్తులు నామ పారాయణము చేయునపుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగప్రక్రియలన్నింటికినీ అతీతము. భల్లూకమునందలి భల్లూక ఆత్మ చైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లూకతత్త్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లూకములో భల్లూకతత్త్వము నశించి మానవత్త్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లూకతత్త్వములోనికి మార్పుచెందుటచే తాంత్రికుడు భల్లూకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్ళతో బంధించి అడవిలో దించివైచిరి.

భల్లూకము మానుషభాషలో మాట్లాడనారంభించి, "అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను. ఎక్కువ వడ్డీలను వసూలుచేయుచూ జనులను మిగుల బాధించితిని. తత్ఫలితముగా భల్లూకజన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమజన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికితోడు శ్రీపాదుల వారి భక్తుడను, మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు, శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చలభక్తితో వారినారాధించువారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను." అని పలికెను.

అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చటనుండియో మూడు నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునపుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లూకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన మూడు నాగుపాములు భల్లూకమునకు మూడుసార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చటనుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయునూ మా యింటనే ఉండినవి.

మాకు సర్వకాల సర్వావస్థలందునూ శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్ఠు అయినవారు గాని, మైలదోషము సోకినవారు గాని గుంపులో నుండిన అవి బుసకొట్టుచుండెడివి.

నాగుపాములు మాయింట నివసించుటచే మా యింటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్తభక్తులు మా యింటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమును గాని, శ్రీపాదుల వారి నామమును గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయభావముతో నుండెడివి. వృద్ధదంపతులు యింటి భాగములోని కొంతస్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించియుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్దారించిరి. తీర్పు వెలువడునంతవరకునూ ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుటకు అనుమతి యీయబడెను. మా దాయాదులు గ్రామపెద్దలను ధనప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైననూ తీర్పు వెలువడుట లేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలమునందు ఒక పుట్ట యుండెను. నాగులచవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్టయందు పాములు ఏమియునూ లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు "నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము! మా అభీష్టములు తీర్చుము" అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయువారందరకూ దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును.

శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగులచవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్న వారు ప్రార్థనచేయు వారు, పాలుపోయు వారు యీ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచుండిరి.

నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవతా! నాగదేవతా! నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము యిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును, మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగనే మూడు నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప ఎవ్వరునూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానేలేదు.

(ఇంకా ఉంది..)                         

No comments:

Post a Comment