Tuesday, March 19, 2013

Chapter 19 Part 1

అధ్యాయము 19
గురుచరణునితో సమాగమము- భాగము 1

వల్లభేశ్వరశర్మ దంపతులు, నేను, సుబ్బణ్ణశాస్త్రి, శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతలో వారికి దూరపుబంధువు అయిన లింగణ్ణశాస్త్రి యనునతడు వచ్చెను. అతడు వేదవేదాంగ పారంగతుడు. లింగణ్ణశాస్త్రి యీ విధముగా చెప్ప నారంభించెను. "నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చితిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైననూ, ధనవంతుడైననూ బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన ఆపద్ధర్మములనూ, ధర్మసూక్ష్మములనూ వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువారు. పితృదేవతల తృప్తికొరకు చేయబడు దశవిధ దానములను 'యథాశక్తి' అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని వారు అత్యంత స్వల్పద్రవ్యముతో ఆ తంతు అయినది అనిపించుకొనెడివారు. శ్రద్ధాపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలయందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చుబెట్టబడుచున్నదనియూ భోక్తలు యిదే అదున్ని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియూ, తన యిల్లు గుల్ల అగుచున్నదనియూ అంతర్మథనము చెందెడివాడు. కాలము తీరగా మా తాతగారు చనిపోయిరి. మా నాయనకూడా తండ్రి అడుగుజాడలలోనే నడచెను. జగద్భక్షకుడైన కాలము నా తండ్రిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువగాని, ఎక్కువగాని కాకుండ యధాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని.

ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములేమియు లేకుండగనే సద్యః కలహములు వచ్చుచుండెను. పరమశాంతులయిన బంధుమిత్రులు మాయింట అడుగు పెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగదములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పరుండినపుడు నా కుమారుడు నా ఛాతిపై కూర్చొని తన రెండుచేతులతో నా పీక పిసిగివేయతలంచెను. నా కోడలు, నీ వయసు వారు చాలామంది వల్లకాటికి చేరియున్నారు. నీవంతు ఎప్పటికి వచ్చునోకదాయని తిట్టిపోసేడిది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు ఏ జన్మములో నేనెంత పాపము చేసుకొంటినో కదాయని పరుష వాక్యములాడెడిది. నా అల్లుడు, మా యింటిలో సరియైన సేవకులు లేరైరిరి. దుక్కలాగున ఉన్నావు. మా యింటికి వచ్చి యిల్లూ వాకిలి ఊడ్చుట, గొడ్లచావడిలో గోసేవచేయుట, అవసరమైనపుడు బ్రాహ్మణార్ధమునకు పోయి తిలదానము పట్టుట మొదలయిన పనులు చేయవచ్చును గదా! మేము పస్తులుండి అయిననూ నీకు బకాసుర భోజనము సిద్ధము చేయగలవారము. నీవే వంటావార్పు చేసి నీవు తినగా ఏమయినా మిగిలినచో మాకు కూడా ఒక కబళము భోజనము పెట్టవచ్చును గదా! అని వ్యంగ్యోక్తులతో హింసించెడివాడు.

నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతీ జీవికినీ, జీవించుటయందు ఆసక్తి కలిగి, జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవిన్చుటలో మాధుర్యము లేదని తేలిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణించుదమన్న పిశాచజన్మ లభించునేమోయని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరుగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా యింటిలో నున్న గొడ్లచావడిలో నాకు అప్పజెప్పబడిన పనులను అన్నింటినీ పూర్తిచేసుకుని భోజనము చేయుటకు ఉద్యుక్తుడనయితిని. అయితే నా కోడలు నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగియున్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు, మిక్కుటముగానున్న క్షుద్భాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదమన్ననూ ఓపికలేని స్థితిలో నుంటిని. దుర్వాసనతో కూడియున్న అన్నమును తినజాలను. ఆకలిబాధకు తట్టుకొనజాలను. కడున్గాడు దైన్యస్థితిలో నున్న నాకు యీ లోకము, యీ జనులు, యీ బాంధవ్యములన్నియూ సత్యములేనా? లేక యిదంతయునూ ఒక యింద్రజాల మహేంద్రజాలమా? అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక మనస్సు మొద్దుబారిపోయినది.

ఇటువంటి విశామపరిస్తితిలో ఒక అవధూత నేనున్న గొడ్లచావడిలో నాకు దర్శనమిచ్చెను. కరుణారసము మహాప్రవాహము వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలునివలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరములనుండి తెలియుననెడి జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణముల పైబడి ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్య హస్తములతో ఆ అన్నమును స్పృశించెను. కంచములోని ఆ అన్నము అదృశ్యమాయెను. ఆ కంచములో 'హల్వా' అని పిలువబడు తీపిపదార్థముండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్పభాగమును స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొనినవి. ఆ అవధూత నన్ను ఒక గునపముతో ఈశాన్యమూల త్రవ్వుమనెను. నిలువెత్తుగొయ్యి తీసిన తదుపరి దానిలో రెండు కుక్కల అస్థిపంజరములు బయల్పడినవి. వాటిని నేను అవతల పారవైచితిని. అవధూత నావద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో పూడ్చితిని. అంతట ఆ అవధూత యిట్లు సెలవిచ్చెను. నీకు పిశాచబాధా నివృత్తిని చేసితిని. నీ గృహమునకు యిప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయాక్షేత్రమైన పీఠికాపురమునుండి నీకు పిలుపువచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పీఠికాపురములో కలుసుకొందుము."

నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారెవరికినీ చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంతదూరము పోవుసరికి సాయంసంధ్య సమీపించుచుండెను. ఒక మామిడితోట గుండా ప్రయాణము చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అనునతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన యింత ఆతిథ్యమును తీసుకొనవలసినదని బ్రతిమాలేను. నేను సరే యంటిని. ఉదయము నేను స్నానసంధ్యలు నేరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమొనర్చి, కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే సక్రమముగా ఏర్పాట్లు జరుగుచుండుటను గమనించిన నాకు ఆశ్చర్యము కలిగెను. అంతట ఆ రైతు "అయ్యా! నిన్న మధ్యాహ్న సమయము నందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయంసంధ్య యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారియై తోటమార్గమున బోవుచుండుననియూ, అతనికి ఆతిధ్యమిచ్చి, ఆ మరునాడు వస్త్ర దానము చేసి, దక్షిణ కూడా యీయవలసినదనియూ, అతనికి భుజించుటకు మామిడి పండ్లను యీయవలసినదనియూ చెప్పెను. తమ దర్శనభాగ్యము కలిగినది. మీకు సేవచేసుకొను అదృష్టము కూడా కలిగినది. ధన్యుడనయితిని." అని సంబరముగా చెప్పెను.

ఈ వృత్తాంతమును బట్టి ఆ అవధూతలో అతీతశక్తులు చాలా కలవని, వారు సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమయినది. నేను వేదమునందలి ఋచలను వల్లెవేసుకొనుచూ ప్రయాణము చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదమును వల్లెవేసుకొనుచూ పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్తు ప్రవహించుటను గమనించితిని. ఆ విద్యుత్ ప్రవాహమువలన శరీరమునందు తెలియరాని ఆనందము కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేదపండితుడు వడివడిగా వచ్చుటను గమనించితిని. అతడు వేదమునందలి సావిత్రిపన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపితిని. అంతట ఆ వేదపండితుడు "సావిత్రిపన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజమహర్షి సవితృకాఠక చయనము చేసెను. అది కూడా పీఠికాపురములోనే చేసెను. ఆ దత్తప్రభువు ఏనాడో యిచ్చిన వాగ్దానము ననుసరించి నేడు పీఠికాపురము శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠిoచు అధికారము బ్రాహ్మణులకే యీయబడిననూ వేదములను అధ్యయనము చేయు అధికారము మాత్రము సర్వ వర్ణముల వారికినీ యీయబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీక్రిష్ణుడో ? బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళను నెత్తిపై జల్లుకొనువాడు. పీఠికాపురము నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు. " అని పలికెను.

నేను వారిని అయ్యా! శ్రీపాదశ్రీవల్లభులననెవరు? వారి మహిమను వినగోరుచున్నానని కోరగా ఆ వేదపండితుడు "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము సర్వపాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినపుడు అవతారపురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగము నందు సుశీల, విష్ణుదత్తుడను పుణ్యదంపతులుండెడివారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయమాతతో తాదాత్మ్యస్థితినందుండెడిది. దత్తజయంతి రోజున ఆమె ప్రసవవేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనావిశేషములతో అత్రిమహర్షులవారితో తాదాత్మ్యస్థితినొందెడివారు. ఈ తాదాత్మ్యస్థితి అనునది అభౌతికము, అప్రాకృతిము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యము, వాక్కునకు అందనటువంటిది, వివరించి చెప్పుటకు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతీమహారాణి, అప్పలరాజశర్మగా జన్మించిరి. వారి తపఃఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానముగా జన్మించిరి. వారు కృష్ణయజుర్వేడులు, ఆపస్తంభసూత్రులు, భారద్వాజ గోత్రీకులు, పూర్వయుగము నందలి లాభాద మహర్షియను వైశ్యముని, వాసవీకన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగానూ, శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతీ మహారాణికి తండ్రియైన బాపనార్యులుగానూ జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్యవంతులను దర్శనము చేసుకోగలవు. నీకు ఆతిథ్యమిచ్చి వస్త్రదానమును, దక్షిణను యిచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠియను వారివద్ద పూర్వజన్మ నందు పాలేరుగా ఉండెడివాడు. పరమ పవిత్రులయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యమువలన అతడు భూస్వామియై సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును శ్రీపాదులవారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారియందు వాత్సల్యభక్తి మెండు." అని వివరించిరి.

తదుపరి నేను "అయ్యా! కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బన్ధములని గమనించితిని. యజ్ఞము చేయునపుడు పవమానఘటము బ్రద్దలైనయెడల ఆ ఘటముతో బాటు అధ్వర్యుని శిరస్సు గూడ వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరబాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదయినా ప్రమాదవశాత్తు బ్రద్దలైనచో అధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుట లేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు, శుభములను కలిగించునవి గాని, అశుభములను కలిగించునవి గాని, సంభవింపకపోవుట చేతనే నాస్తికులు వేద శాస్త్రములను అవహేళనము చెయుచున్నారు." అని వారినడిగితిని.

దానికి ప్రతిగా ఆ మహామహులిట్లు వచించిరి. "నాయనా! ప్రస్తుత కాలములో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్ధములు లెవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్పసాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా నుండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయినవాడు అధ్వర్యుడై యజ్ఞమును చేసినయెడల సద్యఃఫలితము గల్గి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామ మాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలోనిచ్చే దక్షిణలలో 16, 116, 1116 అనెడి సంఖ్యా భేదములకు కూడా ఎంతో రహస్యార్థమున్నది. గోత్రమనునది పితృసంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంతవరకూ మార్పుచెందినది. సాపిండ్యమనునది మాతృసంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు, ధనము అను రెండు ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీయనెడి అగ్ని ముఖ్యముగా కావలెను. గుణభేదమే లేని శ్రీపాదులవారికి కులభేదము లెట్లుండును. వారు భావాద్వైతమును బోధించుచున్నారు. కర్మాద్వైతమును కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదులవారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమవిద్యను సత్వగుణప్రధానులైన బ్రాహ్మణులకుపదేశింపక, రజోగుణ ప్రధానులును, పరోపకార పరాయణులునగు కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులకుపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమవిద్యను బ్రాహ్మణులకుపదేశించిన వారు లోభులై, ధన వ్యామొహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనెడు యీ  ఎనిమిదింటిని జడ ప్రకృతులందురు. చిత్ప్రకృతితో కలిపిన యెడల యివి తొమ్మిదగును. ఒకటి అనునది చిత్ప్రకృతికి ప్రతీకము. రెండు నుండి తొమ్మిది వరకు ఉన్న యీ ఎనిమిది అంకెలు ఎనిమిది జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యమనునది బ్రహ్మతత్త్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన తొమ్మిది అంకెలవలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకమైయున్నది. శ్రీపాదులవారు రెండు చపాతీల కోసము 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ' అని హాస్యముగా భిక్ష అడుగుచుండెడివారు. ఇది 2498 అను సంఖ్యకు ప్రతీక. వారి ప్రతీకదలికలోనూ, వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల, సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోనుకాని బ్రహ్మతత్త్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదులవారు అర్థనారీశ్వరులు."


(ఇంకా ఉంది.. )        

No comments:

Post a Comment