అధ్యాయము 10
నరసింహ మూర్తుల వర్ణనము - భాగము 5
శ్రీపాదుల వైభవము
నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో నున్నది. శ్రీపాదులవారు తామే స్వయముగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించితిని. "శ్రీపాదా! నీవు శ్రీకృష్ణుడననుచున్నావు. మరి అష్టభార్యలు, పదునారు వేల గోపికలు ఈ అవతారమున కూడా కలరా?" అంతట శ్రీపాదులు మందహాసముతో "నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది షోడశకళాపరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరమునుండి, నా మనస్సునుండి, శ్రీపాద శ్రీవల్లభ అవతారమనెడి ఈ దివ్యాత్మ నుండి దశదిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతీ క్షణమునూ వెలువడుచుండును. ఈ విధముగా ప్రతీ క్షణమునూ ఒక్కొక్క కళకూ శరీర, మనో, ఆత్మతత్త్వముల నుండి 10 * 10 *10 = 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా పదునారు కళల నుండి 16 ,౦౦౦ స్పందనలు వెలువడుచుండును. ఇవన్నియూ నా పదహారు వేల గోపికలే! పూర్వావతారమున అవి మానవరూపములో ఆవిర్భవించినవి. ఈ అవతారమునవన్నియునూ నిరాకారముగా స్పందనశీలముగా నున్నవి.
నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించిననూ తప్పేమియూ లేదు. అవి అన్నియూ నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివ స్వరూపమును, విష్ణు స్వరూపమును, బ్రహ్మ స్వరూపమును ఆరాధించవచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకులయొక్క రకరకముల సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నియో జీవపరిణామముపై ప్రభావము చూపును." అని వివరించిరి.
నరసింహరాజ వర్మకు ఆ రాత్రి నృశింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి (1 ) కుందపాద నరసింహమూర్తి (2 ) కోప నరసింహమూర్తి (3 ) దివ్య నరసింహ మూర్తి (4 ) బ్రహ్మాండ నరసింహమూర్తి (5 ) సముద్ర నరసింహమూర్తి (6 ) విశ్వరూప నరసింహమూర్తి (7 ) వీర నరసింహ మూర్తి (8 ) క్రూర నరసింహ మూర్తి (9 ) భీభత్స నరసింహమూర్తి (10 ) రౌద్ర నరసింహమూర్తి (11 ) ధూమ్ర నరసింహమూర్తి (12 ) వహ్ని నరసింహమూర్తి (13 ) వ్యాఘ్ర నరసింహమూర్తి (14 ) బిడాల నరసింహమూర్తి (15 ) భీమ నరసింహమూర్తి (16 ) పాతాళ నరసింహమూర్తి (17 ) ఆకాశ నరసింహమూర్తి (18 ) వక్ర నరసింహమూర్తి (19 ) చక్ర నరసింహమూర్తి (20 ) శంఖ నరసింహమూర్తి (21 ) సత్త్వ నరసింహమూర్తి (22 ) అద్భుత నరసింహమూర్తి (23 ) వేగ నరసింహమూర్తి (24 ) విదారణ నరసింహమూర్తి (25 ) యోగానంద నరసింహమూర్తి (26 ) లక్ష్మీ నరసింహమూర్తి (27 ) భద్ర నరసింహమూర్తి (28 ) రాజ నరసింహమూర్తి (29 ) వల్లభ నరసింహమూర్తి మిగతా (30 ) వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభులవారిని చూచెను. (31 )వ నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతీ అవతారమును చూచెను. (32 ) వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించెడి స్వామిసమర్ధునిగా చూచెను.
శ్రీనివాసుని వృత్తాంతము
నాయనా! రేపు పరమపవిత్రమైన రోజు. కన్యామాసమునందు శ్రవణా నక్షత్రము, ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వేంకటేశ్వరుడు అర్చారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమినాడు, విళంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధనసహాయము పొంది అప్పు పత్రము వ్రాసియిచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిరా నక్షత్రము నందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణా నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తరఫల్గుణీ నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భారద్వాజస గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జన్మించినవాడు ఆకాశమహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాసప్రభువు అగస్త్యమహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానుడికి సగము పంచినాడు.
సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో, "నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయునూ మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశ్శాస్త్ర రీత్యా పరమపవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకొని రాబడిరో, వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మగారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలమునందు ఎంతటి చిత్రవిచిత్ర విషయములు జరుగుచున్నదియూ, శ్రీవారి ఆఖరి అవతారముగా కల్క్యావతారమునకు ముందు జరుగబోవు లీలలను వివరించు చెప్పెదను." అని వచించి నన్ను దాపులనే యున్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచట రెండు ఈతాకుల చాపలుండెను. నాలుగు మేలుజాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను.
శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము
శ్రీపాదులవారి లీలలు అనితరసాధ్యములు. అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మములనుండి పేరుకొని యున్న పాపరాశులు భస్మీపటలమగును.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.
No comments:
Post a Comment