Monday, April 23, 2012

Chapter 17 Part 2

అధ్యాయము 17
శ్రీనామానందుల వారి వర్ణనము - భాగము 2

నా దత్తనామస్మరణమును తన్మయత్వముతో ఆలకించుచూ దారివెంట పోవుచున్న బాటసారి యొకడు మేడిచెట్టుఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను "ఓయీ! నీవు ఎవ్వడవు? మర్యాదగా యిచటనుండి వెంటనేపొమ్ము. నీవు పోకపోయినచో యిచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నిన్ను చంపివేసెదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహనామాంత్రికుని హతమార్చితిని." అంటిని.

అందులకు ఆ నూతనవ్యక్తి చేతులు జోడించి, "అమ్మా! నేను రజకకులమునందు పుట్టిన రవిదాసు అనుపేరుగల దత్తభక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుండును. శ్రీగురుదత్తులు యీ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురము నందు విరాజిల్లుచున్నాడు. ఎంతటి దూరదూరములలోనున్న దత్తభక్తులకైననూ తాను యీ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలావిశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము! నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు యిష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే యున్నది. నేను నా బంధువులయింటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను." అని పలికెను.

అంతట నేను "నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పెడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరయి ఉన్నది అని విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో యీ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువుచేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదులవారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము యీచోటినుండి వెళ్ళకపోయిన యెడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనెదవు." అంటిని.

అతడు మారు మాటాడక దత్తదిగంబర! దత్తదిగంబర! శ్రీపాదవల్లభ దత్తదిగంబర! అని పాడుకొనుచూ వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్టమీద పద్మాసనము వేసుకొని ధ్యానము చేసుకొనుచుండగా యీ దుష్టులబారిన పది మీ వలన రక్షింపబడితిని.

అంతట నేను, "అమ్మా, శ్రీపాదులవారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యాముగా ఉండని దేశముగాని, వారి ఎరుకలోలేని కాలము గాని యీ సృష్టిలో లేనేలేవు. కార్యకారణ సంబంధములతో యీ సృష్టిలో వివిధ దేశములలో, వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వ కారణములకునూ వారే మహాకారణము. రకరకాల స్థితులలో నున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణములేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదులవారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా యిటువంటి అన్ని స్థితులకూ అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియును. మనము శ్రీపాద శ్రీవల్లభులవారి నామస్మరణము చేసుకొనుచున్న యెడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తిని పొందగలము." అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ, సుశీలయను పేరుగల యీ బ్రాహ్మణ యువతితోనూ కలసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మేమందరమునూ దత్త నామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందమువలె కనుపించుచుంటిమి. ప్రయాణమధ్యములో నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి.

శ్రీదత్తుడు ఛండాలవేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట

నామనందులవారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీనామానందుల వారిట్లు చెప్పసాగిరి. మానాయనగారి పేరు మాయణాచార్యులు. నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాసదీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తరదేశమునందలి పుణ్యక్షేత్రములను, సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చితిని. మేము శ్రీ వైష్ణవులమగుటచే శివారాధానము మాకు సమ్మతము కాదు. మడి, ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతీమాధవ దర్శనము చేసుకొని బయటకు వచ్చుచు ఛండాలునొకనిని చూచితిని. ఛండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి 'నామానందా! నాకు గురుదక్షిణ సమర్పించి యిచ్చటనుండి కదులుము' అని గద్దించి పలికెను. అంతట నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు యీ వింతను చూచుచుండిరి. ఛండాలుడు శ్రీవైష్ణవబ్రాహ్మణోత్తముని గురుదక్షిణనిమ్మని గద్దించుట కలివైపరీత్యము కాక మరేమీ అని జనులు అనుకొనిరి. వీడెవడో త్రాగివచ్చి యీ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరి కొందరనుకొనిరి. అంతట నేను, "ఓయీ! నీవేవ్వరవో నాకు తెలియదు, అయిననూ నేను వైష్ణవబ్రాహ్మణుడను, నీవు ఛండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమియునూ సబబుగాలేదు." అనంటిని. యింతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేక పోయితిని. వాని కన్నులు  చింతనిప్పుల వలె ఎర్రగానుండెను. వాని ముఖకవళికలు ఎంతటివారికయిననూ హడలు పుట్టించునవిగా నుండెను. నా యీ శాంతవచనములకు వాడు ఎంతమాత్రమును లొంగక, "నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచూ, నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునాయని నానా గోత్రములవారిని ప్రశ్నించుచూ పిచ్చికుక్కవలె తిరుగుచున్నావు. బ్రాహ్మణజన్మనెత్తితినని దురహంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనెడి సన్యాసనామము నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయూ నాకు గురుదక్షిణగా నిచ్చి అందరునూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయిన యీ కత్తితో నీ శరీరమును ఖండఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదేపదే కుళ్ళపొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడిచేసెదను. ఖండించబడిన ప్రతీ శరీరభాగమునందునూ చైతన్యమును అనుభవించుచూ ఘోరమైన నరకబాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న ఔను, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటిదేవతలతో ఎవరినీ ప్రార్థించిననూ నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్కదేవత కూడా సాహసింపలేడు." అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన ఛండాలుడు తన ఒరలో నున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. 

నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ ఛండాలునికి సాష్టాంగ ప్రణామమాచరించితిని. నా వద్దనున్న రొఖ్ఖమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నియునూ నాకు కల్పితములుగా తోచెను. అయితే, నా ఊహలను అన్నింటినీ తలక్రిందులుచేయుచూ వారి మోహనమైన దివ్యమంగళరూపము నాకు దృగ్గోచర మాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్యమంగళమూర్తి, "నేను శ్రీదత్తుడను, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించితిని. నీవు నా వాడవు. నేను నీ వాడవు. నేను నీ సొత్తు. నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటినుండి నామానందుడవై ధర్మప్రచారము చేయుచూ, చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు." అని దీవించెను.

నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట

అయ్యా! ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించివేయుచున్నది. ఏ యింటికి పోయిననూ నాకు అన్నమిడువారే కానరారైరి. జనులు నా గురించి వింతవింతగా "ఇతడొక పిచ్చివాడు. ఛండాలుడొకడు త్రాగివచ్చిన మైకములో వీనినుండి గురుదక్షిణ వసూలుచేసెను. ఇతడు బ్రాహ్మణుడయిననూ ఛండాలుని  గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన యితనికి  భిక్షవేయుట ధర్మశాస్త్ర విరుద్ధము."అని చెప్పుకొనసాగిరి. యీ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగనే శ్రీ అప్పలరాజుశర్మ గారింటికి చేరితిని. భవతీ! భిక్షాందేహి! అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతోనుంటిని. ఇంతలో తలుపు తెరచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపుపళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగుమీద కూర్చొండబెట్టుకొని తమ దివ్యహస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను, మూతిని తుడిచిరి. అనంత శక్తిస్వరూపమైన తమ వరదహస్తమును నా శిరస్సుపై నుంచి, "నీకు సర్వమునూ సిద్ధము చేయబడును. దేనికోసమూ వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీవెచ్చటనున్ననూ నీ వెన్నంటియే నేనుందును. అదృశ్యముగా జంటనై సంచరించెదను. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుచుందును." అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటినుండి నేను సన్యాసినై నా యిచ్చవచ్చినచోటుల సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 

నాల్గు విధములైన జీవన్ముక్తులు 

నేను, "అయ్యా! శ్రీదత్తులవారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానమున్నదా? ప్రత్యేకమయిన మంత్రములను ఏమయిననూ జపము చేయవలెనా? నా సంశయములను దీర్చి కృతార్థుని చేయవలసినది." అని అడిగితిని.

దానికి ప్రసన్నవదనులయిన శ్రీనామానందులు "నాయనలారా! మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షము కలుగవలెనను నియమములేదు. శారీరక ప్రారబ్దమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటివారిని 'జీవన్ముక్తులు' అని పిలువవచ్చును. తన యిష్టదైవము యొక్క లోకమునందు నివసించుట 'సాలోక్యముక్తి'. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన యిష్టదైవము యొక్క సామీప్యమునందు నివసించుభాగ్యము కలుగును. దానినే 'సామీప్య ముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైన పుణ్యరాశియున్న యెడల తన యిష్టదైవము యొక్క స్వరూపమును పొందును. దీనినే 'సారూప్యముక్తి' యందురు. అంతకంటెనూ విశేషమైనస్థితిలో తన యిష్టదేవతా చైతన్యములో 'సాయుజ్యము' నందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకొన్న దత్తభక్తులు యిహలోకమునందుండగనే సాలోక్యముక్తి ననుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్దము ననుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదారవిందములందు లగ్నమై సృష్టియొక్క ధర్మములను, ధర్మసూక్ష్మములను సృష్టి నిర్వహింపబడు చిత్రవిచిత్ర విధానములను తన అంతరదృష్టితో అవలోకించుచూ ఆనందము ననుభవించెను. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నియునూ, వారి ప్రమేయము లేకుండగనే విశ్వకళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోకజీవనము సాగించుచూ సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతరదృష్టితో సాలోక్యభక్తులకంటే విశ్లేషణాత్మకముగ తెలుసుకొందురు. వారు పొందెడి ఆనందము మరింత మిక్కుటముగానుండును. జీవిశరీరబద్ధుడైనపుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో, బద్ధావస్థయందుండును. పరిణామము చెందు కొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించునపుడు ఆనందము ఎక్కువగా నుండును. సాయుజ్యమునందిన శ్రీ దత్తభక్తుల  నుండి శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్చగా ప్రకటిత మగుచుండును. శ్రీదత్తులవారికి సంకల్పముండును. శ్రీదత్తునిలో సాయుజ్యము నొందిన యోగిపుంగవులకు సంకల్పమనునదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారినుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని, పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరునూ శ్రీపాదుల వారి దివ్యాంశలే! ఆయా దేవతల ద్వారా శ్రీపాదులవారే భక్తులను అనుగ్రహించెదరు." అని సెలవిచ్చిరి.


(ఇంకా ఉంది..)                        

No comments:

Post a Comment