Friday, October 28, 2011

అధ్యాయము-2 భాగము-7

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 7 
శంకరభట్టు మహారాజుల సంవాదము   

నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయుచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి? అని తలంచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించునటులే నన్ను కూడా "అంతకు యింత అయిన యింతకు ఎంత అగును?" అని ప్రశ్నించెను. "ఇంతకు ఇంతే!" అని గంభీరముగా బదులిచ్చితిని. రాజు విభ్రాంతుడై యీ విధముగా వచించెను. "మహాత్మా! మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనయితిని. నాకు ఈ మధ్యనే పూర్వ జన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా యింటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసెడివాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నా కంటె కూడ ధనికులు, అన్నపానములకు లోటులేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని, ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. అబ్దీకములకు గాని, వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు, సంభావనలు వచ్చెడివి. అందుండి వంద వంతులలో ఒక వంతు మాత్రమే నాకిచ్చి తొంబై తొమ్మిదివంతులు వారే స్వీకరించెడివారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండెడిది. పైగా నా యింటి నుండి తోటకూరను ఉచితముగా పొందెడివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యధావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు ప్రతిరోజూ తినుట వలన హాని ఏమియూ జరుగదనియూ చెప్పుచుండిరి.

కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వ జన్మలో నేను కటిక దరిద్రస్థితిలో ఉండికూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించితిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగ నేను వారి కంటె ఎన్నో రెట్లు ధనవంతుడుగను, శ్రేష్టుడిగను జన్మించితిని. తోటకూర దానము చేయుట వలన రాజయితిని గదా, మరి యిప్పుడు అప్పటికంటె ఎన్నో రెట్లు బండ్లకొలది తోటకూర దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి? అని యీ వింత ప్రశ్నను వేసితిని. దానికి మీరు సరియైన సమాధానం చెప్పితిరి." అని ముగించెను. అంతట నేను "రాజా! పూర్వజన్మలో పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమయినది. మణులు, రత్నములు, బంగారము వంటివి దానము ఈయదగిన యీ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినాను అందుకు వందరెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమియూ రాదు." అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా యిచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీ చరనులు కృపా విశేషమున గాడిదను అధిరోహించెడి గండము తప్పినదని భావించితిని. "శుక్లాంబర ధరం విష్ణుం..." అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి యిదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కెడి గండము తప్పించినందులకు శ్రీపాదులవారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించితిని.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment