అధ్యాయము-2
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 2
శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు
అపుడు శ్రీ సిద్ధయోగీంద్రులు యీ విధముగా సెలవిచ్చిరి. "శంకరభట్టూ! నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్టించిన శివలింగమును, అప్పుడు ఉన్న యదార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని, సృష్టియని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీదత్త ప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును. వర్తమానము భూతకాలముగా మారవచ్చును. భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీదత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరుగాబోవునది అంతయును వారి సంకల్పము ననుసరించియుండును. ఒక విషయము జరుగుటకు గాని, జరగకుండా ఉండుటకు గాని, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీదత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో, ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారియై శ్రీపాద శ్రీవల్లభులుగా యీ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరి. కురువపురము నందలి మత్స్యకారులవంటి అల్పజ్ఞులు కూడ బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారము నశించవలెను, అన్ని రకముల మదములును క్షీనించవలెను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యదార్థస్థితియును మనకు అవగతమగును.
దేవేంద్ర ప్రతిష్టితమైన ఆ శివలింగమును ధనంజయుడను ఒక వ్యాపారి గమనించి, ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి, అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురానగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతానప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా, ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా మూడేళ్ళ పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతీ నది యీ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహా వైభవోపేతముగా మీనాక్షీ సుందరేశ్వరుల దివ్యకళ్యాణము జరిపించెను.
శ్రీ సిద్ధ యోగీంద్రుల వారు యీ విధముగా సెలవిచ్చిరి. "నాయనా! శంకరభట్టూ! సృష్టినందలి ప్రతివస్తువునుండియూ ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న యీ ప్రకంపనములవలన యితర వస్తువులతో ఆకర్షణ, వికర్షణలు కలుగుచుండును. స్థూల, సూక్ష్మ కారణశరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాప కర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్యవిశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్య కర్మములయందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధిచెందుచుండును. ఆ పుణ్యము వృద్ధినొంది, పాపము క్షీనించిననేగాని శ్రీదత్తప్రభువుల వారియందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల, కర్మ కారణ వశమున రకరకములయిన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృపవలననే నీవు యిచ్చతకు రాగలిగితివి."
నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచూ శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియూ, ఎప్పుడు కురువపురమునకు చేరుదునాయనియూ మనస్సులో తహతహలాడుచుంటిని.
మరునాడు ఉదయమునన మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్టమీద గల రావిచెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రియందు నేను శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమములో నున్నదంతయును భ్రమ మాత్రమేనా ? యని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా? దక్షుడా? మంత్రికుడా? యని మనసున సందేహము కలుగసాగెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగెను. నన్ను యిటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము? అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment