అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 3
మహారాజునకు గర్వభంగము
పీఠికాపురము సంస్థానమునేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనెడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలెననెడి కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజుశర్మ యింటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, 'శీఘ్రముగా శ్రీపాదులవారిని తీసుకొని అప్పలరాజుశర్మయు, బాపనార్యులును కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని.' అవమానకరమైన యీ ఆహ్వానమును శ్రీపాదులవారు తిరస్కరించిరి. అప్పలరాజుశర్మకు కోటలోనికి వెళ్ళుటకు యిష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, "నాయనా! బంగారూ! కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా!" అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదులు "తాతా! మహారాజునకు భక్తిలేదు. నా దర్శనము అంత సులభమైనది కాదు." అనెను. శ్రీపాదులవారు భటులతో "మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా యిచ్చటకు రావచ్చును. అతడు కేవలము యీ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను యీ సృష్టికంతకునూ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చునపుడు వట్టి చేతులతో రారాదు. నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన యెడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును." అని కరాఖండీగా చెప్పిరి.
శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజుశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహ వర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన యీ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. 'నేను తలచుకున్న ఆ బుడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక! నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు.' అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యెను. శోషవచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి. అయిననూ అతడు నీరసముగా నుండెను.
ఇంతలో అతని మనోనేత్రమునకు వికారస్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. 'నేనే శక్తిని! నీలోనికి ఉరుకుచున్నాను.' అని అరచుచూ అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తిధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. 'వెంటనే నాలో నుండి వెళ్ళిపో!' అని అతడు హీనస్వరముతో అరచెను. 'ఇదిగో! వెళ్లిపోవుచున్నాను!' అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకుపోయెను. ఆ రకముగా పోవునపుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయూ, శక్తి బయల్వెడలుటయూ జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజ పురోహితులయిన సుందరరామశర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకొనిన తదుపరి శరీరములోనికి శక్తి రాకపోకలు నిలచిపోయెను. అంతట శర్మ యిట్లనిరి. "మహారాజా! చూచినారా! మా అర్చన యొక్క శీఘ్ర ఫలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి. అది మీకు వ్యర్థము. వారి యింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజావిశేషమున అప్పలరాజుశర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చవుకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైననూ మూర్ఖుడై శ్రీపాదుని దత్తవతారమని స్తుతించుచున్నాడు. మీరెంతమాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాల గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతముగనయిననూ శ్రీపాదుని యిచ్చటకు తీసుకురాగలరు ?" ఈ మాటలు, ముఖస్తుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని యిచ్చటకు రప్పించిన యెడల నాకు కలుగు లాభమేమి? పై పెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదులవారి వద్ద కొన్ని క్షుద్రవిద్యలున్నట్లు, నాకు అనుమానముగా ఉన్నది. నాపైన శ్రీపాడుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయిన, యీ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేల? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కులపురోహితులు. మా శ్రేయస్సును కాంక్షించువారు." అని పలికెను.
అంతట శర్మ యిట్లనెను. "మహారాజా! దత్తపురాణమును బ్రాహ్మణులచేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధానము చేయవలెను. భూరిదక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన యెడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును."
రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాల అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసెడి రోజునుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండును. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయెను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యెను. కొండనాలుకకు మందువేసిన ఉన్ననాలుక ఊడిపోయెనను విధముగ బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమీయసాగిరి. బక్కచిక్కిన దేహములతో, ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ళవలె నుండిరి. ఏమిరా! మాకు శ్రాద్ధభోజనము పెట్టుటలేదేమి? మేము యీ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా ? అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధకలాపములను చేయుచున్నానని రాజనెను. "నీవు చేయుచున్నావు సరే! కాని అవి మాకు అందుత లేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినపుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినపుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును." అని పితరులు రాజుతో ననిరి. కనులు మూసినాను, తెరచిననూ పితరుల యొక్క యీ గోలతో ఆర్త నాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్ర అనునట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచూ, యింటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నపుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగుచోటుకి రాజు వచ్చి వీక్షించినపుడు - దీనముగా, హీనముగా, కృశించిన శరీరములతో, ప్రేతకళతో నున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై, రాజు పరిస్థితి చాల దయనీయముగా నుండెను.
సుందరరామశర్మ యింట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడు నొకదానిని తెచ్చి తన తండ్రిని స్థంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రిమీద ఉమ్మివేసి, తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినపుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్దిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణము పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు యధేచ్చగా యింట తిరగాడుచూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు విక్రుతముగా నవ్వుచూ నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరములవారు పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు? మేమే! మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమియునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది, ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులయినవారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేదించ దలచితిమి." అని పలుకుచుండిరి.
పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును కూడా భయభ్రాంతులై, "దత్తపురాణము పారాయణచేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము కాని యిది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనమువలన శంకరుడు ప్రసన్నుడై, తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యము చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసిన అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్ళకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు, నింద్యములయిన వాక్కులతో తమను వేధించువారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన యీ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై, వాక్కులచేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్త్వముతో రక్షించి, భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసెడి యెడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో." అని పరితపించుచుండిరి.
సృష్టిలో మానవుడు కూలియే. కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు
వెంటనే బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును, శ్రీపాదుల వారిని శరణు జొచ్చిరి. అంతట శ్రీపాదులువారు "ఈ సృష్టిలోని ప్రతీ మానవుడును కూలియే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనయిన యెడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ యిచ్చెదను. అప్రసన్నుడనయిన యెడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే యిచ్చెదను. ఆలయములో స్వయంభూదత్తుడుగా నున్నది నేనే! కాలాగ్నిశమన దత్తరూపములో నున్నది నేనే! జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను. నాకు ముఖమునకు మంగళ హారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టినయెడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్తపురాణములోని విష్ణుదత్తుడును, అతని భార్యయును, యీ కలియుగములో అప్పలరాజుశర్మగాను, సుమతీ మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరియొక కల్పమందు లాభాదమహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడ బాపనార్యులు వారే! వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేశచతుర్థి నవతరించుట కూడా దివ్యసంకల్పములో భాగము. వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారము నుండియూ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారితో ఋణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నృశింహరూపములో ఋణానుబంధము కలిగిన నరసింహవర్మ, నిజంగా పుణ్యాత్ములు గనుకనే వారికి నాతో యీ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండును. నేను నృశింహసరస్వతిగా అవతరించునపుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించెదను. వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి యిచ్చటనున్న భూతప్రేతములకు విముక్తి కలిగించినట్లే. నృశింహ సరస్వతిగా అవతరించునపుడు నా గంధర్వనగరమునకు వచ్చిన భక్తుల నావహించిన భూతప్రేతములను పారద్రోలి, ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంతమాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన యెడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జా నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన యెడల, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదా దత్తా! శ్రీవల్లభా! దిగంబరా! అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటిని దహించివేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుటవలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున, మీరు దత్తపురాణమును పారాయణ చేసియున్ననూ, మీకు దాని ఫలితము లేకపోగా, వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము." అని తెలిపిరి.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము
(అధ్యాయము 15 సమాప్తం)
No comments:
Post a Comment