Wednesday, December 7, 2011

Chapter 9 Part 3

అధ్యాయము 9
కర్మఫల మీమాంస - భాగము 3

అంతట నేనిట్లంటిని. "అయ్యా! నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు గదా! వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదుల వారు కర్మధ్వంసము నెట్లు చేసెదరు?"

సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దానధర్మముల ఫలితము

తిరుమలదాసు యిట్లనెను. "శ్రీకృష్ణుడు కర్మఫలితములను అనుభవింపవలెననే చెప్పెను గాని జాగ్రదావస్థలోనే వానిని అనుభవింపవలెనని చెప్పలేదు. వాని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన పది సంవత్సరముల కర్మమును మానసికక్షోభవలననో, స్వప్నములలోని మానసిక బాధలవలననో, కొద్ది ఘడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. సత్పురుషులకు, యోగులకు దానధర్మములు, సేవలు చేయుటవలనను, దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడ పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్య స్వరూపములు. వాటికి కైంకర్యములు చేయుట వలన మనపాపము వాటికి ఆపాదింపబడి, వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పున్యమూర్తులకు దానధర్మములు, సేవలు చేయుటవలన ధ్యానశక్తి మధ్యమమున బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని, ఆ సేవామధ్యమమున శిష్యుని పాపకర్మలను తానూ స్వీకరించి తన తపఃఫలమును శిష్యునికి సంక్రమింపజేయును. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతారపురుషులు మహాతేజోమూర్తులు గనుక, వారు అగ్ని స్వరూపులు కనుక, తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు, వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగ నుండిన యీ బదలాయింపు కూడ అంత తీవ్రస్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్ధములయిన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు, రాప్పాలను కొట్టుట ద్వారాను, రకరకముల చిత్రమార్గాముల ద్వారాను వారు ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను. శ్రద్ధగా వినుము.

శ్రీపాదులవారు పుట్టినప్పటి నుండి వారికి పాలసమస్య ఉండెడిది. సుమతీమహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి యింట ఒక ఆవు ఉండెడిది. వారింటనున్న కాలాగ్నిశమనదత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండెడిది. ఆ ఆవు కేవలము ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు, గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరము నిచ్చుచుండెను. అదియొక వింత ప్రవృత్తిగానుండెను.

కాలాగ్నిశమన దత్తునికి నైవేద్యముగా నుంచిన ఆ స్వల్ప క్షీరమును, ఒక్కొక్కపరి శ్రీపాదులవారు నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజా మందిరమున చొరబడి త్రాగెడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజశర్మ గారు దత్త ప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యము నిడి నిరాహారముగా నుండెడిది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగిన యెడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును త్రాగెడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్యశిశువునకు చాలినంత క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించెడివారు. సమృద్ధిగా క్షీరమును యివ్వగల ఆవును శ్రీ అప్పలరాజుశర్మ గార్కి యివ్వవలెనని వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కాని అవి అన్నియునూ వ్యర్ధమాయెను. అప్పలరాజుశర్మ ఎత్తి పరిస్థితులలోను దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణమువలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేదపండితులు గనుక వేదసభలేమయినా జరిగినచో వేదసంభావనను మాత్రమే స్వీకరించెడివారు. వారికి పౌరోహిత్యమువలన రాబడికూడా తక్కువ. వారు కేవలము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, నరసింహవర్మ గారికిని మాత్రమే పౌరోహిత్యము చేసెడివారు. వారిరువురూ, సామాన్యముగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యముకంటె ఎక్కువగా యిచ్చెడి సాహసముచేసిన అప్పలరాజుశర్మ గారు కోపగించుకొనువారు. అప్పలరాజుశర్మగారు తమ మామగారైన సత్యఋషీశ్వరులనుండి కూడా ఏమియునూ స్వీకరించెడివారు కారు. కార్తీకపౌర్ణమి నాడు సుమతీమహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల యింట భోజనము చేసెడివారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధతదియ తోజున మామగారింట  భోజనము చేసెడివారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేశ చతుర్ధినాడు కూడా బాపనార్యుల యింట భోజనము చేసెడివారు.

కుటుంబము యొక్క యీ దు:స్థితిని తలంచుకొని సుమతీ మహారాణి ఒకనాడు భర్తతో, "నాథా! మా పుట్టినింటివారు స్థితిపరులే కదా! పైగా వారు కూడా నిష్టాగరిష్ఠమైన శ్రోత్రియసంస్కారముల వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొకదానిని స్వీకరించుటలో నాకు దోషమేమియును కనబడుటలేదు. శ్రీపాదునికి కడుపునిండుగా క్షీరమును కూడా యివ్వలేని స్థితిలో నున్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి." అనెను. అంతట అప్పలరాజుశర్మ యిట్లనెను. "సౌభాగ్యవతీ! నీవు చెప్పేది విషయము బాగుగనే యున్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమియు నుండనేరదు. కాని ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలా మంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వము నుండియూ యిప్పటివరకు అత్యంత ఆశ్చర్యకరమయిన విషయములు నడచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమే అయిన యెడల మనయింటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరము నీయవచ్చును గదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగజేయవచ్చును గదా. అదియును గాక పెద్దవాడయిన శ్రీధరరాజశర్మ అంధుడిగాను, చిన్నవాడయిన రామరాజశర్మ కుంటివాడు గానూ ఉన్నారే! శ్రీపాదుడు వారిద్దరునూ అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చును గదా. నీవు ఈ విషయము నీ నాయనతో చర్చిన్పుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితముకాదు."

సుమతీ మహారాణి యీ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసముతో యిట్లనిరి. "అమ్మణీ! ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించుటలోనే గాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనిన్చితిని. మనయింట గోసమృద్ధి యున్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే గాక మహదానందప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రము యొక్క ఆమోదము ఆవశ్యకమే! ఆహా! ఏమి విధివైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలెనోయని పరిపరివిధముల ప్రయత్నించు జామాటలు లోకమున లెక్కకు మిక్కుటముగానున్నారు. అయిననూ నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతని నియమమును భంగపరచయత్నించిన మనము వెఱ్ఱివాళ్ళమగుదుము. సృష్టియందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించినగాని నీ భర్త యీ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యము నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న ఋణానుబంధము తెగిపోవును. ఋణవిముక్తుడైన దత్తుడు మీ యింట బిడ్డగానుండజాలడు. జగద్గురువై లోకమునుద్ధరించుటకు బయల్వెడలెను. అందువలన పొరబాటున కూడా నీవు శ్రీపాదుని, వారి సోదరుల అంగవైకల్యము పోగొట్టుమని కోరకుము. సర్వమునూ కాలాధీనమైయున్నది. ఆ కాలము శ్రీపాదుని అధీనమై యున్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీరసమృద్ధి కలిగితీరును. అయితే శ్రీపాదునితో నీకు ఋణానుబంధము నశించును. ఋణవిముక్తుడైన యీ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడుగాక విశ్వగురుత్వము వహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీరసమృద్ధమై, తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరము నొసంగును. అప్పుడసలు యీ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము ఓరిమి వహించుము. దత్తుడు కల్పించిన యీ విషమసమస్యను దత్తుడే పరిష్కరించును." అని తెలిపెను. 

అంతట శంకర భట్టు "అయ్యా! శ్రీపాదుల వారి అన్నలిద్దరునూ అన్గావైకల్యముతో జనించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా?" అని ప్రశ్నించెను.

అంతట తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శ్రీ దత్తాత్రేయులవారు సాయంసంధ్యలో అవతరించిరి. శ్రీపాదులవారు ఉషఃకాలమున అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్టమధ్యాహ్నము అభిజిలగ్నమునందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయంసంధ్య తరువాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో నుందురు. కావున దత్తావతారము యోగసాధనలలోని పరిణామక్రమములో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చినది. ఎటు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, పరిణామము యొక్క ఏ దిశలో కదలవలెనో జీవులకు అంతుబట్టని గాఢ అంధకారము. జీవులకు తెలియకుండగనే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలోనుంచి పరిణామము వైపునకు పయనించిరి. ఇది కేవలము ఒక్క భూమండలమునకే పరిమితము కాదు. 

శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులును ఒక్కసారి విజ్రుంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మా సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములయిన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచూ అనంత వైవిధ్యములో పరిణామము నొందుటను ఇది సూచించును. మధ్యందిన మార్తాండుడు చండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదజల్లుచూ జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము. ఈ విషయములు వారియొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. 

దత్తావతారమునకును, శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాళరాత్రి నడచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారయిన శ్రీధరరాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తిక వాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారయిన శ్రీరామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయిననూ, మహాంధకార సదృశమైన తమస్సును విడనాడి, కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలయిన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్యవిషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. 

(ఇంకా ఉంది..)               

No comments:

Post a Comment