Saturday, April 7, 2012

Chapter 16 Part 1

అధ్యాయము 16 
శ్రీమన్నారాయణ వృత్తాంతము - భాగము 1 

నేను శ్రీపాదులవారి దివ్య చరితమును మననము చేసికొనుచూ, మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసికొనుచూ పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననెడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడుచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాశీనుడయి ఉన్నాడు. అతడు "అయ్యా! కొంతసేపు యిక్కడ విశ్రమించి చెరుకురసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు." అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు యిచ్చిన చెరుకురసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. "అయ్యా! నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే! అయితే వారు బ్రాహ్మణులు. మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును, మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్ధికపరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పులబాధకు తట్టుకొనలేక చార, స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానములనోసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము "దండుగమారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెలనమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మా యందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన యెడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది." అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల యింట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు, "బాపనార్యుల యింట లభించేది అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపశ్శాలురయిన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభామయిన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది." అని పలికిరి. శ్రీ బాపనార్యులు "మా భూములను యిదివరకే పంటకాపులకు ఒసంగితిమి. వారు సేద్యము చేసుకొనుచున్నారు. సహేతుకమయిన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరిమి వహించియుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకక పోదు." అనిరి. తదుపరి శ్రీపాదులవారు, "ఇదిగో! గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టుకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభీష్టము సిద్ధించిన తదుపరి యీ మినుములను పారవేయవలసినది. రాతిక్రింద కప్పకు కూడ ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది." అనిరి.

మేము బాపనార్యుల యింట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధదంపతులు మాత్రముండిరి. వారుకూడ కమ్మకులస్థులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కరుచుతచే మరణించెను. కొలది దినములకు అతని భార్య కూడ కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడ లేదు. ఆ విధముగ ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించుకొనవలెననెడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్ఠులను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికీ తమ ఆస్తిపాస్తులను యీయవలెననెడి మీమాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధదంపతుల యింట మాకు ఆతిధ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలించిననూ ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా యింటిల్లిపాదికీ, వాంతులు, విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినపుడు వృద్ధదంపతులు మమ్ము వారించిరి. వారికి మా యందు వాత్సల్యభావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగింపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ యింట తిష్ఠవేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశక్యత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో, రేవో యిచ్చటనే తేల్చుకొనవలెనని తలచితిమి. 

దాయాదులకు వృద్ధదంపతుల ఆస్తిపాస్తులు కావలయును గాని, వారు మాత్రము అక్కరలేదు. మేముకూడ వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసుకొనవలెననెడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించుచుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలోవారు రాజీకివచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని, మమ్ములను ఆ యింటనుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి.

దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కుడొకడుండెను. వారు అతనితో లాలూచిపడి అతనిని ఆ వృద్ధదంపతుల యింటికి తీసుకొనివచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. "మీ యింటనున్న యీ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ యింటనున్న ఆ యింట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ యింటి నుండి పంపించివేయుడు."

దానికి వృద్ధ దంపతులు "మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నయెడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియేయుండును. ఎంతధానము ఖర్చు అయిననూ, వారికి ఉన్న అమంగళములన్నియును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరునూ మంత్రాధీనులయి ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సద్బ్రాహ్మణులయిన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినది. " అని ఆ జ్యోతిష్కుని కోరిరి. 

జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండెను. నాయనా! శంకరభట్టూ! ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మలకునూ వేదమే మూలమయి ఉన్నది. యాగములచేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకునూ, దేవతలకునూ పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు అయిదు రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్యసహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమయిన దోషములు లేవు. వృద్ధదంపతుల పుణ్యమా అని మాకు పరమపవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్పహవిస్సులు, మంత్రసామర్థ్యము వలన ఏయేదేవతలకు ఎంతకావలయునో అంతవృద్ధిని పొందును. 

భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది 

గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యుల యిహలోకస్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోకస్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనమునందలి మాధుర్యమును పదిమందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనము చేతను, పరలోక ధనమైన పుణ్యధనము చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యులవంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడయిన శ్రీపాదుల వారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తి చేసి మమ్ములను ధన్యుల చేసిరి.


(ఇంకా ఉంది..)            

No comments:

Post a Comment