Tuesday, January 17, 2012

Chapter 10 Part 4

అధ్యాయము 10 
నరసింహ మూర్తుల వర్ణనము - భాగము 4 

వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులయిన శ్రీపాదులవారిని చూచి భయభ్రాంతులయిరి. అంతట శ్రీపాదులు యిట్లనిరి. "తాతా! భయపడుచున్నావా? నేను నరసింహ మూర్తినే ! సందేహము వలదు. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను అయిన తత్త్వముగదా! వైశ్య కులమునకు శాపమిచ్చెదనని అనుకొనుచున్నావు. వాసవీమాత, తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా నుండునట్లు శాపమిచ్చినట్లే, వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చెదనేమోయని నీవు ఆందోళన పాడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కులభేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కులభేదములుండవు. ఆర్య వైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యుల పూర్వయుగములలోని లాభాద మహర్షి కాదా! నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయిననూ, బాపనార్యులు వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నీకు నేనిచ్చు జంగిడీ వేరుగా నున్నది. దానిలో దత్త మిఠాయి నిండుగానుండును. ఎంతయిచ్చిననూ తరిగెడిది కాదు. ఎవరికినీ కంటికి కనిపించెడిది కాదు. నృశింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నా యందే ఉన్నవి గనుక నాది 33 వ అవతారము. అందువలన నీ వంశము నందు 33 వ తరము నడుచుచుండగా, బాపనార్యులు 33 వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33 వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల యింట, అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్టింపబడును. వత్సవాయివారికి, మల్లాదివారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి యిదే నా అభయము! మీ వంశస్థులలో ఎవరయినా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్యభావ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేనయినా సరే ఆరాధించిన యెడల దత్త శునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్యరూపములలో, అదృశ్య శునకరూపమున సదా రక్షగా నుండును.

అంతట వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదులవారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నులనుండి ఆనందబాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాటరాలేదు. సుమతీ మాత ఇదంతా కలా? వైష్ణవమాయయా? అని సందేహములో పడెను. అప్పలరాజుశర్మ మనస్సు మూగపోయెను. శ్రీపాదులవారి అన్నలిద్దరునూ శ్రీపాదుల వంక భయముభయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా? లేక దత్తప్రభువా? ఏమిటి ఈ వింత? అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు హేళనబుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేనిట్లంటిని. "శ్రీపాదా! ఆయా స్పందన శక్తులు మానవరూపము పొందినపుడు భార్యలుగా ఉన్నవి గదా మరి. ఇది స్త్రీ లంపటత్వము గాక మరేమిటి? అవతారపురుషుల విషయములో యిదిలీల. మరి మాబోటి వారి విషయములలో స్త్రీ లంపటత్వము? ఏమి పక్షపాతవైఖరి?" 

శ్రీపాదులిట్లనిరి, "శ్రీకృష్ణునకు అష్టభార్యలు, పదహారువేల గోపికలున్ననూ అతడు నిత్య బ్రహ్మచారియే! అంతేగాని నీవనుకొనునట్లు స్త్రీ లంపటుడు కాడు, అది దేహసంబంధము ఎంతమాత్రమునూ కాదు. కేవలము ఆత్మా సంబంధ రీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య. భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడే మానవత్వము పొందునట్లు శపించబడినపుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడు అయిదు రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయిననూ శయన సుఖము పొందినది కేవలము అర్జునునితో మాత్రమే! ధర్మమూ వేరు, ధర్మసూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకొనేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే! మత్స్య యంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి ఆరు లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలి యుండవలెను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగా నున్నది. క్షమాగుణములో భూదేవిని పోలి యుండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరుగబోవు విషయములన్నియునూ తెలియును. కౌరవ, పాండవ యుద్ధము జరిగితీరునని తెలియును. అయితే అది జరుగుటకు ముందు ఎన్నియో సంఘటనలు జరుగవలసినవి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నియునూ తలంచుకొన్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా నుండెడిది. అందువలన సహదేవునితో వ్యవహరించునపుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతు. భోజనము మిక్కుటముగా చేయుటవలన మహాబద్దకస్తునిగా తయారయినాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుటయందు కూడా బద్ధకము వహించెడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించునపుడు దాసివలెనే ప్రవర్తించెడిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించెడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకి మంత్రివలె చక్కటి సలహాలనిచ్చేడిది. నకులుడు రెండు వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి. అంతటి సునిశిత యుద్ధవిద్యా నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసెడిది. భోజన పదార్థములను రుచికరముగా, అతని మనస్సునకు సంతుష్టినిచ్చెడివి, అతని యుద్ధ విద్యాసాధనకు అనుగుణమయినవి తయారు చేసి ద్రౌపది అందించెడిది. తల్లి, బిడ్డ మనసు తెలుసుకొని అడుగకుండగనే భక్ష్య భోజ్యముల నందించునట్లు, ద్రౌపది నకులునితో వ్యవహరించెడిది. శయ్యా సుఖమునందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించెడిది. ధర్మభంగము కాకుండ పంచభర్తృక అయిననూ శయ్యాసుఖమును యిచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే!

సుబ్బయ్య శ్రేష్ఠి! నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖము నందివ్వలేదు. బిల్వమంగళుడు, ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించునపుడు కాలకర్మ కారణ వశమున చింతామణియు, బిల్వమంగళుడును నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అపుడు మీకు ధర్మబోధ చేసెదను.

అంతట నరసింహవర్మగారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో యిట్లనిరి. "తాతా! మనమిద్దరమునూ రేపు గుఱ్ఱపుబండిలో మన భూములను చూచుటకు పోయెదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడి భూమాత నన్ను శ్రీపాదప్రభూ! నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా? అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు గదా!" అని అనెను. అంతట వర్మగారు "నాయనా! శ్రీపాదా! నాదొక చిన్న మనవి. మనకు శ్రీ పీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లెనేర్పరచి వారిచేత మన భూములను సాగు చేయించ దలచితిని. పల్లెప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి, జమిందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకమునకు నియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు గదా!" అనిరి. శ్రీపాదులు నవ్వుచూ, "తాతా! నీవు నీ జమిందారీ విషయమునే ఆలోచించితివి గాని నా జమిందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరిణీకము చేయమందువు, ఆ తరువాత శ్రీపాదా! నీవు ఈ కరిణీకము చేయవలసినది అని అందువు. ఘండికోట శ్రీపాద శ్రీవల్లభరాజ శర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేను చేయబోయే కరిణీకము విశ్వవ్యాప్తమయినది. నా లెక్కలు నాకున్నవి. ప్రతీరోజు కోట్లకొలది పుణ్యరాశులు, మణులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలినిని కదిలించుట. మనుష్యులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్య క్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్రసింధువేదము తెలిసినవారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగరహస్యము. పీఠికాపుర కుండలినిని బాపనార్యులగారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి 33 వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్ట వశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశము నందలి ప్రతీ క్షణమును సద్వినియోగము చేసుకొనుడు." అని చెప్పిరి. నాయనా! శంకరభట్టూ! నరసింహవర్మగారు శ్రీపాడులవారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి.

(ఇంకా ఉంది..)
           

No comments:

Post a Comment