Sunday, September 2, 2012

Chapter 18 Part 2

అధ్యాయము 18
రావిదాసును గురించిన వర్ణనము - భాగము 2
భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు

కురుంగడ్డ వైపునకు రావిదాసు పడవనడపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడయిన కారణమున యితరులు తనపడవలో ఎక్కిన యెడల స్పృశ్యతాదోషము కలుగుననియూ, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవలయుననియూ ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసియుండునని రావిదాసు పలికెను. నేను మహాపండితుడను. శ్రీపాదులవారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన యెడల నా విద్వత్తును గమనించి భూరిసంభావననిచ్చును. అద్దాని నుండి నీకు మూల్యమును చెల్లించెదనని ఆ పండితుడు పలికెను. రావిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రావిదాసుకు పురాణేతిహాసముల గూర్చి కూడ ఏమియునూ తెలియదని పండితుడు గమనించి, ఓయీ! నా జన్మ చరితార్ధము. పురాణేతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్ధమనెను. రావిదాసు మిన్నకుండెను. నదీప్రవాహము మిక్కుటముగానుండెను. దానికి తోడు పడవలో రంధ్రముపడి నీళ్ళు పడవలోనికి రాసాగెను. అయ్యా! మీకు ఈతవచ్చునా? అని రావిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రావిదాసు, నాకు ఈతవచ్చును, మీకు ఈతరాదు అందువలన మీ జీవితము నూటికి నూరుపాళ్ళు వ్యర్ధమే అనెను. రావిదాసు శ్రీపాదవల్లభుల నామమునుచ్ఛరించుచూ నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీమధ్యమున గోచరించెను. అది అంతయునూ శ్రీపాదులవారి మహిమయని రావిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్యహస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయుచుండెను. ఇద్దరునూ శ్రీపాదులవారి దర్శనమునకు వచ్చిరి. రావిదాసు యింతకు పూర్వము శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించిననూ వారు నిర్లక్ష్యధోరణితో తిరస్కరించుచుండిరి. కాని యీనాడు మాత్రము రావిదాసు నమస్కరించినపుడు ప్రసన్నవదనముతో మందహాసము చేసిరి. రావిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్రచర్చను కోరిన పండితుడు నోటిమాటరాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, "ఓరీ! పాండిత్యగర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై యుండి, సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టు కొనుచుంటివి. కట్టుకున్న మహాయిల్లాలును క్షోభపెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్తనుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితులలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించిననూ మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునేయున్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండ లయినందులకు మానసికముగా చెప్పరాని క్షోభనొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను యీ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడియున్నది. నీకు ప్రస్తుతము మరొక మూడు వర్షములు ఆయుష్షును ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయినయెడల నీ కర్మకు నిన్ను వదిలివేసెదను. నీవు పండితుడవే! సందేహము లేదు, నీ విద్వత్తునకు సంభావన నీయమందువా? లేక మరో మూడు వర్షములు ఆయుష్షును యీయమందువా? తక్షణమే సమాధానమీయవలసినది." అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదులవారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాటరాక మూగవానివలె నుండెను. వాని హృదయములో తన ఆయుష్షును పెరుగవలెననెడి కోరిక యుండెను. కాని నోటమాటరాలేదు. శ్రీపాదుల వారే "నీ హృదయమునందలి కోరికననుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుకత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మములో నీ భార్య కావలసి ఉన్నది. కాని యీ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములనుభవించెదరు. నీవు నపుంసక జన్మనొంది ఆ రజకవనితకు సేవలు చేయుచూ కర్మఫలముననుభవించెదవు. నీవు యీ మూడు వర్శములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్నవస్త్రములకు లోటులేకుండా రజకవనిత వద్ద సేవచేసుకొనెదవు. దుష్కర్మలనాచరించిన రజక దంపతుల సేవచేయుచూ శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రావిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాద్దత్తావతారమైన నన్ను సేవించు కొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమినుండి వైదొలగవలసినది." అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయెను. రావిదాసు శ్రీపాదులవారి దుస్తులను ఉతుకుటయూ, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయూ మొదలగు సేవలను చేసుకొను చుండెను.

శ్రీపాదులవారు నదీస్నానానికి వచ్చినప్పుడల్లా రావిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనెడివాడు. శ్రీపాదులవారు ప్రసన్నవదనముతో వాని నమస్కారములను స్వీకరించెడివారు. రావిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదులవారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందలమంది చేత నమస్కరించబడెడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పియుండెను. అయితే యీ నమస్కారములను వారు అంగీకరించినపుడు మాత్రమే ఈ మహాయోగము కలుగుననికూడా తన తండ్రి చెప్పియుండెను. రావిదాసు తన నమస్కారములను శ్రీపాదులవారు అంగీకరించుటవలన అమితానందముతో నుండెను.

రావిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీజనముతో కలసి జలక్రీడలాడుటను గాంచి తను గూడా మహారాజు జన్మనెత్తిన బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదులవారు నదీ స్నానమునకు పోవునపుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకువచ్చి, రావిదాసునకు యవనవంశమందు వైడూర్యనగరమున జన్మించునట్లు వారు వరదానమొసంగిరి. తాము నృశింహ సరస్వతీ అవతారమందు వానికి దర్శనభాగ్యమి చ్చెదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రావిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడెడి యీ వింతదృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని.

నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదులవారు నా వంకచూసి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము?

ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులయిన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమయిన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీగురుదేవులు పసుపుకొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరునూ మహాదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి.

వల్లభేశునకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము

ఇంతలో ఒక యువబ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళిదూసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు. ఆపస్తంబసూత్రుడు. వల్లభేశ్వరశర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారము నుండి వచ్చినవాడు. శ్రీపాదులవారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరుపేరునా అడిగి వారి క్షేమసమాచారములను తెలిసికొనెను. సర్వజ్ఞులయినవారికి యిది ఒకరకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్నభిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్యహస్తములను పైకిచాచిరి. ఒక పెద్ద వెండిపాత్ర నిండుగా 'ఖీర్' అనబడు పాయసమందుండెను. అచ్చట సమావిష్టులయిన శిష్యగణములకు దాని పంచిపెట్టవలసినదని శ్రీపాదులవారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచిననూ పాత్రయందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను. తనశిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రావిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచారములకు కూడా స్వామిప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేశుని తమదగ్గర కూర్చొనమనిరి. వల్లభేశుని ప్రక్కనే నేను కూర్చొంటిని. నా ప్రక్కన సుబ్బణ్ణశాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చొండెను. ఒక బీదబ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతట శ్రీపాదులవారు "నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్నచోటనే భయముండును. ఈ వల్లభేశుడే నీకు అల్లుడు. సుబ్బణ్ణశాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేశుని పితృదేవతలు చాలా ఆగ్రహముగా నున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాదికర్మలు, సభక్తికముగా చేసెడి పిండప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యధా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహమంత్రములను చదువవలెను. మాంగల్యభాగ్యము కొరకు పసుపుకొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకండిన ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాదివారు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, వత్సవాయివారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు, అను మహాదుష్టశక్తుల వలన పీడింపబడువారికి తక్షణమే యీ ప్రసాదము వలన బాధానివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గెడివారికి యీ ప్రసాద స్వీకరానంతరము సంపద అభివృద్ధి చెందును." అని తెలిపిరి. ఈ దివ్యభాషణము చేయుసందర్భమున శ్రీపాదులవారి చెక్కిళ్ళ నుండి అశ్రువులు జాలువారినవి. డగ్గుత్తిక చెందిన గొంతుతో శ్రీపాదులవారు "మల్లాదివారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి వంశములతోను నాకున్న   ఋణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్యభక్తికి నేను పరవశించెదను. నాకేదయినా తినుటకు దొరకునేమోయని నేను వారి వంటయిళ్ళలోనికి సూక్ష్మరూపములో యధేచ్ఛగా పోవుచుందును. వారే కాదు! ఎవరయిననూ సరే నన్ను వాత్సల్యభక్తితో ఆరాధించిన వారి యిండ్లయందు నేను పసిబాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచాములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మ్రింగివేసి వాటికి నవ్యములయిన విముక్తదేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్యశక్తులు, మహాపదార్ధమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందు కొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలో నున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము." అని ఆజ్ఞాపించిరి.

మేము ఏరుదాటి యీవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బణ్ణశాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహమంత్రములే తెలియునుగాని, ప్రేతసంస్కారకర్మల గురించి, ఆయామంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి విననూలేదు, కననూలేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బణ్ణ బ్రహ్మ స్థానమున కూర్చుండెను.అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బణ్ణకే ఆశ్చర్యము! ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహమంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రమునకు బదులుగా పసుపుకొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు. వరుడు కూడా నిర్ధనుడే. వివాహసందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగక పోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేశునకు తల్లియు తండ్రియు కూడ లేరు. కన్య తల్లిదండ్రులును, వరుడును, పురోహితుడును, నేనును కలిపి అయిదుగురుము మాత్రమే! ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదులవారి దర్శనమునకు పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు శలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేశుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన యెడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనమును సంపాదించెను. అయితే మ్రొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదులవారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసికొని కురుంగడ్డకు వచ్చుచుండగా నలుగురు దొంగలు యాత్రికులవేషమున యితనితో కలసి వచ్చి వల్లభేశుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయములో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాడులవారు త్రిశూలధారి అయిన యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగవవాడు తానెన్నడు దొంగతనం కూడా చేయలేదనియూ, ఈ ముగ్గురు దొంగలును మార్గమధ్యంలో తనని కలిసినారనియూ, ప్రలోభపరచెడి వారి మాటలకు లోనయి వారితో కుమ్మక్కయినాననియు, తనను రక్షించవలసినదనియూ, వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి, కొంచెం విభూతిని ప్రసాదించి, వల్లభేశుని శరీరంపై చల్లమనియూ, వాని తలనూ, మొండెమునూ అతికించ వలసినదనియూ  ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృతదృష్టి వలన వల్లభేశుడు పునరుజ్జీవితుడయ్యెను. ఆ దొంగావలన జరిగిన వృత్తాంతమంతయునూ వల్లభేశుడు తెలిసికొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శనభాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేశుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేశుడు తన తప్పు తాను తెలిసికొనెను. వేయిమ్రంది బ్రాహ్మణ్యమునకు అన్నసంతర్పణ చేయుశక్తి తనకు చాలాకాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్థోమతలో నాలుగువేల మందికైననూ సునాయాసముగా అన్నసంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి యిక్కట్లను కొనితెచ్చుకొన్నందులకు ప్రతిగా నాలుగువేల మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్నసంతర్పణ చేయించెను.

(ఇంకా ఉంది...)