Friday, October 28, 2011

అధ్యాయము-2 భాగము-6

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 6 

శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను ? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్రపరిస్థితుల్లో యిరుక్కొని విచిత్రముగ బయటపడితిని.

నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయవిధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా! మీరు వైష్ణవులా! శైవులా! అని ప్రశ్నించిరి. "మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు, అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపెడివారమనియు, ఆది శంకరుల దక్షినామ్నాయి పీఠం అయిన శృంగేరి యందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియూ" నేను చెప్పితిని. మీరు దయ ఉంచి మా రాజు గారి వద్దకు రావలసినదని వారు కోరిరి. నేను వారిననుసరించి రాజ దర్శనమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరయినా కనిపించిన యెడల, వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, "అంతకు యింత అయితే యింతకు ఎంత?" అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలెనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞము చేయించిరి. అదృష్ట వశమున వానికి పుత్రసంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను, బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుటవలననే తన కుమారుడు మూగవాడయ్యెనని రాజు అభిప్రాయపడెను.అందుచే ఆ రాజు శైవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులయిన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును, వైష్ణవులకును కూడా సంకట ప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానము చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించునట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయు, తక్కిన వంటకములను భుజించుటయూ బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తర్వాతా వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరనో, వండిన తోటకూరనో తినవలసి వచ్చెడిది.

బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియూ, వేదాంతములో పండితులమనియూ, పురాణేతిహాసములలో పండితులమనియు విర్రవీగెడి బ్రాహ్మణులు అందరునూ కూడ తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోను ఒక దత్త భక్తుడు, దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు, తమ దురవస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరునూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించిరి.

తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలెనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతములో చాల గర్విష్టిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో నుండి, మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment