Wednesday, March 7, 2012

Chapter 14 Part 2

అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 2

అంతట నేను, "అయ్యా! శ్రీగురుని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలదిని ఇంకనూ తెలిసికొనవలెననెడి ఉత్సుకత మిక్కుటమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నృసింహ సరస్వతీ నామమున అవతరించెదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకోన ఉత్సాహము కలుగుచున్నది." అని అంటిని. అందులకు స్వామి, "నాయనా! వేదఋషులయొక్క తత్త్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతస్సత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. "ఋతము" అనగా సత్యము. ఇదియే ఆత్మా సత్యము. వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునపుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహినీ. దీనిని వర్ణించునపుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, మహావర్ణవమును తెలియజెప్పునదిగాను, మనయొక్క చిత్తములను ప్రకాశింప చేయునది గాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధకశక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమొనరించెదరు. పరమసత్యమును, అంతర్ జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనునది అంతః ప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతల కర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను, అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద. అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగూఢ అర్థము యోగ్యులయిన వారలకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచినయెడల వెన్న కాచిన నెయ్యి అయితే 'ఘ్రుత' శబ్దమునకు దీప్తి యని మరొక అర్థమున్నది. వేదమందు 'గో' శబ్దమునకు 'వెలుగు' అని అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మబలమునకును, తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమైయున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచూ ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్తమున్నది. పుత్రోత్పత్తి అనునది అంతః శక్తి జనకమునకు సంకేతము. దీనినే వారు 'అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు' వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. 'సలిలం అప్రకేతం' అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమైయున్న జడాబ్ధి అను చీకటి సముద్రము నుండి తన స్వకీయశక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహా సముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో, సరస్వతి తన అంతర్ జ్ఞాన కిరణములలో ఊర్ధ్వసలిలములను మనకు గోచరింప జేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త స్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి 'సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని' చెప్పియున్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యముల నోనగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు. తమశ్శక్తులు. సత్యజ్ఞానమును అన్వేషించువారికి ప్రబలవిరోధులు." అని వివరించిరి.


ఔదుంబర వృక్షమునకు యిచ్చిన వరములు, నరసింహ సరస్వతి అవతార వైశిష్టము


నాయనా! శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్థంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యెను. కొంతకాలము తరువాత రెండు ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్థంభము చిగుర్చుట నారంభించెను. అచ్చట ఔదుంబరవృక్షము రూపొండెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయులవారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి, ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైతసిద్ధాంతమునందు ఆసక్తి యుండుటను గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతి వేషధారివై దీన జనోద్దరణ చేయగలవనియూ, ద్వైతసిద్ధాంతమును ప్రచారము చేయగలవనియూ వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణకమలములపైబడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీదత్తులు "ప్రతీ ఔదుంబరమూలము నందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగము నందు నృశింహసరస్వతీ నామము వహించి అవతరించెదనని వాగ్దానము చేసిరి. ఇదంతయునూ పైంగ్య బ్రాహ్మణము నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమియయిన హిమాలయము నందలి శంబలగ్రామ పరిసరములందు మాత్రమే నిలచియున్నది. మిగిలినచోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా? లేదా? అను ప్రశ్న ఉదయించినపుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్థంభము నుండి ఆవిర్భవించిన ఆవేశావతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మషచిత్తులై దైవమున్నాడా? లేడా? అను కుతర్కములు చేయునెడ తాను ఉన్నానని ఋజువుచేయుటయే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసెదననుటకు సూచన ప్రాయముగా వారు నృశింహ సరస్వతీ నామమున అవతరించెదరు.


అంతట శ్రీస్వామి వారిని "అయ్యా! మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదులు వారిని దర్శించితిరా! వారి బాల్య లీలలను వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది." అని అడిగితిని.


(ఇంకా ఉంది..)         

No comments:

Post a Comment