Wednesday, June 25, 2014

Chapter 22 Part 2

అధ్యాయము 22 - భాగము 2

గురుదత్తభట్టు వృత్తాంతము

జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే


"నాయనా! శంకరభట్టూ! కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరీగా జన్మనెత్తెడి దౌర్భాగ్యము నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధముగా కాపాడిరి. నన్ను కేవలము విధికే వదలివేసి యుండినచో నేను పూర్తిగా పతనమయి ఉండెడివాడను." అని గురుదత్తభట్టు చెప్పెను. సద్గురువులు మానవాళియందు తమకున్న అవ్యాజప్రేమ వలన పూర్వజన్మ కర్మఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసము వారు తమ అమూల్యమయిన శక్తిని, కాలమును వెచ్చించువారు. 

శ్రీపాదుల వారి జాతకము సాంద్రసింధువేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిథివార నక్షత్రములు కూడా సాంద్రసింధువేదము ననుసరించియే యుండును. శ్రీపాదులవారును, అప్పలరాజుశర్మగారును, బాపనార్యుల వారును యింటిలో తెలుగుభాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములలో సప్తఋషుల పవిత్రభూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకొనుట కూడ గలదు. శంబలలో మాట్లాడుకొను ఈ భాష సంస్కృతము కంటె భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యమును గాని, సౌకుమార్యమును గాని వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురములో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మ గారు మాత్రమే యీ భాషను మాట్లాడుకొనగలిగినవారు. 

సత్యఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో "తాతా! శ్రీకృష్ణుడు సత్యమును గాని, అసత్యమును గాని పలుకువాడు కాడు. అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే." అని శ్రీపాదులవారనిరి. అంతట బాపనార్యులు, "కన్నా! ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను. మాటవరుసకు కూడా అసత్యమును పలుకరాదు." అని శ్రీపాదుల వారితోననిరి. శ్రీపాదులవారు మందహాసము చేసిరి. అదేరోజు మధ్యాహ్నము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి యింటికి వచ్చిరి. శ్రేష్ఠిగారికొక ప్రగాఢ కోరిక ఉండెడిది. అది బాపనార్యుల వారు తమ యింట భోజనము చేయవలయుననియూ, భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలెననియూ, అది కూడా పరమపవిత్రమయిన మహాలయపక్షములలో జరుగవలెననియూ, దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరనియూ వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో, మన్నించరోయని శ్రేష్ఠిగారికి మనసున శంక కలదు. అయిననూ శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడిచేసిరి. బాపనార్యుల వారు అప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠిగారింట భోజనము చేసెదమనియూ, దక్షిణను కూడా స్వీకరించెదమనియూ తెలిపిరి. శ్రేష్ఠిగారి ఆనందమునకు అవధులు లేవు. 

శ్రీపాదులవారు బహు చమత్కారులు. మహాలయపక్షములు జరుగుచుండగా వాగ్ధానమును పొందిన శ్రేష్ఠిగారును, వాగ్దానమును చేసిన బాపనార్యులును కూడా యీ విషయమును మరచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారి యింటికి శ్రేష్ఠిగారు వచ్చిరి. శ్రీపాదుల వారు మందహాసము చేయుచూ, "వాగ్దానమును చేయనే కూడదు. చేసిన తరువాత  తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరచినయెడల, వాగ్దానమును పొందినవారయిననూ జ్ఞప్తికి తేవలయును. ఈ విషయమును మీరిద్దరి నుండి నేను సంజాయిషీని అడుగుచున్నాను."అనిరి. అప్పుడు వారిద్దరికీ  తాము చేసిన తప్పిదము తెలియ వచ్చెను. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుట;ప కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. చేసిన తప్పిదమునకు వారిరువురుకునూ చింత కలిగెను. వారినోదార్చుచూ, "మీ యిద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతీ మానవునిలోను, 'నేను' 'నేను' అనునది చైతన్యరూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా 'నేను' అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ 'నేను' అను చైతన్యమునకు విశ్వప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై యున్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినపుడు మాత్రమే యీ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన యీ వాగ్దానము, లేదా పొందబడిన యీ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన యీ జన్మలోనే మీ యిద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన 'నేను' అను చైతన్యమునకు బదలాయించబడినది గనుక, ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి, శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి యింట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు. కర్మస్వరూపము చాలా సంక్లిష్టమయినది, సూక్ష్మమయినది. కొన్ని కొన్ని కర్మలకు భౌతికకాలము వేరుగాను, యోగకాలము వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా యీ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరించబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది." అని శ్రీపాదులు వారిరువురికి హితవుచేసిరి. 

అంతట నేను శ్రీపాదుల వారు హితవుచేసిన భౌతికకాలము, యోగకాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగితిని. శ్రీ భట్టుమహాశయుడు, "భౌతికకాలము, భౌతిక దేశముతో పాటు మానసిక కాలము, మానసిక దేశము అనునవి కూడ కలవు. వీనికి తోడుగా యోగకాలము, యోగదేశము అనునవియునూ కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకొనుము. అతడు 20 సంవత్సరముల వయస్సు వానివలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. 

అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికుండెడి బరువు, బాధ్యతలున్నాయనుకొనుము. అపుడు వాని భౌతికకాలము 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతికకాలము, మానసిక కాలము ఒకే కాలమును కలిగిఉండవలెననెడి నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును." అని తెలియపరచిరి. 

కాశీలో గాని, పిఠాపురములోగాని నివసించవలెనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీ వాసఫలము గాని పిఠాపురవాస సహితము గాని ప్రాప్తించును. 
దేహము ఒక క్షేత్రమందు వుండినను, మనసు అచ్చట లేకున్న ఆ క్షేత్రవాస ఫలితము రాదు. 

(ఇంకా ఉంది.)

        


Monday, June 23, 2014

Chapter 22 Part 1

అధ్యాయము 22 - భాగము 1

గురుదత్తభట్టు వృత్తాంతము 

జ్యోతిష శాస్త్రములో భక్తులకు జాతకఫలము కూర్చగలవారు శ్రీపాదులోక్కరే 

గురుచరణుడును, కృష్ణదాసును, నేనును శ్రీపాదులవారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్తభట్టు అనెడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చియుండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి. ఒకానొక ప్రశాంతస్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మమ్ములను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిషశాస్త్రము వైపునకు మరలినది. నేను శ్రీ భట్టు మహాశయుని, "అయ్యా! జ్యోతిషశాస్త్రము నందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా ? లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా ? మానవ జీవితమూ పూర్వ కర్మ నిర్దేశితమా ?లేక మానవ ప్రయత్నా నిర్దేశితమా ?" అని ప్రశ్నించితిని. అంతట శ్రీ భట్టు మహాశయులు, " 'భ' చక్రమనగా నక్షత్రక కక్ష్య. దీని ప్రారంభ స్థానము అశ్వినీ నక్షత్రము. ఈ నక్షత్రము ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యము కాదు. అశ్వినీ నక్షత్రగోళమును గుర్తించుట కష్టము గాన దానికి 180 అంశలలో నున్న చిత్తా నక్షత్రము ఒకే గోళముగాను, ప్రకాశవంతముగాను, స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన యెడల అది అశ్విని యగును గాన చైత్రపక్షము గ్రాహ్యమయినది. అశ్వినీ నక్షత్రము 'తురగ ముఖాశ్వినీ శ్రేణి' అని మూడు గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రములో జన్మించుటకు కూడా విశేషకారణమున్నది. మూడు గోళములు ఒకే నక్షత్రముగా నున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అదియే 'భ' చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము. ఇది అశ్వినీ నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు 180 అంశల దూరములో నుండు వారి జన్మనక్షత్రమైన చిత్తానక్షత్రము. 180 అంశల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని, గ్రహము యొక్కగాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరముగా యోగ్యమయిన గ్రహసంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల యెడల ప్రేమభావమును గాని, ద్వేషభావమును గాని కలిగియుండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్చమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకొనుటకు, ఆ కిరణములను, స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను, కిరణములను మనము కలిగి యుండవలెను. దీనిని మంత్ర తంత్రముల వలన గాని, ధ్యానము, ప్రార్థన మొదలయిన విధానముల ద్వారా గాని, లేదా తన స్వకీయమయిన యోగశక్తి ద్వారా గాని సాధించగలము. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై యున్న, పైన చెప్పిన విధానములు ఏమియునూ పనిచేయవు. అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు. ఆ విధముగా వారు మార్చివ్రాయుటకు మన వలన యీ లోకమునకు ఏదయినా ఒక మంచి ప్రయోజనము ఒనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోను, కర్మదేవతల కార్యకలాపములోను శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకొనరు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును. శ్రీవారి హృదయము నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతలయొక్క శక్తి నిర్వీర్యమయిపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారి చైతన్యస్వరూపులు. తనకి అవసరమని తోచినపుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయము." అని వివరించిరి. 

నేను అజ్ఞానదశలో జ్యోతిషములో మహాపండితుడని భ్రమించెడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగుభాషను అంతబాగుగా మాట్లాడలేను. సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవము దత్తాత్రేయులవారు. నేను పాదగయాక్షేత్రమున కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూదత్తుని దర్శించితిని. భక్తిశ్రద్ధలతో వారిని అర్చించితిని. నేను ధ్యానములో కూర్చునియుండగా నాకు, "ఓరి! మూర్ఖుడా! నీవు చచ్చి ఎంతసేపయినది? నీవు నా భక్తుడనని బీరములు పలుకుచున్నావు? ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళజూచుటకేనా యిచ్చటకు వచ్చినది? " అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగెను. నేను జ్యోతిషపండితుడనగుటచే నా జాతకమును లెక్క గట్టితిని. నేను ఏ  రోజున ఎన్ని ఘడియలకు యీ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయాక్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నా నాడీ స్పందనమును చూచితిని. నాడి కొట్టుకొనుట లేదు. హృదయస్పందనమును చూచితిని. గుండె కూడా పని చేయుట లేదు. నా ముఖమును అద్దములో చూచుకొంటిని. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకొంటిని. ఏమున్నది గర్వకారణము ? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నొంది నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహు ధనాశాపరుడు. అతని సూక్ష్మశరీరమును చూడగలిగితిని. నా కంటెను అత్యంత వికారకళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగియున్న వివేకము మేల్కొనినది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేసిన గాని నా దురవస్థ తొలగదని తెలిసికొంటిని. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము, నాడీ స్పందనము లేకపోయిననూ ఆనందముగా ఉండెడి ఉన్నత స్థితి. నా స్థితి చాల అధ్వాన్నముగా నున్నది. నా ఆత్మకు ఆనందము ఎంతమాత్రమూ లేదు. పైపెచ్చు దుఃఖభారముగా నున్నది. ఆత్మ శరీరమును వీడినపుడు శరీరబాధలంతరించును. అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధస్థితిలో హృదయస్పందనను నిలుపుదల చేసి, "శిలగా నున్న స్వయంభూదత్తుడే ఘండికోట వారింట అవతారమెత్తెనంట. మరి శిలకు నాడీస్పందనము, హృదయ స్పందనము ఉండవు గదా ? మరి శ్రీపాదునికి నాడీస్పందనము, హృదయస్పందనము కలవు  కదా? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమపవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించెనట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి ద్రౌహిత్రుడిగా జననమాయెనట. ఏమి విడ్డూరము! ఎంతటి దగా! ఎంతటి వంచన!" అని పరమ నికృష్ఠులు, పాపాత్ములు అయినవారు పలికెడి మాటలను విని, నేను ఎంతో మోసపోయి, ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకొనుచున్నాననెడి వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. 

నేను శ్రీపాదుల వారింటికి వేగముగా పరిగెత్తుకొనిపోయితిని. పది సంవత్సరముల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, "రారా! భడవా! రా! బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ, చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు, మానవరూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం, మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోరబాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం, అవధూత వేషధారియై మహాలయ అమావాస్యనాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి  వచ్చినది ఎవరో తెలుసా ? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా ? నేనే! ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే! నిన్ను శిలగా మార్చాను గాని ఆకలిదప్పులను ఉంచాను. ప్రాణం తీశాను గాని బ్రతికున్నవాడిగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో, కాదో అనునది తరువాత తేలుద్దాం. ముందు యీ  విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చినవాడివి. కావున బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా ?" అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజ గజ వణికిపోతిని. ఇంతలో సుమతీ మహారాణి వీధిలోనికి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, "కృష్ణ కన్నయ్యా! నిండుగా ప్రేతకళ ఉట్టిపడే యీ అఘోరీ ఎవ్వరు? నువ్వు లోపలికి రా! కాస్త దిష్టి తీసి వేసెదను." అని కేకలేసినది. అంతట శ్రీపాదులవారు "అమ్మా! ఇతడు అఘోరీ ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇపుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన యింటిలో కాస్త చద్ది అన్నము ఏమయినా ఉంటే పెట్టు అమ్మా!" అని తల్లిని బ్రతిమిలాడిరి. 

శ్రీపాదుల వారికోసం వారి జనని అఖండలక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణీ అన్నము అట్టే పెట్టినది. శ్రీపాదులవారు ఆ తరవాణీ అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడి పొమ్మనిరి. నేను కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగానుండు ఖాళీస్థలములో ఆ తరవాణీ అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వము తొలగిపోయినది. నేను మరల శ్రీపాదుల వారి దర్శనార్థము పోయితిని. అయితే శ్రేష్ఠిగారు శ్రీపాదులవారిని తమ యింటికి తీసుకొనిపోయిరి. శ్రీపాదులవారు శ్రేష్ఠిగారి పచారీ కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టెలో వేయుచుండిరి. శ్రేష్ఠిగారు స్వయముగా జొన్నలను, బియ్యమును కొలచి యిచ్చుచుండిరి. శ్రీపాదులవారు, తాతా! ఈ రోజు దస్త్రము కదా! నాన్నగారికి ఎంత దక్షిణ ? నాకెంత దక్షిణ? అని శ్రేష్ఠిగారిని అడిగిరి. అంతట శ్రేష్ఠిగారు, "కన్నయ్యా! నన్నగారికిచ్చెడిది పండిత బహుమానము. నీకిచ్చెడిది వేంకటేశ్వరస్వామి వారి ముడుపు. మనిద్దరికీ బేరసారములు లేవు. నీకు కావలసినది నీవు తీసుకొనవచ్చును. నాకు కావలసినది నీవు యీయవలెను." అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యము ఎంత మనోహరము? శ్రీపాదుల వారు కొంచెము బెల్లంముక్క తీసుకొని నోటిలో వేసుకొనిరి. ఒక బెల్లంముక్క నాకు ప్రసాదముగా యిచ్చిరి. తాతా! నేను చేయించెడి గణేశపూజ అయిపోయినది. గణేశుడు బెల్లంముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకొన్నాడు. నీకు రుజువు కావలెనన్న నా నోరు చూడుము, అని తన వాదన గహ్వరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు గాని కొంత సమయమైన తరువాత శ్రేష్ఠిగారు, "బంగారుకన్నా! గణేశునికి ఆకలయినపుడు మనల్ని అడుగకుండగనే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యముగా స్వీకరించవచ్చును." అని చెప్పుమని శ్రీపాదులవారితో అనిరి. ఇంతలో అఖండలక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకొని వెళ్ళినది. 

(ఇంకా ఉంది.)
            

Sunday, June 22, 2014

Chapter 21 Part 3 (Last Part)

అధ్యాయము 21 భాగము-3
దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట

శ్రీపాదులు షోడశ కళాప్రపూర్ణులు

నాయనా! శంకరభట్టూ! ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినపుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా అగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే గదా పరిమితమయిన ఆకారము కలుగునది. అందువలన శివకేశవులిరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశాభాగహారము నందు పదింటిచే భాగింపగా మిగిలిన ఆరు దశాంశల నుండి, అయిదు దశాంశాంకల మొత్తము విష్ణుప్రతీకగా గ్రహింపబడినది.  పంచభూతాత్మకమయిన సృష్టి అంతయునూ విష్ణుస్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో, "మూలప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతిరూపముగాను, రాక్షసయుద్ధ సమయమున దుర్గారూపము గాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుషవేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశకళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదియే!" అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదలి వెళ్లిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులగుటచే వారిని షోడశ కళాప్రపూర్ణులుగా తెలిసికొనవలెను.

దేవతల వివిధ స్వరూపములు

ప్రకృతి విష్ణుస్వరూపమగుటచే అయిదు దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశరూపుడాయెను. కారణము సుస్పష్టమే! చేతనస్వరూపుడయిన శివుడు ప్రధానుడు. మిధ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు. అందువలన శివునిలో బ్రహ్మ దశాంశరూపుడు. ఇట్టి దశాంశరూపబ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము రెండు మొదలుకొని తొమ్మిది వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించియున్నది. అందుచేత బ్రహ్మకు నవప్రజాపతి స్వరూపము సిద్ధించెను. పదహారు, నూరు, వెయ్యి అనెడి మూడు పదములలో చివర రెండు పదములు ముక్తానుబంధరీతిగా గణింపబడి 116, 1116 అనెడి రూపము నందినవి. వీటిని పదిచే భాగించిన యెడల సృష్టి యందలి వివిధ వస్తుసముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 11 అను రెండు పూర్ణాంకములు, బ్రహ్మకు 111 అను మూడు పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయువారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణము దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను మూడింటిని దానము చేసినవాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యమగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండదానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రీ - త్రిష్టుప్ - జగతీ ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్ నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన యీ పిండాండదానము (శరీర దానము) వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్య దానఫలము లభించును.

సవితృ కాఠక చయన ఫలితమే శ్రీపాదుల అవతారము

సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించునది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24 కు ప్రతీక. 9 అనునది బ్రహ్మ స్వరూపము. 8 అనునది మాయా స్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృకాఠక చయనము చేయుట వలన ఆనాడు యిచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును అర్థనారీశ్వరము నొంది జీవుల  యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మమార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ 'దో చౌపాతీ దేవ్ లక్ష్మి' అని భిక్షనడిగిరి. వారి వాక్కులకు, లీలలకు, బోధనాపద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగజాలరు. ఈ నవ్య వ్యాకరణమునకు వారే  కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. 

కృష్ణదాసు వలన నేను ఎన్నియో విషయములను వింటిని. మరెన్నో క్రొత్త సంగతులను తెలిసికొంటిని. పాండిత్య జనిత  అహంకారము కలిగిన వారు ఎంత మాత్రమూ శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు. 

కృష్ణదాసు యిట్లు చెప్పనారంభించెను. "శ్రీపాదులవారు పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి యున్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదులవారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదులవారు విచిత్రముగా ప్రతీ త్రాచుపామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నిటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వేచిరి. చాలా పెద్ద చీమలు, యిదివరకు ఎవరూ కనీ విని ఎరుగనివి  అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలో నున్నారు. వారికి నిద్రాభంగము కలుగకూడదని ఆ చీమల నన్నిటినీ శ్రీపాదుల వారు చంపి వేసిరి. ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చి పడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో యిట్లనిరి. "రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలికములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు చూడమనిరి." ఇంతలో వింతకాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నియునూ బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసముతో, "ఈ చీమలరాజునకు సంజీవినీ శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకొన్నది. ఇటువంటి వింతవింతలు యీ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాతా! నీవు కోరితే ప్రతీ క్షణక్షణము ఈ రకమయిన లీలలను ఎన్నయినా చూపగలను." అనిరి. 

ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుబాములను చూసి ఆశ్చర్యము నొందిరి. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించిరి. అంతట శ్రీపాదుల వారు ఒక నాగుబాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్యహస్తములతో నిమిరిరి. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి. 

ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటికి శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక ? ఈ విషయమును నేను శ్రీపాదుల వారినడిగినపుడు యిట్లనిరి. "రాహుగ్రహబలం చాలనపుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయి కొండచిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్పయోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములయిన ఆటంకములను కలుగజేయు సర్పములు మన కళ్ళకి కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును యీ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖసంతోషములను కలుగజేయుచుంటిని."

మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 21 సమాప్తం)        

Thursday, June 19, 2014

Chapter 21 Part 2

అధ్యాయము 21 భాగము 2

దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట

మోహము నశించుటతో మోక్షము

పీఠికాపురములో అబ్బన్న అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచూ అతడు బాపనార్యుల యింటికి వచ్చెను. శ్రీపాదులవారు వేదఘోషను ఆపుచేయమనిరి. అబ్బన్నకు కడుపునిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదులవారు అబ్బన్నను పిలిచి, "ఓయీ! ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవయవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా, అకారణ నిందచేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున నున్నారు. వారికి చిత్రగుప్తులు వారు మరణానంతరము పిశాచజన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాపపరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచినవారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలము ప్రోక్షింపవలసినది. చాటింపువేసిన మాదిగ సుబ్బయ్య యింటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది." అనిరి. అబ్బన్నయునూ, సుబ్బయ్యయునూ అచటికి వెళ్లి, వారందరిని బాపనార్యుల యింటికి తీసుకొనివచ్చిరి. శ్రీపాదులవారు ఉగ్రస్వరూపమున, "ఓయీ! దండిస్వామినని ఎంత గర్వించితివి? నీవు ఆరాధించు దత్తుడే యిక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణమొకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణమొకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టినీ శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుటవలన నీకూ, నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొన్నది. మిమ్ములనందరిని కొన్ని వందల సంవత్సరములు పిశాచజన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తులవారు నిర్ణయించిరి. అవ్యాజకరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవజన్మకు వచ్చినపుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయునూ, నేనునూ అభిన్నస్వరూపులమై ఉండగా మోక్షమనునది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడయినా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన యెడల, వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యముతో మాయకు అతీతముగా సుఖస్వరూపముగా ఉండవలెనని కోరిన, అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునక, మోక్షమునకు, బంధనమునకూ వ్యత్యాసమేమి యుండును. ప్రతీ క్షణముననూ అసంఖ్యాకములయిన నూతన లోకములు సృష్టి, స్థితి లయముల నొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనందభూమికలకు గాని, పరిమితి గాని, హద్దులు గాని లేవు. మరణానంతరము నా వద్ద రాగోరువారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏయే లోకములకు తిరిగి పంపబడవలెనో, నా సంకల్పము నిర్ణయించును. కపటనాటక సూత్రధారినయిన నేను ప్రస్తుతము నరాకారముగా మీముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేనిస్థితిలో కూడా నేను మిమ్ములను సదా చూచుచునే యుందునని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగి వచ్చినది. మహా యోగుల యొక్క యోగశక్తులన్నియునూ లోకకళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు. నీ కంటే తక్కువ స్థితిలో నున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మమార్గమును, కర్మమార్గమును, యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును బోధించుటకే అవతరించునది. నేను సర్వసత్యములకునూ మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును. సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది యీ సృష్టిలో కానరాదు. నేను లేనిదే యీ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టి యున్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంఝాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయిననూ, ఉద్ధరింపబడక పోయిననూ సృష్టికి గాని, నాకు గాని కలిగెడి నష్టమేమియునూ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యధావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇదీ అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదలి వచ్చుట, ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరి వలె నున్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా, గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగడుచున్నవి. పరస్పరము యీ విధముగా ప్రశంసించుకొన్ననూ యదార్థము మాత్రము వేరుగా నున్నది." అని హితబోధ చేసిరి. 

అరుంధతి వశిష్టుల సంబంధము 

అరుంధతీ మాత ఛండాలవంశము నందు జన్మించెనని వింటిని. అట్లయిన ఆమెను వశిష్టమహర్షి ఎట్లు పెండ్లాడెనని నేను గురుచరణుని అడిగితిని. అపుడు గురుచరణుడు, "పూర్వము వశిష్ఠుడు వేయి సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక ఛండాలకన్యక వశిష్ఠునకు తాను చేయుటకర్హమైననట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదయినా కోరుకొనమనగా ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను. నీవు ఛండాలజాతి స్త్రీవి. మన యిద్దరికి భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమయినది అగును ? అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి, కోరితిని. వరమిచ్చిననిమ్ము, లేనియెడల నేను మరలిపోవుటకు అనుజ్ఞనిమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లయినచో నీ దేహమును నా యిష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా? అని ఆమెనడిగెను. ఆమె వల్లెయనెను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు ఏడు పర్యాయములు చేసెను. ఏడవ జన్మలో ఛండాలజాతి దోషమంతయునూ హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయెను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డు పెట్టలేదు గనుక ఆమె అరుంధతి యను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగ వశమున వశిష్ఠ గోత్రోద్భవులయిన నరసింహవర్మతో శ్రీపాదులు సెలవిచ్చిరి. శూద్ర క్షేత్రము నందు బ్రాహ్మణుని వలన పుట్టినవానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణజాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణ కర్మ విభాగములననుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తానాచరించెడి దుష్కర్మల వలన క్రమశః పతనము నొంది శూద్రుడవవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవవచ్చును. అయితే దత్తప్రభువు నందు అచంచల విశ్వాసము నుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించిననూ, ఏ పరిస్థితులలో ఉండిననూ సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్యఐశ్వర్యములను పొందునట్లు దత్త ప్రభువు అనుగ్రహించగలరు. జన్మజన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల." అని వివరించెను. 

దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయము 

మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలియజేసుకొనుచూ మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్యదర్శనమిచ్చి, మమ్ము తరింపజేసి, తన దివ్యహస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి, "పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురుసార్వభౌముడుగా అవతరించుననియూ, యీ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియూ, శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యమూ తుంగభద్రాజలమును స్వీకరించువారు. మీకు శుభము కల్గును గాక." అని చెప్పుచూ ఆమె పూర్వరూపము లోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయములో కృష్ణదాసు అను మాలదాసరియొకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికను ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా నిచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. 

మేము ముగ్గురమూ కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిదీ ఒకే కులము. వారికి దత్త ప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించిననూ అది స్వీకరీయమైనదే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు  కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు, "యజ్ఞాదికర్మలలో నిచ్చెడి దక్షిణలకు 16, 116, 1116 అనెడి సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన యెడల శ్రీపాదులవారి సంఖ్య అయిన 2498 అను దానికి బోధపడగలదు. " అని చెప్పెను. 

ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహసమయమందు వరుడు అగ్నిహోత్రుని ప్రార్థించుచూ, "ఓ అగ్నిహోత్రుడా! నీవు నాకు యీ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము." అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా పదిమంది పిల్లల వరకూ కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశరూపులగు 10 మంది కలసిన పూర్ణాంకరూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు. కావున దశాంశల రూపుడు 16 దశాంశలను పది సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూలప్రకృతిరూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్థభాగమే కదా! అందుచేత పదిలో సగము అయిదగుటచే మనకు శేషముగా వచ్చి ఆరును అయిదుచే భాగించగా విష్ణువు ప్రతీకముగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతానరూపుడైన, బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1 ని 1 చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమియునూ మిగులలేదు. 

పూర్ణము అనగా సున్న అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము సమస్తమునూ లయించినపుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యము నందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంతత్వ ధర్మమును కలిగియున్నది. సృష్టి యొక్క స్థితి స్వభావము నందు అనంతత్వము అనివార్యము. 

(ఇంకా ఉంది ..)       

Wednesday, June 18, 2014

Chapter 21 Part 1

అధ్యాయము 21 భాగము 1 

దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట

సాధకులకు స్థానశుద్ధి, భావశుద్ధి ఆవశ్యము

నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞమేరకు గురుచరణునితో కలసి మాంచాల గ్రామదర్శనమునకు బయలుదేరితిని. దారి మద్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మవిద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, "అయ్యా! వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదులవారు అంటిరి గదా! ఆ మహాభాగ్యుడెవరు ? అతడు ఏ కాలములో వచ్చువాడని" నేను ప్రశ్నించితిని. అంతట గురుచరణుడిట్లనియె! అయ్యా! శంకరభట్టు! అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్యసంకల్పము వలన గాక మహాతపస్వులు అరుదెంచవీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్ఛారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చట నున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాళము నందలి దిశదిశల నుండియూ భావతరంగములు ఎల్లప్పుడునూ ప్రసరించుచునే యుండును. పవిత్రభావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబలశక్తి సంపన్నములయినపుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశము నందు దుష్టములైన భావతరంగములున్న యెడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను. భావశుద్ధి కలిగినవాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగియుండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును గాని, అన్నమును గాని స్వీకరింపవలెను. వేదవేదాంతములందు మహాపండితుల మనుకొనువారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారివలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓఢ్రదేశమునందలి జగన్నాథపూరీ మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచ్చట నేను జగన్నాధునకు బదులు శ్రీపాదులవారిని దర్శించితిని. నాతోబాటు ముగ్గురు నలుగురు శ్రీపాదభక్తులుండిరి. వారికి తమ యిష్టదేవతారూపములో దర్శనమిచ్చి, వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీదేవతా రూపములును తామేనని మౌనముగా బోధించిరి.

దండిస్వామికి గర్వభంగము

అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి  యొకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరయినా మహాత్ములు తటస్థించినపుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభా! మహాప్రభూ! ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరువచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కముతో "శ్రీపాదుడనెడి వాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు. వాని శిష్యులయిన వీరు కూడా క్షుద్ర మాంత్రికులే! తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసిననూ, మా స్వాముల వారు మహాశక్తిమంతులు గనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టికరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు." అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమయితిమి. శ్రీపాదులవారి లీలావిధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి, వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించునదియును వారే! దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే! ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తరువాత దండిస్వాములవారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయములో నేను కూడా మార్గమధ్యమములోని పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ బాపనార్యులవారి యందుననూ, శ్రీ అప్పలరాజుశర్మ వారి యందుననూ, శ్రీపాదుల వారి యందుననూ ద్వేషభావమును విషముజిమ్ము స్వభావమును కలిగినవారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయము నందలి దేవీదేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు, "ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తనయొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనముగా చేసికొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచిరోజులు వచ్చినవి. మీరు నిశ్చింతగా నుండుడు." అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్రఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకొనివచ్చుటకు కుక్కుటేశ్వరస్వామి దేవాలయమునకు పోయిరి. "తానూ స్వయముగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమొనర్పవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరయి క్షమాపణ చెప్పుకోవలయును. అప్పలరాజశర్మ గారు దండిస్వామి ఎదుట హాజరయి తానూ పరంపరాగతముగా అర్చించే కాలాగ్నిశమనదత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాములవారు విధించు శిక్షకు పాత్రులు కావలెను." అని ఊరంతయునూ చాటింపు వేయబడెను.

వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోను, దండిస్వామికి శ్రీపాదులవారు గాని, అప్పలరాజు శర్మగారు గాని, బాపనార్యులు గాని తలవంచరాదనియు ఇటువంటి అకృత్యములకు మద్దతునీయరాదనియు తీర్మానించిరి. నరసింహవర్మగారి అధ్యక్షతను జరిగిన క్షత్రియమహాసభయు యీ విధముగనే తీర్మానించిరి.

శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్షచ్ఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మగారును, శ్రేష్ఠిగారును, బాపనార్యులవారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చొనియుండిరి. అప్పలరాజుశర్మ చేష్టలుడిగి వెఱ్రివానివలె కూర్చొండెను. శ్రీకృష్ణ సదృశ్యు లయిన శ్రీపాదుల వారు నిద్ర మేల్కాంచి, తనకు ఆకలిగా నున్నదనియూ, పెరుగు అన్నము తినెదననియూ చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండిగిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజుశర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయునూ, శ్రేష్ఠిగారును మహానందముతో సుశ్రావ్యముగా నున్న ఆ పవిత్రవేద ఋచలను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయును పవిత్ర ఋష్యాశ్రమమువలె నుండెను.

కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపుముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము యిటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండిస్వామి తన శిష్యులతోను, పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోను వేదఘోషతో అచ్చటినుండి బయలుదేరెను.వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్ళను కదుపుచూ, ముందుకు మాత్రముపోజాలక అచ్చటనే యున్నట్లు కనుపించుచుండెను. ఈ విధమయిన విచిత్ర విన్యాసముతో ఎన్నియో ఘడియలు గతించుచుండెను. అందరునూ యీ వింతను చూచి ఆశ్చర్య చకితులగుచుండిరి. ఇంతలో దండిస్వామి వద్ద నున్న బ్రహ్మ దండము రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలయినట్లు తోచి నేలమీద చతికిలపడెను. పీఠికాపురవాసులకు యీ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియూ, శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరుగగలవనియూ వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదలి యింటిపట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. 

(ఇంకా ఉంది.. )       

Sunday, June 15, 2014

chapter 20 part 3(Last part)

అధ్యాయము 20 భాగము 3
విస్సావధాన్ల వృత్తాంతము

శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికి మూలము శ్రీపాదుడు

తాతగారి నోటివెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధమనోహరముగా నవ్వి, "తాతా! ఇప్పుడే మీ కండ్ల ఎదురగనే ముండ్లచెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్రప్రమాణము ఉన్నదా? అనెడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగభూమికలందుననూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టియందంతటను ఒకే భగవచ్చైతన్యమున్నది. అయితే  అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమైయున్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనునది అనుభవమున ఉన్నది. ఈ కాలమనునది సూర్యచంద్రాది ఖగోళములవలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయజ్ఞానము ఏకకాలముననే అనుభవములో గల వారు అత్రిమహర్షి. ఈ సృష్టి యందు అనసూయా తత్త్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణశరీరములు. భూత భవిష్యద్వర్తమానములు మొదలయిన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయునూ ఏకకాలముననే అనుభవము, అట్టి స్థితియందు త్రిమూర్తులును, త్రిశక్తులును నా యందే యుండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులును, త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తియందే యున్నారనెడి మాట యదార్థమే! నేనునూ, ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే యిచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియునూ మాతృగర్భము నుండే వెలువడవలననెడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్యపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన యీ  విధముగా  ఉండవలెననెడి సంకల్పము గాని ఏ విధముగ కలుగవలెను ? దాని ప్రభోదన శక్తియే నేను అనగా మహా సంకల్పస్వరూపము! ఆ మహాసంకల్పము ననుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్పస్వరూపమే పరమ గురుస్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏక కాలము లోనే  జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగెడి మూలశక్తిని నేనే! సృష్టియందు మాతాశిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యభర్త సంబంధము, అన్నాచెల్లెల్ల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీదేవతాస్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని, మాయాశక్తియును, మహాశక్తియునూ,  యోగశక్తివలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్యపరాశక్తిగా గాని, మూలదత్తునిగా గాని ఆరాధించునపుడు త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ అంతర్లీనస్థితిలో నుండును. ఈ దైవసంబంధములునూ, వాటి తత్త్వములునూ, ఆయాస్థితుల అనుభవములునూ కేవలము సాధనాసంపత్తి కలిగిన వారికే అవగతమగును."

శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. 

మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచజన్మ నుండి విముక్తమై, మానవజన్మనొంది తగిన సమర్థత కలిగిన వ్యక్తినుండి అది నేర్వవలెను. నేను ప్రతీ జీవితోడనూ అంతర్గతముగా సంబంధమును కలిగియుండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి, ప్రతీ నిత్యము స్నానజపాదులవలన వాటిని దగ్ధముచేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్నారాధించు వారి అనేక పాపసంస్కారములను నా యందు ఆకర్షించుకొని మనయింట కులదైవముగనున్న కాలాగ్నిశమనదత్తుని స్థూలపూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగెడి మహాఫలమును నన్ను ఆరాధించువారికి ధారపోసేదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును గనుక, నేనే చేసెడి కర్మలకు సద్యఃఫలితములు కలుగును గనుక, ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆదిగురుస్వరూపము! తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడైయున్నాడో గురువు యొక్క తపః శక్తికి, ఆ గురువు యొక్క శిష్యులు కూడ వారసులై యున్నారు. భగవద్గీతలో కూడా కర్మచేయుట అనివార్యమను విషయము తెలియ జేయబడినది. 

నా అవతారమునకు సమాప్తి లేదు 

దత్తుడనయిన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయి వరముల నిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి, వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. తాతా! అందువలననే నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములయిన గురువుల రూపమున నున్నది నేనే! ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగువేసిన, నేను నా భక్తునివైపు నూరు అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తులనుండి, బాధల నుండి కాపాడుట నా సహజ నైజము. " అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను, మహాప్రభూ! సోమలత గురించియూ, సోమయాగము గురించియూ నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదుల వారు సోమలతనే సంజీవినీమూలిక అని అందురని చెప్పి, నీకు దానిని చూడవలెనని ఉన్నదా? అని అడిగిరి. నేను ఔనంటిని. వెంటనే వారి చేతియందు  సంజీవినీ మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా యీనాటికినీ నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది. 

శ్రీపాదులవారు "ఈ సంజీవినీ వనమూలికలు హిమాలయ పర్వతశ్రేణులలోనూ, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధూనదీ ఉద్గమస్థానం దగ్గర, మల్లిఖార్జున ప్రభువు నిత్యనివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్రదేవగిరి, వింధ్య పర్వతశ్రేణి, బదరీ అరణ్యప్రాంతములందునూ లభ్యమగుచున్నవి. దీని  వలననే లక్ష్మణుడు మూర్ఛనుండి కోలుకొనినాడు. దీనిని సేవించుటవలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనెడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకునూ, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు యిది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్నివలన గాని, జలమువలన గాని, విషము వలన గాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలుకాగానే ప్రతీరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులూ రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్ళలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వతశ్రేణి, భీమశంకరపర్వతముల దగ్గర క్రూరమృగాలు ఈ సంజీవినీమూలికను కాపలాకాయుచుండును. అర్థరాత్రి అమావాస్యరోజున దివ్యకాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా! గురుచరణా! ఈ విధముగా 24 రకాలయిన దివ్య ఔషధమొక్కలు ఉన్నవి. ఇవి అన్నియూ చాలా పవిత్రమయినవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములయిన వేదమంత్రములను ఉచ్ఛరించుచూ, అత్యంత వినమ్రభావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ యిరువయినాలుగు దివ్య ఔషధమొక్కలు 1) సోమ 2) మహాసోమ 3) చంద్రమ 4) అంశుమాన్ 5) మంజువాన్ 6)రజితప్రభు 7) దూర్వా 8)కనియాన్ 9)శ్వేతాన్ 10)కనకప్రభ 11)ప్రతానవాన్ 12)లాల్ వృత్త  13)కరదీర 14) అంశవాన్ 15) స్వయంప్రభ 16)రుద్రాక్ష 17) గాయత్రి 18)ఏష్టమ్ 19)పావత 20)జగత్ 21)శాకర్ 22)అనిష్టమ్  23)రైక్త 24)త్రిపదగాయత్రి. " అని తెలిపిరి. 

నేను శ్రీపాదుల వారి నుండి శలవుగైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని. 

నేను శంకరభట్టునకు యీ వృత్తాంతమును వివరించుట పూర్తికాగానే మహాగురువుల మానససంచారము పూర్తి అయినట్లుగా, వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను, ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి. "మీరు యిరువురునూ కృష్ణ దాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదముపొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్ననూ ఎంతదూరములోనున్ననూ, నేను మిమ్ములను ఎల్లప్పుడునూ గమనించుచునే యుందునని గ్రహింపుడు. 

భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవసమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూలదృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూలశరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్ఠమైయున్నది. ఏ  యుగములోని వారైననూ, ఏ దేశములోని వారైననూ, ఏ కాలములోని వారైననూ, నా కటాక్షమును పొందిన యెడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్టితమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకూ అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవచైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను. 

నాయనా! శంకరభట్టూ! అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థాన మేర్పడగలదు. నా మాతామహ గృహమున నా జన్మస్థలమున ఔదుంబర వృక్షచ్ఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠిoపబడును. నా యొక్క, నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్యదృష్టిని నిచ్చుచున్నాను. చూడుడు! అని గురుచరణుని, నన్నూ భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందరదృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము. లీలలు విచిత్రములు. మేము బయలుదేరునపుడు వారిట్లనిరి. వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. 

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 20 సమాప్తం ) 


    

Friday, June 13, 2014

Chapter 20 Part 2

అధ్యాయము 20 భాగము 2
విస్సావధాన్ల వృత్తాంతము 

ఔదుంబర వృక్ష మహిమ 

అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, "నీవు చెప్పునది నిజమే! కాదనను! ఈ సృష్టి యొక్క మర్మమంతయునూ ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము! ఉత్తర క్షణములో వారు ఏమి చేయసంకల్పించెదరో సప్తర్షులు కూడనూ గ్రహింపజాలరు. అట్టిది నీవెంత ? నేనెంత ? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసికక్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యముగాని కష్టనష్టములకు గురిచేసి కర్మక్షయమొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతారపురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించెడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి, ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరము నందలి ప్రాణశక్తి ద్వారా తానూ జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్ధమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి, భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్టితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడిననూ అది పరిపూర్ణముగనే యుండును. దానికి కారణము శ్రీదత్తాత్రేయుల వారు ప్రతీ ఔదుంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్టితులై యుండుటయే!" అని విశదపరచెను.

నాకు హరిదాసు చెప్పునదంతయూ ఆశ్చర్యముగానుండెను. కృష్ణదాసు అను పేరుగలిగిన ఆ హరిదాసు తన దారివెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో, భక్తితో మా యింటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగనే గడచిపోయెను. మా దూరపు బంధువొకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నాయందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా యింటనే నివసింపమొదలిడెను. నాకు కొంత ధనమొసగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా యింటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలిడెను. మా యింట ఏమి ఇబ్బందులు తలయెత్తిననూ ఔదుంబరమునకు ప్రదక్షిణచేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనెడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరేడిది. మా బాధలు ఊహించనివిధముగా తీరేడివి. దత్తాత్రేయుల వారికినీ, మాకునూ మధ్య స్నేహవారధిగా ఔదుంబరముండెడిది. అయ్యో! దత్తభక్తులకు ఔదుంబరవృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయులవారు సాక్షాత్తు మనయింట ఉన్నట్లే! ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించిననూ అది తక్కువేయగును.

పాపకర్మల ఫలితముగా ముళ్ళచెట్టుగా జన్మించుట

నేను నా వ్యాపార నిమిత్తము ఓఢ్ర దేశమునకు పోవుచూ నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదులవారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముండ్లచెట్టు యొకటున్నది. శ్రీపాదులవారు దానికి శ్రద్ధగా నీరు పొయుచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని "బంగారు కన్నా! నీకు యింత ప్రీతిపాత్రమైన యీ ముండ్లచెట్టు సోమలతయో లేక సంజీవినీ మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించిననూ, వహింపకున్ననూ అది పెరుగుట మానదు." అనిరి.

అంతట శ్రీపాదులవారు "తాతా! పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి, 'స్వయంభూదత్తుడే బాపన్నావధాన్ల గారి మనుమడుగా అవతరించెనట! ఎంతటి విడ్డూరము? ఎంతటి దైవద్రోహము? అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' అమ్మయునూ, నేనునూ, అన్నలునూ, శ్రీవిధ్యాధరి రాధ సురేఖలును వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి యింటనూ, నరసింహవర్మ గారి యింటనూ భోజనము చేయు సందర్భమున 'మల్లాది వారునూ, ఘండికోట వారునూ బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారినీ బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయ వలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా? వేదములలో ఉన్నదా?అని కుతర్కములాడిన విస్సావధాన్లు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనముపెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే 'వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతనూ, నరసింహవర్మ తాతనూ అను నిత్యమూ దుమ్మెత్తి పోసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' మరణానంతరము ఉత్తరక్రియల లోపములవలన, మహాపాపభారమున, తన స్వభావమునకు తగినట్లుగా ముండ్లచెట్టుగా జన్మించిన ఈ విస్సావధాన్లు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను." అని తెలిపిరి.

కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధమనోహరరూపమును చూడగనే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నులవెంట ఆనందభాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదులవారి దివ్యపాదపద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదులవారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా! లే! లే! ఏమిటి ఈ పిచ్చిపనులు? చచ్చి, తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా? అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యులవారు నాతో, ఓయీ! మా బంగారుబుడతడికి తగిన పుట్టములేమైనా కలవా? అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టముల నిచ్చితిని. గురుచరణా! నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొనిపోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంటనుండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్లచెట్టు వద్దకు తీసుకొనిపోయి "విస్సన్నతాతా! నీ సంతానము శ్రాద్ధకర్మలవలననూ, బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుటవలననూ నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనెడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీనిచేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా?" అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్లచెట్టును ఆచ్చాదించి యుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విస్సావధానులు అంతకంటెనూ మహాద్భాగ్యము కలదా ? అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదులవారు నా చేత ఆ ముండ్లచెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావిపుల్లను, మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణలవలననూ అగ్ని జనించినది. నేను ఆ ముండ్లచెట్టును దగ్ధము చెసితిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదులవారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, "శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునపుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమునావరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనపుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనముచేసి, అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నిలేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి ఋణానుబంధమో కలిగియున్న ఆ జీవులు ఏదో ఒక పొరబాటువలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి  యుండిననే గాని గోఘ్రుతము వంటి పవిత్రపదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయినయెడల దేవతలకునూ, మానవులకునూ విశ్వనియంత చేత ఏర్పరుపబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమమహర్షి తన ఆశ్రమము నందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమమహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయాగోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరీ అవతరణము గావింపబడినది. కావున గౌతమమహర్షికి లోకమెంతయో ఋణపడియున్నది. గౌతమమహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత.

ఈ విస్సావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమమహర్షికినీ, విస్సావధానులకునూ ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రము నందు జన్మించుటయే! ఇది అత్యంత స్వల్పమైన ఋణానుబంధమే అయిననూ, త్రేతాయుగములో యిదే పీఠికాపురములో సవిత్ర కాఠక చయనములో గౌతమమహర్షి కూడా పాల్గొనియున్న కారణముననూ, విస్సావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే గాక, అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణముచేతనూ, అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని యీ దత్తుడు ప్రసాదించగలడనెడిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతనూ, యీ సంఘటన జరిగినది. ఋణానుబంధము లేనిదే శునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్ధమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయుము. వీలు లేకపోయిన శాంత వచనములతో నీ అసమర్ధతను తెల్పుము, అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ యెడల నిర్ధాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో, యీ  లోకమెంత సత్యమో, యీ సర్వ సృష్టియునూ ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకునూ నేనే మోలకారణమనెడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకునూ సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా 'సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ' అని చెప్పబడినది. " అను విషయములను సవివరముగా తెలిపిరి.

నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. బాపనార్యుల చెక్కిళ్ళపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులవారు తాతగారి చెక్కిళ్ళపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టిచేతులతో తుడుచుచూ "తాతా! ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే యుంటున్నావు. నీ జన్మ ధన్యము! అచ్చముగా నీ రూపములోనే నృశింహసరస్వతి అవతారము ధరించెదను. యిది సత్యము!" అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయివైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాదా! ఎన్నియో రోజుల నుండి సందేహము నా మనస్సున నున్నది. అడుగమందువా ? అని సందేహమును వేలబుచ్చిరి. తక్షణమే శ్రీపాదుల చిరునవ్వు నవ్వుతూ, తాతా! నీయంతటి వాడికి సందేహమా? పది సంవత్సరముల బుడతడినయిన నేను తీర్చుటయా? అయిననూ ప్రయత్నించెదను, అడుగుము అనెను.  సృష్టి స్థితి లయములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదా చేయునది ? శ్రీపాదుడు 'ఔను' అనెను. వారియొక్క శక్తిస్వరూపములే కదా సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు 'ఔను' అనెను. ఈ త్రిమూర్తులను, వారియొక్క యీ త్రిశక్తులను ఆదిపరాశక్తియే గదా సృష్టించినది. మరల శ్రీపాదుడు 'ఔను' అనెను. "అయిన యెడల నీవు ఎవరు?" అని బాపనార్యులు శ్రీపాదులవారిని ప్రశ్నించిరి. 

(ఇంకా ఉంది.. )