Thursday, October 27, 2011

అధ్యాయము-2 భాగము-4

అధ్యాయము - 2 
శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం- భాగము 4 
 శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము 

సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగిపొరలుచుండెను. అతని నేత్ర ద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు గదా! అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగెను. "అయ్యా! నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే! అంత్యజుడనే! సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలచినాను. మీ పేరు శంకరభట్టు అనియూ, మీరు శ్రీపాద శ్రీవల్లభులవారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియూ, అంతేగాక మీరు కాకులచేతను, సర్పములచేతను, ఎందులకు బాధపెట్టబడినారో కూడా నాకు తెలియును." అనెను. 

నేను దిగ్భ్రాంతికి లోనయితిని. బహుశ ఇతడు కొంత జ్యోతిష్యవిద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించెననుకొంటిని. వెంటనే వల్లభదాసు యిట్లనెను. "అయ్యా నేను జ్యోతిషుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము- పాండిత్య ప్రకర్ష కలిగినవారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్త్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినావో, ఆ పరతత్త్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థము లేని తర్కవితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల అవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిక అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము.  

నిన్న పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్య తత్త్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందగా వప్పజెప్పగలరు, కాని ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గాలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా! మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో! మీరు తర్కప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల, ఎన్ని వేల మార్లు వేదమును వల్లె వేసియుండిరి? ఎంత పుణ్యము! ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి, అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకములందలి సమస్తములైన వారలు, వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. "వేదము ప్రభువు యొక్క ఉచ్చ్వాసనిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వ ధర్మములకును మూలము వేదములే. వేదపఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా, దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేనియెడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైన భోజనము కావలెనన్న వారు యితరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైన ఒక గింజను దానము చేసిన యెడల దేవతలమైన మేము దానిని వెయ్యిగింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనపుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంతఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంతవరకును, స్వేచ్చగా యిందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంత కాలము స్వేచ్చగా ఉండవచ్చును."

ఇంద్రుని వచనములు విన్న వారు సంకట స్థితికి లోనయిరి. ఆకలిదప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి యుండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరల యిట్లు పలికెను. "మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రము నందు నివసించియు పితృ దేవతలకు పిండోదకములు యిచ్చునపుడును, అబ్దీకములు పెట్టునపుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినదీ, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా యిదేవిధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘ కాలము జీవించిరి. ఆహా! ఎంత ఆహారము వృధాగా ఖర్చయినది? వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి యుండిరి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్కవితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నియూ స్పష్టముగా వారిలో కన్పించుచున్ననూ, శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులయితిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తియొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లును అంతవరకు పితృదేవతారూపమైన వాయసరూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడినది." "శంకరభట్టూ! ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి, పూర్వ పుణ్య వశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి." అని శ్రీ వల్లభదాసు పలికెను.

అంతట నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియూ, శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియు నేను గుర్తించితిని. శ్రీవల్లభదాసు యిట్లు పలికెను. "అయ్యా! మీ శరీరము నుండి వచ్చు వాసనచేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి."

నేను "అయ్యా! వల్లభదాసు మహాశయా! ఆ సంఘటన ఎందులకు జరుగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును, సర్పములకును, ఇతరమైన జీవజంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయిన నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడిచేయునోయని చాలా భయముగా ఉన్నది?" అని అంటిని. 

అందుకు శ్రీవల్లభదాసు, "అయ్యా! ఇదంతయునూ శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట యిటువంటి ఉపద్రవములు జరగవు.

ప్రాణములు యిచ్చిన వానికే, ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ యుండదు.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment