Friday, June 13, 2014

Chapter 20 Part 2

అధ్యాయము 20 భాగము 2
విస్సావధాన్ల వృత్తాంతము 

ఔదుంబర వృక్ష మహిమ 

అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, "నీవు చెప్పునది నిజమే! కాదనను! ఈ సృష్టి యొక్క మర్మమంతయునూ ఆదిగురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము! ఉత్తర క్షణములో వారు ఏమి చేయసంకల్పించెదరో సప్తర్షులు కూడనూ గ్రహింపజాలరు. అట్టిది నీవెంత ? నేనెంత ? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసికక్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించశక్యముగాని కష్టనష్టములకు గురిచేసి కర్మక్షయమొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతారపురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించెడి ఔదుంబర వృక్షమునకు ఆకర్షించి, ఔదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరము నందలి ప్రాణశక్తి ద్వారా తానూ జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్ధమేమనగా ఆ ప్రాణశక్తి ఔదుంబరము నుండి వెలువడి, భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఔదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్టితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడిననూ అది పరిపూర్ణముగనే యుండును. దానికి కారణము శ్రీదత్తాత్రేయుల వారు ప్రతీ ఔదుంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్టితులై యుండుటయే!" అని విశదపరచెను.

నాకు హరిదాసు చెప్పునదంతయూ ఆశ్చర్యముగానుండెను. కృష్ణదాసు అను పేరుగలిగిన ఆ హరిదాసు తన దారివెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో, భక్తితో మా యింటి పెరటియందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగనే గడచిపోయెను. మా దూరపు బంధువొకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయెను. అతనికి పిల్లలు లేరు. నాయందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా యింటనే నివసింపమొదలిడెను. నాకు కొంత ధనమొసగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా యింటనున్న ఔదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలిడెను. మా యింట ఏమి ఇబ్బందులు తలయెత్తిననూ ఔదుంబరమునకు ప్రదక్షిణచేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనెడి వారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరేడిది. మా బాధలు ఊహించనివిధముగా తీరేడివి. దత్తాత్రేయుల వారికినీ, మాకునూ మధ్య స్నేహవారధిగా ఔదుంబరముండెడిది. అయ్యో! దత్తభక్తులకు ఔదుంబరవృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదుంబరము గృహమునందున్న దత్తాత్రేయులవారు సాక్షాత్తు మనయింట ఉన్నట్లే! ఔదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించిననూ అది తక్కువేయగును.

పాపకర్మల ఫలితముగా ముళ్ళచెట్టుగా జన్మించుట

నేను నా వ్యాపార నిమిత్తము ఓఢ్ర దేశమునకు పోవుచూ నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదులవారు బాపనార్యులతో కలిసి పెరటియందుండిరి. వారి పెరట్లో ముండ్లచెట్టు యొకటున్నది. శ్రీపాదులవారు దానికి శ్రద్ధగా నీరు పొయుచుండిరి. బాపనార్యులు శ్రీపాదుల వారిని "బంగారు కన్నా! నీకు యింత ప్రీతిపాత్రమైన యీ ముండ్లచెట్టు సోమలతయో లేక సంజీవినీ మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించిననూ, వహింపకున్ననూ అది పెరుగుట మానదు." అనిరి.

అంతట శ్రీపాదులవారు "తాతా! పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి, 'స్వయంభూదత్తుడే బాపన్నావధాన్ల గారి మనుమడుగా అవతరించెనట! ఎంతటి విడ్డూరము? ఎంతటి దైవద్రోహము? అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' అమ్మయునూ, నేనునూ, అన్నలునూ, శ్రీవిధ్యాధరి రాధ సురేఖలును వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి యింటనూ, నరసింహవర్మ గారి యింటనూ భోజనము చేయు సందర్భమున 'మల్లాది వారునూ, ఘండికోట వారునూ బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారినీ బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయ వలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా? వేదములలో ఉన్నదా?అని కుతర్కములాడిన విస్సావధాన్లు తాతయే - యీ ముండ్లచెట్టు.' 'సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతీ మహారాణిని తమ పుట్టింటి ఆడుబిడ్డగా భావించి భోజనముపెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే 'వెంకటప్పయ్య శ్రేష్ఠి తాతనూ, నరసింహవర్మ తాతనూ అను నిత్యమూ దుమ్మెత్తి పోసిన విస్సావధానులు తాతయే - యీ ముండ్లచెట్టు.' మరణానంతరము ఉత్తరక్రియల లోపములవలన, మహాపాపభారమున, తన స్వభావమునకు తగినట్లుగా ముండ్లచెట్టుగా జన్మించిన ఈ విస్సావధాన్లు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను." అని తెలిపిరి.

కొలదిసేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధమనోహరరూపమును చూడగనే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నులవెంట ఆనందభాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదులవారి దివ్యపాదపద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదులవారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా! లే! లే! ఏమిటి ఈ పిచ్చిపనులు? చచ్చి, తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా? అనిరి. నేను పట్టుబట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యులవారు నాతో, ఓయీ! మా బంగారుబుడతడికి తగిన పుట్టములేమైనా కలవా? అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుపుట్టముల నిచ్చితిని. గురుచరణా! నీకొక వింత చూపెదను రమ్మని వారు నన్ను లోనికి తీసుకొనిపోయిరి. బాపనార్యుల వారు కూడా శ్రీపాదుల వెంటనుండిరి. శ్రీపాదుల వారు మమ్ములను ముండ్లచెట్టు వద్దకు తీసుకొనిపోయి "విస్సన్నతాతా! నీ సంతానము శ్రాద్ధకర్మలవలననూ, బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుటవలననూ నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనెడి వాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీనిచేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా?" అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్లచెట్టును ఆచ్చాదించి యుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విస్సావధానులు అంతకంటెనూ మహాద్భాగ్యము కలదా ? అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదులవారు నా చేత ఆ ముండ్లచెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావిపుల్లను, మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణలవలననూ అగ్ని జనించినది. నేను ఆ ముండ్లచెట్టును దగ్ధము చెసితిని. శ్రీపాదుల వారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానానంతరము శ్రీపాదులవారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి, "శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులనుకొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునపుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమునావరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనపుడు తప్పకుండా వాటికి ఉత్తరక్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనముచేసి, అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయవలసిన విధి ఏదిన్నిలేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి ఋణానుబంధమో కలిగియున్న ఆ జీవులు ఏదో ఒక పొరబాటువలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గోగణాభివృద్ధి  యుండిననే గాని గోఘ్రుతము వంటి పవిత్రపదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయినయెడల దేవతలకునూ, మానవులకునూ విశ్వనియంత చేత ఏర్పరుపబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును. మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమమహర్షి తన ఆశ్రమము నందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమమహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయాగోహత్య పాతక నివారణార్థము వారిచే గోదావరీ అవతరణము గావింపబడినది. కావున గౌతమమహర్షికి లోకమెంతయో ఋణపడియున్నది. గౌతమమహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత.

ఈ విస్సావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమమహర్షికినీ, విస్సావధానులకునూ ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రము నందు జన్మించుటయే! ఇది అత్యంత స్వల్పమైన ఋణానుబంధమే అయిననూ, త్రేతాయుగములో యిదే పీఠికాపురములో సవిత్ర కాఠక చయనములో గౌతమమహర్షి కూడా పాల్గొనియున్న కారణముననూ, విస్సావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటయే గాక, అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణముచేతనూ, అయోగ్యునకు కూడా అవ్యాజకరుణతో సద్గతిని యీ దత్తుడు ప్రసాదించగలడనెడిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతనూ, యీ సంఘటన జరిగినది. ఋణానుబంధము లేనిదే శునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్ధమై వచ్చినచో వీలు కలిగిన సహాయము చేయుము. వీలు లేకపోయిన శాంత వచనములతో నీ అసమర్ధతను తెల్పుము, అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేను కూడా నీ యెడల నిర్ధాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో, యీ  లోకమెంత సత్యమో, యీ సర్వ సృష్టియునూ ఎంతటి సత్యమో, ఈ సమస్తమునకునూ నేనే మోలకారణమనెడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకునూ సత్యమైన పరమసత్యమును. వేదమునందు కూడా 'సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ' అని చెప్పబడినది. " అను విషయములను సవివరముగా తెలిపిరి.

నేను నిశ్చేష్టితుడనై చూచుచుంటిని. బాపనార్యుల చెక్కిళ్ళపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులవారు తాతగారి చెక్కిళ్ళపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టిచేతులతో తుడుచుచూ "తాతా! ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే యుంటున్నావు. నీ జన్మ ధన్యము! అచ్చముగా నీ రూపములోనే నృశింహసరస్వతి అవతారము ధరించెదను. యిది సత్యము!" అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయివైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాదా! ఎన్నియో రోజుల నుండి సందేహము నా మనస్సున నున్నది. అడుగమందువా ? అని సందేహమును వేలబుచ్చిరి. తక్షణమే శ్రీపాదుల చిరునవ్వు నవ్వుతూ, తాతా! నీయంతటి వాడికి సందేహమా? పది సంవత్సరముల బుడతడినయిన నేను తీర్చుటయా? అయిననూ ప్రయత్నించెదను, అడుగుము అనెను.  సృష్టి స్థితి లయములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదా చేయునది ? శ్రీపాదుడు 'ఔను' అనెను. వారియొక్క శక్తిస్వరూపములే కదా సరస్వతీ, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు 'ఔను' అనెను. ఈ త్రిమూర్తులను, వారియొక్క యీ త్రిశక్తులను ఆదిపరాశక్తియే గదా సృష్టించినది. మరల శ్రీపాదుడు 'ఔను' అనెను. "అయిన యెడల నీవు ఎవరు?" అని బాపనార్యులు శ్రీపాదులవారిని ప్రశ్నించిరి. 

(ఇంకా ఉంది.. ) 

       

No comments:

Post a Comment