Tuesday, March 27, 2012

Chapter 15 Part 1

అధ్యాయము 15
బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము - భాగము 1

నేను శ్రీ దత్తానందులస్వామి వారినుండి శెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పిక అగుటవలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళితిని. అచట నీరు చేదుకొనుటకు ఒక చేద కూడా కలదు. నేను నూతిలోపలికి తొంగిచూద్దును గదా! ఒక వింత దృశ్యం కంట పడినది. నూతి ఒరల మధ్య భాగము నుంచి మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో, శంకరభట్టూ! అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగితిని. అందులకతడు, "నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియును. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచియున్నాను." అని చెప్పెను.

అతడిని నూతిలోనుండి బైటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు "ప్రాపంచిక బంధములతో సంసార కూపమున బడిన మానవుడవు నీవు. బంధరహితుడనై యీ విచిత్ర యోగప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా యంతట నేనే లేచేడను. మనకు శక్తి చాలనపుడు శ్రీపాదులవారు దయతో శక్తి ననుగ్రహించెదరు." అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. అతడిట్లు చెప్పసాగెను. "నా పేరు బంగారప్ప. నీవు దాహము గొనినట్లున్నావు. నేను నీ దప్పిక తీర్చెదను." అని పలికి తక్షణమే చేదతో నీతిని తోడి తానూ గడగడ త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోయితిని.

అంతట మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితిమి. అతడిట్లు చెప్పసాగెను. "నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్ర తంత్రములలో ప్రావీణ్యమును సంపాదించినవాడను. నాకు అయిష్టులయిన వారిని మంత్ర తంత్ర ప్రయోగాములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందితిని. శ్మశానములలో వివిధములయిన కార్య కలాపములను చేసెడివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడెడివారు. నేను ఏ గ్రామమునకు పోయిననూ, అచ్చటి జనులు నేను భూతప్రేతములను ప్రయోగించుటద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించెదనో అను భయముతో నాకు విశేషముగా ధనము నిచ్చెడివారు. వారొసంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించి యుండు భూతప్రేతముల బలులకు ఉపయోగింపబడెడిది. సకాలములో బలులు సమర్పింపని యెడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు. నా ముఖములో సాధారణ మనుష్యులకుండవలసిన ప్రసన్నత్వము లోపించి భూతప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వ పుణ్యవశమున పీఠికాపురమునకు వచ్చితిని.

దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన యీ నగరమందు క్షుద్రములయిన కుతంత్రములకును, పరస్పర కలహములకును కూడ లోటులేదు. నేను శ్రీ బాపనార్యులవారి గురించి, శ్రీపాదులవారి గురించి కర్ణాకర్ణిగా చిత్రవిచిత్రములయిన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యులవారిని సంహరింపదలచితిని. నేనొక కొలను వద్దకుపోయి దోసిళ్ళకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినయినా చంపదలచుకొన్నపుడు నా వద్ద అనేక రకములయిన ప్రక్రియలుండెడివి. అందులో ఒకటి నేను చంపదలచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచూ నీటిని త్రాగినచో, నేను త్రాగిన నీరంతయునూ ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్టపగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలావిశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండిననూ అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరియై పోవుచున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయితిని. కాని బాపనార్యులవారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా యీ క్షుద్రవిద్య ఎందులకు యీ రోజున విఫలమయ్యెనాయని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండెను.

శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట

నా వద్ద సర్పమంత్రమొకటుండెడిది. అది పఠిoచినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి యింటివద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చిచేరి వానిని కాటు వేయును. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రమును పఠించితిని. అపుడు అనేక సర్పములు బాపనార్యుల యింట చేరినవి. అయితే అవి ఆ యింటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయలవలె వ్రేలాడినవి. రెండు ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్లిపోయినవి. ఈ విధముగా నా రెండవ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్ద నున్న భూతప్రేతములు బాపనార్యుల యింటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయునూ శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో యింకనూ రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదులవారి పిండిబొమ్మను చేసి, దానికి 32 స్థానములలో 32 సూదులను గ్రుచ్చితిని. ఈ మారణప్రక్రియ వలన శ్రీపాదులవారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగితీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోకి యింకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగితీరవలెను. నా యీ ప్రయత్నము కూడా విఫలమయ్యెను. విచిత్రముగా ఒకానొక అర్థరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవము కలిగెను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల యింట చేరిన సర్పములన్నియును పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదులవారి పిండిబొమ్మకు ఎక్కడయితే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్ట చర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే అనుభవింప సాగితిని. నరకయాతననుభవించితిని. చనిపోయిన బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరకబాధలు ఎట్లుండునో చనిపోయిన గాని తెలియవు. కాని నేను ఆ రాత్రి బ్రతికుండగనే నరకబాధాలను చవిచూసితిని. భరించలేని బాధలు కలిగినపుడు ఏ మానవుడైననూ దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చితిని. నా మనోనేత్రమునకు శ్రేపాదుల వారి రూపము గోచరించి, "బంగారప్పా! నీవొనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు యిహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింప వలసియున్నది. అయితే నీయందు కృప వహించి యీ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనలద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్రవిద్యలు అన్నియూ నశించును. అయితే ఎవరయినా దాహము గొనియున్నవారు నీ మనోనేత్రములకు గోచరించినపుడు నీవు నీరుత్రాగి దప్పిక తీర్చుకున్నయెడల వారెంతటి దూరములో నున్నను వారు దాహార్తి తీరినవారగుదురు. తలక్రిందులుగా వ్రేలాడుట అను ఒకానొక యోగప్రక్రియ కలదు. దానిని అభ్యసించినచోనీవు ఆనందప్రాప్తిని పొందగలవు. నేటినుండి సాత్వికప్రవృత్తి ననుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు గాని, బాపనార్యుల వారి గృహమునందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు యీ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనునది ఆకస్మాత్తుగా లభించునది కాదు. దురదృష్టమనునది విచక్షణారహితముగా యివ్వబడునది కాదు. పూర్వజన్మములోని పుణ్యకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు అదృష్టమని అందురు. పాపకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమపూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసినవారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్రవిద్యలతో ఎందరో అమాయకులను అకాలమరణమునకు గురిచేసినావు. ఆ పాపఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనుపించునంతవరకు ఉండును. అతడు దప్పిగొనియున్నపుడు నీవు నీ విద్యనుపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రమును వ్రాయును." అని చెప్పిరి. ఈ సంఘటన జరుగునాటికి శ్రీపాదులవారి వయస్సు ఏడెనిమిది సంవత్సరములుండును. నాయనా! శంకరభట్టూ! ఆ రోజు నుండి నీ కోసమే నేను వేచియున్నాను. నేడు నాకెంతయో సుదినము! అని బంగారప్ప అనెను. నాకు యీ గాధ అంతయునూ అయోమయముగా నుండెను. అంతట నేనిట్లంటిని. అయ్యా! మీరు నీరు త్రాగిన యెడల మరియొకరి దప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినదంటిని. దానికి బంగారప్ప, "నాయనా! అన్నమయకోశము నందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయకోశము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగియుందురు. మనోమయకోశము నందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. విజ్ఞానమయకోశము నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. ఆనందమయ కోశము నందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయశక్తిని ఒకానొక యోగప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయశక్తితో అనుసంధానమొనరించెదను. తద్వారా, యీ తాదాత్మ్యభావము వలన యిది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి, తన ఎదురుగానున్న వానికంటె రెట్టింపు బలమును, శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్రమహర్షి రామ లక్ష్మణులకు బల అతిబల అను రెండు పవిత్ర మంత్రములనుపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకొనినయెడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలుకలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో, ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించునపుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతాక్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12 వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12 వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులయిన శ్రీపాదులవారియందు అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును." అని చెప్పెను. అంతట నేను "అయ్యో! గౌతమమహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియూ, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురు గదా! ఆమె నిజముగా శిలారూపమును పొందెనా? లేక యిందులో ఏదయినా రహస్యార్థమున్నదా?" అని ప్రశ్నించితిని.

అంతట బంగారప్ప, "మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను 'శిల'కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన మునీ! ఎంతపని చేసితివి? అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచూ శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామక్రమములో 'శిల' ప్రథమ స్థానము లోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాతా మరియొక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమశిలలో మరియొక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా, ఆ శిల రెండుగా ఖండించబడెననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా, మరియొక ఖండములో మరియొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమయిన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నపుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును." వివరించెను.


(ఇంకా ఉంది..)                  

No comments:

Post a Comment