Wednesday, March 28, 2012

Chapter 15 Part 2

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 2
జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ

అంతట నేను "అయ్యా! జీవమున్నప్పుడే కదా బాధగాని, సుఖముగాని అనుభవమయ్యేది? అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును?" అని ప్రశ్నించితిని. అంతట బంగారప్ప, "జీవాత్మ, పరమాత్మలో కలిసియున్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలుకానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ, శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది, అనగా ప్రాణమనునది లేనపుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచూ, తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభావిన్చుచూ లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచూ నిద్రాణస్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై, దాని సరిపడని విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము. దానిలో నున్న ప్రాణము నిద్రాణస్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరియొక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా నున్నపుడు నిద్రాణమైయున్న ప్రాణము యిప్పుడు చైతన్యవంతమై నితారుగానో, వాలుగానో ఉండవలెననెడి సంకల్పమును కలిగి యుండును. అయితే ధృడత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచూ సగము జీవనసహితముగను, సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననెడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచూ మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షిరూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలె క్షీరమునొసంగుట చేత తనకు తెలియకుండగనే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహారధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్య కర్మలు, పాపకర్మలు చేయబడుచుండును.

సాధన పథమున సప్తభూమికల విచారణ

మానవుడు తన పరిణామక్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు, సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. మూడు, నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనయినప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాల దిగ్భ్రాంతికి లోనయింది. అపుడు ఆమె తాను శిలా చైతన్యములో నున్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే మూడు, నాలుగు భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగనే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజస్థితిని పొందినది.

నాలుగవ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగాశాక్తులు లభించును. తమ యోగశక్తులను లోకకళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితిలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము, తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం యీ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవజన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అయిదవ భూమికలో నున్నవారు సంకల్పజ్ఞానులు. ఆరవ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాల తక్కువగా ఉంటుంది. ఏడవభూమికలో నున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు." అని తెలియపరచెను.

అవతార పురుషులకు, సాధకులకు గల వ్యత్యాసము 

బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం యిట్లు ప్రశ్నించితిని. "అయ్యా! జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా? లేక అవతారములకు కూడా యివి వర్తించునా? " అంతట బంగారప్ప "అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన యెడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన యెడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ, భూమిమీద వాడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము, భూమిమీద వాడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము, మృగములలో శ్రేష్ఠమైన సింహపు ముఖాకృతితోను, మిగిలిన భాగము మనుష్య రూపముతోను ఉన్న అవతారము. యాచనాప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్త్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్త్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వము నందలి అనేకత్వమును, అనేకత్వము నందలి ఏకత్వమును తన యందె నిలుపుకొనివచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి ఋణానుబంధము లేని యోగసంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదులవారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములునూ, అన్ని సంప్రదాయములును వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికినీ ఆది బిందువు, అన్త్యబిండువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారము నంతయునూ పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి నొందించునది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతు పట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా! శంకరభట్టూ! నీవు ధన్యుడవు! వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు." అని చెప్పెను.

సత్కర్మ, దుష్కర్మల ఫల వివరణ 

"అయ్యా! నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినపుడు లోకములో కొందరిని మంచివారు గానూ, మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేల? అని నేనడిగితిని.

దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, "నాయనా! నీవు మంచి ప్రశ్ననే అడిగిటివి. సృష్టి యంతయునూ ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది. అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవధర్మములకు, జంతుధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు, దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్న వికాసముగాని, పరిణామముగాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన యెడల, అన్నియునూ మంచిశక్తులు మాత్రమే వారియందు కలవని అర్థము కాదు. నీవు యీ ప్రపంచములో చూచేది మోసము, దగా, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనునది తెలియరాదు. మనము చూచెడి యీ కోటానుకోట్ల నక్షత్ర రాశులన్నియు మొట్టమొదట అస్త్యవ్యస్తముగా ఏర్పడినవే! అవి పరస్పరము డీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్రరాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధృవుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై, సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై, దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకునూ, నాస్తికులకునూ వారే ఆధారము. సత్కర్ములకునూ, దుష్కర్ములకునూ వారే ఆధారము. ఈ సృష్టిలీలలో ఏదియునూ స్థిరము కాదు. నీవు యీనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే! అందువలననే యీ జన్మలో ధర్మతత్పరులైయున్నను వారికి దుఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్యఫలానుభవము కాని వేరు కాదు. సామాన్య పాపముకాని, పుణ్యము కాని వెంటనే ఫలితముల నీయవు. అయితే తీవ్రమైన పాపముగాని, మహాపుణ్యముగాని చేసిన యెడల శీఘ్రముగనే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకొన్నయెడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకుగాని, చెడుపని చేయుటకుగాని వానికి పరిమితమైన స్వేచ్ఛ యీయబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కు తోచని స్థితిలో నున్నపుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు. చావు, పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యనుండుట అద్భుతమైన విషయము." అని చెప్పిరి.      
 
(ఇంకా ఉంది..)  

No comments:

Post a Comment