Thursday, October 27, 2011

అధ్యాయము-2 భాగము-5

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 5 

కానీ మీ పితృదేవతలలోని కొందరు స్మశాన కాళికాసాధన చేసి, దానితో అయిష్టులయిన వారిని ఎందరినో, తమ మంత్ర ప్రభావముతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన, నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన యీ సంఘటన జరిగి వారికి ఉత్తమగతులు లభించినవి. 

అయ్యా! బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతిస్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై, సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనెడి భేదమేమియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానము నపేక్షించినపుడు బ్రాహ్మణ ధర్మమూ ననుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్టి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనునది బ్రాహ్మణధర్మ ప్రకారము దోషమైనది. కాని క్షత్రియధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు. సత్యాన్వేషివి. కావున అహింస నీకు పరమధర్మము. కాని కసాయివానికి మాత్రము కాదు.

కావున మానవుడు చేయు కర్మలవలన ఫలితము సక్రమముగా ఉండవలెనన్న, తానూ ఏ కులమందు జన్మించినను, తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు గనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి.

శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతీ క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యానశ్లోకమును పఠిoచుచూ వినోదముగా నీ తోటివారితో వదురుచుండెడివాడవు. "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే" అను శ్లోకమును వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పెడివాడవు. శుక్లాం బరధరం అనగా తెల్లబట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు శశివర్ణం అనగా బూడిదరంగులో కూడినదనియూ చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగినదనియూ, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియూ, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను, అని చెప్పెడివాడవు. అయ్యా! శంకరభట్టూ! శ్రీదత్తప్రభువు బహుచమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అపుడు నీవు దుమ్ము, ధూళితో బూడిదరంగులోనే ఉంటివి. నడువలేక నడువలేక ఒక్కొక్క పర్యాయము రెండు చేతులను నేలకు ఆన్చి నడచివచ్చితివి. ఆ విధముగ నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాస పడుచూ మేడిచెట్టు వద్దకు వచ్చిననూ గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన యెడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను యీ రకమయిన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశమును వినెడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు యిచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్థుల యింట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన యీ సంఘటనను వారికి పొరపాటున చెప్పిననూ వారు నిన్ను తమ కులముల నుండి వెలి వేయుదురు. 

శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిధ్యమును స్వీకరించి రెండు, మూడు రోజులు గడచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment