అధ్యాయము 10
నరసింహమూర్తుల వర్ణనము - భాగము 2
నాయనా! శంకరభట్టూ! అవధూతలనుండిగాని, సిద్ధపురుషులనుండిగాని అనుగ్రహప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న శకలమైనను గ్రహించిన యెడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా! నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోను, మనస్సులోను ఆత్మలోనూ అంతర్లీనమైయున్న లక్ష్మీ అంశ క్షీనించసాగెను. శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమైతీరును. 32 రాగిపాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదులవారు సత్యమును చేసిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, శ్రీపాదులవారు వెళ్లిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 రాగిపాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలియున్నది. నాకు అప్పలరాజుశర్మ నుండి పదివరహాలు రావలెనని దొంగ లెఖ్ఖలు చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ పది వరహాలు నాకు యీ విధముగా లభించునట్లు చేసిరి. యీ లీలద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదులవారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు, సూర్యాస్తామయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్య యందును, సాయంసంధ్యయందును, అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతఃసంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులును విజ్రుంభించుటకు సిద్ధముగా నుండును. సాయంసంధ్య యందు సూర్యభగవానుని సమస్త శక్తులును తిరోగమన దిశయందు వారిని చేరును.
అంతట నేనిట్లంటిని. "అయ్యా! దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే కాని, స్వీకరించక పోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయము అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదులవారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచూ వారే నరసింహావతారమని, శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివునియందు అనసూయాతత్త్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయయుంచి సవివరముగా తెలియజేయవలసినది."
అంతట సుబ్బయ్య శ్రేష్ఠి, "అయ్యా! మీరు ఆకలిగొని యున్నారు. నీ యింటికి అన్నార్థియై వచ్చినవానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును, జాతికుల భేదముల నెంచక యీయవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను యింతలో ఆ కనిపించెడి అరటిచెట్ల వద్దకు పోయి రెండరిటాకులను తెచ్చెదను. అన్నములోనికి సంభారము బీరకాయపప్పు. అది అమృత తుల్యముగా నుండును. " అని పలికెను.
నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగిడీలో ఒక రాగిపాత్ర మినహా మరేమియూ లేవు. ఆహారపదార్థములుగాని, ఫలములుగాని, కందమూలములు గాని ఏమియూ లేవు. పైగా అన్నములోనికి ఆధరువుగా బీరకాయపప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమయిననూ తటాకమునకు పోయి కాళ్ళుచేతులు కడుగుకొని వచ్చెదను అని అనుకొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటిచెట్లు వైపునకు వెడలినాడు.
నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చితిని. సుబ్బయ్య శ్రేష్ఠి రెండు అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాడిచెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను యీ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తరువాత తనవద్దనున్న రాగిపాత్రను తీసుకొని రెండు దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగిపాత్రనుంది జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగిపాత్ర నుండి బీరకాయపప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేమిరువురమునూ సమృద్ధియును, అమృతోపమానమును అయిన ఆ అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములయిన తదుపరి ఆ రాగిపాత్ర ఎప్పటివలెనే ఖాళీగా నుండెను.
శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము
శనైశ్చ్వరుడు కర్మకారుడు, గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనైశ్చ్వరునివలెనే ఫలితములిచ్చును. కేతువు అంగారకుని వలెనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనైశ్చ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయంసంధ్య మహాశక్తిమంతము, చతుర్థీ తిథియు, త్రయోదశీ తిథియు, రాహుగ్రహమునకు బలమైన తిథులు. శనిత్రయోదశీ మహాపర్వమునందు సాయంసంధ్యలో శివారాధనము చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదులవారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదులవారిని అర్చించిన యెడల సర్వగ్రహదోషములు శమించును. యుద్ధములకును, ఆపదలకును, శస్త్రాస్త్రములవలన కలుగు అకాలమృత్యువులకును, ఋణగ్రస్తులై యీతిబాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము. అరుణమనగా పాపము లేనిది. చిత్తానక్షత్రమునాడుగాని, మంగళవారమునాడుగాని శ్రీపాదులవారు అరుణ వర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును, బాపనార్యులవారును శనిప్రదోషమున చేయు శివారాధానము నందు పాలుపంచుకొనెడివారు. ఆ రోజున అప్పలరాజుశర్మకూడా మహానిష్ఠతో నుండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమాతీమహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమైయున్న అనసూయా మహాతత్త్వమును ధ్యానించెడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది. అందువలన వెంకటప్పయ్య శ్రేష్ఠి వారినున్దిగాని, నరసింహవర్మ వారినుండి గాని, బాపనార్యుల వారినుండిగాని ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియూ, వారినుండి ధనమును స్వీకరించక పోవుటయే మహాపాపమనియూ శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకరభట్టూ! శ్రీపాదులవారు సకలదేవతాస్వరూపులు. సర్వదేవతాస్వరూపులకునూ అతీతమైన మహాతత్త్వము వారిది. వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములను పొందగలిగినవారు ధన్యులు.
సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు ఈ వింత పధ్ధతి ద్వారా తన తండ్రిని ఋణవిముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలమువలె వ్యాపించెను. శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు. అప్పలరాజుశర్మ కనులనుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దులకుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మగారి యింటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యులును వచ్చిరి. తండ్రిని ఋణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానిన్చిరి. నేను సమావిష్టులయిన పెద్దల సమక్షములో రాజశర్మగారి బాకీ తీరెనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారివచ్చి పది వరహాలు యిచ్చి రాగిపాత్రను కొనుక్కొని వెళ్ళిన యెడల ఋణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతట ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను.
బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. "ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా?" అంతట శ్రీపాదులు వారు, "ఆ జటాధారియే కాదు. అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియును." అని జవాబిచ్చిరి.
(ఇంకా ఉంది...)
సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు ఈ వింత పధ్ధతి ద్వారా తన తండ్రిని ఋణవిముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలమువలె వ్యాపించెను. శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు. అప్పలరాజుశర్మ కనులనుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దులకుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మగారి యింటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యులును వచ్చిరి. తండ్రిని ఋణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానిన్చిరి. నేను సమావిష్టులయిన పెద్దల సమక్షములో రాజశర్మగారి బాకీ తీరెనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారివచ్చి పది వరహాలు యిచ్చి రాగిపాత్రను కొనుక్కొని వెళ్ళిన యెడల ఋణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతట ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను.
బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. "ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా?" అంతట శ్రీపాదులు వారు, "ఆ జటాధారియే కాదు. అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియును." అని జవాబిచ్చిరి.
(ఇంకా ఉంది...)
No comments:
Post a Comment