Saturday, March 10, 2012

Chapter 14 Part 4

అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 4

నాయనా! శంకరభట్టూ! సకల దేవతలును తెజస్సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని, పురోగమనమునకునూ వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్య పోషకులు. దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్ట శక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది, వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. ఆశ్వమను శబ్దమునకు గుఱ్ఱము అని లౌకికార్థము. అయితే వేదఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును, మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించి ప్రాణమయ చైతన్యమునకు, జాజశ్శక్తికి, జీవశ్వాశశక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలయిన జీవరాశులవలెనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములయినవి కానేకావు. అవి సజీవములయిన జననోపచయ సంభూతములు. కొన్ని మూలబీజములనదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి, వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగ వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్కదానికిని ఒక సమాన ప్రకాండము, మానసిక తత్త్వ చరిత్ర కలదు.

బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము

వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రానేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క యింద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పధ్ధతి ప్రకారమే ప్రానేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయనా! దేవతలందరునూ మంత్రస్వరూపులు.  ఈ జగత్తు అంతయునూ దైవాధీనమయి ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులయి ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములై యున్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలైయున్నారు.

శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలయిన అత్యంత స్వల్ప పరిమితిగల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని శేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావవైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిష్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు యీ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును.

పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడినవాడవు. నీవు దానిని సంస్కృత భాషయందు రచించిననూ, అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడిననూ, పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే! శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్ననూ శ్రీపాడులవారు అచ్చటనే సూక్ష్మ రూపమున యుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను. సావధానముగా ఆలకింపుము.

శ్రీపాదుల వారు సప్తవర్షముల ప్రాయము వారయిరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల యిండ్లలో యిటువంటివి జరిగినపుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాపనార్యులవారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురము నందుండు దత్తదాసుడను మాలదాసరికి యీ మహోత్సవమును చూచుయోగము కలుగలేదు. అతడు పంచమజాతికి చెందిన వాడయినందున యీ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరిని తన యింటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించెదమని చెప్పెను. వారందరునూ ఎంతో ఆసక్తితో వాని యింటికి చేరిరి. దత్తదాసు దత్తచరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. "పూర్వయుగములందు అనసూయామాతకును, అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే యీనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్దారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగును గాక!" ఇంతకంటె శ్రీగురుని గురించి చెప్పుటకు అతనివద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదులవారి అమృతదృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదులవారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తానూ మాలదాసరి యింటికి వెంటనే పోవలసియున్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదులవారిని కారణమడుగగా "విశుద్ధ అంతఃకరణుడయిన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసినవారికి యివ్వవలసిన సద్యః ఫలితమును వెంటనే అతనికి యివ్వవలసియున్నది" అని శ్రీపాదులనిరి.

శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు

శ్రీపాదులవారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి నీయలేదు. అంతట క్రోధావేశముతో శ్రీపాదులిట్లనిరి. "మీరు ఎవరినయితే పంచములని, నీచజాతివారని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారియందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములో వారు ఉన్నతస్థితియందుందురు. రాబోవు శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యము నందలి అధికాంశము సేవకావృత్తినవలబించి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైననూ మార్చుటకు వీలుండదు.అయితే మీ బ్రాహ్మణ్యము నందు ఎవరయిననూ ధర్మబద్ధులై జీవించుచూ, దత్తభక్తిని కలిగినయెడల వారిని కంటికి రెప్పవలె కాపాడెదను."

శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీజనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలదిసేపటికి శ్రీపాదులవారు శాంతులయి మౌనము నవలంబించిరి. 

సరిగా యిదే సమయములో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి.వారు ప్రేమతో సమర్పించిన మధురములయిన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతీ ఒక్కరినీ శ్రీపాదులవారు ఆశీర్వదించిరి.

నాయనా! శంకరభట్టూ! చూచితివా? శ్రీపాదులవారి దివ్య ప్రేమ! వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని, మరే విధమైన భౌతికములయిన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించిననూ భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన యెడల కష్ట నష్టములకు గురి యగుదురు.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము 

(అధ్యాయము 14 సమాప్తం)     

No comments:

Post a Comment