అధ్యాయము 18
రావిదాసును గురించి వర్ణనము - భాగము 3
శ్రీపాదుల విరాట్ స్వరూపము
కొంతసేపైన తదుపరి కండ్లు తెరువవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదులవారు "మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టివిధానము చిత్రవిచిత్రముగా ఉన్నది. నిరాకారుడనయిన నేను నరాకారముగా మీ ముందునకు వచ్చుట కడుచోద్యము. నిర్గుణుడనయిన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు, అవధులు లేని నేను పరిమితులతో, అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులునూ నా కరస్ధమయి ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండము నందలి ప్రతీ అణువు అణువు లోనూ ఉన్నవాడిని నేనే. అణువణువునూ కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే! అణువణువునూ విడగొట్టగలిగి నూతన సృష్టిరచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే! ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధచేయుచూ సర్వజీవులనూ అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచూ, ఆర్తితో పిలిచినపుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్త్వమును నేనే! అన్ని జీవులలోనూ 'నేను' 'నేను' అని తోచుచున్న అసలుసిసలైన 'నేను'ను నేనే! అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్నయెడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని, అవి మీకు వ్యక్తమై అనుభవము నిచ్చుచున్నపుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది?" అని శలవిచ్చిరి.
పరబ్రహ్మస్వరూపులైన శ్రీ గురుదేవులు యీ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటినుండియో ఘంటానాదము వినబడినది. అందరునూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్దిక్షణముల అనంతరము అందరునూ చూచుచుండగా అది అంతర్హితమైనది.
స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన
శ్రీపాదులిట్లనిరి. "ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యః ఫలములను ప్రసాదించు మహావతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడనూ పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగవిఘ్నములను జయించలేడు. ఓయీ! వల్లభేశా! వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలముచేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేకరకముల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే! వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగియున్న విషయము కూడా మాకు అవగతమే! చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి, నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసినయెడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవ వాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము."
శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్లనీరు పెట్టుకొనుచున్నది. అంతట శ్రీపాదులిట్లనిరి. "అమ్మా! శ్రీపాద శ్రీవల్లభుడైన నేను ప్రతీ స్త్రీయందును నాకు జన్మనిచ్చిన అఖండసౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే! నీవు దుఃఖింపకుము. నేనిచ్చెడి యీ పసుపుకోమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. యీ సృష్టిలోనే ఏ శక్తికి కూడ దానిని మార్చుటకు సాధ్యము కాదు.
నాకు గాయత్రీ మంత్రోపదేశమును చేసిన నా మొదటిగురువైన మా తండ్రిగారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రిగారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృశింహ సరస్వతి అను పేరా మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును గూడ చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృశింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేదవిద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన యీ ఘంట ఒకప్పుడు మా తాతగారింటనుండెడిది. అది నా సంకల్పమున సాధకులననుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలిపొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పైపొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టూ! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితాంరుతము తెలుగు ప్రతిలోని జయసంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ ఘంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ ఘంట అనేక ఆకారములు మారి, పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థాన మేర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయజయధ్వానరూపమైన ఘంటను పీఠికాపురము పంపించెదను."
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
No comments:
Post a Comment