Thursday, March 8, 2012

Chapter 14 Part 3

అధ్యాయము 14 
దత్తదాసునకు అభయ ప్రదానము - భాగము 3 
శ్రీపాదుల వారి అద్భుత లీల 

శ్రీస్వామి యిట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండియూ నత్తి యుండెడిది. అందరునూ నన్ను హేళన చేయువారు. దీనికితోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. అయిదవ సంవత్సరము నుండి యీ జబ్బు ఉధృతమవసాగెను. ఒక్క సంవత్సరము గడుచుసరికి, పది సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు పది సంవత్సరముల వయస్సు వచ్చి నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగెను. 

శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు యివ్వబడుచుండెను. విద్వత్తు కలిగినవారలకు, భూరిదక్షిణలు యీయబడుచుండెను. శ్రీపాదులవారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొనిపోయెను. శ్రీపాదులవారి వయస్సు ఆరు సంవత్సరములు మించదు. యజ్ఞమున కవసరమైన  ఘృతము  సేకరింపబడెను. ఆ ఘృతము నంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు.  ఘృతము నందలి ఒక వంతు భాగమును తన యింట రహస్యముగా దాచివేసి మిగతా మూడువంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను.  ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘ్రుతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు యిటువంటి విఘ్నము కలుగుత అందరికినీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనముతో శ్రీపాదులవారి నవలోకించిరి. అంతట శ్రీపాదులవారు, "నా ధనమును అపహరింపవలెనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట యీ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింప దలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చునపుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డుకర్రతో ఒకటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించువారి యింట జ్యేష్ఠాపత్నీ సమేతముగా శనైశ్చ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను." అని పలికిరి. శ్రీపాదులవారి మాటలు ఎవరికినీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరుగబోవు సంఘటనలు గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదులవారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి, తాళపత్రముపై, "అమ్మా! గంగామతల్లీ! యజ్ఞ నిర్వహణ కవసరమైన ఘృతమును యీయవలసినది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్యశ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ." అని వ్రాయించిరి. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరునూ చూచుచుండగనే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను.

మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు "కొంచెము సేపు ఆగుడు. మీ అబ్బాయి జబ్బును నివారించెదను. నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను." అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘ్రుతమును అపహరించినందులకు ఏమయినా కీడు వాటిల్లునాయని అతడు లోలోన చింతించు చుండెను. తను ఘ్రుతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదయిననూ , శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని ధృఢ నిశ్చయమునకు వచ్చెను. అపుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను.

శ్రీపాదులవారు: తాతా! నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు గదా! ఒక గృహమును పరశురామ ప్రీతీ గావింపవలెను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింప వలసినదనిరి. 
వృద్ధ బ్రాహ్మణుడు: గృహ నిర్మాణమునకు, శంఖుస్థాపనలకు ముహూర్తములుండును గాని, గృహ దహనములకు ముహూర్తములుండవు అనిరి.

శ్రీపాదులవారు: చౌర్యముచేయుటకును, గృహదహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? 
వృద్ధబ్రాహ్మణుడు: అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమయినా వర్జ్యములు , దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు.

శ్రీపాదులవారు: అయిన యెడల యిప్పుడు అటువంటి వర్జిత సమయమేమయినా జరుగుచున్నదా?
వృద్ధ బ్రాహ్మణుడు: ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది.

శ్రీపాదులవారు: తాతా! ఎంత శుభవార్త చెప్పితివి. పరమపవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు, ఆ యింటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు.

శ్రీపాదులవారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకొని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదులవారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ, ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోను సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులాజ్ఞాపించిరి. ఈ విధముగా మూడురోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల యింత అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనయితిని. శ్రీపాదులవారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకము పైనుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, "ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేరా ప్రసిద్ధుడవయ్యెదవు గాక! గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించేడవు గాక!" అని ఆశీర్వదించిరి.

తదుపరి శ్రీపాదులవారు "ఓయీ! నీవును, ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారము నందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని యింటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించిటివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్యకూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయియుండుటను గాంచి గుండెనొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున యీ జన్మలో ఈ వింత వ్యాధికి లోనయితివి. నీ గృహమును పూర్వ జన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము యీ జన్మమున భస్మీపటలము గావించబడినది. మీ యిరువురిని, కర్మబంధముల నుండి నా యీ లీల ద్వారా విముక్తులను చేసితిని." అని పలికిరి.


శ్రీపాదులవారి అనుగ్రహమును పొంది నేను యింటికి తిరిగివచ్చితిని. వేదశాస్త్రములందు పండితుడనయితిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి యిచ్చెను. శ్రీపాదులవారి ప్రమేయముతో మా యిర్వురి కర్మబంధములు విచ్ఛేదనమగుటచే అనంతర కాలమున యిర్వురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి, నత్తి కూడా పోయి పండితుడనయితిని, సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యెను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మసూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది.

(ఇంకా ఉంది..)    

No comments:

Post a Comment