చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము - భాగము 3
వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కాని, ఆత్మజ్ఞాన ప్రబోధకములయిన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగెను. "గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే! వ్యాఘ్రమా! అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరునూ వ్యాఘ్రాజినముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చునది అయినపుడు, వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను? పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు. గావున నా యొక్క ఆత్మా వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన యెడల ఆత్మజ్ఞానము పొందినట్లే."
సంవత్సర కాలము యిట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గుహవద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపమునే ధ్యానము చేయుటవలన ఆ వ్యాఘ్రరూపమును పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకును, ఆత్మశుద్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి 'ఓం' కారమును నేర్పిరి. "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అను దానిని మంత్రముగా వల్లెవేయమనిరి.
వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున పోవలెను. అపుడు కురువపురమునండు తన భక్త జనసందోహముతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు, వారితో "నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు. నేను యిప్పుడే తిరిగి వచ్చెదను." అని పలుకుచూ కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచునపుడు వారు అడుగుపెట్టు ప్రతిచోట ఒక తామరపద్మము ఉదయించుచుండెను. వారు యీవలి ఒడ్డునకు చేరి "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అని అవిశ్రాంతముగా పఠిoచుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదవల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచూ కురువపురమునకు చేరిరి.అందరునూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి.
శ్రీవల్లభులు కురువపురం చేరి, వ్యాఘ్రము నుండి క్రిందకు దిగీదిగగానే ఆ వ్యాఘ్రము అసువుల బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలెను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వ జన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకొనవలసినదని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులవార శ్రీవల్లభులు "నాయనా! వ్యాఘ్రేశ్వరా! నీవు ఒకానొక జన్మమున మహా బలిష్టుడవైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి, నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు యిప్పించుట మొదలయిన క్రూరకర్మలను చేయుచుంటివి. నీవు మనుష్యజన్మమెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన, కాల కర్మ కారణ వశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసియున్నది. కాని నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపజేసితిని. చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక సిద్ధ పురుషుల దర్శనాశీస్సులను నీవు పొందెదవు. యోగమార్గమున నీవు ఉన్నతుదవై ప్రకాశించెదవు గాక!" అని ఆశీర్వదించిరి.
శంకరభట్టు యింతకు పూర్వము చూచినది సాక్షాత్తూ ఆ వ్యఘ్రేశ్వరునే. అతడు హిమాలయముల యందుండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండ యితడు వ్యాఘ్ర రూపమున కావలి కాయుచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావ ప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరముగాని, వార్తాహరుల అవసరముగాని లేదు. కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయునూ శ్రీదత్త ప్రభువు లీల.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము !
No comments:
Post a Comment