Tuesday, December 6, 2011

Chapter 9 Part 1

అధ్యాయము 9 
కర్మఫల మీమాంస - భాగము 1 

ఆనాడు గురువారం. సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును, నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణరూపంలో మా గదిలో ప్రవేశించినది. ఆశ్చర్యంలో కెల్లా ఆశ్చర్యం! ఆ సన్నటి సూర్య కిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల రూపాన్ని ఇద్దరమూ చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగనే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము, అత్యంత మంగలప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి పదునారు సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యముచేత మాత్రమే! క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళరూపము కనుమరుగైనది. 

శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును, బాధాకరముగను కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన, శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా? అని మనసులో మధనపడసాగితిని. 

అప్పుడు శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పనారంభించెను. "నాయనా! శంకరభట్టూ! ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిధ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీదత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్టమధ్యాహ్న సమయమందు దత్త క్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము." అంతట నేనిట్లంటిని. "అయ్యా! ప్రతిరోజూ శ్రీదత్తప్రభుని స్మరణతోను, దత్తకథాప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన.

శ్రీ తిరుమలదాసు యిట్లు చెప్పదొడంగెను. "నాయనా! కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వము నిర్మూలించి, ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమయిన లీలలద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మసంస్థాపనా కార్యక్రమములన్నింటికి బీజరూపమును యీ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. "

ఖనిజములో చైతన్యము నిద్రాణస్థితి. ఖనిజస్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధనిద్రాణస్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తుపదార్థము తీసుకొన్న మనుజుడు తన శరీరమునందు యీ స్థితిని అనుభవించును. ప్రాణశక్తిరూపమున అభివ్యక్తమైన తత్త్వము పరిణామము చెంది వికాసముచెందిన దశలో మనస్సుద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసముచెందిన దశలో మనుష్యుదానిపించుకోనును. మనస్సు తనయొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సునకతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగాముద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప, నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితి ననుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొండుచుండును. అయితే అతడు మహా సంకల్పముననుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములంటావు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతిమానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతిక్షణము కోట్లకొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధా నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు.మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన, వారి అతిమానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాన్తిస్వరూపము వేగము కూడా వారి అతిమానస వేగామునకు సరికాదు. మానవుడుగాని, మరేప్రాణిగాని చేయు ఏ చిన్న ప్రార్థన అయిననూ అసంఖ్యాకములయిన వారి తేజః పుంజములను చేరి తీరవలసినదే! సమస్త దృశ్యాదృశ్య శక్తులకునూ వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరమునుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటికోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహనక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తెజస్సునండు సూర్యుని ముందు దివిటీవలె నుండును. నాయనా! ఇదే శ్రీపాద శ్రీవల్లభ వారి అసలుసిసలు తత్త్వము. అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ, నిరాకారస్వరూపము సృష్టియందు తనకుగల అవ్యాజ అనంత కరుణతో సాగున, సాకారముగా మనుష్య రూపములో శ్రేపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. 

శ్రీపాద శ్రీవల్లభుల దివ్యస్వరూపము 

మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమయినటులనే, దైవము కూడా తనయొక్క అనంత పరిమితులను కుదించుకుంటూవచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగప్రక్రియ. సత్యము ఒక్కసారి సృష్టిలో ప్రతిష్టించబడిన యెడల అది స్వతస్సిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్టించ సంకల్పముతో వచ్చిన దివ్యభావ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతట నేనిట్లంటిని. "అయ్యా! మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియుచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతుచిక్కుటలేదు. వారి యీ దివ్యభవ్య  చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలేనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్టించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టలగురించి వింటిని గాని, సత్యమును ప్రతిష్టించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన." అంతట తిరుమలదాసు యిట్లనెను. "అయ్యా! శంకరభట్టూ! నీవు శ్రీవారి దివ్యచారిత్రను వ్రాయుటకు సంకల్పింపబడినవాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించును. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీ లేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకుమించి నీవు ఆలోచించుట వ్యర్థము."

మానవుడు రకరకముల భోజనపదార్థములను తీసుకోనును. అవి వాటంతట అవియే జీర్ణమై, మానవునికి శక్తి నిచ్చుచున్నవి. ఈ ప్రక్రియయందు మానవుని ప్రమేయముగాని ప్రయోజకత్వముగాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుట వరకే వాని బాధ్యతా, ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొనుట అనునది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరముయొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు కావున తప్పు, ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛలేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించవలసినదే! ఇది తిన్నవానికి ఇష్టమున్ననూ, లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతస్సిద్ధకార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్టించబడినది.  సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను, మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు, ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకొని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహనక్షత్రాదుల గతులు యీ రకముగా జరిగి తీరవలసినదే! ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి యీయబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టియందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమునూ సంకల్పమాత్రమున సిద్ధించుచుండును, త్రేతాయుగమున యగ్నయాగములు చేయుటవలన సిద్ధించుచుండును, ద్వాపరయుగమున మంత్ర, అస్త్రప్రయోగమున సిద్ధిన్చుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రములవలన సిద్ధించుచుండును. యుగధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్నకొలదియూ సరళీకరణ విధానము నిర్ణయించబడినది.

(ఇంకా ఉంది..)

No comments:

Post a Comment