Saturday, December 3, 2011

Chapter 8 Part 4 ( Last Part)

అధ్యాయము 8
దత్తావతారముల వర్ణనము - భాగము 4
కర్మచక్ర పరిణామము

అంతట తిరుమలదాసు యిట్లు చెప్పెను. "నీవు చెప్పునది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసినయెడల సప్తజన్మముల బాలవైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు నలుగురయిదుగురు స్త్రీలను వివాహమాడిన యెడల మరు జన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ నలుగురయిదుగురు స్త్రీలు తమ కామవాసనలు, సంస్కారములు నశింపనియెడల పురుష జన్మనెత్తి ఆ స్త్రీ ని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచారదోశము కలుగును. అట్లుగాక వేరువేరు జన్మములయందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన యెడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచాక్రమునండు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమూ నాచరింపవలెను. పురుషజన్మ నెత్తిన యెడల ఆ జన్మకు సంబంధించిన ధర్మము నాచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుషజన్మకు గాని యిటు స్త్రీ జన్మకుగాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమనునది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచూ మనస్తాపమునొందుదురు. మాంస భోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి, పదిమందితో కలిసి దానిని భుజించెననుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధననుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలములోనిక్షిప్తమై యుండును. నాయనా! వాయుమండలము నందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మలవలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక, తనను తినిన పదిమంది మానవులను హింసింపవలెనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మనెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు, ప్రతీ చర్యకును, ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణమునలవరచుకొనవలెను. సాత్వికుడు మేకను చూచిననూ, దాని మాంసము తిననొల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మయందు తనను భక్షించిన మనుష్యుడే అయిననూ సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానమును చేసిన యెడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును.

పీఠికాపురవాసుల సాంఘాతిక పుణ్యమును, సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీ దత్తునిగా గ్రహింపక మరింత అశుభఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరదిన్చుచూ, శ్రీపాదవల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్ధంకానపుడు మౌనము వహించుట మంచిది, అంతే కాని దివ్యభవ్యమైన శ్రీమన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచూ పాదములకు మేకులను కొట్టువారునూ, శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక, శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తన అనుగ్రహ లీలలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీదత్తనామస్మరణమున సర్వమనోరథములు అయాచితముగా, అప్రయత్నముగా సిద్ధించును. శ్రీవల్లభుని నిందించు పాపజనులకు  విచిత్ర పద్ధతులలో విఘ్నములు, అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్ని స్వరూపము. వారు ధరించునది అగ్నివస్త్రము. వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి? ఎన్ని కల్పములు గడచినవి? ఎన్ని సృష్టి స్థితి లయములు జరిగినవి? కాని శ్రీదత్తులవారు శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తూ శ్రీపాద శ్రీవల్లభులే! సృష్టిలోని ప్రతీ అణువణువునూ, యీ పరమసత్యమునకు సాక్ష్యము పలుకును.

స్వయంభూదత్త పునఃప్రతిష్ట 

శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్తసిద్ధుడు. అతడు తిట్లు, శాపనార్థముల మూలమున ఆశీస్సులనందజేయు వింత సాధువు. అతడు ఎవరినయినా పొగిడిన యెడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీనించినట్లే! ఆ సిద్ధుని పీఠికాపురవాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అపుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలానదిలో నున్నాడని తెలిపెను. అంతట ఏలానదిలో ప్రయత్నముచేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభ ముహూర్తమున అపరసర్వమంగళాదేవి అయిన సుమతీ మహారాణియు, బ్రహ్మతేజో విరాజితులైన అప్పలరాజశర్మయు పునఃప్రతిష్టించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి.

విద్యారణ్యుల ఆవిర్భావము 

ఆలయములో పునఃప్రతిష్ట జరిగిననాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ యింటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లెయనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము రెండవ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానులు భుజముపైకెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచూ సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధిస్థితుడయ్యెను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు "మాధవా! నాకు 16 సంవత్సరములు వయస్సు వచ్చునపుడు నీ కోరికమేరకు బుక్కరాయుడుచే హిందూసామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు, బుక్కరాయునికి నీవు తోడై యుండుము. నీవు విద్యారణ్యమహర్షి నామమున విఖ్యాతుడవయ్యెదవు గాక! నీ సోదరుడైన సాయణాచార్యునింట రాబోవు శతాబ్దములలో గోవిందదీక్షితులు జనించును. ఆ గోవిందదీక్షితుడు ఎవరో కాదు నీవే! రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవు గాక!" అనిరి.

అంతట ఆ సిద్ధుని కన్నులవెంట ఆనందబాష్పములు జలజలరాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదులవారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత? అనెను. అంతట శ్రీపాదులిట్లనిరి. "నీవు శృంగేరీపీఠము నధిష్టించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యెదవు. నీ శిష్య పరంపరలో మూడవవాడిగా నీవే కృష్ణసరస్వతీ నామమున జనించెదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యము మిక్కుటముగా నున్నది. కావున నేను నృసింహ సరస్వతీ నామమున తిరిగి అవతారమెత్తునపుడు నీవు కృష్ణసరస్వతీ నామమున నాకు కాశీలో సన్యాసదీక్ష నిచ్చెదవు. దీనికి కాశీవిశ్వేశ్వరుడునూ, అన్నపూర్ణామాతయునూ సాక్షి. నీవు సన్యాసిధర్మమును పునరుద్ధరింపవలెను."

వశిష్ఠ, శక్తి, పరాశరసత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులును, ఋగ్వేదులును అయిన వాజపేయయాజుల మాధవాచార్యుడు, విద్యారణ్యమహర్షిగా వినుతిగాంచి తీరును. నాయనా! రేపు నీకు మరిన్ని విషయములను చెప్పెదను అని తిరుమలదాసు యీ రోజు వృత్తాంతము ముగించెను.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

(అధ్యాయము 8 సమాప్తం) 

No comments:

Post a Comment