Wednesday, December 7, 2011

Chapter 9 Part 2

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 2 
శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును.

మూడు అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచూ, వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు లక్ష మార్గములననుసరించిన యెడల, వానిని ఉద్ధరించుటకు దైవము పదిలక్షల మార్గముల ననుసరించును. శ్రీదత్తప్రభువు తన అంశావతారములచేతను, సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధులద్వారాను ఈ సృష్టిపాలనము చేయుచుందురు. 

పూర్వయుగములందలి శ్రీదత్తులవారేనా ఈ శ్రీపాదులవారు అను స్వల్పసంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదులవారు నైవేద్యరూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయా మాత లోహపుశనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమీ అలనాటి దత్తుడనేనని గుర్తుచేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్ధము కూడ ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బుస్థానములోనున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపములో నున్నవనియు, వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపముగా మార్చితిననియు, శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్యమానసములో వీక్షించని వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్యమానసములో వీక్షించనిజీవి ఏదియూ ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యము. సత్యవస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టితమై యుండుట వలన ఆ జ్ఞానమును పొందినవారందరూ ఈ లోకమునుండి అంతర్థానమైననూ నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చునపుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులయిన మునులు, అవతారపురుషులు అందరునూ అవినాశ తత్త్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్త్వమునకు చెందినవారు. అవినాశతత్త్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండితీరవలెననెడి నియమమేదియునూ లేదు. య్యది స్వేచ్చాతత్త్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంతనవీనము. కారణములేని కార్యము జరుగుటకు వీలులేదు. సర్వకారణములకునూ, సర్వకార్యములకునూ ఏకైకతత్త్వమే ఆధారము. అది అన్నింటికినీ అతీతము. అదియే దత్తతత్త్వము. ఆ దత్త ప్రభువు తన సంపూర్ణకళలతో కలియుగమున ప్రప్రథముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు వేయిశిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. 

నాయనా! శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీనృశింహ సరస్వతిగా అవతరించెదమని సెలవిచ్చి యున్నారు. హిరణ్యకశపుడు అతి విచిత్రములయిన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినాను ఇచ్చిన వరములకు భిన్నముకాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడయిన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కోడా తన స్వామీ ఉన్నాడని వచించెను. స్వామీ స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా? లేడా? అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునణచుటకును, ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీదత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని ఋజువు చేయుట నరసింహావతార విశిష్టత, దైవదూషణ చేయువారి మదమునణచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట - అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులునూ, శ్రీ నృశింహ సరస్వతియునూ, శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమియూ లేవు. 

తిరుమలదాసు యీ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రములమీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో గదా! శాలివాహన శకములో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూణశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదులవారు శలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? యీ కలియుగము ఏ రోజున ఎన్ని ఘటికల, ఎన్ని విఘటికలకు ఆరంభమైనది. భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము, భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదులవారు ఏ విషయములను వ్రాసియిచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తవతారముగా నమ్మెదను.

నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పకుండగా నేను మధ్యమధ్యలో వారు చెప్పుదానిని ఆలకించు భంగిమలను కనపరచుచూ, చిరునవ్వును నవ్వుచూ ఆ లోహపు శనగల వైపు చూచుచుంటిని. 

ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురు పోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదులవారి చరిత్రము నాలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములునూ వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించినది. 

ఆహా! క్షణములో నేను చెవిటివాడు గాను, తిరుమలదాసు మూగవాడు గాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్ననూ మాట వచ్చుటలేదు. నేను వినదలచుకొన్ననూ ఎంతటి చిన్నధ్వని కూడా వినిపించుటలేదు. అపుడు నేనిట్లు నా మనసులో చింతించితిని. "రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వముగాని కాదుగదా! హా! హతవిధీ! యిపుడేమి చేయవలెను?"

ప్రసాదముగా ఉంచబడి లోహపుఖండములుగా మారిన శనగలు 
"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిల్చుట 

ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్రభాషలో "శ్రీపాద రాజం శరణం ప్రపద్యే" అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్నపత్రము కానవచ్చెను. మేము చూచుచుండగనే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జపత్రము కంటె చాలాచాలా తక్కువమందము కలిగియుండెను. అది ముట్టుకొనినపుడు మృదువుగానుండెను. నలుపురంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి యీ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగుభాషలో నున్నది. "శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102 వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18 వ తేదీన రాత్రి సమయమున 2 గంటల 27 నిమిషముల 30 సెకండ్లు. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధపాడ్యమి, శుక్రవారము, అశ్వినీ నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది."

నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయునూ స్వేదరూపమున బయటకు వచ్చుచుండెను. శరీరము కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదులవారు అదృశ్యముగా యిచ్చటనేయున్నారని నాకు రూడీయైనది. నా మనమున "ఏమి నా దురదృష్టము? నేను కురవపురమునకు చేరుట కలలోనిమాట! శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించిననూ ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసికొట్టి ఉతికి ఆరవేయును." అని చింతించితిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు సాధారణంగా, బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్యపరమాణువులకు బోధించుచు, ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువుచేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురుశిష్యులు ఉభయులూ దోష భూయిష్టులే! బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు, రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిసరములనున్నవారు తమ రజకవృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని యిటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు గాని, అవగాహన చేసుకోన గలుగువారు గాని కారు. ఏది ఏమయిననూ నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. 

నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మవర్చస్సుతో వేలుగొందుచుండెను. అంతట నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మాలిన మనస్కుడయిన నేను రజకుడనని తోచెను. 

నైవేద్యముగా ఉంచబడి లోహరూపమున మారియున్న శనగలు క్రమముగా యధారూపమును పొందినవి. శ్రీపాదులవారు నన్ను మన్నించారని అర్ధము చేసుకొంటిని. మరికొంతసేపటికి తెల్లటిరంగులో నున్న ఆ పత్రము అంతర్ధానమాయెను.

తిరుమలదాసు యిట్లనెను. "నాయనా! శంకరభట్టూ! ఈ కలియుగము లోహయుగము. ఇదంతయునూ కల్మషములతో కూడినయుగము. శ్రీపాదులవారి ఆజ్ఞ మేరకు, నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము  హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠదేశమున శరీరధారిని కాక తప్పదు."

"అయ్యా! శ్రీపాదులవారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరియొక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతమును శలవిచ్చి నన్ను ధన్యుడచేయవలసినది." అంటిని.

తిరుమలదాసు యిట్లనెను. "ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల యింటికి ఉతికినబట్టలను తీసుకోనిపోయితిని. సుమతీమహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదులవారినెత్తుకొని ఆడించుచుండిరి. దత్తదిగంబర! దత్తదిగంబర! దత్తదిగంబర అవధూతా! అని వారు పాడుచుండిరి. అపుడు శ్రీపాదులవారు రెండు సంవత్సరముల బాలుడు. వారు కేరింతలుకొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయనమనోహరముగా నుండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్త దిగంబర! అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతట శ్రీపాదులవారు నృసింహ సరస్వతి దత్త దిగంబర! అనిరి. తాము సాక్షాత్తు దత్త ప్రభువులుగా గతములో అవతరించితిమనియు, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు, తెరమరుగయిన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదులవారు తమదయినా శైలిలో ఈ విధముగా బోధపరచిరి.

సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట 

శ్రీపాదులవారు, "తాతా! నేను నృసింహ సరస్వతిగా మరాఠదేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠదేశమునకు రమ్మనుచుంటిని." అనిరి. శ్రీధరావధాన్ల వారి నోట మాటరాలేదు. అంతట తిరుమలదాసు, "నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్ననూ, నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ." అంటిని. అపుడు శ్రీపాదుల వారు "తిరుమలదాసూ! నీవు మరాఠదేశమున గాడ్గేమహారాజ్ అను పేరుతో రజకకులమున జన్మించెదవు గాక! దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యెదవు గాక! ధీశిలానగరమున 'సాయిబాబా' నామమున యవనవేషమున నా యొక్క సమర్ధ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవనవేషమున నున్న నా సమర్ధ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవు గాక! నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక 'గోపాలా! గోపాలా! దేవకినందన గోపాలా!' అను నామమును జపించెదవు గాక! నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకము నందుండి ఆ పైన గాడ్గేమహారాజ్ గా లోకహితార్ధము చేయుము. ఇదే నీకు నా వరము! నా అభయము!" అని నన్ను దీవించిరి.

శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. ఇంతలో సుమతీమహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మివుండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలెనే భావించిరి. 

(ఇంకా ఉంది...)                    

No comments:

Post a Comment