అధ్యాయము 17
శ్రీనామానందుల వారి దర్శనము - భాగము 1
నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితము లేనిదానివలె కన్పించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళుచేతులు వణక నారంభించినవి. యిద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగుపరుగున వచ్చి నా కాళ్ళపైబడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయూ అయోమయముగా నుండెను. దారిబత్తెము కూడాలేని బక్కబ్రాహ్మణుడనైన నేను పరాయిస్థలములో పరాయి వ్యక్తుల బారినుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, "అమ్మా! నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారినుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది." అని అంటిని.
ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే గాక తమ బారినుండి యీ స్త్రీని రక్షించెదనని ధృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి, వారు "ఓ బక్కబ్రాహ్మణుడా! మేము యీ దురాచారిణిని చంపదలచితిమి. నీవు యీమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన యెడల నిన్నుకూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డురాకుము." అనిరి.
నాలో ఏదో అదృశ్యశక్తి ప్రవేశించినట్లనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటినుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడెడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టి వేయునవి అయి ఉన్నవి. అంతట నేను, "బ్రాహ్మణజన్మనెత్తి సిగ్గులేకుండగా గతరాత్రి ఆవును వధించి, ఆ మాంసమును భుజించి, కల్లును ద్రావి, సకల దురాచారములతో కూడిన మీకు నన్నునూ, యీ నిరపరాధియైన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పనికాదు. నేనన్నింటికిని సిద్ధముగనే యుంటిని. మీయందు జాలితో పలుకుచున్నాను. మీరు యీ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠివ్యాధి సోకినవారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్ఠివ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారయిన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే యీ ఔషధమును తయారు చేయు విధానము అందరికినీ తెలియదు. కామవాంఛను అణచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలెనని మీరు కోరుకున్నచో యీ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి యీ మాటలను పలుకుచున్నాను." అని పలికితిని.
నా మాటలు విన్న యిద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము! నేను పలికిన కొన్ని పలుకులు వారి గతజీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిషము యందు ఏమాత్రమూ పాండిత్యములేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, "అయ్యా! మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు, అయిననూ మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము యిర్వురమునూ అన్నదమ్ములము. బ్రాహ్మణజాతిలో జన్మించిననూ, బ్రాహ్మణధర్మములు మాలో పూర్తిగా లుప్తమయినవి. సర్వభ్రష్ఠులమయితిమి. గోమాంసభక్షకుల తో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోను మేము సర్వభ్రష్ఠులమైతిమి. ఒక గుట్టమీద పద్మాసనములో కూర్చొన్న యీమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానయిననూ ఆమెను అనుభవింపదలచితిమి. అదేమిచిత్రమో గాని, ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శనభాగ్యము మాకు కలిగినది." అనిరి. అంతట నేను "ఏది మంచి, ఏది చెడు అను వివేచననుచేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించుచుండెను. మనము మంచిదారిలో నడచిన యెడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన యెడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసివచ్చును. ఈయమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమయిన కోరికలతో యీమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో, క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్తనందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తిస్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుతకాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యీ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియునూ కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మా! నీ వృత్తాంతమును ఎరిగింపుము." అని ఆమెనడిగితిని.
అంతట ఆమె, "అయ్యా! తమరు నన్ను యీ పాపాత్ముల బారినుండి రక్షించితిరి. మీరు నాకు పితృసమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింపమొదలిడెను. యౌవనసంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించు ఆనందించుటయనిన సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదేపదే చెప్పుచుండును. నేను సుమంగళీచిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన విటుని కోసమై వేచియుంటిననియు, అలంకరణరహితముగానున్నచో విధవరాలువలె అమంగళముగా ఎందులకు కన్పించుచున్నావనియు, గృహమునందలి చిన్న పిల్లలను మురిపెము చేయునెడల నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసిననూ నీవు చాల ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగుపొరుగు వారు ఆనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన యెడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచూ, ఆ మంత్రాధిష్ఠాన దేవత ప్రీతికొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్ననూ అత్తగారుగాని, మామగారుగాని యింటియందున్న తక్కిన పెద్దలుగాని నా భర్తను పల్లెత్తుమాట అనరు. ఈ భూలోకమునందు నరకమనునది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడచుచుండెను." అని తెలిపినది.
ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడేతెంచెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని మా యింటికాహ్వానించిరి. అతడు ఏవేవో లెఖ్ఖలు వేసి, చిత్రవిచిత్రములయిన పూజలుచేసి, "ఈమె నష్టజాతకురాలు. అనేక అమంగళయోగములు కలది. ఆ యోగప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను యింటనుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు, పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతానయోగము కలుగును." అని చెప్పెను.
దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలును, యింటిలోని వారును, నా భర్తయును నన్ను యింటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరములేక కనీసము పుట్టినింటికయిననూ కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా యింటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్ఛమైన తన కామవాంఛకు నన్ను బలిచేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తికొలది విసరితిని. అది వానినెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధీ! నేను స్త్రీనైయుండి గత్యంతరములేని పరిస్థితులలో బ్రాహ్మణహత్య చేసితిని. నా మనస్సు మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయిననూ నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారయిననూ అన్నదమ్ములును, వదినెలును, మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకులేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామరజనము చూచిరి, కాని వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇంటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయెదను గాక! యని తలచి దారీతెన్నూలేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహుదప్పికగానుండెను. కాసారములోని నీరుత్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షమొకటుండెను. ఔదుంబరము దత్త ప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమను విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్షమూలమునందే గాఢనిద్రలోనికి జారుకుంటిని. కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళుతెరచి చూచునంతలో రెండు నాగుపాములు నాకు రెండు వైపులా కాపలాకాయు కావలివాండ్ర వలెనుండెను. నేను ఆ రెండు నాగుపాములకునూ నమస్కారము చేసితిని. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి రెండునూ ఎటోపోయెను. నేను దత్తదిగంబర ! దత్తదిగంబర! జయగురుదత్త! దత్తదిగంబర! అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబరవృక్షఛాయలో కూడనుంటిని. నేను శ్రీదత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను.
(ఇంకా ఉంది..)
No comments:
Post a Comment