Wednesday, April 25, 2012

Chapter 17 Part 3

అధ్యాయము 17
శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 3
దత్తారాధనము యొక్క విశిష్టత

అంతట నేను, "అయ్యా! అటులయినయెడల మనము వివిధరూపములలోనున్న దేవతల నారాధింపవలెనా? లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలెనా? దేవతలందరునూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుంటిరి. నాకు యీ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది." అని వారిని కోరితిని. అందులకు శ్రీ నామానందులు ప్రసన్నులై "ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో యిట్లనిరి. అయ్యా! మీ చెల్లెలు మా యింట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీపరిమాణములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైన నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా? అని వాపోయునది. అంతట ఆ అన్నగారు చెల్లెలును పిలిచి యిట్లనెను. ఇన్ని పదార్ధములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియునూ చిక్కటిపాలలో నిబిడీకృతమైయున్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్నిరకముల పదార్ధములలోని సత్తువలు ఒక్క చిక్కటిపాలలో నున్నవి. అందువలన నీవు నీకు కావలసినంత   పరిణామములో చిక్కటిపాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్కవస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాటపడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్నరుచులు గలవారు గనుక భిన్నభిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధానము చేసిన యెడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణు ఆరాధనము చేసినయెడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్తరక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ, సాకార భక్తితో చేసేది కర్మలకు ఫలితము, ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా! అనేక జన్మలలో చేసేది పాపపురాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవుచున్నపుడు శ్రీదత్తభక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తిలేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తులవారు తమ భక్తుని నుదుటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక ఆధ్యాత్మిక స్థితులన్నియునూ, ఆయాస్థితులలో నుండుటకునూ స్థితికర్తయైన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమయిన యెడల శరీరముగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవముగా దహనమునొందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి  వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణులవారు శ్రీదత్తప్రభువుతో అభిన్నత్వము కలవారు. గోవర్ధనగిరి నుద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోప, గోపికలందరునూ పూర్వజన్మములలో గొప్పఋషులు. యోగగ్రంధులే గిరులు. ఆ గ్రంధులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునపుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలనెత్తవలసి యుండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతనూ తాను వహించి, వారి గ్రంథి విభేదనమొనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతికదృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తనవారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధస్థితులను మార్చవలెనని శ్రీదత్తులవారు సంకల్పించిన సామాన్యముగా నడువవలసిన పరిణామక్రమమును శీఘ్రతరము చేయవలసినదని  విష్ణువును ఆదేశింప వచ్చును. ఈ ప్రక్రియలో  తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటిని భక్తునిచేత అజ్ఞాతస్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తులవారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్యస్థితి ననుభవించి యోగులను లక్షాపాతికవేల మందిని తయారుచేయుట, కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయముచేయు సంకల్పము కలిగిన యెడల శ్రీదత్తులవారిలోని రుద్రాంశ విజ్రుంభించి కోటానుకోట్ల జన్మములు అవి గతించినవయిననూ, రాబోవునవి అయిననూ వాటినన్నింటినీ ధ్వంసముచేసి, ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని, విష్ణ్వంశ గాని, రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయునూ వారి సంకల్పమును బట్టి యుండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తిమార్గము నవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదులవారి అశ్రితుడొకడు  గుఱ్ఱమునెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరచినది. రక్తసిక్తుడైన ఆ భక్తునివైపు శ్రీపాదులవారు తమ అభాయహస్తమును చూపగా గాయములన్నియునూ క్షణములో మాయమయినవి. శ్రీపాదులవారి యందు నమ్మకము యిసుమంతయు లేని మరొకనికి అదేరోజున నూరువరహాలతో నిండిన పాత్రయొకటి లభించును. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠివారు శ్రీపాదులవారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతట శ్రీపాదుల వారిట్లనిరి. "నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. కాని వీని ఆయుర్దాయమును మరొక 20  సంవత్సరములు పొడిగించితిని. ఇది వీని అనన్యభక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. నూరు వరహాలు దొరికినవానికి యీ రోజు మహాదైశ్వర్యము కలుగవలసిన రోజు. కాని వాడికి భక్తీభావము యిసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుటవలన వాని మహాదైశ్వర్యయోగమును కేవలము నూరువరహాలకు మాత్రమే కుదించి వేసితిని. నాయందు కేవల భక్తిగలవానికి నేను దాసానుదాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొన గలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతియయిన పరమేశ్వరుడు కూడా అటువంటివానికి దాసుడయి సంచరించును." అను సద్విషయములను, సందేశములను తెలియపరచిరి.

శ్రీ నామానందుల వారు యీ రీతిగా సెలవీయగానే మేమందరము ఎంతయో ఆనంద భరితులమయితిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతట నామానందుల వారు "మీరు ఏకభుక్తము చేయుచూ మండల దీక్షను పాటించుడు. మిక్కుటమయిన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు. ఆ ధనమును వ్యయపరచి సద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు. అంతట పాపము శమించును. పాపశమనమయినట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా గాని, స్వప్నములో గాని పొందగలరు. మండలదీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున  పూర్వపు అలవాట్లకు బానిసలయిన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము." అని తెలిపిరి.

(ఇంకా ఉంది..)          

No comments:

Post a Comment