Wednesday, April 25, 2012

Chapter 17 Part 4 (Last Part)

అధ్యాయము 17 
శ్రీ నామానందుల వారి దర్శనము - భాగము 4 
అనఘాసమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము

సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్నచిత్తులయిన నామానందుల వారు, "ఆత్మ నిరంతరాయమయినది. మనస్సు ప్రతీ క్షణములోనూ అనేక కోట్లసార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమకాలమున వారిరువురిలో ఎవరయినాగాని, లేదా వారిద్దరుగాని తమ మానసికచైతన్యము జీవనిర్జీవస్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవమును పొందినయెడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నముచేయు మహాదోషములవలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగానుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలననూ, గయ్యాళితనమును ప్రదర్శించి కోడళ్ళను నానావిధములుగా హింసించుట వలననూ, నిర్ధాక్షిన్యముగా శిశు హత్యలను, స్త్రీ హత్యలను చేయుట వలననూ, నిస్సహాయస్థితిలో నుండు అనాధల యెడల పరమ కర్కశత్వమును చూపుట వలననూ నపుంసకత్వము కలుగుట కాని, నపుంసకునకు భార్యగా అగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు పదిమంది సంతానమును కనుటవరకు హక్కుగలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మవిరుద్ధము. పదిమంది సంతానమును కన్నా తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా! నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకునూ, నీవు అనుకూల దాంపత్యముతో సర్వసుఖములను పొందుటకు అనఘావ్రతము చేసి అనఘాదేవి సమేత శ్రీదత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి యిహలోక సుఖము, పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్తదర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతీ అక్షరమునందును యుగాయుగాంతముల వరకూ చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములయిన విధినిషేదములును లేవు. నేను యీ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటినుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రమును నా మదిలో మొదులుచున్నది. వినండి!

సిద్ధమంగళ స్తోత్రము 

1 . శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

2 . శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

3 . మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

4 . సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

5 . సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

6 . దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

7 . పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

8 . సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

9 . పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా 
     జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ 

నాయనలారా! పరమపవిత్రమైన యీ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన యెడల అనఘాష్టమీ వ్రతముచేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండలదీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించినచోట  సూక్ష్మవాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుచుందురు." అని అమృతవాక్కులను ఆ సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి వివరించిరి.

శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట 

శ్రీనామానందుల వారి నోటివెంట యీ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతట నేనిట్లంటిని. "మహాపురుషా! ఈ దివ్యస్తోత్ర పారాయణముతో, శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కధాప్రసంగాములతో యీ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున యీ రాత్రి గడుపవలెననెడి కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులయిన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించుకొనుచున్నవాడను." నాతోబాటు ఉన్న సుశీలయును, బ్రాహ్మణ సోదరులును, నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులయిన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయునూ, శ్రీపాదులవారి నామస్మరణముతోను, వారి లీలాకథా ప్రసంగములతోను, సిద్ధమంగళ స్తోత్ర పఠనముతోనూ గడచినది. ఉషఃకాలమున శ్రీపాదులవారికి దివ్య శ్రీమహామంగళహారతి యీయబడెను.

మహామంగళ హారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక రెండెడ్లబండిపై భోజనసామాగ్రిని వేసికొని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలును, నీ భర్తయు వేరొక బండిలో యీ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజనసామగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీ నామనందుల వారు ధ్యానావస్థలో నుండిరి.

శ్రీనామానందుల వారు ధ్యానావస్థ వదలి ప్రకృతిస్థులయినపుడు బండివాడెక్కడ? అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయెనని చెప్పగా, ఆహా! మీరెంత అదృష్టవంతులు! నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమునూ విస్తుపోతిమి. శ్రీ నామానందులు "శ్రీపాదులవారు పరమ కారుణ్యమూర్తి! వారే బండివాని రూపములోవచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా! సుశీలా! నీ అదృష్టము పండినది. నీ భార్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయునూ, అత్తమామలునూ కొలదిసేపటిలో ఎడ్లబండిలో యిచ్చటకు చేరుకొనుచున్నారు." అని పలికిరి.

త్రికాలవేదులయిన నామానందులవారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో, అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవగలందులకు నామానందుల వారిని అనుజ్ఞనడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 17 సమాప్తం)

No comments:

Post a Comment