Wednesday, October 26, 2011

అధ్యాయము-2 భాగము-3

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 3

ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న యిండ్లుగల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యెను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంటదప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములేవరయినా సమకూర్చిన యెడల స్వయంపాకమును చేసికొని భుజించెదనని తలచితిని.  ఆ పల్లెలో బ్రాహ్మణులెవరయినా ఉన్నారేమోయని సందేహము కలిగి ఆ పల్లెప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, "అయ్యా! మేము కొండజాతి ప్రజలము. నేను యీ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేనియెడల మా నుండి పండ్లు, పుట్టతేనె స్వీకరించవలసినదని చెప్పెను." 'మార్గమధ్యే శూద్ర వదాచరేత్' అని యున్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పుకాదని తలచితిని. వారు కొండకోనలలోనే లభ్యమగు పండ్లు, పుట్టతేనె తెచ్చి నా ఎదుట బెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ యిష్టము వచ్చిన చోట్ల పొడువసాగినవి. నేను భయవిహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునేయున్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద యిట్లనెను. "ఆహా! ఏమి విడ్డూరము! మా ప్రాంతము నందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు యింత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరయినా సిద్ధపురుషుని నిందించుటయో, అవమానించుటయో చేసియున్నావు. వారి శాపఫలితముగా యిటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న యెడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యథా భావించవలదు." అని మిన్నకుండెను.

నాకు సమకూర్చబడిన పండ్లను, పుట్టతేనెను నేను స్వీకరిన్చాలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. నేను పరుగుపెట్టుచున్ననూ కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా ? మరి నాకు శ్రీపాద  వల్లభుల దర్శనప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా! గత జన్మములోని పాపములన్నియును క్షీనించినగాని నాకు శ్రీదత్తప్రభువు యొక్క దర్శనము కాదేమో! నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకొని వచ్చితినో! అవి అన్నియును నశింపవలెనన్న యిటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసివచ్చునో! ఆహా! శ్రీవల్లభుల దర్శనప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో యిన్ని సంకటములు, ఉపద్రవములు యిమిడి ఉన్నవా? హా! దైవమా! నన్నింకను ఎన్ని శిక్షలకు గురిచేయ దలచితివో కదా! ఇంక నన్ను కాపాడువారెవ్వరూ? శ్రీపాద శ్రీవల్లభా! శరణు! శరణు! అని తలచుచూ నెమ్మదిగా అడుగులు వేసికొనుచూ ఒక మేడిచెట్టు మొదలుకు చేరుకొంటిని. శ్రీదత్తప్రభువుల నివాస స్థానమైన యీ మేడిచెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీదత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకెన్నడునూ లేని ఒక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో, లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని, పెద్దపెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్లిపోవుచుండెను. ఇదివరకు కాకులవలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటినుండి నురగలు వచ్చుచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైననూ నేను మరణించుట ఖాయమని తలంచితిని.

సాయంకాలమగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి, ఆరవైచి, ఆరిన బట్టలను మూటలుగా గట్టి, గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి, నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన యెడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక, ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొనిపోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి యుండెను. దుర్గంధ భరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచముపైనుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును దీసి నా చేత త్రాగించెను. పాములు కరచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకులనుండి రసము పాలవలె స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలోను బెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగాసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకొనియుండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో, "విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన యీ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్న యితడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు." అనెను.

కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి యంతయునూ నేను చర్మకారుని యింటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయూ దత్త దిగంబరా! దత్త దిగంబర! శ్రీపాదవల్లభ దిగంబర! అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొనియుంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునపుడు నా హృదయము ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమకులమైన బ్రాహ్మణవంశమునందు జన్మించిన వాడిననియు, అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment