అధ్యాయము 21 భాగము 1
దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట
సాధకులకు స్థానశుద్ధి, భావశుద్ధి ఆవశ్యము
నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞమేరకు గురుచరణునితో కలసి మాంచాల గ్రామదర్శనమునకు బయలుదేరితిని. దారి మద్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మవిద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, "అయ్యా! వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదులవారు అంటిరి గదా! ఆ మహాభాగ్యుడెవరు ? అతడు ఏ కాలములో వచ్చువాడని" నేను ప్రశ్నించితిని. అంతట గురుచరణుడిట్లనియె! అయ్యా! శంకరభట్టు! అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్యసంకల్పము వలన గాక మహాతపస్వులు అరుదెంచవీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్ఛారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చట నున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాళము నందలి దిశదిశల నుండియూ భావతరంగములు ఎల్లప్పుడునూ ప్రసరించుచునే యుండును. పవిత్రభావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబలశక్తి సంపన్నములయినపుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశము నందు దుష్టములైన భావతరంగములున్న యెడల దుష్ట పురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను. భావశుద్ధి కలిగినవాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగియుండవలెను. ద్రవ్యశుద్ధి గలవారి నుండి మాత్రమే ధనమును గాని, అన్నమును గాని స్వీకరింపవలెను. వేదవేదాంతములందు మహాపండితుల మనుకొనువారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారివలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓఢ్రదేశమునందలి జగన్నాథపూరీ మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచ్చట నేను జగన్నాధునకు బదులు శ్రీపాదులవారిని దర్శించితిని. నాతోబాటు ముగ్గురు నలుగురు శ్రీపాదభక్తులుండిరి. వారికి తమ యిష్టదేవతారూపములో దర్శనమిచ్చి, వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి సమస్త దేవీదేవతా రూపములును తామేనని మౌనముగా బోధించిరి.
దండిస్వామికి గర్వభంగము
అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి యొకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరయినా మహాత్ములు తటస్థించినపుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభా! మహాప్రభూ! ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చునట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరువచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కముతో "శ్రీపాదుడనెడి వాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు. వాని శిష్యులయిన వీరు కూడా క్షుద్ర మాంత్రికులే! తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసిననూ, మా స్వాముల వారు మహాశక్తిమంతులు గనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టికరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు." అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమయితిమి. శ్రీపాదులవారి లీలావిధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి, వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్త రక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించునదియును వారే! దానికి పరిష్కారమును చూపి ఆదుకొనువారును వారే! ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తరువాత దండిస్వాములవారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయములో నేను కూడా మార్గమధ్యమములోని పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ బాపనార్యులవారి యందుననూ, శ్రీ అప్పలరాజుశర్మ వారి యందుననూ, శ్రీపాదుల వారి యందుననూ ద్వేషభావమును విషముజిమ్ము స్వభావమును కలిగినవారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుక్కుటేశ్వరాలయము నందలి దేవీదేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు, "ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తనయొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమణచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనముగా చేసికొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచిరోజులు వచ్చినవి. మీరు నిశ్చింతగా నుండుడు." అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేదమంత్రఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకొనివచ్చుటకు కుక్కుటేశ్వరస్వామి దేవాలయమునకు పోయిరి. "తానూ స్వయముగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమొనర్పవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరయి క్షమాపణ చెప్పుకోవలయును. అప్పలరాజశర్మ గారు దండిస్వామి ఎదుట హాజరయి తానూ పరంపరాగతముగా అర్చించే కాలాగ్నిశమనదత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాములవారు విధించు శిక్షకు పాత్రులు కావలెను." అని ఊరంతయునూ చాటింపు వేయబడెను.
వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్యవైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోను, దండిస్వామికి శ్రీపాదులవారు గాని, అప్పలరాజు శర్మగారు గాని, బాపనార్యులు గాని తలవంచరాదనియు ఇటువంటి అకృత్యములకు మద్దతునీయరాదనియు తీర్మానించిరి. నరసింహవర్మగారి అధ్యక్షతను జరిగిన క్షత్రియమహాసభయు యీ విధముగనే తీర్మానించిరి.
శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్షచ్ఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖభారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మగారును, శ్రేష్ఠిగారును, బాపనార్యులవారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చొనియుండిరి. అప్పలరాజుశర్మ చేష్టలుడిగి వెఱ్రివానివలె కూర్చొండెను. శ్రీకృష్ణ సదృశ్యు లయిన శ్రీపాదుల వారు నిద్ర మేల్కాంచి, తనకు ఆకలిగా నున్నదనియూ, పెరుగు అన్నము తినెదననియూ చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండిగిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి. అప్పలరాజుశర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయునూ, శ్రేష్ఠిగారును మహానందముతో సుశ్రావ్యముగా నున్న ఆ పవిత్రవేద ఋచలను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయును పవిత్ర ఋష్యాశ్రమమువలె నుండెను.
కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపుముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము యిటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండిస్వామి తన శిష్యులతోను, పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోను వేదఘోషతో అచ్చటినుండి బయలుదేరెను.వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్ళను కదుపుచూ, ముందుకు మాత్రముపోజాలక అచ్చటనే యున్నట్లు కనుపించుచుండెను. ఈ విధమయిన విచిత్ర విన్యాసముతో ఎన్నియో ఘడియలు గతించుచుండెను. అందరునూ యీ వింతను చూచి ఆశ్చర్య చకితులగుచుండిరి. ఇంతలో దండిస్వామి వద్ద నున్న బ్రహ్మ దండము రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలయినట్లు తోచి నేలమీద చతికిలపడెను. పీఠికాపురవాసులకు యీ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియూ, శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరుగగలవనియూ వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదలి యింటిపట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను.
(ఇంకా ఉంది.. )
No comments:
Post a Comment