Tuesday, November 5, 2013

Chapter 19 part 2 ( Last Part)

అధ్యాయము 19
గురుచరణునితో సమాగమము - భాగము 2

శ్రీపాదుల విరాట్ స్వరూపము 

నేను బృహత్ శిలానగారమని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతిశాస్త్రి అని అందురు. నేను వేదాధ్యయనము చేయునిమిత్తము వాయసపుర (కాకినాడ) అగ్రహారమునకు వచ్చితిని. గురుశుశ్రూష చేయుచూ వేదమును నేర్చుకొనుచుంటిని. మా గురుదేవులకు వారి గృహమునకు సమీపముననే భూములు కలవు. వారికి గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయితిని. ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్యతేజోవిరాజితుడైన పది సంవత్సరముల వయస్సుగల బాలకుడొకడు మా భూమిలోనికి వచ్చెను. అతడు మెడలో జందెమును ధరించియుండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడని నిశ్చయించుకొని నిర్ధారణ కొరకు అతనిని అడిగితిని. 

అంతట ఆ బాలకుడు "నేను నేనే! నాలో సమస్త తత్త్వములునూ ఉన్నవి. అన్నింటికీ ఆధారభూతుడనయిన మాత్రము నేనే! నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడనని భావించిన అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములను గాంచి నన్ను క్షత్రియుడననుకొన్న అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వైశ్య లక్షణములను గాంచి నన్ను వైశ్యుడనని అనుకొన్ననూ అదో అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములను గాంచి నన్ను శూద్రుడననుకొన్ననూ అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యదార్థము కాదు. నన్ను నీవు ఛండాలునిగా భావించిననూ తప్పుకాదు. కాని అది కూడా యదార్ధముకాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్యతత్త్వము అన్ని అవధులకునూ ఆవలనుండునది. నా యొక్క ధర్మము, పరమధర్మము. అది సమస్త ధర్మములకునూ అతీతము. ఆధారభూతము కూడనూ. నాది పరమప్రేమతత్త్వము. సృష్టిలోని జీవులలో నుండే ప్రేమతత్త్వములన్నింటి కంటే సుదూరములో నుండును. అంతే కాకుండా వాటి అన్నింటికినీ ఆధారముగా నుండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీవలె ప్రవర్తించును. స్త్రీగా భావించిన పురుషునివలె ప్రవర్తించెదను. నన్ను అర్థనారీశ్వరుడననుకొందువా ఆ రెండు రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచామగోచరమైన దివ్యానందతత్త్వమని రుజువు చేసెదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు ?" అని ప్రశ్నించెను. 

నాకు అతడు చెప్పునదంతయునూ మహోగ్ర జ్వరపీడితుని సంధిప్రలాపమువలె తోచినది. పైత్యము మితిమీరినపుడు అవాక్కులు, చవాక్కులు వచ్చునని తలంచితిని. నా మనో అవస్థను గమనించుచున్న ఆ బాలుడు, "నేను ఇప్పుడు శనైశ్చ్వరుడు, నేను యీ గణపతిశాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్రవిచిత్రములయిన బంధనములలో పడవేసి హింసించెదనో ఆ వేడుకను తమరు వీక్షించుడు ప్రభూ! అని నాతో అనుచున్నాడు. కాని నేను గణపతిశాస్త్రి కర్మఫలమును గోక్షీరరూపములో గ్రహింపబోవుచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని శనైశ్చ్వరునితో అంటిని." అని గణపతిశాస్త్రికి తెలిపెను. 

ఆ మాటలు విన్నవెంటనే నాలో కంపరము బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయములో నా జాతకములో చాల చెడుదశ జరుగుచుండెను. నేను ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండగనే ఆ పశువుల కాపరి ఒక ఆవువద్దకు పోయి గాయత్రీ! నాకు ఆకలిగానున్నది. పాలివ్వగలవా? అని ప్రశ్నించెను. ఆ గోమాత ఆవునని సూచించు అర్ధములో తన తలను త్రిప్పెను. దాని పొదుగు పాలతోనిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువులకాపరి తృప్తిగా పాలను త్రాగెను. వాస్తవమునకు అది గొడ్డు ఆవు. అయిననూ ఆ పశువులకాపరికి పాలిచ్చెను. ఇది అంతయునూ నాకు అయోమయముగా నుండెను. ఆ పశువులకాపరి తృప్తిగా అచ్చటనున్న ఒక మామిడిచెట్టు క్రింద కూర్చుండెను. నేను తిరిగి అతనివైపు యాదృచ్చికముగా చూడగా ఆ పశువులకాపరితో పాటు ఎవరో పదియేండ్ల రైతు బాలిక వేషము లోనున్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురూ నయనానందకరముగా నుండిరి. వారి సరససల్లాపములు, వినోద భరితములైన సరస సంభాషణలు చూడచక్కని జంటగా కన్పించెను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ గుఱ్ఱపు బండి నుండి దిగిరి. వారితో పాటు పది సంవత్సరముల వయసు కలిగిన తేజోవిరాజితుడైన బాలకుడొకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామియని ఆ తరువాత తెలిసికొంటిని. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు తమ తండ్రిగారి స్మృత్యర్థము భూదానముగా యిచ్చి యుండిరి. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠివారికి విస్తారమయిన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొను నిమిత్తము శ్రీ శ్రేష్ఠిగారు ఎప్పుడయినా పీఠికాపురమునుండి వాయసపురాగ్రహారమునకు వచ్చుచుందురు. శ్రేష్ఠిగారు పశువులకాపరిని, అతనితోనున్న రైతుబాలికను చూచి ఆశ్చర్యచకితులయిరి ఏలనన వారు మహా తేజోవంతులగుటయేగాక కొంచెము మార్పులు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలి యుండిరి.

అంతట శ్రీపాదుల వారు, తాతా! ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితుడవయినావు? అని అడిగిరి. దానికి వారు, నాయనా! వారిరువురిని చూడుము. నయనానందకర దృశ్యము! అనిరి. అంతట శ్రీపాదులవారు, చూచెడివాడు, చూడబడెడి దృశ్యము ఒక్కటేనా ? అని అడిగిరి. దానికి శ్రీ శ్రేష్ఠిగారు అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రీ! అని గోముగా పలికిరి.

శ్రీపాదుల వారు "తాతా! ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమము. అచ్చట రెండుగానున్నది. ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యదార్థమా ? అద్వైతము యదార్థమా? నేను ఒకటా? రెండా? లేక అనేకమా? ఆలోచించి చెప్పు. "

శ్రేష్ఠిగారికి శ్రీపాదుల యీ మాటలతో పశువుల కాపరియు, ఆ రైతు బాలికయూ కూడా శ్రీపాదులవారి కాయసృష్టి గాని కాదు గదా అనేది సందేహము కలిగినది. శ్రేష్ఠిగారి చుబుకమును పట్టుకొని శ్రీపాదులిట్లనిరి. "తాతా! సందేహమెందులకు ? మీ వంశములోని వారు నన్ను మరువనంతవరకు నేనునూ, నా శక్తియునూ, అదృశ్యరూపమున మీ భూములలో సంచరించువారమే! మీ యింట్లో నా అడుగుల చప్పుడు సాధకులయినవారికి తప్పక అనుభవమయ్యే విషయమే! అనఘాదేవీ సమేతుడైన ఆ అనఘుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్థనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూతరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ సమక్షములోనే ఉన్నాడు. సందేహము వలదు. నేను సుమతీ మాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినపుడు నేను పుత్రుడనై జన్మించినపుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియూ, ఆ రకముగా ప్రయత్నము చేసినచో యిల్లు వదలి వెళ్లిపోవుట  ఖాయమనియూ నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తిపాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘాసమేతమైన అనఘస్వరూపమును నీకు దృష్టి గోచరముగావించితిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణము లేని కార్యము జరుగజాలదు. సృష్టి విధానము చిత్రవిచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడునవి. మూఢులైన జనులకు నా చర్యలద్వారా, లీలల ద్వారా, మహిమలద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమములో ఒక భాగము." శ్రీపాదుల వారు ఈ ప్రకారముగా పలికి మేము చూచుచుండగనే కాంతిస్వరూపమునుపొంది మామిడిచెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగనే రైతుబాలికయు, పశువుల కాపరియూ కాంతి స్వరూపమును పొంది శ్రీపాదులవారిలో లీనమయిరి. కాలము కాని కాలములో మామిడిచెట్టునకు కాయలు కాయుట  అసంభవమైన విషయము. కాని ఆ మామిడిచెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దానిని శ్రీపాదులవారు కోసిరి. వారి హస్తస్పర్శ ఎట్టిదోకాని అది చూచుచుండగనే పండుగా మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనముగాని, మధుర పదార్థములు గాని తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠిగారిచే ఆ మామిడి పండును తినిపించిరి. ఆ మామిడిపండును తినునంత వరకునూ శ్రేష్ఠిగారు పసిబాలుని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదులవారి మాతృప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి దివ్య నేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించునపుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు. ఆ మామిడిపండు యొక్క టెంక శ్రీపాదుల వారి సుముఖములో నిట్టనిలువుగా నిలబడి ప్రభువుయొక్క ఆజ్ఞ కోసము వేచియుండు సేవకునివలెనున్నది. శ్రీపాదులవారి హస్తసంజ్ఞతో ఆది పైకెగిరినది. అది మామిడి టెంక రూపున ఉన్ననూ కేవలము కాంతి స్వరూపముగా మారిపొయినది. శ్రీపాదులిట్లనిరి. "విత్తు ముందా? చెట్టు ముందా? అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటికంటెనూ  ముందున్నవాడు ఒకడున్నాడు. అతడే దైవము. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టును గాని, చెట్టునుండి విత్తనమును గాని ఆవిర్భవింపజేయగలడు. అమోఘమైన అతని సంకల్పము సప్తమహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలవబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మ అగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో  లీనమయినపుడు అతని సంస్కారములన్నియూ వేయించబడిన విత్తనములవలె నుండును. అయితే పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రము లోనికి తీసుకు రాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమయిన జీవులను సృష్టిలోనికి తీసుకు వచ్చునపుడు వారు కారణజన్ములై దైవ కార్యమును నిర్వహింతురు. జన్మాంతమున వారు తిరిగి పరమాత్మ యందు లీనమగుదురు. పరమాత్మయందు లీనముకాక అత్యంత సామీప్యమున ఉండదల్చిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదల్చెదరు. అట్టివారిని కూడ పరమాత్మ దైవకార్య నిర్వహణార్థము కారణజన్ములుగా జన్మింపజేయును. జన్మాంతమునవారు పరమాత్మయండు లీనముగాక అత్యంత సామీప్యస్థితియందే ఉండి దివ్యానందముననుభవించెదరు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అను స్థితిలో ఉండగోరు జీవులు కారణజన్ములై దైవకార్యమును నిర్వహించిన తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైతస్థితిగాని, విశిష్టాద్వైతస్థితిగాని, అద్వైతస్థితిగాని, జీవులయొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా? విశిష్టాద్వైతము గొప్పదా? ద్వైతము గొప్పదా? అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునేయుండును. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితియందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పము ననుసరించి వ్యక్తస్థితికి వచ్చి వారికోసమై నూతనముగా సృష్టింపబడిన బ్రహ్మాండములయందు సృష్టిస్థితిలయములను కావించెదరు. నవవ్యాకరణ పండితుడయిన హనుమంతుడు రాబోవుకల్పములో బ్రహ్మగా నుండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యతా విశేషములనుబట్టి విశ్వపరిపాలనా కార్యక్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలనా నిర్వహణమునకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా నుండును. ఆ దేవతా శక్తులకు ప్రతిబంధకములుగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా నుండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని "అల్లా" యని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని "యహోవా" యనియు సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థచైతన్యమును కుమారుడైన ఏసు అనియు సాంత్వమును, ఆదరణను, ప్రేమను, కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మయనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మములయందును, మతములందును, సిద్ధాంతముల యందును స్వప్రకాశముతో వెలుగొందువాడను నేనే! ఆయా జీవుల అభీష్టములనుబట్టి, అభిరుచులనుబట్టి వారనుసరించు మార్గములనుబట్టి ఆయాస్థితులనుబట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే! నేను సర్వతంత్ర స్వతంత్రుడనుకనుక, సాధ్యాసాధ్యములు లేనివాడను గనుక నాకు నిర్దిష్టమైన విధానమనునది లేదు. సమస్త దేవీదేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా, జాజ్వల్యమానముగా ప్రకాశించువాడను నేనే గనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను, స్తోత్రములను అందుకొనువాడను నేనే! అందరిని అనుగ్రహించు వాడను నేనే! కలిపురుషుని మాయ అంతమైన వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనెడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహార్యాగము ద్వారానైననూ, అంతర్యాగము ద్వారానైననూ నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైననూ, అంతర్ముఖుడైననూ సదా నేను వానిని కనిపెట్టుకొని యుండువాడను, ప్రేమతో పలుకరించువాడను నేనే! వేదములో కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మమని చెప్పబడినది. నేనే సత్యజ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే! ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడనూ నేనే! సమస్త గురుస్వరూపమునూ నేనే! సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలయిన సమస్త సాధనాస్థితులలోనూ, స్వయంప్రకాశముతో వెలుగొందువాడను నేనే! ఎవరైతే వినిర్మలభక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారములను నాపైన వేసి సర్వస్య శరణాగతి పొందుదురో, అట్టివారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టి యుండువాడను. నేను శ్రీపాదుడను. శ్రీవల్లభుడను. తాతా! ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగమునాటి అత్రి అనసూయానందనుడే యీనాటి శ్రీపాదశ్రీవల్లభుడు. భరద్వాజ ఋషి కిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవచ్చినది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల వెంబడి ధారాపాతముగా ఆనందాశ్రువులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనము చేసికొనిరి. వారు అనుభవించిన తన్మయత్వము వర్ణనకు అందనిది. వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపైన తరువాత శ్రేష్ఠిగారిట్లనిరి. "నాయనా! బంగారు తండ్రి! మా వంశముపైన నీ అనుగ్రహముండనీ. మా గోత్రముపైన నీ అనుగ్రహముండనీ! మా ఆర్యవైశ్య కులముపైన నీ అనుగ్రహముండనీ!" అని కోరగా శ్రీపాదులిట్లనిరి. "తాతా! తథాస్తు! బ్రాహ్మణునకు ఒక వరము కోరుకొను అధికారము కలదు. క్షత్రియునకు రెండు వరములు, వైశ్యునకు మూడు వరములు, శూద్రునకు నాల్గువరములు కోరుకొను అధికారమున్నది. నీవు కోరిన మూడు వరములను అనుగ్రహించితిని. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట, నా మాతామహులైన శ్రీ బాపనార్యుల యింట, సరిగా నా జన్మస్థానము  నందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశములోని 33వ తరము వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును. మీ వంశ మూలపురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయమహర్షి ప్రతీ గురువారము మధ్యాహ్నసమయమున ఏదో ఒక రూపములో నాకు నైవేద్యమీయబడిన పదార్ధములో ఎంతోకొంత భాగమును స్వీకరించుగాక! దాని వలన మార్కండేయ గోత్రమునందు జనించినవారలకు మేలుకలుగు గాక! నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహమున్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్య వైశ్యుడొకడు భారతప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీజ్యోతిష్యము నందలి సూచనను బట్టి పీఠికాపురము రాగలడు. మెండుగా నా అనుగ్రహమును పొందగలడు. ఆ తరువాత నేపాళదేశము నుండి భక్తజనులు అసంఖ్యాకముగా పీఠికాపురమున నా దర్శనార్థము రాగలరు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికినీ అది అనుల్లంఘనీయమయిన శాసనము.

తాతా! నా జేగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠిoపబడిన స్థలములో భూమిగతమై యుండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవు నా మహాసంస్థానమునకు ద్రవ్యసహాయము చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులమునందు జన్మించి పీఠికాపురములో ఏదో ఒక సంబంధము  కల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్యసహాయము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతీదానికినీ ప్రమాణము కోరెదరు. నా చరిత్ర పారాయణము చేసిన అభీష్టసిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనిననూ ప్రతిబంధకములు తొలగును. పీఠికాపురములో నా జన్మనక్షత్రమైన చిత్తానక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన ఋణబాధలు తీరును. కన్యలకు యోగ్యులైన వరులతో వివాహము జరుగును. భూతప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీవాసవీ కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదివసము. ఆనాడు పీఠికాపురములో నా సన్నిధిలో నుండు వారాలకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము. నా చరిత్ర స్వతః ప్రమాణము నా లీలలు స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేల ?"

శ్రీపాదుల వారి లీలలు అనితరసాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభేశ్వరశర్మ దంపతులు, సుబ్బణ్ణశాస్త్రీ , లింగణ్ణశాస్త్రీ శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వెడలితిమి. శ్రీపాదులవారు మమ్మెంతగానో ఆశీర్వదించిరి. చిరునవ్వుతో యిట్లనిరి. ఆహా! ఏమి చర్చలు! ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమేర్పడుటకు చాలా కాలము గడువవలెను గదా! మల్లాది వారి ఋణము, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఋణము, వత్సవాయి వారి ఋణము తీరేదెన్నటికో." ఈ విధముగా పలికి మౌనముద్ర వహించిరి. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము! 

(అధ్యాము - 19 సమాప్తము)    

Tuesday, March 19, 2013

Chapter 19 Part 1

అధ్యాయము 19
గురుచరణునితో సమాగమము- భాగము 1

వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు అయిన లింగణ్ణశాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగణ్ణశాస్త్రి యీ విధముగా చెప్ప నారంభించెను. "నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైననూ, ధనవంతుడైననూ బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములనూ, ధర్మసూక్ష్మములనూ వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తికొరకు చేయబడు దశవిధ దానములను 'యథాశక్తి' అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్పద్రవ్యముతో ఆ తంతు అయినది అనిపించుకొనెడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలయందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చుబెట్టబడుచున్నదనియూ భోక్తలు యిదే అదున్ని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియూ, తన యిల్లు గుల్ల అగుచున్నదనియూ అంతర్మథనము చెందెడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయనకూడా తండ్రి అడుగుజాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని, ఎక్కువగాని కాకుండ యధాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని.

ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియు లేకుండగనే సద్యః కలహములు వచ్చుచుండెను. పరమశాంతులయిన బంధుమిత్రులు మాయింట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగదములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినపుడు నా కుమారుడు నా ఛాతిపై కూర్చొని తన రెండుచేతులతో నా పీక పిసిగివేయతలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు. నీవంతు ఎప్పటికి వచ్చునోకదాయని తిట్టిపోసేడిది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకొంటినో కదాయని పరుష వాక్యములాడెడిది. నా అల్లుడు, మా యింటిలో సరియైన సేవకులు లేరైరిరి. దుక్కలాగున ఉన్నావు. మా యింటికి వచ్చి యిల్లూ వాకిలి ఊడ్చుట, గొడ్లచావడిలో గోసేవచేయుట, అవసరమైనపుడు బ్రాహ్మణార్ధమునకు పోయి తిలదానము పట్టుట మొదలయిన పనులు చేయవచ్చును గదా! మేము పస్తులుండి అయిననూ నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంటావార్పు చేసి నీవు తినగా ఏమయినా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును గదా! అని వ్యంగ్యోక్తులతో హింసించెడివాడు.

నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతీ జీవికినీ, జీవించుటయందు ఆసక్తి కలిగి, జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవిన్చుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణించుదమన్న పిశాచజన్మ లభించునేమోయని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా యింటిలో నున్న గొడ్లచావడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తిచేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనయితిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగియున్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు, మిక్కుటముగానున్న క్షుద్భాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్ననూ ఓపికలేని స్థితిలో నుంటిని. దుర్వాసనతో కూడియున్న అన్నమును తినజాలను. ఆకలిబాధకు తట్టుకొనజాలను. కడున్గాడు దైన్యస్థితిలో నున్న నాకు యీ లోకము, యీ జనులు, యీ బాంధవ్యములన్నియూ సత్యములేనా? లేక యిదంతయునూ ఒక యింద్రజాల మహేంద్రజాలమా? అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది.

ఇటువంటి విశామపరిస్తితిలో ఒక అవధూత నేనున్న గొడ్లచావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలునివలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరములనుండి తెలియుననెడి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణముల పైబడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయెను. ఆ కంచములో 'హల్వా' అని పిలువబడు తీపిపదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్పభాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గునపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తుగొయ్యి తీసిన తదుపరి దానిలో రెండు కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నావద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతట ఆ అవధూత యిట్లు సెలవిచ్చెను. నీకు పిశాచబాధా నివృత్తిని చేసితిని. నీ గృహమునకు యిప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునుండి నీకు పిలుపువచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకొందుము."

నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారెవరికినీ చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంతదూరము పోవుసరికి సాయంసంధ్య సమీపించుచుండెను. ఒక మామిడితోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన యింత ఆతిథ్యమును తీసుకొనవలసినదని బ్రతిమాలేను. నేను సరే యంటిని. ఉదయము నేను స్నానసంధ్యలు నేరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమొనర్చి, కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతట ఆ రైతు "అయ్యా! నిన్న మధ్యాహ్న సమయము నందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయంసంధ్య యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారియై తోటమార్గమున బోవుచుండుననియూ, అతనికి ఆతిధ్యమిచ్చి, ఆ మరునాడు వస్త్ర దానము చేసి, దక్షిణ కూడా యీయవలసినదనియూ, అతనికి భుజించుటకు మామిడి పండ్లను యీయవలసినదనియూ చెప్పెను. తమ దర్శనభాగ్యము కలిగినది. మీకు సేవచేసుకొను అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనయితిని." అని సంబరముగా చెప్పెను.

ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీతశక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమయినది. నేను వేదమునందలి ఋచలను వల్లెవేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లెవేసుకొనుచూ పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహమువలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేదపండితుడు వడివడిగా వచ్చుటను గమనించితిని. అతడు వేదమునందలి సావిత్రిపన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతట ఆ వేదపండితుడు "సావిత్రిపన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజమహర్షి సవితృకాఠక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో యిచ్చిన వాగ్దానము ననుసరించి నేడు పీఠికాపురము శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠిoచు అధికారము బ్రాహ్మణులకే యీయబడిననూ వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వ వర్ణముల వారికినీ యీయబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీక్రిష్ణుడో ? బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు. " అని పలికెను.

నేను వారిని అయ్యా! శ్రీపాదశ్రీవల్లభులననెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేదపండితుడు "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వపాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినపుడు అవతారపురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగము నందు సుశీల, విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్యస్థితినందుండెడిది. దత్తజయంతి రోజున ఆమె ప్రసవవేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనావిశేషములతో అత్రిమహర్షులవారితో తాదాత్మ్యస్థితినొందెడివారు. ఈ తాదాత్మ్యస్థితి అనునది అభౌతికము, అప్రాకృతిము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీమహారాణి, అప్పలరాజశర్మగా జన్మించిరి. వారి తపఃఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణయజుర్వేడులు, ఆపస్తంభసూత్రులు, భారద్వాజ గోత్రీకులు, పూర్వయుగము నందలి లాభాద మహర్షియను వైశ్యముని, వాసవీకన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగానూ, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రియైన బాపనార్యులుగానూ జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును, దక్షిణను యిచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠియను వారివద్ద పూర్వజన్మ నందు పాలేరుగా ఉండెడివాడు. పరమ పవిత్రులయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యమువలన అతడు భూస్వామియై సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును శ్రీపాదులవారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్యభక్తి మెండు." అని వివరించిరి.

తదుపరి నేను "అయ్యా! కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బన్ధములని గమనించితిని. యజ్ఞము చేయునపుడు పవమానఘటము బ్రద్దలైనయెడల ఆ ఘటముతో బాటు అధ్వర్యుని శిరస్సు గూడ వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదయినా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు, శుభములను కలిగించునవి గాని, అశుభములను కలిగించునవి గాని, సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేద శాస్త్రములను అవహేళనము చెయుచున్నారు." అని వారినడిగితిని.

దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. "నాయనా! ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్ధములు లెవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్పసాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసినయెడల సద్యఃఫలితము గల్గి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామ మాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనెడి సంఖ్యా భేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనునది పితృసంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంతవరకూ మార్పుచెందినది. సాపిండ్యమనునది మాతృసంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను రెండు ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీయనెడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదులవారికి కులభేదము లెట్లుండును. వారు భావాద్వైతమును బోధించుచున్నారు. కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదులవారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమవిద్యను సత్వగుణప్రధానులైన బ్రాహ్మణులకుపదేశింపక, రజోగుణ ప్రధానులును, పరోపకార పరాయణులునగు కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులకుపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమవిద్యను బ్రాహ్మణులకుపదేశించిన వారు లోభులై, ధన వ్యామొహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనెడు యీ  ఎనిమిదింటిని జడ ప్రకృతులందురు. చిత్ప్రకృతితో కలిపిన యెడల యివి తొమ్మిదగును. ఒకటి అనునది చిత్ప్రకృతికి ప్రతీకము. రెండు నుండి తొమ్మిది వరకు ఉన్న యీ ఎనిమిది అంకెలు ఎనిమిది జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనునది బ్రహ్మతత్త్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన తొమ్మిది అంకెలవలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమైయున్నది. శ్రీపాదులవారు రెండు చపాతీల కోసము 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ' అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2498 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతీకదలికలోనూ, వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోనుకాని బ్రహ్మతత్త్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదులవారు అర్థనారీశ్వరులు."


(ఇంకా ఉంది.. )