Saturday, October 29, 2011

అధ్యాయము-3 భాగము-1

అధ్యాయము-3 
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం- భాగము 1 
శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ 

శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరము నందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్లూరుచుండెను. మూడురోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. నాలుగవ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపలి నుండి మహా రౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమూ లేదు, సున్నమూ లేదు, అని కసురుకొనెను. నేను గృహము బైటనే కొంతసేపు వేచి యుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, "అయ్యా! అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన యెడల నా నెత్తి మీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు, యీమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును.మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగులగొట్టబడినవి. మా యింట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న యెడల ఇబ్బంది ఉండదు. లేని యెడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి, మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పధ్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకోనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసినవారు ఎవ్వరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుట లేదు. లోకులు 'నీకు అప్పు యిచ్చిన యెడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చునపుడు తీర్చెదమనుకొందువా? ఆ దారియును యిప్పుడు మూసుకొని పోయెను.' అని అనుచుండిరి. స్థితిపరుడనయిన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలచి, 'వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటయినా ఎవరయినా దానమిచ్చిన యెడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే యింటిలో నీకు అన్నము లభించును.' అని అన్నది. అంతట భార్యా విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నియును నాకు బాగుగా తెలియును. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును." అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాదా! శ్రీవల్లభా! ఏమి యీ విషమ పరీక్ష! అనుకోని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు యింటికిని పోయితిని. ధనసహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నమును పెట్టువారే కరువయిరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు యిట్లు పలికెను. "అయ్యా! ఇప్పటివరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీకు కూడా దురదృష్టవంతుడవయితివి." అప్పుడు నేను యిట్లంటిని. "అయ్యా! సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే! వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచూ ఆ కనిపించుచున్న రావిచెట్టు మొదటలో కూర్చొనెదము. ఆపైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము". అని పలికితిని.

దానికి ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిని. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, "అయ్యా! యువరాజుల వారికి మాట వచ్చినది. మూగతనము పోయినది. సత్వరమే మిమ్ములను తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని" విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. "నేను ఒంటరిగా రాజాలను. నాతోపాటు యీ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్లవలెనని చెప్పితిని." దానికి రాజభటులు వల్లెయనిరి. మమ్ములను గుఱ్ఱములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరు గమనించి ముక్కుమీద వ్రేలు వేసికొనిరి.

మహారాజు ఇట్లు పలికెను. "అయ్యా! మహాత్మా! మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలా సేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! శ్రీదత్త దేవా దిగంబరా! అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాకారుడయిన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి, నోటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందురు? శ్రీదత్తప్రభువులకును, ఆ యోగికిని గల సంబంధమేమి?" దయ ఉంచి తెలుపవలసినదని కోరెను.

"శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్త ప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే! వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను, పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని." అని సవినయముగా పలికితిని.

విచిత్రపురము నందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా, రాజునకు సద్బుద్ధి ఏర్పడి, తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేనోళ్ళ శ్రీవల్లభస్వామిని కీర్తించిరి.

రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను. "అయ్యా! యిన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలననూ, వైష్ణవులు శివదూషణ చేయుట వలననూ పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయునూ ఋణపడి యున్నాము." అని పలికెను.

మేము వారి నుండి శెలవు పుచ్చుకుని వచ్చునపుడు మాధవనంబూద్రి కూడా మాతో పాటు వచ్చెదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురమూ అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా యిచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణ్యమునకు యిచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువర్తనురాలాయెను.

(ఇంకా ఉంది...)

No comments:

Post a Comment