Monday, December 19, 2011

Chapter 10 Part 3

అధ్యాయము 10 
నరసింహమూర్తుల వర్ణనము - భాగము 3 

శ్రీపాదుల వారి స్వరూపము 

బాపనార్యులు: "నీవు మూడు సంవత్సరముల బాలుడవు. వయస్సుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవు ఏమయినా సర్వజ్ఞుడవా ?"

శ్రీపాదులు: "నా వయస్సు మూడు సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేననుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను. ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందునూ ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరుగనేరవు. నేను సాక్షీ భూతుడనై వీటన్నింటిని గమనించుచుందును."

బాపనార్యులు: "శ్రీపాదా! చిన్నపిల్లవాడు తాను చంద్రమండలము నందున్నట్లు తలంచిన మాత్రమున చంద్ర మండలము నందున్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు."

శ్రీపాదులు: "నేను సర్వే సర్వత్ర స్థితమై ఉండు ఆదితత్త్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనైయున్నాను. నా ఉనికివలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశము నందున్నట్లు నీకు అనుభవమునిచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశాములలో లేనని కాదు దానర్థము. నేను సర్వే సర్వత్ర ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములును నా పాదపీఠిక కడనున్నవి. నా సంకల్పమాత్రము చేతనే ఈ సృష్టి అంతయునూ ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నది?"

అప్పలరాజశర్మ: "నాయనా! చిన్ననాటి నుండియు నీవు మాకు సమస్యాత్మకముగా నున్నావు. నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరియొక అవతారముగా వచ్చెదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు. వారు యిదంతయునూ నాటకమనియూ, బూటకమనియూ మనస్చాంచల్యము వలన కలిగిన తెలివిమాలినతనమనియూ రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మకర్మలనాచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని, అవతారపురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును."

శ్రీపాదులు: "తండ్రీ! నీవు చెప్పునది నేను కాదనుట లేదు. సత్యమునే వచిన్చావలెను గదా! నా పాలబాకీ విషయము వచ్చినపుడు నాకు వినోదముగా నున్నది. పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినపుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని జూచి నీవు సూర్యుడవు కాదు అన్నంతమాత్రమున సూర్యుడు, సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాలాబాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు, మనుష్యులమనియు భావించి మానవతత్త్వమునేవిధమున అనుభవించుచున్నారో, అదే విధమున నేనునూ సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనేననియెడి తత్త్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు?"

బాపనార్యులు: "శ్రీపాదా! జతాదారి కనుమరుగయిన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగిపాత్రలు 31 లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదయినా చమత్కారము జేసి వాటిని మాయము చేసినావా?"

శ్రీపాదులు: "సర్వమునూ కాలకర్మవశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్తదర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెఱ్ఱితలలు వేసినది. కాంతాలోలుడయిన యితడు పురాతన కాలమునుండి పూర్వీకులచే ఆరాధించబడెడి ఆ పెద్ద తామ్ర దత్తవిగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడుకత్తెకిచ్చెను. లోకులతో దత్తవిగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారియై వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమునకాశపడి ఆ దత్తవిగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్తవిగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవజేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి యీ జన్మములో శ్రీమంతుల యింట జనించెను. పూర్వ జన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్తవిగ్రహము 32  రాగిపాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి యింట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగిపాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పమువలన నృశింహుని 32 అవతారముల అంశలు ఆ రాగిపాత్రలలో ప్రవేశించెను.

యీ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు, నా చేతులమీదుగా రాగిపాత్రను స్వీకరించవలసినదనియు, దానికి గాను పదివరహాల సొమ్మును శ్రేష్ఠి కిచ్చి నన్ను బంధవిముక్తిని చేయవలసినదనియూ చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయెను. అతని ఆర్ధికసమస్యలు అనూహ్యమయిన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించితిని. అతడు అప్పులవారి బాధనుండి తప్పించుకొనుటకు జటాధారియై మారువేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమునూ తెలిసినట్లే గదా!

యీ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా పదివరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి పదివరహాలు లభించునట్లు చేసితిని. అయితే దీనికి ప్రతిగా యితని పూర్వజన్మ కృత పుణ్యఫల మంతయూ హరించివేసితిని. ఓయీ! సుబ్బయ్య శ్రేష్ఠి ! చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వేకిలిచేష్టలన్నియునూ నాకు తెలియును. నీ గాధ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడీ పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచూ జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీ కంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియును. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగిపాత్ర నుండి జలము, అన్నము, బీరకాయపప్పు మాత్రమే లభించును. నీవు తిని, ఎవరికైననూ పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును." అని తీక్షణముగా పలికెను.

శ్రీపాదులవారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్ని గోళములుగా నుండెను. మరల వారు "ఓయీ సుబ్బయ్యశ్రేష్ఠి! యీ రాత్రి నీ యింటి దక్షిణద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో నున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడుబీదవాడవగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడీ పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినపుడు నేను అనుగ్రహించిన విధమున రాగిపాత్ర అనుగ్రహించును." అని కఠిన స్వరముతో పలికిరి. 

(ఇంకా ఉంది..)      

No comments:

Post a Comment