అధ్యాయము 20 భాగము 3
విస్సావధాన్ల వృత్తాంతము
శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు. అన్నింటికి మూలము శ్రీపాదుడు
తాతగారి నోటివెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధమనోహరముగా నవ్వి, "తాతా! ఇప్పుడే మీ కండ్ల ఎదురగనే ముండ్లచెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్రప్రమాణము ఉన్నదా? అనెడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగభూమికలందుననూ ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టియందంతటను ఒకే భగవచ్చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమైయున్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనునది అనుభవమున ఉన్నది. ఈ కాలమనునది సూర్యచంద్రాది ఖగోళములవలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయజ్ఞానము ఏకకాలముననే అనుభవములో గల వారు అత్రిమహర్షి. ఈ సృష్టి యందు అనసూయా తత్త్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణశరీరములు. భూత భవిష్యద్వర్తమానములు మొదలయిన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయునూ ఏకకాలముననే అనుభవము, అట్టి స్థితియందు త్రిమూర్తులును, త్రిశక్తులును నా యందే యుండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులును, త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తియందే యున్నారనెడి మాట యదార్థమే! నేనునూ, ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే యిచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియునూ మాతృగర్భము నుండే వెలువడవలననెడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ ఆవిర్భవించినవి. అయితే ఆ ఆద్యపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన యీ విధముగా ఉండవలెననెడి సంకల్పము గాని ఏ విధముగ కలుగవలెను ? దాని ప్రభోదన శక్తియే నేను అనగా మహా సంకల్పస్వరూపము! ఆ మహాసంకల్పము ననుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్పస్వరూపమే పరమ గురుస్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏక కాలము లోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగెడి మూలశక్తిని నేనే! సృష్టియందు మాతాశిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యభర్త సంబంధము, అన్నాచెల్లెల్ల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీదేవతాస్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని, మాయాశక్తియును, మహాశక్తియునూ, యోగశక్తివలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్యపరాశక్తిగా గాని, మూలదత్తునిగా గాని ఆరాధించునపుడు త్రిమూర్తులునూ, త్రిశక్తులునూ అంతర్లీనస్థితిలో నుండును. ఈ దైవసంబంధములునూ, వాటి తత్త్వములునూ, ఆయాస్థితుల అనుభవములునూ కేవలము సాధనాసంపత్తి కలిగిన వారికే అవగతమగును."
శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును.
మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచజన్మ నుండి విముక్తమై, మానవజన్మనొంది తగిన సమర్థత కలిగిన వ్యక్తినుండి అది నేర్వవలెను. నేను ప్రతీ జీవితోడనూ అంతర్గతముగా సంబంధమును కలిగియుండుటచే జీవుల సంస్కారములను, మలినములను వారి నుండి స్వీకరించి, ప్రతీ నిత్యము స్నానజపాదులవలన వాటిని దగ్ధముచేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్నారాధించు వారి అనేక పాపసంస్కారములను నా యందు ఆకర్షించుకొని మనయింట కులదైవముగనున్న కాలాగ్నిశమనదత్తుని స్థూలపూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగెడి మహాఫలమును నన్ను ఆరాధించువారికి ధారపోసేదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును గనుక, నేనే చేసెడి కర్మలకు సద్యఃఫలితములు కలుగును గనుక, ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆదిగురుస్వరూపము! తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడైయున్నాడో గురువు యొక్క తపః శక్తికి, ఆ గురువు యొక్క శిష్యులు కూడ వారసులై యున్నారు. భగవద్గీతలో కూడా కర్మచేయుట అనివార్యమను విషయము తెలియ జేయబడినది.
నా అవతారమునకు సమాప్తి లేదు
దత్తుడనయిన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయి వరముల నిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి, వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. తాతా! అందువలననే నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములయిన గురువుల రూపమున నున్నది నేనే! ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగువేసిన, నేను నా భక్తునివైపు నూరు అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తులనుండి, బాధల నుండి కాపాడుట నా సహజ నైజము. " అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను, మహాప్రభూ! సోమలత గురించియూ, సోమయాగము గురించియూ నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదుల వారు సోమలతనే సంజీవినీమూలిక అని అందురని చెప్పి, నీకు దానిని చూడవలెనని ఉన్నదా? అని అడిగిరి. నేను ఔనంటిని. వెంటనే వారి చేతియందు సంజీవినీ మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా యీనాటికినీ నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది.
శ్రీపాదులవారు "ఈ సంజీవినీ వనమూలికలు హిమాలయ పర్వతశ్రేణులలోనూ, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధూనదీ ఉద్గమస్థానం దగ్గర, మల్లిఖార్జున ప్రభువు నిత్యనివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్రదేవగిరి, వింధ్య పర్వతశ్రేణి, బదరీ అరణ్యప్రాంతములందునూ లభ్యమగుచున్నవి. దీని వలననే లక్ష్మణుడు మూర్ఛనుండి కోలుకొనినాడు. దీనిని సేవించుటవలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనెడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకునూ, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు యిది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్నివలన గాని, జలమువలన గాని, విషము వలన గాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అణమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలుకాగానే ప్రతీరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులూ రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్ళలో తడిపి రాత్రి గదియందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వతశ్రేణి, భీమశంకరపర్వతముల దగ్గర క్రూరమృగాలు ఈ సంజీవినీమూలికను కాపలాకాయుచుండును. అర్థరాత్రి అమావాస్యరోజున దివ్యకాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా! గురుచరణా! ఈ విధముగా 24 రకాలయిన దివ్య ఔషధమొక్కలు ఉన్నవి. ఇవి అన్నియూ చాలా పవిత్రమయినవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములయిన వేదమంత్రములను ఉచ్ఛరించుచూ, అత్యంత వినమ్రభావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ యిరువయినాలుగు దివ్య ఔషధమొక్కలు 1) సోమ 2) మహాసోమ 3) చంద్రమ 4) అంశుమాన్ 5) మంజువాన్ 6)రజితప్రభు 7) దూర్వా 8)కనియాన్ 9)శ్వేతాన్ 10)కనకప్రభ 11)ప్రతానవాన్ 12)లాల్ వృత్త 13)కరదీర 14) అంశవాన్ 15) స్వయంప్రభ 16)రుద్రాక్ష 17) గాయత్రి 18)ఏష్టమ్ 19)పావత 20)జగత్ 21)శాకర్ 22)అనిష్టమ్ 23)రైక్త 24)త్రిపదగాయత్రి. " అని తెలిపిరి.
నేను శ్రీపాదుల వారి నుండి శలవుగైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని.
నేను శంకరభట్టునకు యీ వృత్తాంతమును వివరించుట పూర్తికాగానే మహాగురువుల మానససంచారము పూర్తి అయినట్లుగా, వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను, ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి. "మీరు యిరువురునూ కృష్ణ దాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదముపొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్ననూ ఎంతదూరములోనున్ననూ, నేను మిమ్ములను ఎల్లప్పుడునూ గమనించుచునే యుందునని గ్రహింపుడు.
భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవసమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్రవిచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూలదృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూలశరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్ఠమైయున్నది. ఏ యుగములోని వారైననూ, ఏ దేశములోని వారైననూ, ఏ కాలములోని వారైననూ, నా కటాక్షమును పొందిన యెడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్టితమగును. ఇది యోగదృష్టి కలవారికెల్లరకూ అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవచైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను.
నాయనా! శంకరభట్టూ! అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థాన మేర్పడగలదు. నా మాతామహ గృహమున నా జన్మస్థలమున ఔదుంబర వృక్షచ్ఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠిoపబడును. నా యొక్క, నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్యదృష్టిని నిచ్చుచున్నాను. చూడుడు! అని గురుచరణుని, నన్నూ భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందరదృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము. లీలలు విచిత్రములు. మేము బయలుదేరునపుడు వారిట్లనిరి. వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
(అధ్యాయము 20 సమాప్తం )
No comments:
Post a Comment